Neetikathamala-1    Chapters    Last Page

29

దైవస్తుతి

ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్వలాం

బింబోష్ఠీం స్మిత దన్తవఙ్త్కి రుచిరాం పీతామ్బరాలం కృతామ్‌,

విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్త్వస్వరూపాం శివాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాం నిదిమ్‌.

- మీనాక్షి పంచ రత్నం

---

దాశరథి

అండజవాహ! నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్‌

కొండల వంటివైన వెసcగూలి నశింపక యున్నె, సంతతా

ఖండల వైభవోన్నతులు గల్గక మానునె, మోక్షలక్ష్మి కై

దండ యొసంగకున్నె తుద దాశరథీ! కరుణా పయోనిధీ!

దయా సముద్రుడవైన ఓ రామా ! నిన్ను నమ్మినవారి పాపము లెన్ని యున్నను నశించితీరును. అంతులేని సిరి సంపదలు కల్గును. తుదకు మోక్షము సిద్దించును.

---

సావిత్రి

సావిత్రి మద్ర దేశాధిపతి అయిన అశ్వపతి కుమారై. సావిత్రీదేవి వరప్రసాదం వల్ల పుట్టడంచేత అమెకు ''సావిత్రి'' అని నామకరణం చేశారు. సావిత్రి సిద్ధ, సాధ్య యక్ష, అమర కన్యలను మించిన అసాధారణ సౌందర్యరాశి. అశ్వపతి క్షితీంద్రుడు తన కూర్మి కూతును చూచి ఆమెకు గుణవయో రూపాలలో అనురూపుడైన భర్త కొరకై అన్వేషింపసాగాడు. ఒకనాడు నారద మహర్షి ఆయన ఇంటికి వచ్చాడు. ఆ మహా మునికి సముచిత సపర్యలుచేసి కుశల ప్రశ్నాదికములతో ప్రసంగించు చుండగా ఇంతలో సావిత్రి అక్కడకువచ్చి తండ్రికి, మహర్షికి నమస్కరించింది. అప్పుడు నారదుడు ఆ కన్యనుచూచి '' రాజా! ఇంకా కుమారైకు తగిన వరుడు లభించలేదా?'' అని అడిగాడు. మద్రపతి కుమారైను దగ్గరగా తీసికొని ''అమ్మా! నీ గుణ రూప శీలములకు తగిన వరుడే నాకు దొరకలేదు. అను రూపుడైన భర్తను నువ్వే తెలుపు'' అని అడిగాడు.

సావిత్రి సిగ్గుపడి కొంతసేపటికి ''సాళ్వరాజకుమారుడైన సత్యవంతుడు రూపవంతుడని, గుణ వంతుడని విని వానియందు నా మనస్సు లగ్నమై ఉన్నది'' అని పలికెను. అశ్వపతి నారదునిచూచి సావిత్రిచేత వరింపబడిన రాజకుమారు డెట్టి వాడని అడిగెను. నారద మహర్షి ''రాజా! నిత్య సత్యవచను డగుట వల్ల ఆతనికి సత్యవంతుడని ప్రసిద్ధి వచ్చింది. ఆ రాజకుమారునకు చిత్రాశ్వుడని నామాంతరమున్నది. ఆతడు తేజస్సులో సూర్యుడు; బుద్ధియందు బృహస్పతి; పరాక్రమంలో ఇంద్రుడు; సహనంలో భూదేవి వంటివాడు; కాంతియందు చంద్రునితో సమానుడు. రూపమునందు అశ్వనీ కుమారులతో తుల్యుడు; శమ దమాది సర్వసద్గుణ సంపన్నుడు. కాని వానియందు ఒకే ఒక దోషమున్నది. నేటినుండి ఒక్క సంవత్సరములో అతడు మరణిస్తాడు. నీకు నిజం చెప్పాలి కాబట్టి చెప్పాను'' అన్నాడు. అశ్వపతి కూతురువైపు తిరిగి తల్లీ! ఈ మహాను భావునకు తెలియని విషయములేదు. ఈతని వచనము అమోఘము. నీ కట్టి అల్ఫాయుష్కుడైన వరుడు ఎందులకు? మరొకనిని చెప్పుము'' అని అడిగాడు.

సావిత్రి దృఢనిశ్చయంతో ''మనోవాక్కాయ కర్మలలో మనస్సే ప్రధానమైనది. కాబట్టి నామనసులో నిలిచిన ఆ సత్యవంతుడే నాభర్త'' అని చెప్పింది. నారదమహర్షి '' సరే, నరేంద్రా! నీ కూతురు సద్గుణములప్రోవు. ఆమెను ఆ రాజకుమారుడికే ఇవ్వు. నీ కుమార్తె పుణ్య విశేషం వల్ల ఆమె ప్రియుడు పరిపూర్ణాయుష్మంతు డవుతాడు'' అని పలికాడు.

అశ్వపతి నారద మహర్షి ఆజ్ఞానుసారం రాజ్యాన్ని కోల్పోయి, అరణ్యాలలో తపో నియమంతో కాలం గడుపుతున్న సాళ్వరాజు ద్యుమత్సేనుని దగ్గరకువెళ్ళి, ప్రార్థించి ఆయన కుమారుడైన సత్యవంతునికిచ్చి సావిత్రికి వివాహం చేశాడు. సావిత్రి వల్కలాజిన వసనయై అత్తమామలకు భర్తకు శుశ్రూషచేసి వారి అంతరంగాలను ఆనందింపజేసింది. కాలంగడుస్తున్నది. సావిత్రి నారద మహర్షి మాటలప్రకారం రోజలు లెక్క పెట్టుకుంటున్నది. నాలుగు రోజులు తక్కువగా సంవత్సరం గడిచింది. నాలుగవరోజున పతి మరణమని, నిష్ఠతో త్రిరా త్రోపవాస వ్రతం చేసింది. మామగారైన ద్యుమత్సేనుడు ఆమె కఠోరనియమాలు చూసి ''తల్లీ! దుస్తరమైన ఈ వ్రతం చేస్తున్నావెందుకు?'' అని అడిగాడు. ''పరమ శుభాలు కోరి నే నీవ్రతం చేస్తున్నాను. ఈ నా వ్రతభారం చూసి మీరేమి దుఃఖించవద్దు. దీని ఫలం మీకే ముందు తెలుస్తుంది'' అని సమాధానం చెప్పింది సావిత్రి.

తెల్లవారింది. తన బ్రతుకే తెల్లవారే సమయం ఆసన్నమైనదని సావిత్రి మానసమంతా శోక భారంతో నిండిపోయింది. దినముఖోచితకృత్యాలు ఆచరించింది. భక్తితో పతికి పరిచర్యచేసింది. అత్తమామలకు విప్రవరులకు ప్రణామం చేసింది ''నిత్య సౌభాగ్యవతిగా వర్ధిల్లు'' మని వారు ఆశీర్వదించారు. మామగారు పిలిచి ''అమ్మా, తీవ్రమైనతపమొనర్చి చాలా డస్సిపోయినావు. ఇక భోజనంచెయ్యి'' అన్నాడు. ''మహారాజా! రాత్రివరకు భోజనం చేయకూడదు. ఇది ప్రారంభంలో నేను చేసుకున్న నియమం'' అని సమాధానం చెప్పింది సావిత్రి.

ఇంతలో సత్యవంతుడు సమిత్కుశ ఫలాహరణార్థమై వనానికి బయలుదేరాడు. సావిత్రి భర్తతోపాటు తానుకుడా అరణ్యానికి వస్తానన్నది. కృశాంగివైన నీ విప్పుడు వనానికి రావద్దన్నాడు భర్త. ''నాథా! నాకు ఉపవాసశ్రమ లేశ##మైనాలేదు. అరణ్యంలోని పుష్ప పల్లవ ఫలాలను చూడాలని నాకోరిక. నా కుతూహలాన్ని నిరోధించవద్దని'' బ్రతిమాలి, అత్తమామల అనుమతిపొంది, భర్తతోపాటు తాను వనానికి బయలుదేరింది.

ఇట్లా దంపతులు మందగమనంతో పరిసరారణ్య భూములకు వెళ్ళారు. తరులతాదులతో, మంజుల శుకపిక గానాలతో రమ్యమైనవనసౌందర్యం తిలకిస్తూ అరణ్య మధ్యంలోకి వెళ్ళారు. సత్యవంతుడు అవసరమైన ఫలాలు కోశాడు. కట్టెలు కొడుతూ ఉండగా ఆయన శరీరం చెమటపట్టింది. శిరోవేదన కల్గింది. అవయవాలు పట్టు తప్పుతున్నవి. గొడ్డలి భూమిమీద పడవేసి ''ప్రియా! నా ఒడలు వశం తప్పుతున్నది. శిరస్సుశూలంతో పొడిచినట్లుగా ఉన్నది. ఈబాధ భరించలేను. కొంచెంసేపు విశ్రమిస్తాను'' అని పలికి సావిత్రి అంకతలం మీద తల ఉంచి నిశ్చేతనంగా పడుకొన్నాడు.

ఇంతలో కాంచన వర్ణాంబరం ధరించి ఒక వినీల మేఘాకారుడు, ఉజ్జ్వల రక్తాక్షుడై, ప్రళయకాలాగ్ని స్వరూపుడై, పాశహస్తుడై మహాసంరంభంతో సత్యవంతుని మీదికి దూకాడు. భయవిహ్వలయై సావిత్రి ''అయ్యా! మీరెవ్వరు? ఏమి చేయడానికై ఇక్కడికి వచ్చారు'' అని ప్రశ్నించింది. జగజ్జన సంత్రాసకరుడైన ఆ మహా తేజస్వి ''కమలాక్షీ! నేను యమ ధర్మరాజును. నీ పాతివ్రత్య మహిమతో అన్యులు గుర్తించ లేని నా ఆకారాన్ని నీవు సందర్శింప గలిగావు. నీ భర్తకు కాల మాసన్నం అయింది. వీడు మహా పుణ్యనిథి. కాబట్టి ఇతరులను పంపకుండా నేనే స్వయంగా వచ్చాను'' అన్నాడు. వెంటనే సత్యవంతుని దేహంలో ప్రవేశించి ప్రజ్వరిల్లుతున్న జీవుని గైకొని పాశబద్ధుని చేసి దక్షిణదిశగా భీకరమార్గంలో వెళ్ళిపోతున్నాడు. సావిత్రి ప్రాణశ్వరుని దేహాన్ని భూమిపై ఉంచి పాదపద్మాలు తొట్రిల్లుతుండగా ఆకారం దాల్చిన శోకంగా యమధర్మరాజు వెంటబడింది.

యమధర్మరాజు ఆమెను చూచి '' లతాంగీ ! నీవు నా వెంటరావలదు. ఈ త్రోవ అగమ్యం'' అని వారించాడు. ''భర్త ఎక్కడుంటే భార్యకూడ అక్కడే ఉండవద్దా మహానుభావా ! సకల మార్గములో ధర్మమార్గమే ప్రధానమైనది. అట్టి ధర్మస్వరూపుడవైన నీ దర్శనము పరమ శుభములకు నెలవు. అందరివలె నేను ఊరక తిరిగి వెళ్ళుదునా?'' అన్నది. సావిత్రి మాటలువిని యముడు సంతసించి భర్త ప్రాణంతప్ప ఒకవరం కోరుకొమ్మన్నాడు. సావిత్రి ఆయనకు నమస్కరించి అడవిలో శత్రువులచే పరాభూతుడై పడివున్న మామగారికి కన్నులు ప్రసాదించమని కోరింది. ''ఇంక నావెంట రావద్దు తల్లీ'' అని ఆమెకు వరం ప్రసాదించాడు కాలుడు. ''దేవోత్తమా! నీవు సకల ధర్మముల నెరిగిన ధర్మదేవతవు. తత్తత్‌ సముచిత కర్మఫలాన్ని ప్రాణికోటికి సమబుద్ధితో ప్రసాదించే ''సమవర్తివి'. భూతములనెల్ల యమించే వాడివి కాబట్టి పెద్దలు యము డంటారు. కల్మషములను శమింపజేసి శమనుడ వని ప్రసిద్దిచెందావు''అని ప్రస్తుతించింది. ఆ పుణ్యసతి మాటలు విని ''నీ సమంజస వాక్యరీతి నన్ను తృప్తుని కావించినది. సత్యవంతుని ప్రాణములుకాక ఒకవరము వేడుకొనుము'' అన్నాడు. సావిత్రి ఆంజలి ఘటించి ''వైరులవలన పోయిన రాజ్యం ద్యుమత్సేనునకు లభించునట్లు వరమిమ్ము'' అని వేడింది. ''అట్లే అగుగాక'' అని పలికి తల్లీ! త్రోవ అత్యంత దుర్గమం. నువ్వు ఇక రాకూడదు అన్నాడు.

సావిత్రి యముణ్ణి అనుసరిస్తునే ''ప్రథమ ధర్మాధ్యక్షా! ఎట్టి దశలో కుడా ధర్మాత్ములు తమధర్మకార్యం వీడరు. ధార్మిక హృదయములలో మోహతాపములు పుట్టవు. కావున పతి అనుగమనము మానడం ధర్మం కాదుగదా!'' అని పలికింది. అమె ధర్మతత్పరతకు మెచ్చుకొని, తండ్రియైన మద్రరాజుకు పుత్రులు కలుగునట్లుగా వరం ప్రసాదించి ''ఇప్పటికే చాలా దూరం వచ్చావు. ఇక తిరిగి వెళ్లడం మేలు'' అన్నాడు యముడు.

''భర్తచరణ పంకజాలను ఆశ్రయించుకొనివుండే నాకు ఆకలిదప్పులులేవు. ధర్మాత్మా? ధర్మంవల్లనే సూర్యచంద్రాదులు నిర్వికారంగా ప్రకాశిస్తున్నారు. సకల ధాత్రి అభ్యుదయం పొందుతున్నది. నాపట్ల ఇంత కరుణ వహించిన మీరు నాకు ఆత్మబంధువులు. నా మనోరథం ఈడేర్చు'' అని ప్రార్థించింది. ఆ మహానుభావుడు సావిత్రివైపు తిరిగి ''నీపట్ల ప్రసన్నుడనైనాను. సత్యవంతుని జీవితముకాక నీయిష్టమైన వరం కోరుకొమ్ము'' అన్నాడు. సావిత్రి మహిషవాహనునికి ప్రణమిల్లి పుణ్యవీక్షణా? పతివిరహము దుస్సహమైనది. సర్వమంగళములకు సతికిపతియే మూలము. కాని అతులిత కీర్తిశాలి, సుగుణాఢ్యుడు, సాళ్వసుతునికి ప్రాణదానము ప్రసాదించుము'' అని ప్రార్థించింది. సావిత్రి అఖండ పతిభక్తి మెచ్చుకొని యముడు ''ఓ కాంతా!ఇదిగో! నీ భర్త జీవము. వీడు చతుశ్శతాబ్దములు జీవించి శతపుత్ర లాభమును పొందును. నిత్యకీర్తి వర్ధనుడగు వివిధ యజ్ఞ నిర్వహణము కావించి వంశదీపకుడగును'' అని పలికి అంతర్హితుడయ్యెను.

సావిత్రి వెనుదిరిగి వెళ్ళి పూర్వంవలెనే ప్రాణశ్వరుని తొడలపై నిడుకొని కూర్చుండి యుండెను. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రనుండి మేల్కాంచిన వానివలె లేచెను. సావిత్రీదేవి వదన మండలమున సహస్రపూర్ణచంద్రులు ఉదయించిరి. అఖండ పతిభక్తితో ధర్మస్వరూపుడైన యమధర్మరాజునే మెప్పించి పుట్టినింటిని, మెట్టినింటిని పవిత్ర మొనర్చిన సతీసావిత్రికి సాటి యగువారు విశ్వమందే కానరారు.

ప్రశ్నలు

1. సావిత్రి ఎవరిని వరించెను! అత డెట్టివాడు?

2. వనములో సావిత్రి ముందు సాక్షాత్కరించిన మహానుభావుడెవరు? ఆత డేల అచటికి వచ్చెను?

3. సావిత్రి యముని మెప్పించి పతిని ఎట్లు సంరక్షించుకొనెను?

Neetikathamala-1    Chapters    Last Page