Neetikathamala-1    Chapters    Last Page

17

దైవస్తుతి

గౌరీవిలాస భవనాయ మహేశ్వరాయ

పంచననాయ శరణాగత కల్పకాయ,

శర్వయ సర్వ జగతామధిపాయ తసై#్మ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ.

--- ---

దాశరథీ

పెంపునC దల్లివై కలుష బృంద సమాగమ మొందకుడ ర

క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియరోగముల్‌ నివా

రింపను వెజ్జువై కృపగురించి పరంబు దిరంబుగాCగ సత్‌

సంపదలియ్య నీవె గతి దాశరథీ ! కరుణాపయోనిధీ!

దయాసముద్రుడవగు ఓ రామా! మమ్ము పోషించుటలో తల్లివి. పాపములనుండి రక్షించుటలో తండ్రివి. శరీరవ్యాధులు పోగొట్టు వైద్యుడవు నేవై మా యెడ దయ జూపి మోక్షము స్థిర మగునట్లు మంచి సంపదలు ఇవ్వగా నేవే మాకు దిక్కు.

* * *

జడభరతుడు

ఋషభరాజేంద్రుని కుమారుడు భరతుడు. తన సోదరుల రాజ్యాలకు సంరక్షకుడుగా ఉంటూ భరతుడు అవక్ర పరాక్రమంతో చాల కాలం రాజ్యపాలన గావించాడు. పిదప తపస్సు చేసుకొనుటకు పులహాశ్రమపదానికి వెళ్ళాడు. ఒకనాడు స్నానార్థమై నదికి వెళ్ళి విధివశాత్తు ఆ నదిలోపడి మృత్యుముఖమందున్న ఒక చిన్న లేడిపిల్లను రక్షించి ఆశ్రమానికి తీసుకువచ్చాడు. తన కమండలువులోని నీరు పడుతూ గరికను త్రుంపి దానికి మేపుతూ ఆ లేడిని పెంచసాగాడు. ఆ లేడిపిల్ల యెడ అతని మనస్సులో చాల ప్రేమ ఏర్పడింది. భరతుడు తపస్సు చేసుకునే సమయంలో ఆ హరిణము అతని దరిచేరి అతని చేయి నాకుతూ అక్కడే తిరుగుతూ ఉండేది. కనులు విప్పినపుడు దానిని ఆప్యాయంగా చూస్తుండేవాడు . లేడిపై అతనికి మోహంకూడ పెరిగింది. భరతుడు మహా తపోధనుడైనాడు. అతడు అవసానకాలం సమీపించినదని గ్రహించాడు. పరమేశ్వరుని వశం చేయవలసిన అతని మనస్సు వాసనాబలం వల్ల మృగపరమైనది. తన మరణానంతరము ఆ మృగం గతి ఏమౌతుంది, దానిని ఎవరు లాలిస్తారన్న విషయాలు అతని మనస్సు నలముకున్నాయి. కన్నీటితో జాలిగా ఆ మృగాన్ని చూస్తూ అతడు తనువు త్యజించాడు.

ఈ మృగ మోహనాసనాబలంవల్ల భరతుడు లేడియై జన్మించాడు. కాని తపోమహిమవలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉండెను. లేడిజన్మ కలిగినందుకు ఎక్కువగా విచారించాడు. లేడి రూపంలో జీవిస్తూ భగవద్ధ్యానంలో జీవితాన్ని గడిపివేశాడు. ఆ కారణంచేత భరతుడు అంగీరసుడు అను బ్రాహ్మణ కుంటుంబమందు జన్మించాడు. పూర్వజన్మల జ్ఞానంవల్ల తాను పూర్వం చేసిన తప్పులు మరల చేయకుండుటకుగాను జడునివలె ప్రవర్తించసాగాడు. అతడు ఎవరినీ ఏమీ కావాలని అడుగడు. అన్నమైనా పెడితే తింటాడు. లేకపోతే అడుగడు. ఎవరితోను మాట్లాడడు. తండ్రి ఉపనయనంచేసి కర్మలయందు అతని మనస్సు ప్రవర్తించునట్లు ప్రబోధించాడు. జ్ఞానతప్తమైన అతని మనస్సు కర్మలవైపు మొగ్గలేదు. సవతి అన్నలు ఎన్ని కష్టాలు పెట్టినా మౌనంగా సహించాడు. అన్నలు దృఢశరీరుడైన సోదరుని జోన్నచేనికి కాపలాపెట్టారు. అక్కడా మౌనము, నిర్లిప్తతనే అత డాశ్రయించాడు.

ఒకనాడు సింధూదేశాధీశ్వరుడైన రహూగణుడు జ్ఞానార్థియై పల్లకీలో కపిలాశ్రమానికి చేను ప్రక్కనుండి వెళ్ళాడు. పల్లకీ బోయలలో ఒకడు కాలు మెలికపడి నడవలేకపోయాడు. రాజువలన భయంతో భటులుచేనికి కాపలాయున్న దృఢశరీరుడైన భరతుని తీసుకునివచ్చి పల్లకి కొమ్ము బుజానపెట్టారు. అప్పుడూ భరతుడు మట్లాడక మోయసాగాడు. కాని పల్లకి మోయటం తెలియనందువలన పల్లకీ ఇటూ అటూ ఊగసాగింది. రాజు మందలించగా మిగిలిన బోయలు భరతుడే కారణమని నేరం అతని మీద ఆరోపించారు. రాజాగ్రహాన్ని లెక్కచేయక తనకు కుదిరినవిధంగా భరతుడు పల్లకీ మోశాడు. రాజు ఈసారి కఠినంగా చేసిన మందలింపుకు భరతుడు జ్ఞానగర్భితమైన మాటలతో సమాధానం చెప్పాడు. వెంటనే రాజు అతని యథార్థస్థితిని గ్రహించి పల్లకి దిగి సాష్టాంగ నమస్కారం చేసి జ్ఞానోపదేశం చేయమని ప్రార్థించాడు. భరతుడు అతనిని అనుగ్రహించి తన దారిని వెళ్ళిపోయాడు.

ఉత్తర జన్మ కారణమైన వాసనాబలం ఎంతటిదో మనం గ్రహించి మనసు సద్వాసనాయుతమై యుండునదిగా చూచుకోవాలి.

ప్రశ్నలు

1. భరతునికి లేడిజన్మ ఎందుకు కలిగెను?

2. జడభరతుడను పేరు వాని కెట్లు వచ్చెను?

3. సింధుదేశాధిపతిని భరతుడు ఎట్లు అనుగ్రహించెను?

Neetikathamala-1    Chapters    Last Page