Neetikathamala-1    Chapters    Last Page

33

దైవస్తుతి

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ,

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్త్మె నకారాయ నమశ్శివాయ.

- - -

భర్తృహరి

మకర ముఖాంతరస్థమగు మానికముం బెకలింప వచ్చుc, బా

యక చలదూర్మికానికరమైన మహోదధిదాcట వచ్చు, మ

స్తకమునcబూవు దండవలె సర్పమునైన భరింప వచ్చు మ

చ్చిక ఘటియించి, మూర్ఖజన చిత్తముc దెల్ప నసాధ్య మేరికిన్‌.

మొసలి నోటిలోని కోరలనడుమ నుండు రత్నమునైనను ప్రయత్నించి బయటికి దీయువచ్చును; పెద్ద అలలుగల సముద్రమునైనను దాటవచ్చును. సర్పమును పూలదండవలె శిరస్సున ధరించవచ్చును. కాని మూఢుడైన వాని మనమును సమాధానపెట్టుట ఎవరికిని సాధ్యముగాదు.

- - -

రామబాణప్రభావం

శ్రీరఘు వీర కోదండ వినిర్ముక్త శరము అప్రతిహతము, అమోఘము, అమేయము, దాని శక్తి అపారము. దానెదిరించి నిలువగల వీరుడు ముల్లోకములలో లేడు . రామబాణ హతులై జీవించిన వారు లేరు.

విశ్వామిత్ర మహర్షి ప్రేమమీరగా, రామునికి సర్వ అస్త్ర శస్త్రాలను ఉపదేశించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞాచే రామ లక్ష్మణులు యాగ రక్షణార్థం ధనుర్ధరులై యజ్ఞ రక్షణ దీక్ష వహించారు. అయిదు అహోరాత్రములు ఏకాగ్రతతో వారు తపోవనాన్ని కావలి కాసినారు. ఆరవ దినాన వర్షాకాల మేఘాలవలె మారీచ సుబాహులు మాయ మబ్బులతో ఆకాశాన్ని కమ్మివేశారు. అజ్ఞానంచేత రాముణ్ణి పిల్లవాడని భావించి లెక్కచేయక నెత్తురు వర్షం కురిపించసాగారు. రాముడు క్రుద్ధుడైనాడు. శక్తిమంతమైన ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి కొట్టాడు. వాడు నేలకూలి మరణించాడు. పరమ భాస్వరమైన మానవాస్త్రాన్ని మారీచునిపై ప్రయోగించాడు. ఝంఝామారుతము దూదిపింజను ఎగురగొట్టి నట్లుగా ఆ మానవాస్త్రము మారీచుణ్ణి నూరు యోజనాల దూరము ఎగురవేసుకొనిపోయి సముద్ర మధ్యంలో పడవేసింది.

మారీచుడు తాటక అనే యక్షిణికి సునందునివలన జన్మించాడు; అగస్త్య మహర్షి శాపంవల్ల సునందుడు మరణించాడు. తండ్రిని చంపివేశాడన్న కోపంతో తనమీద పడబోతున్న మారీచుణ్ణి అగస్త్యమహర్షి ''నీవు రాక్షసుడవు అయిపోదువుగాక'' అని శపించాడు. మరుక్షణంలో మారీచుడు క్రూర కర్ముడై మహర్షుల తపస్సుకు, యజ్ఞములకు భంగం కలిగించడం ఆరంభించాడు. సహస్రనాగబలంతో, వరగర్వంతో, తప్తకాంచన కుండలాలతో, అమిత దర్పంతో వాడు తన దుష్కృత్యాలు ప్రారంభించాడు.

బ్రతికి బయటపడిన మారీచుడు నిర్వణ్ణుడయిపోలేదు. సమయంకొరకు వేచియున్నాడు. ఇద్దరు రాక్షసులతో మృగరూపం ధరించి దండకారణ్యంలో ధర్మాచరణ పరాయణులైన ఋషులను చంపి వారిమాంసంతింటూ, వారినెత్తురు త్రాగుతూ క్రూరుడై ధర్మదూరుడైనాడు. దండకారణ్యంలో తాపసవేషంలో ఉన్న రామలక్ష్మణులను, సీతను చూచాడు. వారు మారీచుని గుర్తించలేదు. వారిని చూడగానే మారీచుడికి రామబాణపు దెబ్బ జ్ఞాపకం వచ్చింది. పూర్వవైరం స్మృతిలో మెదలింది. రాముడు తాపసి, నియతాహారుడు, తనను ఏమిచేయలేడని తలంచి, తన కొమ్ములతో పొడిచి చంపాలని రాముడికి ఎదురుగా పరుగెత్తాడు. రాముడు వజ్ర సదృశ##మైన బాణాలను మూడింటిని విడిచాడు. రామబాణాహతి ఎంత భయంకరమైనదో ఇదివరకే రుచి చూచినందువల్ల వాడి గుండెబెదిరి భయంతో అందకుండా పారిపోయాడు. ఆ బాణాలు తగిలి తోటి రాక్షసులు మరణించారు. తర్వాత మారీచుడు దుర్వృత్తులు మానివేశాడు . తపోనిష్ఠతో, మనోనిగ్రహంతో యోగ్యుడైనాడు. అరణ్యమధ్యంలో ఏకాంతంగా మనోహరమైన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని జటావల్కలధారియై కృష్ణాజినం కప్పుకుని నియతాహారియై జీవించసాగాడు. అతడు ఎటుచూచినా వందలకొద్దీ, వేలకొద్దీ రామాకృతులే వాడి కళ్ళకు కన్పడుతూన్నాయి. ఆ అడవి అంతా వానికి రామమయంగా తోస్తుంది. శూన్యంలో రాముడు; కలలో రాముడు! సర్వే సర్వత్రా ఆ మారీచునికి రాముడే సాక్షాత్కరిస్తున్నాడు. రాముని భయంవల్ల 'రా' అనే అక్షరంతో ఆరంభము అయ్యే పేర్లు- రత్నాలు అన్నా, రథాలు అన్నా వాడు అడలిపోతూ ఉన్నాడు.

సీతాపహరణం చేయడానికై మాయామృగ రూపంతో వచ్చి, తనకు సాయం చేయమని రావణుడు కోరగా మారీచుడు రామునితో వైరం వద్దు అని, ఆవైరంవల్ల సమంత్రి పుత్ర బాంధవంగా మరణం తప్పదని హెచ్చరించాడు. తాను చెప్పినట్లు చేయకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు. రావణుని చేతిలో చావుకంటే రామదర్శనంచేసి రామునిచేతిలో మరణించటమే యోగ్యమని నిర్ణయించుకుని మారీచుడు మాయామృగ రూపంలో రావణునికి సాయం చేశాడు.

క్రూర సత్త్వుడై నప్పటికీ మారీచుడు యోగ్యుడై, తాపనవృత్తి నవలంబించి అంతా రామమయంగా దర్శించగల్గటం రామబాణ ప్రభావం వలననేగదా!

ప్రశ్నలు

1. రామబాణ మహిమ ఎట్టిది?

2. మారీచుడు ఎవరు? ఆతడు రామబాణము నెట్లు చవిచూచెను?

3. రావణునకు సహాయము చేయుటకు మారీచుడు ఎందులకు అంగీకరించెను?

Neetikathamala-1    Chapters    Last Page