Neetikathamala-1    Chapters    Last Page

23

దైవస్తుతి

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్‌,

వాతాత్మజం వానర యూథముఖ్యం

శ్రీరామ దూతం శిరసా నమామి.

--- --- ---

భర్తృహరి

సగుణ నిర్గుణ కార్యముల్‌ సలుపు సుమతి

సేcత పరిణతి గడుc బ్రతీక్షింపc దగును

బరుషకర్మ విపాకంబు ఫలము దనుక

హృదయము దహించు శల్యంబు రీతి జగతి.

పండితుడగు వాడు మంచిదో చెడ్డదో యొక కార్యమును చేయబూను నేని ప్రయత్న పూర్వకముగ ఆలోచింపవలెను. అట్లుగాక త్వరపడి అనాలోచితముగా చేసిన కార్యములయొక్క ఫలము శల్యమువలె మనమును బాధించు చుండును.

* * *

నారద తుంబురులు

ఒకనాడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు తన్ను సేవిస్తుండగా వైకుంఠంలో సభ తీరి ఉన్నాడు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, కణ్వుడు, విశ్వామిత్రుడు మొదలైన ముని గణమంతా వచ్చారు. అందరితో పాటు నారద తంబురులు కూడా విష్ణుమూర్తి సేవకై విచ్చేశారు. విష్వక్సేనుడు వేత్రహస్తుడై సభలో ప్రశాంత పరిస్థితి నెలకొల్పుతుండగా అప్సరఃకన్యల నాట్యం అవలోకిస్తున్నాడు విష్ణుమూర్తి. ఇంతలో దాసీజనం సేవ లంపదుకుంటూ లక్ష్మీదేవి సభలో ప్రవేశించింది. మరుక్షణమే వేత్రహస్తులై కొందరు కొలువులో ఉన్నవారు భయ సంభ్రాంతులై పోయేటట్లు వారినందరిని బెత్తాలతో మోది బయటికి తరిమివేశారు. బ్రహ్మ అంతటివాడు భయపడి పారిపోగా నారదాదుల మాట చెప్పవలసిన పనిలేదు. అప్పుడు భటులు ''ఓహో ! తుంబురుడా''అని పిలిచి లోపలికి తీసుకొనిపోయారు. ''ఇతనిని మళ్ళీ పిలిపించిన హేతు వేమిటి'' అనుకున్నారు కొందరు. ''ఇప్పుడు సంగీత విషయము లేమి అవసరమో?'' అనుకొన్నారు మరికొందరు. ''ఈయన తప్ప సంగీత కళా విశారదులు ఇంక ఎవరూ లేరు కాబోలు'' అని మూతి ముడుచుకున్నారు.

నారదుడు కుడా ''ఇప్పుడు ఇతనిని పిలిపించడానికి కారణమేమిటబ్బా'' అనుకున్నాడు. ఇంతలో విష్ణుమూర్తి రమాసమేతుడై తుంబురుని గానం ఆలకిస్తున్నాడని వార్త వచ్చింది. నారదుని హృదయం ఈర్ష్యతో తుకతుక ఉడికి పోయింది. అయినా ఏం జరుగుతుందో చూదామని అలాగే అల్లంతదూరంలో నిల్చిఉన్నాడు. కొంతసేపటికి విష్ణుమూర్తి బహూకృతిగా ఇచ్చిన బంగారు పతకాన్ని, సునేత్ర పటమును ధరించి వినూత్న కాంతితో బయటకు వచ్చాడు తుంబురుడు. ఆతని దేహంపై ధగధగ మెరిసే పతకాన్ని, నేత్రపటాన్ని చూసేసరికి నారదుని హృదయం భగ భగ మండిపోయింది. అసూయాగ్నిపెచ్చుపెరిగిపోతున్నది.

''నాతో విచారించకుండా వీడు వెళ్లటమా? వెళ్ళి నన్ను పిలవకుండా సంగీతవిద్యను ప్రదర్శించడమా? ప్రదర్శించి తగుదునమ్మాయని ప్రభు విచ్చిన సొమ్ములను దాల్చి దర్పంతో బయటికి రావడమా?'' అని నారదుడు లోలోపల ఉడికి పోయినాడు. ''ఓరి పాపీ ! తుంబురా'' అని పళ్ళు పటపట కొరికాడు. ''నాకంటె వీడి గొప్పతన మేమిటి?'' వీడిని ఇంతటితో వదలిపెడతానా'' అని ఆగ్రహిస్తూ ఎట్లాగైనా తుంబురునితో వాదము పెట్టుకొని, అవమానించి తన సంగీతకళా చాతుర్యం విష్ణుమూర్తికి వినబడేటట్టు ఉపాయం ఆలోచిస్తా ననుకొన్నాడు.

నారద మహర్షి వివేక ధనాఢ్యుడు. కాబట్టి తన అసూయ వ్యక్తం కాకుండా లోలోపల అణచి పెట్టుకొని వెనుకటి కంటె ఎక్కువమైత్రి ప్రదర్శిస్తూ, తుంబురుని గానంలోని గుణదోషాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాని యింటికి రాకపోకలు సాగించాడు. ఒకనాడు తుంబురుడు లేని సమయాన ఇంటికిపోయి ఇంటిముందు మొగసాలలో మేళవించి ఉన్న వీణను పుచ్చుకొని పలికించాడు. నిర్దుష్టమూ, అపూర్వమూ అయిన ఆ శ్రుతుల పెంపును చూచి ఆశ్చర్యపడి చాల సిగ్గుపడి తిరిగి వెళ్ళిపోయాడు. ''ఏమీ! ఈ తుంబురుని గాన కళాధురీణత్వము! గాంధర్వము రూపుగొన్నవా డితడు. ఇంత పాండిత్యం ఉన్నట్లు నా కింతవరకు తెలియదు. తాడి దన్నే వాడుంటే తల దన్నే వాడుంటాడన్న లోకోక్తి నిజమైంది. బ్రహ్మాదుల సన్నిధిలో మేము ఇరువురము అనేకపర్యాయాలు గానం చేశాము. కాని ఎప్పుడూ ఇంతటి గాన కళా సంపద ప్రదర్శించలేదు. ఉత్తముల మహిమ నీరు కొలది తామర'' అని మనసులో అనుకున్నాడు నారదుడు.

విద్యాస్పర్ధచే ఎట్లాగైనా తుంబురుని గెలవాలన్న నిశ్చయంతో ఎక్కడ పండితులుంటే వారందరి దగ్గరకువెళ్లి విద్యను అభ్యసించాడు. ఎక్కడా తుంబురున కీడైనవాడే కనిపించలేదు. తన కోరిక పుండరీ కాక్షుని అనుగ్రహం వల్లకాని తీరదని, బహుకాలం తపస్సు చేశాడు. ఎట్టకేలకు నీలవర్ణ దేహుడు, పుండరీకాక్షుడు, మకరకుండలధారి, కౌస్తుభరత్నభాసితుడు, శంఖచక్రాది పరికర సమేతుడు అయిన విష్ణుమూర్తి సాక్షాత్కరించి ''ఏమి వరము కావలయునో కోరుకొమ్ము'' అనినాడు. నారదమహర్షి బహువిధములుగా రమాపతిని స్తుతించి ''గాన విద్యలో తుంబురుని గెలుచునట్లు అనుగ్రహింపుము'' అని ప్రార్థించెను. అంత స్వామి కృపతో ''ద్వాపరయుగంలో నేను దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై వసుదేవుడికి పుత్రుడుగా ఉద్భవిస్తాను. అప్పుడు ద్వారకానగరంలో నన్నాశ్రయించి నీ అభిమతం ఈడేర్చుకొమ్ము'' అని సెలవిచ్చి అంతర్ధానమైనాడు. నారదమహర్షి ద్వాపరయగంలో శ్రీకృష్ణుని సేవించి అనుపమసంగీత విద్యాకుశలు డైనాడు.

''స్పర్ధయా వర్ధతే విద్యా'' అన్న సూక్తికి ఈ కథ తార్కాణము. నేటి విద్యార్థులు అక్రమ స్పర్ధలు మాని, శ్రేయోదాయకమైన విద్యా విషయక స్పర్ధపూని వివిధ విజ్ఞాన పారంగతులు కావడానికి ప్రయత్నించాలి.

ప్రశ్నలు

1. నారదుని మాత్సర్యమునకు కారణ మేమి?

2. తుంబురుని జయించుటకు నారదుడు చేసిన ప్రయత్నము లేవి?

3. విద్యా విషయకమైన స్పర్దవలన ప్రయోజన మేమి?

Neetikathamala-1    Chapters    Last Page