Neetikathamala-1    Chapters    Last Page

21

దైవస్తుతి

మహారత్న పీఠే శుభే కల్పమూలే

సుఖాసీన మాదిత్య కోటీ ప్రకాశమ్‌

సదా జానకీ లక్ష్మణోపేత మేకం

ముదా రామచంద్రం భ##జే7హం భ##జే7హమ్‌.

--- ---

దాశరథీ

నీసహజంబు సాత్త్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప

ద్మాసనుC డాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం

హాసన మిద్ధరిత్రి, గొడు గాకస, మక్షులు చంద్ర భాస్కరుల్‌

నీ సుమతల్ప మాది ఫణి, నీవె సమ స్తము గొల్చునట్టి నీ

దాసుల భాగ్య మెట్టి దయ దాశరథీ! కరుణాపయోనిధీ!

కరుణా సముద్రుడవైన ఓ రామా! సాత్త్వికమున నీ సహజ గుణము; నీ నివాసము క్షీర సముద్రము; బ్రహ్మ నీ కుమారుడు; ఆదిలక్ష్మి నీ భార్య; భూమి నీ సింహాసనము; ఆకాశాము గొడుగు; సూర్య చంద్రులు నీ నయనములు: ఆదిశేషుడు పాన్పు; సమస్తము నీవుగా గొల్చెడి నీ భక్తుల భాగ్యము ఎంత గొప్పది.

* * *

వయంపంచాధికం శతమ్‌

పాండవులు అరణ్యవాసకాలంలో ద్వైతవనం చేరారు. అచట సరోవర సమీపాన విడిది చేసి ధర్మరాజు ద్రౌపదితో రాజర్షు లాచరించే సాద్యస్కవ్రతం సాగిస్తున్నాడు. అది గ్రహించాడు దుర్యోధనుడు. అగ్నికి వాయువు తోడైనట్లు వానికి శకుని తోడైనాడు. శకుని, కర్ణ దుశ్శాసనుల ప్రోద్బలంతో రాజరాజు అచటకు చనుదెంచి వనవాసక్లేశంతో ఉన్న పాండవులను పరిహసించి, తమ వైభవ ప్రదర్శనంతో అవమానించి, ఆనందించాలని నిశ్చయించాడు. గోసంపదను వీక్షించే నెపంతోను, ఘాతుక మృగసంహారమిషతోను వారు దృతరాష్ట్రుని అనుమతి పొంది నారీ సహస్రంతో ధ్వైతవనం చేరారు. దుర్యోధనుడు అచట గోపరీక్ష పూర్తి చేశాడు. కొంత కాలం క్రూర మృగాలను వేటాడాడు.

కౌరవ వైభవాన్ని చూచి పాంపడవులు తమ దురదృష్టానికి క్రుంగి ఖిన్నులు కావాలని దుర్యోధనుని కోరిక. ఆ దుష్టభావంతో ఆ సరోవరసమీపంలో క్రీడా మందిరాలను నిర్మించుటకు ఆజ్ఞ యిచ్చాడు రమణీయమైన ఆ సరోవరం కౌరవ సైన్యం చేరకముందే చిత్రసేనుడనే గంధర్వుడు అప్సరసలతో క్రీడార్థమై చేరుకున్నాడు. ఈ విషయం సేవకుల వలన విన్న దుర్యోధనుడు ఆ గంధర్వులను పారదోలమని తన వీర సమూహాన్ని పంపాడు. కౌరవసేన గంధర్వులను సరోవర ప్రాంతం తక్షణమే వీడి వెళ్ళాలని దుర్యోధన మహారాజు నాజ్ఞగా తెల్పారు. గంధర్వులు దుర్యోధనుని బుద్ధిహీనునిగా నిందించి ప్రాణాలపై ఆశ యున్నచో తిరిగి పొండని ఆ సేనకు హెచ్చరికచేశారు. గంధర్వుల మాటలు విని దుర్యోధనుడు తీవ్రకోధోద్విగ్న హృదయుడై నాకు అనిష్టం కల్గించిన ఇంద్రుడైనా సరే, దండనార్హుడే అని గర్జించాడు. వెనువెంటనే సమరానికి సంసిద్ధులైనారు. ఈ వార్త విని చిత్రసేనుడు కోపంతో కౌరవులను తగిన రీతిగా దండించమని ఆదేశించాడు. తీవ్రయుద్దం ప్రారభ##మైనది. భీతితో కౌరవసేనపలాయనం చిత్తగించింది. కురుకుమారులు, యుద్దవిముఖు లైనారు. కర్ణుడు పరాభూతుడై ప్రాణ సంరక్షణార్థం పరుగెత్తాడు. దుర్యోధనుని గంధర్వులు చుట్టు ముట్టారు. చిత్రసేనుడు దుర్యోధనుని బంధించగా మిగిలిన గంధర్వులు దుశ్శాసనాదులను బంధించి నారీజనాన్ని వశపరచుకున్నారు. సేనలో కొందరు హత మయ్యారు; మరికొందరు పారిపోయారు.

హతశేషులు ఆర్తనాదాలతోను, మంత్రులు దీనవదనాలతోను ధర్మరాజువద్దకు వెళ్ళి తమరాజును, కురుకుల స్త్రీలను బంధవిముక్తులుగా జేయమని ప్రార్థించారు. భీమసేను డా వార్తవిని ఆనందించాడు. పాండవులను అవహేళన చేయ సిద్ధపడినందుకు గంధర్వులు తగిన సత్కారమే చేశారు. కాగల కార్యం గంధర్వులే చేశారు. మనం చూస్తూ వూరుకుంటే చాలు నన్నాడు. అంత ధర్మరాజు భీమునితో ''సోదరా! ఆపదలో శరణు వేడిన వారిని కఠిన వచనములతో వేధించరాదు. శరణాగత రక్షణం మన ముఖ్యధర్మం అంతేగాదు. దుర్యోధనాదులు కురుకులాంగనలు బంధించబడుట కురులానికే అవమానం'' అని చెప్పి గంధర్వులను శిక్షించవలసినదిగా కోరినాడు. దుర్యోధనుని పూర్వ ప్రవర్తనమంతా భీముని మనస్సులో ఒక్కసారి మెదిలింది. తనకు విషాన్నం పెట్టడం, గంగలో త్రోయడం, లాక్షాగృహ దహనం, నిండు సభలో ద్రౌపదిని అవమానించుట మొదలగు దుష్కార్యములకు తగిన ప్రతిఫలం అతనికి లభించింది అని తీవ్రంగా పలికాడు. అంతలో దుర్యోధనుని దీనాలాపములు, తననూ, కులాంగనలనూ రక్షింపుమని భీమార్జుననకుల సహదేవులకు చేయుచున్న అభ్యర్థనలు వారికి వినిపించాయి.

''సోదరా! మనలో మనకు వైషమ్యములు కల్గినపుడు మనము ఐదుగురము, వారు వందమంది. కాని ఇతరులతో యుద్దం వచ్చినపుడు మనము నూటఐదుగురము సుమా!'' అని పలికినాడు ధర్మరాజు. అంతట ధర్మజుని ఆజ్ఞపై సోదర సమేతుడై అర్జునుడు గంధర్వులపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ ఘోర యుద్ధంలో గంధర్వులు పరాజితులై కౌరవులను ధర్మరాజుకు అప్పగించారు. ధర్మరాజు దుర్యోధనుని మెత్తగా మందలించి బంధవిముక్తుని చేశాడు.

కాన ''వయం పంచాధికం శతం'' అన్నది మన జాతి జీవనానికి, మన ధర్మ రక్షణకు ఒక తిరుమంత్రం కావాలి. అప్పుడే మనం సమన్వయ జీవితాన్నీ సాధించుకుని ముందంజ వేయగలము.

ప్రశ్నలు

1. దుర్యోధనుని ఘోషయాత్ర ఉద్దేశ##మేమి?

2. దుర్యోధనాదులు ఎవ్వరిచే నెట్లు బంధింపబడిరి?

3. ధర్మజుడు దుర్యోధనునకు ఎట్లు బుద్దిచెప్పెను?

Neetikathamala-1    Chapters    Last Page