Neetikathamala-1    Chapters    Last Page

16

దైవస్తుతి

ప్రాతర్వదామి లలితే! తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి,

శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతీ

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి.

--- ---

దాశరథి

దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ

దాసుని దాసుCడా గుహుడు తావక దాస్యమొసంగినావు నే

చేసిన పాపమో వినుతిచేసిన గావవు గావుమయ్యనీ

దాసులలోన నేనొకCడ దాశరథీ! కరుణాపయోనిథీ!

దగ్గర చుట్టముగాని శబరికి ముక్తినిచ్చావు. నీ సేవకుని సేవకుడైనా కాని గుహునకు సేవాభాగ్యాన్ని ప్రసాదించావు. నేను చేసిన పాపమేమోగాని ప్రార్థించినా నన్ను కాపాడవు. నీ భక్తులలో నేనొకడిని. కావు మయ్యా శ్రీరామా!

* * *

శబరి

రామ లక్ష్మణులు సుగ్రీవుని కలుసుకోవడానికి పంపాసరోవర పశ్చిమ తీరానికి వచ్చారు. అక్కడ పుణ్యశ్లోకుడైన మతంగమహాముని ఆశ్రమం ఉన్నది. ఆ వనం ఆయన నిర్మించినదే కావున ''మతంగవన'' మంటారు. ఆ వనంలో ఎన్నో ఏనుగు లున్నాయి. కాని అవి ఆశ్రమంలోనికి పోవు. అతి ఉన్నతమైన వృక్షాలతోను, పలు రకాల పక్షిబృందాల మనోహరమైన పాటలతోను ఆ వనం అహ్లాదకరంగా ఉంటుంది. మంతగమహర్షి, ఆయన శిష్యులు మహాతపస్సంపన్నులు. ఆరమ్యమైన ఆశ్రమంలో శబరి ఉన్నది. ఆమె వృద్ధురాలు. మతంగముని శిష్యులు ఆమెకు గురువులు. గురుసేవవలన, వత్ర నియమాలవలన, తపస్సువలన ఆమె శరీరం శిథిలమైపోయింది. ఆమె తల ముగ్గుబుట్టవలె ఉన్నది. ఆమె కన్నులు దీప్తిమంతములై ఉన్నాయి. మాంస రహితంగా అస్థిపంజరంపై కప్పిన చర్మము ముడుతలు పడింది.

ఆశ్రమ రామణీయకాన్ని చూస్తూ వస్తున్న రామలక్ష్మణులను శబరిచూచింది. చూచి చూడడంతోనే మహదానందంతో తొట్రుపాటుతో ముందుకు నడిచింది ఆ పుణ్మమూర్తి. చేతులు జోడించి శ్రీరామ పాదాలకు నమస్కారం చేసింది. లేచి లక్ష్మణుని పాదాలకు ప్రణమిల్లినది. వారికి భక్తితో స్వాగతం చెప్పింది. ఆ ఆనందరూపులైన పరమపురుషులకు శాస్త్రోక్తంగా అర్ఝ్య పాద్యాదులను సమర్పించి పూజించింది. సిద్ధులందరకూ పుజనీయురాలైన ఆ శబరి వారి ఎదుట చేతులు జోడించి నిలుచున్నది. ఆ తీక్ష తపోవ్రతను సాదరంగా చూస్తూ- ''ఓ శబరీ! నీవు తపస్సే ధన మనుకున్నావు. సంతోషము ! నీ తపస్సుకు అంతరాయా లన్నింటినీ జయించావా? నీ మనస్సు సుఖంగా ఉందా? నీగురుసేవ సఫలము అయిందా? చెప్పు''మంటూ రాముడు కుశల ప్రశ్నలు వేశాడు. ''ఓరామా! నీవు పురుషోత్తముడవు. నీదర్శనభాగ్యంచేత నాతపస్సు అంతా ఫలించింది. నాగురుసేవ సఫలమైనది. ఓ పరమపురుషా! నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. ఇప్పుడు నా జన్మ సఫలమైనది. నాకు సర్వం సిద్ధించినది. నీ చల్లని చూపులతో నేను పరిశుద్థురాల నైనాను. నీ కృపవలన అక్షయమైన పుణ్యలోకాలకు పోతాను'' అని ఆనందంతో సమాధానమిచ్చింది శబరి. ఓ రామప్రభూ! నీవు చిత్రకూటంవద్ద ఉన్న రోజులలో నాగురువులు దివ్య విమానాల మీద స్వర్గలోకానికి పోతూ మీరు ఈ పుణ్యాశ్రమానికి వస్తారని నన్ను అతిథి సత్కారం చేయమని చెప్పారు. రామదర్శనంవల్ల అత్యుత్తమ పుణ్యలోకాలు నాకు ప్రాప్తిస్తాయి అని కూడ చెప్పారు. ప్రభూ! అనాటినుండి ఈ పంపాతీరాన దొరికే వివిధ మధుర ఫలాలను మీ కొరకు సేకరించి దాచిపెట్టి ఉంచాను. మీరిద్దరూ ఆరగించవలెను'' అని విన్నవించుకుంది. అంత ఆమె ఆశ్రమంలోనికి వెళ్ళి భద్రంగా దాచిన పండ్లబుట్ట తెచ్చి వారిముం దుంచింది. మధురాతిమధురఫలాలను శ్రీరామ లక్ష్ముణులచే తినిపించాలి. పొరపాటున రుచిహీన ఫలాలుంటాయేమో! తాను వాటిని రామప్రభువుకు ఇస్తానేమో? శ్రీరాముడు తనను మన్నించుటకు వాటిని ఇష్టం లేకపోయినా తినవలసి వస్తుందేమో! అన్న వ్యాకులత ఆమెను పీడిస్తోంది. ఏమైనా ఆస్థితి కలుగకూడదని నిర్ణయించుకుంది. తాను మెచ్చినది, తనకు నచ్చినదైన ఫలాన్ని తీసుకుని చివర కొంచెం కొరికి అది అతిరుచ్యమైనదని నిర్థారించుకుని రామప్రభువుకు సమర్పించింది బ్రహ్మజ్ఞానియైన ఆ నారీశిరోమణి. ఎంగిలిపండు రాముని ఆరగింపుకు అందివ్వడంచూచి తల్లడిల్లిపోయాడు లక్ష్మణస్వామి. కాని భక్తాధీనుడైన శ్రీరాముడు చిరునవ్వుతో ఆప్యాయంగా శబరి సమర్పించిన ఫలాలను ఆరగించాడు.

అతిథిసత్కారం అయిన తర్వాత రాముని కోరిక ననుసరించి పరమాత్మవేత్తలైన తన గురువుల ఆశ్రమం అంతా రామునికి చూపించింది. వార్దక్యంవలన, ఉపవాసాలవలన స్వయంగా పోలేక ఆ తపోధనులు సప్తసాగరాలను అక్కడికే తెప్పించారు. ఆ సప్త సాగర సరస్సులో రామలక్ష్మణులు స్నానంచేసి పితృతర్పణాలు వదిలారు. తృప్తిచెందిన మనస్సుతోనున్న రామునిచూచి శబరి- ''జగద్రక్షకా! నీవు అనుమతించినచో నేను ఈ శిథిల దేహాన్ని త్యజించివేస్తాను. నేను పరిచర్యచేసిన ఆ పరమాత్మవేత్తల దగ్గరికే పోవాలని కోరికగా ఉంది'' అని విన్నవించింది. రాముని అనుమతితో శిథిలదేహాన్ని త్యజించడానికి ఆమె అగ్ని ప్రవేశం చేసింది.

సజ్జన సంసేవనము సర్వ శ్రేయస్కరము అనుటకు శబరి గాథ ఒక తార్కాణము.

ప్రశ్నలు

1. శబరి ఎచ్చట ఉండెను?

2. శబరి రాముని ఎట్లు సేవించెను?

3. శ్రీరాముడు శబరిని ఎట్లు అనుగ్రహించెను?

Neetikathamala-1    Chapters    Last Page