Neetikathamala-1    Chapters    Last Page

38

దైవస్తుతి

వందే వందారు మందార

మిందుభూషణ నందనమ్‌,

అమందానంద సందోహ

బంధురం సింధు రాననమ్‌.

* * *

భర్తృహరి

క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి

త్రము దగు మందు, దుర్జనులు దారుణపన్నగముల్‌, సువిద్య వి

త్త, ముచితలజ్జ భూషణ, ముదా త్త కవిత్వము రాజ్య, మీ క్షమా

ప్రముఖ పదార్థముల్‌ గలుగుపట్టునc దత్కవచాదు లేటికిన్‌?

మానవకోటికి సహనము కవచము వంటిది. కోపము శత్రువు వంటిది. దాయాది అగ్ని. మిత్రుడు మంచి ఔషధము. దుర్జనులగు వారు భయంకర సర్పములవంటివారు. ఆత్మజ్ఞానమే సంపద. వినయము అలంకారము. ఉదాత్త కవిత్వము రాజ్యము. క్షమాది గుణములు ఉన్నవానికి కవచాదులతో పని ఉండదు. అనగా ఆ యా సద్గుణములు మానవుని సదా కవచాదులవలె రక్షించు చుండునని తాత్పర్యము.

- - -

ఖాండిక్య కేశిధ్వజులు

ఖాండిక్య కేశిధ్వజులు అకుంఠిత విష్ణుభక్తులు. నిమివంశజులు. ఖాండిక్యుడు మహావిజ్ఞాని. కేశిధ్వజుడు కర్మఠుడు. వీరిద్దరు అన్నదమ్ములు. పినతండ్రి పెదతండ్రి బిడ్డలు. వీ రిరువురు రాజ్యముకొరకై పరస్పర విజిగీషులై హోరాహోరిగా పోరాడినారు. కేశిధ్వజుడు విజయం సాధించి చక్రవర్తి అయినాడు. ఖాండిక్యుడు రాజ్యముకంటె మోక్ష సామ్రాజ్యమే మేలని అరణ్యముల కరిగి తపస్సు చేయడం ఆరంభించాడు.

కేశిధ్వజుడు ''మృత్యువునే గెలుస్తాను. అవిద్యను ముట్టకుందును''అని నిశ్చయించుకొని యోగనియతితో జ్ఞానాశ్రయుడై యజ్ఞము చేస్తున్నాడు. యాగధేనువు యజ్ఞవాటిక చుట్టుఉన్న గడ్డిమేయుచు ఏటికట్టవెంట వెళ్లుచుండెను ఒక శార్దూలము గాండ్రు గాండ్రుమని అరచుచు వచ్చి దానిపైబడి దాని మెడను పట్టుకొని, విరచి, తోక నప్పళించి దాని రక్తమును త్రావి గుహలోనికి లాగుకొని పోవుచుండెను. ఆ ప్రాంతములో పొలాలలో పనిచేయుచున్నవారు, స్నాన మొనర్చు బ్రాహ్మణులు అరువగా దాని నట వీడి పులి వెడలిపోయెను.

గో వృత్తాంతమును కేశిధ్వజ మహారాజున కెరిగించిరి. కేశిధ్వజుడు ఋత్విక్కులను రావించి ప్రాయశ్చిత్త మడిగెను. కొందరు మాకు తెలియ దనిరి. వారిలో శునకుడు ''కేశిధ్వజ మహారాజా! దీనికి ప్రాయశ్చిత్త మొక్కడే ఎరుగును. ఆతడు ఖాండిక్యుడు. కావలెనన్న ఆతని నడిగి తెలుసుకొనుమని'' పలికెను. కేశిధ్వజుడు ''మునివరా! ప్రాయశ్చిత్తము వేడుటకై వెళ్లిన నన్ను నా శత్రువు చంపెనా నా యజ్ఞఫలము ఈడేరును. కాక మార్గమును చెప్పినా యజ్ఞతంత్రం పూర్తియై నా అభీష్టము నెరవేరును. ఎట్లయినను నా కిష్టమే'' అని పలికి నిరాయుధుడై రథంమీద ఖాండిక్యుడున్న వనమునకు వెళ్లాడు. ఖాండిక్యుడు వానిని జూచి ధనధాన్య అశ్వగోగణ సమేతమైన మహాసామ్రాజ్యము చాలక ముని వృత్తితోనున్న నన్ను చంపుటకై వచ్చుచున్నాడని తలచి యుద్ధమునకు సిద్ధ మయ్యెను. అపుడు కేశిధ్వజుడు ''కోపము వీడి నా మాటలు వినుడు. నే నాతతాయిని కాను'' అని పలికి తాను వచ్చిన కార్యమును వినిపించాడు. మంత్రి పురోహితులు ''మహారాజా! ఇదే సమయము. ఆతని కథ ముగించు. దానితో రాజ్య మంతయు నీకే వశ మగును. నీవు అవస్థపడి మమ్ములనుకూడా అవస్థపెట్టకుము. ఏ విధముగానైన శత్రువులను జయించుటయే రాజధర్మము'' అని ఖాండిక్యునకు చెప్పిరి.

వారి మాటలు విని జ్ఞాననిధియైన ఖాండిక్యుడు ''మీరు చెప్పిన పనిచేసిన మనకు రాజ్యము, వానికి పరలోకము ప్రాప్తించును. పరలోకసుఖము శాశ్వత మైనది. రాజ్యసుఖము అల్పకాల పరిభోగ్యమైనది. స్వల్ప సుఖమునకై పాపకృత్యము చేసి, పరలోక సౌఖ్యమునకు దూరము కానేరను. పరలోకమును కోరువారికి బద్ధాంజలియై వచ్చినవానిని చంపుట దోషము'' అని పలికి కేశిధ్వజునికి ప్రాయశ్చిత్తమార్గమును ఎరిగించెను. యజ్ఞము సాంగముగ పరిసమాప్త మైనది.

అనంతరము అవభృథస్నానము ఆచరించి, ఋత్విక్కులకు సదస్యులకు పూజ సల్పి, అర్థికోటికి అభిమతార్థము లొసంగి, కేశిధ్వజుడు తిరిగి వచ్చి గురుదక్షిణగా నేదైన స్వీకరింపుమని ఖాండిక్యుని ప్రార్థించెను. ఖాండిక్యుడు మరల మంత్రి పురోహితులను పిలిచి ''గురుదక్షిణ ఇవ్వడానికై నరవరుడు వచ్చినాడు. ఏది కోరుకొందురో తెలుపుడు'' అని అడిగెను. వారందరు ఏక కంఠముతో చతుస్సముద్ర వేలావలయితమైన సామ్రాజ్యమును కోరుకొని, ఆప్తులకు బంధువులకు సంతోషమును కలిగింపు మని చెప్పిరి. ఆతడు నవ్వి ''మీరు అర్థసాధన పరతంత్రులు తప్ప మహాసుఖదాయి యయిన మోక్షమార్గ విచారకోవిదులు కారు. అతి చంచలమైన రాజ్యలక్ష్మిని నేను కోరను. వీడు అమలిన యోగాశ్రయుడు. ఉత్తమ యోగమును కోరుట మేలు కాని రాజ్యమును గోరుటయా? అని పలికి ''ఓ రాజా! నీవు అధ్యాత్మ విద్యాపారంగతుడవు. నీవు నిజముగా గురుదక్షిణ యీయవలె నని సంకల్పించినచో సకల సంసారక్లేశనాశకమైన ఆ విద్య బోధింపు'' మని కోరెను. ఆ మాటలు విని ''అయ్యా! నిష్కంటకమైన రాజ్యాధికారము కోరక నీ విది యేల కోరితి'' వని ప్రశ్నించెను. ''కేశిధ్వజా! వినుము. రాజ్యము వీర భోజ్యము. సమరమునందు ఓడిపోయిన నాకేల ఈ రాజ్యము? సుక్షత్రియులకు యాచన తగదు. నా ప్రధానులు సామ్రాజ్యమును వేడుట కేవలము లోభముతో కూడినది. ఈ కోరిక అయుక్తము'' అని పలికెను. కేశిధ్వజుడు వాని వివేకమున కాశ్చర్యపడి ''నేను అవిద్యవలన మృత్యువును గెలువలేకున్నాను. భోగములను అనుభవించుచు పుణ్యఫలమును క్షీణింప జేసికొనుచున్నాను. మన నిమివంశ పావనత్వము వలన తత్త్వ వివేచన నీకు పొడమినది'' అని పలికి ఖాండిక్యునకు అవిద్యావిధమును వివరించి, భక్తి యోగమహిమను ప్రబోధించెను.

ఖాండిక్యుడు ''రాజా! కృతార్థుడనైతిని'' అని పలికెను. కేశిధ్వజుడు ఆతనికి అర్ధరాజ్యమును ఇత్తుననెను. ఖాండిక్యుడు దానిని పుచ్చుకొనక ఆ రాజ్యమునకు తన కొడుకును రాజుచేసి ఆతడు గోవింద చరణారవింద విన్యస్తమానసుడై, ఆ వనమే తపోవనముగా కేశిధ్వజుడు ఉపదేశించిన భక్తియోగానుసంధానముచే విష్ణు సాన్నిధ్యమును బొందెను.

వివేక నిరూఢులైన వ్యక్తులు భగవదనుగ్రహమునకు పాత్రులగుదు రనియు, విద్యావిషయమున శత్రువుల నైనను ఆశ్రయించి జ్ఞానమును పొందవలె ననియు ఖాండిక్య కేశిధ్వజో పాఖ్యానము తెలుపును.

ప్రశ్నలు

1. ఖాండిక్య కేశిధ్వజు లెవరు? వా రెట్టివారు?

2. కేశిధ్వజుడు ఖాండిక్యుని కడకు ఏల అరిగెను?

3. ఖాండిక్యుడు అడిగిన గురుదక్షిణ ఏమి?

Neetikathamala-1    Chapters    Last Page