Neetikathamala-1    Chapters    Last Page

6

నమశ్శివాభ్యాం కలనాశకాభ్యాం

కంకాల కల్యాణ వపుర్ధరాభ్యామ్‌,

కైలాస శైలస్థిత దేవతాభ్యాం

నమో నమశ్శంకర పార్వతీభ్యామ్‌.

(ఉమామహేశ్వరస్తోత్రం)

భర్తృహరి

మొదలc జూచినc గడుగొప్ప పిదపc గుఱుచ

యాదిc గొంచెము తర్వాత నధిక మగుచుc

దనురు, దిన పూర్వ పర భాగజనితమైన

ఛాయ పోలికc గుజన సజ్జనుల మైత్రి.

దురాత్ముల స్నేహము ప్రాంతఃకాలపు నీడవలె ప్రప్రథమమున విస్తారముగనుండి క్రమక్రమముగ క్షీణించును. సజ్జనుల మైత్రి సాయం కాలపు నీడవలె ప్రథమమున చిన్నదై క్రమక్రమముగ వృద్ధినందుచు వచ్చును.

* * *

కుమారిలభట్టు

అది కాశీరాజైన సుధన్వుని

పేరోలగము. ఆనాడు సభ పండిత పామరులతో సముద్రమును బోలి ఉండెను. సువర్ణకుండలములతో సూర్యసమ తేజస్వియైన పండితు డొకడు సువర్ణాసనముపై కూర్చుండి ఉండెను. అతని ముఖమండలముపై విజయరేఖ తొణికిసలాడుచుండెను. మరికొందరు పరాజయంవల్ల వాడిపోయిన ముఖకమలమలతో నతమస్తకులై ఉండిరి. అంత కొంతసేపటికి సుధన్వ మహారాజు లేచి ''పండితోత్తములారా! జయాపజయములు దైవాధీనములు. కాని అవి సర్వదా సత్య నిర్దేశములు కావు గదా! అందుచే ఎవరు ఆపర్వతశిఖరమును అధిరోహించి క్రిందికి దూకి అపాయము బొందరో వారు ప్రతిపాదించినది సత్యముగా అంగీకరింతుము'' అని నుడివెను. పండితులొకరిమొగము లొకరు చూచుకొన ప్రారంభించిరి. వాదమందు గెలిచిన యా పండితుడే ముందువెనుక లాలోచింపక తన ప్రతిపాదితమైన వేదప్రమాణమందలి ప్రగాఢవిశ్వాసంతో అందరూ చూచుచుండ చరచరనడచి అశిఖర మధిరోహించెను. సదస్సులో ఉన్న వారందరు ఆశ్చర్యముతో అతని వై పే చూడసాగిరి. శిఖరముపై నిలబడి నమస్కరించుచు ఉచ్చెస్వరంతో ''మహాజనులారా! వేదములే పరమ ప్రమాణములై నచో నాశరీరమున కెట్టి అపాయము కలుగకుండు గాక'' అని ఘోషించుచు క్రిందికి దుమికెను. అతని శరీరమునకు ఎట్టి గాయములు తగులలేదు. ఎట్టి బాధలు కలుగలేదు. జనవాహిని దిగ్భ్రాంతితో ప్రతిమారూపమైనది. అతడే న్యాయ, వ్యాకరణ, తర్క, మీమాంసాశాస్త్రములందు అసమాన శేముషీధురంధరుడైన కుమారిలభట్టు.

కుమారిలభట్టు జయమంగళ గ్రామవాసియైన యజ్ఞేశ్వరుని కుమారుడు. తండ్రి యాకాంక్షానుసారం గురుదేవుల ఆశీర్వచనబలంతో భారతదేశమందు వేద ప్రతిపాదితమైన వైదికమతాన్ని పునః స్థాపించే సంకల్పంతో జైత్రయాత్ర సాగిస్తూన్నాడు. ఆరోజులలో భారతవర్షంలో నిరీశ్వరవాదాన్ని ప్రతిపాదించే జైన బౌద్ధమతాలు బాగా విస్తరించిఉన్నవి. అమాయక ప్రజలు ఆమతగురువుల వాక్యాలనే విశ్వసించి అనుసరిస్తూ కర్మభ్రష్టులౌతున్నారు. అందువల్ల ఈ దుఃస్థితి నరికట్టి ప్రజలను వేదప్రబోధిత మార్గావలంబులుగా చేయాలని కుమారిలభట్టు నడుం కట్టుకున్నాడు. అందుకు జైన బౌద్ధమత రహస్యములను తెలుసుకొనగోరాడు. బౌద్ధమత గురువులు అందరకూ అందుబాటులో ఉండేవారు. అందువల్ల శిష్యరూపంలో బౌద్ధగురువును చేరి ఆ మతగ్రంథాలు చదివి ప్రావీణ్యం సంపాదించాడు. కాని జైన గురువులనుచేరటం దుష్కరమైనది. అయినా కార్యసిద్ధికై పట్టుదలతో శిష్యరూపంలో జైన గురువుల శిష్యరికం సంపాదించాడు. శ్రమించి ఆ మతసాహిత్యంలో పాండిత్యం గడించాడు. ఒకనాడు ఒక జై నాచార్యుడు వైదికమార్గమును తీవ్రముగా నిందించు చున్నాడు. ఆ నిందావాక్యములకు అతని హృదయం క్షోభించి నయనములనుండి బాష్పములు రాలాయి. అచటి వారందరు భట్టును వైదికమతానుయాయిగా సందేహించి అవమానించి వెడలగొట్టినారు.

మరునాటినుండి కుమారిలభట్టు దిగ్విజయ యాత్ర ప్రారంభ##మైనది. సుధన్వుడు ఆయనకు అండగా నిలబడ్డాడు. దేశంలో నలుమూలలకు వెళ్లి కుమారిలభట్టు జైన బౌద్ధమతాచార్యులను వాదానికి ఆహ్వానించేవాడు. అన్నింటా విజయం మన భట్టుదే. ఈ విధంగా నిరీశ్వరవాదాన్ని పరాజితం చేసి వైదికమతాన్ని పునరుద్దీపింప జేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కర్మ బ్రహ్మవాదంవలన ఆత్మద్రోహినైతినని, జైన బౌద్ధ గురువులవద్ద చదివి గురుద్రోహం చేశానని కుమారిలభట్టు హృదయంలో ఎంతో వ్యథ అనుభవించాడు. తన దోషాలకు నిష్కృతి ఎట్టిదో ఆలోచించసాగాడు. వాటి ప్రభావం సమాజంపై ఎట్టిదో అతడు బాగుగా ఎరుగు. 'యద్యదాచరతి శ్రేష్ఠః' అనే గీతావాక్యాన్ని అనుసరించి ఎవ్వరూ పరిహాసానికైనా కుమారిలభట్టు గురుద్రోహం చేయ లేదా అని తనను చూపిస్తారేమో! తాను కావించిన పాపకార్యానికి ఫలంగా శిక్ష అనుభవించాలి; పరుల ఊహలోకూడ గురు ద్రోహాన్ని తలపెట్టకుండా ఉండాలి; ఆ శిక్ష ఆలోచించి తుదకు తుషాగ్నియందు తన దేహమునుదహించ నిశ్చయించుకున్నాడు. ప్రభాకరాది శిష్యులు కన్నీరుమున్నీరుగా దుఃఖించారు. అయినా లెక్కచేయక శిక్ష ననుభవించాడు.

''గురుద్రోహము మహానేరము. దానికి అంత శిక్ష సుమా! అని లోకానికి తెలియజేశాడు కుమారిలభట్టు.

ప్రశ్నలు

1. కుమారిలభట్టు ఎవరు? ఆతని ఆశయ మేమి?

2.భట్టుచేసిన గురుద్రోహ మెట్టిది?

3. గురుద్రోహమున కెట్టి శిక్షను అనుభవించెను?

Neetikathamala-1    Chapters    Last Page