Neetikathamala-1    Chapters    Last Page

32

దైవస్తుతి

శ్రీమత్సుందర నాయకీం భయహరాం జ్ఞాన ప్రదాం నిర్మలాం

శ్యామాభాం కమలాస నార్చిత పదాం నారాయణ స్యానుజామ్‌,

వీణావేణు మృదంగ వాద్య రసికాం నానావిధా డంబికాం

మీనాక్షిం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్‌

- మీనాక్షి పంచరత్నం

- - -

భర్తృహరి

గురుcడు గురుండ, వాలు శతకోటి, సుపర్వులు వాహినీపతుల్‌

సుర భవనంబు కోట, మధుసూదనుcడున్‌ సయిదోడు దంతి ది

క్కరి పతిగాcగ నొప్పు బలఘాతియు దాయల కోడె నాజిలో

శరణము దైవమే, పురుష శక్తినిరర్థకమెన్ని భంగులన్‌.

బృహస్పతి గురువై, వజ్ర మాయుధమై, దేవతలు సేనలోని వారలయి, స్వర్గము కోటయై, విష్ణుమూర్తి అనుగ్రహము గలవాcడై, ఐరావత గజముగల్గి ఈ విధమగ ఆశ్చర్యమును గలుగజేయి శక్తిగల ఇంద్రుడే శత్రువులచేత యుద్ధమునం దోడిపోయెను. కాన దైవబలమే ప్రధానముగాని పౌరుష మెందుకును పనికిరాదు.

- - -

కర్ణుడు

సర్వ సాక్షియైన సూర్య భగవానుని వరప్రభావంవల్ల కుంతీదేవికి సద్యో గర్భంలో పుట్టినవాడు కర్ణుడు. కాని దైవ ఘటన వలన సూతపుత్రుడై పెరిగి, దుర్యోధనుని మైత్రిచే అంగరాజైనాడు. కర్ణుడు మహాదాత, సింహసదృశ్య పరాక్రముడు, మహాతేజస్వి, దైవదుర్యోగం వలన అతడు పేటి కాంతర్గత రత్నం అయినాడు. రాధేయుడుశ స్త్రా స్త్రవిద్యలో అద్వితీయు డగుటకు యథాశక్తి పరిశ్రమ చేశాడేగాని అతని అదృష్టాన్ని ఎవరు మార్చగలరు? అతడు విద్యాకాంక్షతో చేసిన కర్మలు అతనికే దుఃఖ హేతువులైనాయి.

అర్జునునకు కర్ణునకు బ్రహ్మాస్త్ర ప్రయోగ, ఉపసంహార విజ్ఞానములోనే తేడా. అందువల్ల కర్ణుడు బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని సంపాదించుటకు ఆచార్య ద్రోణులను అర్థించాడు. కర్ణుడు సూతకుమారుడన్న కారణాన ద్రోణాచార్యుడు అతని కోరికను నిరాకరించాడు. ఎట్లయినను బ్రహ్మాస్త్రజ్ఞానం పొందాలి. శస్త్రాస్త్ర విద్యలో అర్జునుని అతిక్రమించాలి. కార్యసాధనకై చిన్న అబద్ధం ఆడినా, అనుచితమైన కార్యంచేసినా హాని ఏముంది అనుకున్నాడు, పాపం కర్ణుడు! కపట బ్రాహ్మణ వేషధారియై మహేంద్రగిరిపై ఉన్న పరశురాముడి దగ్గరకు వెళ్ళి ''మహానుభావా! నేను భృగువంశ బ్రాహ్మణుడను. తమ సేవలో బ్రహ్మాస్త్రాది శస్త్రాలను అభ్యసించ గోరుచున్నాను'' అని విన్నవించాడు. కర్ణుని తేజో, రూప, శీల సదాచారాలను అవలోకించిన పరశురాముడు అత్యంత ప్రసన్నుడై అతనిని తనవద్ద నుండుటకు అనుమతించాడు. కర్ణుడు సావధాన చిత్తంతో భార్గవరాముని సేవిస్తూ ఈషణ్మాత్రము లోపం కలుగ నీయక అత్యంత ప్రేమ పాత్రు డయ్యాడు. ప్రయోగ, ఉపసంహార సమేతంగా బ్రహ్మాస్త్ర విద్యా రహస్యాన్ని కర్ణునకు బోధించాడు పరశురాముడు. జగత్తులో తాను అద్వితీయ వీరుడు కావాలన్న విజిగీషతో ఏకాంత ప్రదేశంలో నేర్చిన విద్యను దృఢతరం చేసుకొవడానికి అభ్యాసం సాగిస్తున్నాడు. ఒకనాడు ప్రమాదవశాత్తు ఒక బ్రాహ్మణుని అగ్నిహోత్ర గోవత్సం ఆతని బాణం తగిలి మరణించింది. అది చూచి పశ్చాత్తాపంతో దుఖించసాగాడు కర్ణుడు. ఆ వార్తవిని ఆ బ్రహ్మణుడు కుపితుడై - ''గోహంతకుడా ! నీవు ఎవరిని ద్వేషిస్తూ ఓడించాలని సదా ప్రయత్నం చేస్తున్నావో అతడే నిన్ను హతమార్చుగాక! ఘోరయుద్ధ భూమిలో నీ రథచక్రం క్రుంగిపోవుగాక! '' అని శపించి వెళ్ళిపోయాడు.

అధైర్యపడక పురుషకారం పై ధృఢవిశ్వాసంతో కుర్ణుడు పరశురాముని మరింత భక్తి శ్రద్ధలతో సేవింపసాగాడు. ఒకనాడు పరశురాముడు అడవిలో తిరుగుతూ దైవయోగం వలన అలసిపోయాడు. ఒక చెట్టు నీడలో తనకత్యంత ప్రియశిష్యుడైన కర్ణుని తొడపై శిరస్సునుంచుకొని నిద్రించాడు. ఇంద్రుని ప్రేరణ వలన ఒక కుమ్మరి పురుగు కర్ణుని తొడక్రిందజేరి దానిని తొలుస్తూ ఆతని రక్తం త్రాగసాగింది. రాధేయుడు దుస్సహవేదన పడుతున్నాడు. కాని ఏమి చేయాలి? ఆ కీటకాన్ని దూరం చేయడానికి ఏమాత్రం కదలినా గురువులకు నిద్రాభంగం కల్గుతుంది. అట్లు నిద్రాభంగం చేయడం ధర్మవిరుద్ధం. ఆ కీటకాన్ని హతమార్చనిచో వేదన క్షణ క్షణం ఎక్కువ అవుతున్నది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. ఏమైనా సరే గురువులకు నిద్రాభంగం వాటిల్లరాదని నిశ్చయించు కున్నాడు కర్ణుడు. ఆ బాధను భరింపసాగాడు. కొంత సేపటికి వెచ్చని రక్త ప్రవాహం పరశురాముని దేహానికి తగిలింది. తన వీపును తాకి చూడగా చేయి రక్తసిక్తమైంది. రుధిరంతో నా శరీరమును అపవిత్రం చేసిన దెవరు?'' అంటూ లేచాడు జమదగ్నినందనుడు. భయవేదనలతో కంపించి కర్ణుడు చేతులు జోడించి ''స్వామీ యిది ఈ కీటకం యొక్క దుష్కార్యం, నా అపరాధం ఏ మాత్రమూ లేదు'' అంటూ కీటకాన్ని చూపాడు. పరశురాముని క్రోధ వీక్షణంతో కీటకం భస్మమై పోయింది.

కర్ణుని ఓర్మి, గురుభక్తి, త్యాగములకు గురుదేవులు ప్రసన్నులు కావలసినది. కాని దైవగతి మరోవిధంగా ఉంది. పరశురామునికి సందేహం కల్గింది. ''నీవు ఎవరవు? బ్రాహ్మణుడు ఎన్నడూ ఇట్టి కష్టాన్ని సంహింపలేడు. నిజం చెప్పు'' అని గద్దించాడు. ఆ పురుగు వలె తాను కూడ భస్మమైపోతాను అన్న భయంతో గడగడ వణకుతూ సూత నందనుడు ''గురుదేవా! నా అపరాధాన్ని క్షమించండి. బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించేందుకు నేను అసత్యమాడాను. నేను సూత పుత్రుడనగు వసుషేణుడను. గురువు ధర్మపిత అవుతాడు. అందువలన నేను భృగువంశీయుడనని చెప్పాను'' అని విన్నవించి మౌనంగా అంజలి ఘటించి నిలబడ్డాడు. కొన్ని క్షణాలు పరశురాముడు గంభీరంగా ఆలోచించి- ''నీవు మహాపరాధం చేశావు. అందువలన నీ సమానునితో యుద్ధంచేయు నప్పుడు విపత్సమయాన ఈ అస్త్రం నీకు స్మృతికి రాకుండుగాక!'' అని éశపించాడు. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ కర్ణుడు హస్తినాపురం చేరాడు.

విధివిధించిన విపత్తును పురుషార్థం నశింపచేయలేదు. అంతేగాక అసత్యమువల్ల సంపాదింపబడిన వస్తువు క్షణిక సుఖాన్ని కుడా ప్రసాదించదనీ, పరిణామం దుఃఖదాయకమనీ, విజయం సదా సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుందని మనం గుర్తించాలి.

ప్రశ్నలు

1. కర్ణునికి అస్త్రవిద్య నేర్పుటకు ద్రోణు డెందులకు అంగీకరించ లేదు?

2. బ్రాహ్మణుడు కర్ణుని ఏమని శపించెను?

3. పరశు రాముడు కర్ణుని శపించుటకు కారణమేమి?

Neetikathamala-1    Chapters    Last Page