Neetikathamala-1    Chapters    Last Page

15

దైవస్తుతి

ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యామ్‌,

విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం

విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతి దూరామ్‌.

- - -

దాశరథీ

జలనిధిలోన దూఱి, కులశైలము మీటి, ధరిత్రి గొమ్మునం

దలపడ మాటి రక్కసుని యంగముగీటి బలీంద్రునిన్‌ రసా

తలమున మాటి పార్థివ కదంబము గూర్చిన మేటి రామ! నా

తలcపున నాటి రాcగదవె దాశరథీ! కరుణాపయోనిధీ!

కూర్మావతారమును ధరించి సముద్రమున దూరి కులపర్వతమును పైకెత్తి, వరాహమూర్తివై కోరలందు భూమిని ఇమిడ్చి రాక్షసుని వధించి, వామన రూపుడవై బలిని పాతాళమునకు నెట్టి, పరశురాముడవై రాజులోకమును నశింపజేసిన శ్రీరామా! నా ఆలోచనలలో నెలకొని యుండుము.

- - -

అహంకారాసురుడు

(కేనోపనిషద్గాథ)

అనాదినుండి తమ ప్రవృత్తుల కారణంగా దేవాసురుల మధ్య సంగ్రామాలు జరుగుచుండెడివి. ఒక్కొకతరి అవి భయంకరరూపమునొందెడివి. ఒకసారి దేవాసురులమధ్య ఒక దారుణ యుద్ధం జరిగింది. దేవేంద్రుడు అగ్ని వాయు దేవుల సహకారంతో యుద్ధం చేశారు. దేవతలు ప్రాణాలకు తెగించి సమరం సాగించారు. ఇంచుమించుగా దానవు లందరు మరణించారు. హతశేషులు దేశం విడిచి పారిపోయారు. ఆ యుద్ధంలో అగ్నివాయువుల పరాక్రమం అందరికి ఆశ్చర్యం కల్గించింది. సర్వే సర్వత్ర ఎల్లరూ వారి పరాక్రమమునే పొగడసాగిరి. దేవతలకు గొప్ప కీర్తి లభించింది. ఆ కీర్తి కారణంగా ప్రజలు భ్రమలోపడి సర్వేశ్వరుని మరచి దేవతలనే పుజింప ప్రారంభించారు. దానితో దేవతల గర్వము మిక్కుట మయ్యెను. తామే ఘనుల మని భావించసాగిరి. సర్వదా ఆ దేవదేవుని పూజించువారే గర్వోన్మత్తులై ''లోకములన్నియు మనలను పూజింపగా మన మింకొకరిని పూజించుట ఎందులకు'' అని అహంకరించిరి. పరమేశ్వరుడు సర్వ శక్తి మంతుడన్న విషయమే వారి మనము నుండి తొలగ జొచ్చెను. కరుణాసముద్రుడైన భగవంతుడు అమరుల అహంకారమునకు జాలిపడెను. ఘనులు విజయశ్రీ సముపేతులైనచో మరింత వినయశీలు రగుదురుగాని గర్వింపరు. ఫలభరితమగు వృక్షము వంగియుండును గదా! వారు పతనము చెందకుండ సురల గర్వమును సమూలముగా నాశనము చేయదలచెను.

ఒకనాడు నందనోద్యానమందు అమరేంద్రుని సభ ఏర్పాటుచేయబడెను. దేవతలందరు తమతమ ఘనతను తామే ప్రశంసించుకొనుచూ, ఘర్షణపడుతూ అచట సమావేశ##మైరి. తద్వన సమీపమున కనులు మిరుమిట్లు కొలుపు కాంతితో ఒక యక్షుడు ఆకసమునుండి దిగెను. అతని తేజస్సుముందు అగ్ని హోత్రుడు కాంతిహీనుడయ్యెను. దేవతలందరూ ఆ యక్షుని చూచిరి. వారి వదనములు పాలిపోయెను. గడచిన యుద్ధమందు ప్రతాపములో శ్రేష్ఠుడై వీతిహోత్రుని వెళ్ళి ఆ యక్షుని సమాచారము తెలుసుకొని రమ్మని దేవతలు కోరిరి. ఆ యక్షుని సమీపించ అగ్నికి అడుగులు తడబడెను. యక్షుని తేజస్సునకు కనులు మూతపడెను. ఎట్టకేలకు ఆతనిని సమీపించి మాట్లాడు ధైర్యము లేక సిగ్గుతో, వేదనతో ఊరక నిలుచుండెను. ఆ యక్షుడు జాలితో ''నాయనా! నీ వెవ్వడవు? ఇచ్చట ఎందులకు నిలబడితివి? '' అని ప్రశ్నించెను. అగ్నిదేవుడు తెచ్చుకున్న ధైర్యంతో - ''నాపేరు అగ్ని. నన్ను జాత వేదుడని కూడ పిలుస్తారు. తమ రెవరో తెలుసుకొను ఉద్దేశముతో ఇచ్చటికి వచ్చితిని'' అని పలికెను. అంత యక్షుడు ''ఓ అగ్నీ! నీవు చేయుపని ఎట్టిదో నాకు చెప్పగలవా?'' అని ప్రశ్నించెను. అగ్ని దుఃఖముతో ''తేజోవంతా! మీరు అగ్నిచేయు కార్యమునే ఎరుగరా? క్షణమాత్రములో ఈ ప్రపంచమునంతటినీ భస్మముచేయు శక్తి నాకు కలదు. ఆకాశమందలి నక్షత్రములు అస్తిత్వముకూడ అస్మదీయ శక్తివలననే వెలుగొందుచున్నవి'' అని పలికెను. అగ్ని అహంకారము నశించలేదని గ్రహించి ఆ యక్షుడు ఒక గడ్డిపరకను ముందుంచి -''అగ్నిదేవా! నీ శక్తినే నెరుగుదును. నీవీ గడ్డిపరకను దగ్థము చేసి నీ పరాక్రమము చూపుము'' అనెను. అగ్నియందలి తేజస్సును హరించెను. తేజోహీనుడైన అగ్ని శతధా ప్రయత్నించి ఆ గడ్డి పరకను దగ్ధము చేయలేకపోయెను. సిగ్గుపడి పాలినముఖంతో దేవేంద్రుని చేరెను.

పిదప దేవతలు వాయువును పంపిరి. ఆ తేజోవంతుని సమీపించుటతో వాయువునకు అతనిని చూచుటకూడ కష్ట మయ్యెను. ఆ తేజస్వి - సోదరా నీవెవడవు? ఎందు నిమిత్తమై వచ్చితివి?'' అని ప్రశ్నించెను. వాయుదేవుడు కొంత ధైర్యము తెచ్చుకుని - ''మహాపురుషా! నన్నే ఎరుగవా? సకల జీవనాధారము నాయందున్నది. నిరాతంకముగా చరించు శక్తి గలవాడ నగుటవలన నన్ను'' మాతరిశ్వు డని కూడ పిలచెదురు'' అని చెప్పెను. ఆ యక్షుడు'' గర్వముతో కూడిన వాయుదేవుని వదనమును ఒక పర్యాయము చూడగా వాయువు ధైర్యము పూర్తిగా నశించెను. కన్నులు మూతపడెను. అతడు శక్తిహీనుడయ్యెను. అంత యక్షుడు ''సోదరా! నీవు చేయుపని ఏమి?'' అని పలికెను. గాంభీర్యము వహించి వాయువు-'' నా పేరు విన్నవాడు నన్ను కీర్తించక మానడు. నాబలముతో ఈ బ్రహ్మాండము నంతను ఊపివేయగలను. ఈ తరు గిర్యాదులు నాకొక లెక్కగాదు'' అని గర్వముతో పలికెను. వాయవు తేజమును వీక్షణమాత్రముతో హరించి యక్షుడు-''సోదరా! నీ యెదుటనే ఉన్న ఆ తృణమును ఎగురుగొట్టి దూరముగా పడవేసి నీ బలమును చూపుము'' అని పలికెను. వాయు దేవుడు సర్వవిధముల ప్రయత్నము చేసెను. అవి ఎగురుట అటుంచి కదలలేదు, మెదలలేదు. సిగ్గుతో వాయువు ఇంద్రుని చేరెను.

అగ్ని వాయువులు పరాభూతులు కాగా దేవేంద్రునకు ఏమియూ తోచక అమరాచార్యుడైన బృహస్పతివంక చూచెను. అంత బృహస్పతి ''దేవరాజా! ఆ తేజోవంతుని సమాచారము తెలుసుకొన నీకు వినా మరొకరికి సాధ్యంకాదు. స్వయంగా నీవే వెళ్ళవలసింది'' అని చెప్పాడు. ఇంద్రుడు ఆ యక్షుని సమీపించుసరికి కళ్ళు మిరుమిట్లు గొల్పు తేజస్సు వలన ఇంద్రుడు కనులు మూసుకొనెను. యక్షుడు అంతర్ధాన మయ్యెను. దేవేంద్రునికి 'ఈకార్యము భగవానునిది గాక మరెవ్వరిదీ కాదు' అను భావము కలుగ అతడు జగన్మాతను ధ్యానించెను. దివ్య తేజస్సుతో జగన్మాత అవతరించెను. ఇంద్రుడు ఆమెను నుతించి యక్షునిగూర్చి అడిగెను. ఆ జగజ్జనని సాదరంగా ''వత్సా! ఆ యక్షురూపుడు సామన్యుడుగాడు. సాక్షాత్తు బ్రహ్మ. అతనిని గుర్తించగలవాడు ఈ ప్రపంచమందు లేడు. దుష్కృత్యము లొనరించువారి కతడే శత్రువు. రాక్షస సంహారమున మీ రందరు నిమిత్తమాత్రులే. నిజానికి వారిని సంహరించినది అతడే. అతని ఆజ్ఞ లేక ఏ జీవి కాలుకూడ కదల్పజాలడు. అందువలననే అగ్ని వాయువులు నిస్తేజులైరి. మేమే దానవుల దునిమాడితి మని మీరు అహంకరించుచున్నారు. ఆ అహంకారాసురుని వలననే అగ్ని వాయువులు పరాజయము పొందిరి. అహంకారాసురుని జయించి అహంకారశూన్యులైనచో మీరు నిజముగా దేవతలై ఆ పరాత్పరునికి ప్రీతిపాత్రులు కాగలరు'' అని హితవు చెప్పి అంతర్థానమయ్యెను. ఆ జగన్మాత ఉపదేశమును మహేంద్రుడు దేవతలకు చెప్పెను. ఆ ఉపదేశామృతముతో వారి గర్వాహంకారాలు నశించెను. అహంకారాసురుని జయించి వారు నిజముగా విజయము పొందిరి.

మానవులు కూడా అహంకారాసురుని జయించినవాడే సర్వ విజయములను బడసి దైవత్వము సాధింతురు.

ప్రశ్నలు

1. యక్షుడు అగ్ని దేవుని శక్తిని ఎట్లు పరీక్షించెను?

2. యక్షుడు వాయుదేవుని అహంకారమును ఎట్లు పోగొట్టెను?

3. యక్షుడు ఎవరు?

Neetikathamala-1    Chapters    Last Page