Neetikathamala-1    Chapters    Last Page

18

దైవస్తుతి

విశుద్ధం పరం సచ్చిదానంద రూపం

గుణాధార మాధారహీనం వరేణ్యమ్‌,

మహాన్తం విభా న్తం గుహాన్తం గుణాన్తం

సుఖాన్తం స్వయం రామధామ ప్రపద్యే.

--- ---

దాశరథి

తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ

చ్చరణముసోకి దాసులకు సారములౌ ధనధాన్య రాసులై

కరిభటఘోటకాంబర నికాయములై విరజానదీ సము

త్తరణ మొనర్చుC! జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!

కరుణాసముద్రుడవైన ఓ రామా! వృక్షములందు పూవులు కాయలగును. ఆ పూవులే పూజలందు నీ పాదములు సోకి భక్తులకు ధన ధాన్య వస్తు వాహన సేవకులై విరజానదిని దాటించ తోడ్పడుట చిత్రముకదా!

* * *

భీష్ముడు

కురువంశ నృపాలుడైన శంతన రాజేంద్రుని కుమారుడు దేవవ్రతుడు. సంప్రాప్తమైన సామ్రాజ్యాన్ని పితృప్రియం కొరకై తిరస్కరించి బ్రహ్మచర్య దీక్షితుడైన సత్యభాషి, ఆ దేవవ్రతుడు. పితృప్రియంకొరకు చేసిన భీషణ ప్రతిజ్ఞవలన అతడు భీష్ముడైనాడు.

విచిత్రవీర్యుని రాజ్య పట్టాభిషిక్తుని చేశాడు భీష్ముడు. తన సోదరునికి కుల మర్యాదానురూపయైన కన్యను తెచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు స్వయంవరానికి విచ్చేసిన రాజు లందరినీ తన అసమాన పరాక్రమంతో ఓడించి ఆ కాశీరాజ కన్యలను తన సోదరునికొరకై తీసుకువచ్చాడు. వివాహ ప్రయత్నాలు జరుగుతున్నవి. అంబ భీష్ముని సమీపించి- ధర్మవేత్తా! నేను ఇదివరకే సాళ్వరాజును మనఃపూర్వకముగా వరించాను. ఆయనకుకూడ నాయందు భార్యాభావ మున్నది. ధర్మోల్లంఘనం చేసి నన్ను మీ ఇంటి కోడలిగా చేయడం ఉచితంగాదు. కాన నన్ను అతని వద్దకు పంపండి'' అని కోరింది. భీష్ముడు అట్లే అని అంబను సాళ్వుని కడకు పంపివేశాడు. కాని సాళ్వరాజు అమెను తిరస్కరించాడు. ఆమె ప్రార్థనలను మన్నించలేదు. బంధువులకు దూరమై, వరించిన సాళ్వుడు తిరస్కరించగా, తిరిగి హస్తినాపురం వెళ్ళలేక, కాశీరాజపుత్రి విఫల మనోరథయై దైన్యంతో బొటబొట కన్నీరు కారుస్తూ నగరంవెలువడి తాపసుల ఆశ్రమాలలో ఆ రాత్రి రక్షణ పొందింది. అచట నున్న తపస్విజనులు ఆమె నోదార్చి పితృగృహం చేరడం సముచిత మని ఆమెకు హితము చెప్పారు. అంబ అందులకు అంగీకరించక తపోదీక్ష వహించగోరింది. ఆ సమయంలో అంబకు మాతామహుడైన హోత్రవాహనుడను రాజర్షి అచ్చటికి విచ్చేశాడు. ఆమె కారుణ్యగాథను విని ఆమెనోదార్చి పరుశురాముని వేడిన ఆమె దుఃఖమును తొలగించునని కర్తవ్యం బోధించాడు.

హోత్రవాహనుడు పరశురాముని ప్రాణసఖుడు. ఆ సమయాన పరశురాముని సేవకుడైన అకృతవ్రణుడు అక్కడకు వచ్చి పరశురాముడు హోత్రవాహనుని చూడడానికై మరునాడు అచ్చటికి వస్తున్నారని తెలియజేశాడు. వారందరు అంబ యొక్క కరుణామయ గాథను చర్చించి దానికి కారణం భీష్ముడని నిర్ణయించారు. తెల్లవారింది. పరశురాముడు అచ్చటికి విచ్చేశాడు. అందరూ అంజలి ఘటించి ఆయనను స్తుతిCచారు. ఆయన సుఖాసీనుడైనపిదప అంబ అశ్రు పూర్ణ వదనంతో పరశురామ పాదపద్మములకు నమస్కరించి ఆయనను శరణు వేడింది.

శోకసాగరంలో మునిగి ఉన్న తనశోకాన్ని హరించుటకు గాంగేయుని సంహరింపగోరింది. ప్రక్కనే ఉన్న ఆకృతవ్రణుడు పరశురాముడు తనను ఎవరు వచ్చి కోరినా అభయ మిస్తానని పూర్వం చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేశాడు. అంత పరశురాముడు ఆమెకొరకు భీష్మునివద్దకు వెళ్ళి చెప్పవలసిన మాటలు చెపుతా నని వాటిని తిరంస్కరించినచో వానిని వధిస్తానని పలికి ప్రయాణమయ్యాడు.

మహాతేజోమయుడు, బలవంతుడూ అయిన పరశురాముడు ఆ ప్రాంతమునకు వచ్చినట్లు విన్న భీష్ముడు పరమ సంతోషంతో గోవులను బ్రాహ్మణులను వెంట నిడుకొని పరశురామునికి స్వాగతంచెప్పి పూజించాడు. భీష్ముని సత్కారముల నందుకుని పరశురాముడు -''భీష్మా! నీవు కాశీరాజ కన్యలను నీ గృహానికి తీసుకువెళ్ళావు. ఈ అంబను తిరిగి పంపి వేశావు. సాళ్వుడు ఈమెను తిరస్కరించాడు. ఈమె ధర్మభ్రష్టురాలైంది. ఈమెను స్వీకరించేవాడు మరొకడు లేడు. అందుచే ఈమెను గ్రహించి ధర్మమార్గం వహించు''మని ఆదేశించాడు. అంత భీష్ముడు ధృఢనిశ్చయంతో- ''బ్రహ్మవేత్తా! సాళ్వునియందు తన హృదయం లగ్నమైందని చెప్పుటవలననే నేను ఈమెను పంపివేశాను. పరపురుషానురక్తయైనస్త్రీ క్రూరసర్పమువలె భయంకరమైనదిగాదా? ఇపు డీమె వివాహం నా సోదరునితో జరగడం అసంభవం. నేను దయా, భయ, ధనులుబ్ధుడనై నా ధర్మం విడువజాలను'' అని చెప్పాడు. పరశురాముడు క్రోధారుణలోచనుడైనాడు. భీష్ముని ప్రియవచనాలు ఆయనను శాంతింపజేయలేక పోయినాయి. భీష్ము డంతట వినయ వినమితాంగుడై ఆ విప్ర శ్రేష్ఠుని పాదపద్మములకు మ్రొక్కి ''మహర్షీ! నాతో యుద్ధం చేయవలసిన అవసరం మీ కేమి వచ్చింది. అందునా, నాకు ధనుర్విద్య నేర్పిన గురువులు మీరు'' అని అర్థించాడు. పరశురాముడు '' భీష్మా! నీవు గురువుగా భావించే నా ఆదేశాన్ని శిరసావహించడం లేదు. ఈమెను గ్రహించేవరకు నేను శాంతించను. నిన్ను మంత్రి బాంధవ సహితంగా వధిస్తాను'' అని హెచ్చరించాడు. అంతట భీష్ముడు ''గురువర్యా! వజ్రాయుధుడైన మహేంద్రుడు వచ్చి ఎదురు నిలిచినా నేను ధర్మపరిత్యాగానికి అంగీకరించను. ఇంతదనుక గురువు లని భావించి గౌరవపూర్వకంగా సన్మానించాను. మీరు నన్ను మన్నించుటలేదు. కనుక యుద్ధమే సిద్ధం. తమరు కురుక్షేత్రానికి తరలండి. అచ్చట నేను మీతో యుద్దం చేస్తాను'' అని పలికాడు. పరశురాము డందులకు అంగీకరించాడు.

భీష్మ పరుశురాములు కురుక్షేత్ర రంగంలో యుద్ధసన్నద్ధులైనారు. గంగాదేవి వారిని యుద్ధవిముఖులను జేసే ప్రయత్నం విఫలమైనది. ఆ మహాపురుషు లిర్వురూ ఇరువదిమూడు రోజులు భీకరసమరం చేశారు. అంతట పరశురాముడే పరాజయాన్ని అంగీకరించాడు.

ధర్మానుసరణలో కర్తవ్యాకర్తవ్యాలు తెలియక అక్రమ మార్గన వచ్చిన గురువునుకూడ ఎదిరించవలసిందే.

ప్రశ్నలు

1. భీష్ముని పితృభక్తి ఎట్టిది?

2. కాశీరజు కుమారై లెవరు?

3. పరశురాముడు ఎట్లు పరాజితు డయ్యెను?

Neetikathamala-1    Chapters    Last Page