Neetikathamala-1    Chapters    Last Page

14

దైవస్తుతి

ప్రాతర్నమామి లలితా చరణారవిందం

భ##క్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్‌,

పద్మాసనాది సురనాయక పూజనీయం

పద్మాంకుశ ధ్వజ సుదర్శనలాంఛనాఢ్యమ్‌.

--- ---

దాశరథీ

కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను; గెల్చెcబో నిజం

é బాతనిమేన శీతకరుcడౌట దవానలుc డెట్టి వింత! మా

సీత పతివ్రతా మహిమ సేవకభాగ్యము మీ కటాక్షమున్‌

ధాతకు శక్యమా పొగడ, దాశరథీ! కరుణాపయోనిధీ!

కరుణాసముద్రుడవైన ఓ రామా! రాక్షస సమూహములను గెల్చుట కోతికి సాధ్యమా? అట్లు గెల్చినప్పటికీ, ఆతని éశరీరమున అగ్నిహోత్రుడు చల్లనివాడగుట ఎంత ఆశ్చర్యము! సీతాదేవి పాతివ్రత్యమహిమ, నీ సేవకుల అదృష్టము. మీ కరుణాకటాక్షమును పొగడ ఆ బ్రహ్మదేవునికైనను శక్యమా?

* * *

అర్జునుడు

అర్జునుడు పాండవమధ్యముడు. కుంతీపుత్రుడు. వ్యాసమహర్షి ప్రేరితుడైన ధర్మరాజు ఆజ్ఞప్రకారం కౌరవులను జయించుటకు దివ్యాస్త్రాలు సంపాందించుటకై తపోదీక్ష స్వీకరించాడు. సమస్త దేవతాశక్తులూ కల వృత్రాసుర సంహారియైన శంకరుని తన తపస్సుతో మెప్పించి దివ్యాస్త్రాలను పొందుటకై కఠోర నియమాలతో ఆ హిమాలయప్రాంతంలో తపస్సు ప్రారంభించాడు. వాని దీక్ష మహర్షులకు కూడా సంతృప్తిని కల్గించింది. వారు పినాకపాణివద్దకు వెళ్ళి అర్జునుని తపస్సువల్ల పుట్టే వేడిని ఏ జీవి భరింలేకపోతున్న దనీ వెంటనే అతని మనోభీష్టం నెరవేర్చవలసిం దని ప్రార్థించారు. శంకరుడు అందులకు అంగీకరించాడు.

శివుడు కిరాత వేషం ధరించి పినాక ధనుస్సుతో, వాడి బాణాలతో బయలుదేరాడు. కిరాతస్త్రీ రూపంలో పార్వతి ఆయనను అనుసరించగా భూతగణాలు వెంట నడిచాయి. వారందరూ అర్జునుని తపోవనభూమికి చేరారు. ఆ సమయానికే మూకాసురుడనే రాక్షసుడు సూకరరూపంతో అర్జనుని సంహరించే సంకల్పంతో అచ్చటకు వచ్చాడు. నిరపరాధియైన తనను చంపే దుష్ట సంకల్పంతో వచ్చేదానిని సంహరిస్తాను అంటూ అర్జునుడు గాండీవం ఎక్కుపెట్టి బాణం సంధించి ధనుష్టంకారం చేశాడు. తానే ముందుగా బాణం సందించుటవల్ల దానిని చంపే అధికారం అర్జునునకు లేదని కిరాతుడన్నాడు. ఇద్దరూ బాణాలను ఒక్కసారే వదిలారు. ఇరువురి బాణాలు తగిలి ఆ వరాహం క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతంలాగా అటు ఇటు తిరిగి తిరిగి చివరకు కూలిపోయింది. కిరాతుని జూచి అర్జునుడు కోపంతో ''ఓయీ! నీవెవ్వడవు? మునిజనులతో ప్రశాంతంగా ఉండే ఈ అడవిలో స్త్రీలతో నిర్భయంగా సంచరించే ధైర్యం నీకెలావచ్చింది? నేను లక్ష్యంచేసిన మృగాన్ని చంపే అధికారం నీకెక్కడిది? నాయెడ తిరస్కారభావం ప్రవర్తించినందులకు నిన్ను శిక్షించకుండా విడువను'' అని అన్నాడు. కిరాతుడు గలగల నవ్వి ''ఓహో! నీవు బలేవాడివి. నా ఏలుబడిలోని దీ అరణ్యం-నీవు చూచుటకు సుకుమార రాకుమారుడిలా ఉన్నావు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ?'' అని తిరిగి ప్రశ్నించాడు. ఇక్కడ సంచరిస్తున్నప్పుడు నన్ను హింసించేందుకు ఈ మాయారాక్షసుడు వరాహరూపంలో రాగా వానిని నా బాణంతో సంహరించాను అని అన్నాడు అర్జునుడు. నీ బాణం తగులకముందే వీడు నా బాణంతో మరణించాడు. అందువలన ఆ జంతువుపై సర్వాధికారాలు మావి. బలగర్వంతో అధిక ప్రసంగం చేసి నామీద దోషారోపణ చేయకు. నీ ప్రాణాలు నాచేతిలో ఉన్నాయి. ఇదిగో బాణం వదులుతున్నాను - శక్తిఉంటే కాచుకో'' అన్నాడు కిరాతుడు. వాని మాటలు విన్న అర్జునుడు తీవ్ర కోపంతో బాణవర్షం కురిపించాడు. కాని ఆ బాణాలు కిరాతుణ్ణి ఏమి చేయలేదు. కిరాతుడు హేళనగా - ''మూర్ఖుడా! కాలయాపనచేయక నీ వద్ద శక్తి గల బాణాలుంటే విడిచిపెట్టు'' అన్నాడు. అర్జునుని కోపం పెచ్చుపెరిగింది. రెండు గడియలు తీవ్రబాణవర్షం కురిపించాడు. ఆ బాణాలన్నీ కిరాతునిలో లీనమైనాయి. ఆశ్చర్యంతో అర్జునుడు-ఇన్ని బాణాలు వేసినా ఇతని శరీరంపై ఒక్క శరాఘాతము లేదే-నా బాణధాటికి శంకరుడు వినా మరొకరు నిలువలేరే అని భావించాడు. ఆతడు యక్షుడో, దేవతాస్వరూపుడో కానిచో ఈ బాణాలతో మరణించి ఉండాలి అని నిశ్చయించి తిరిగి శరవర్షం కురిపించాడు. అర్జునుడి అమ్ములన్నీ వమ్మయినవి. అగ్ని దేవుడిచ్చిన అక్షయతూణీరం శూన్యమైనది. కోపంతో తన చేతిలోని గాండీవంతో అతడిని కొట్టగా ఆ గాండీవంకూడ కిరాతునిలో లీనమైంది. వెంటనే తన ఒరనుండి కత్తిలాగి దానితో కిరాతుని శిరస్సుపై వేయగా అది తుత్తునియలై పోయింది. వెంటనే ముష్టియుద్ధానికి దిగాడు అర్జునుడు. కిరాతుని ముషిఘాతాలు అర్జునుని శరీరాన్ని నుగ్గుచేశాయి. చైతన్యం కోల్పోయి అర్జునుడు రెండు గడియలు లేవలేక పోయాడు. స్పృహ వచ్చేసరికి అతని శరీరమంతా నెత్తురుమయ మైనది. వెంటనే అచటి మట్టితో పార్థివలింగం ప్రతిష్ఠించి పూలు అక్షతలతో ఆ త్రినేత్రుని అర్చించాడు. ఆ పూలమాలే కిరాతుని రూపంలో నున్న శివుని మెడలో చేరింది. అది చూచి అర్జునుడు హర్ష పులకిత శరీరుడై ఆ కిరాతుడే దేవదేవుడని గ్రహించి కిరాతుని పాదములమీద పడి అనేక విధముల స్తుతించాడు. అంత ఆ దేవదేవుడు ఉమాసహితుడై దర్శనమిచ్చి అర్జునుని తల నిమిరి ఆలింగనము చేసి పాశుపతాస్త్రాన్నిచ్చి అనుగ్రహించాడు. తపస్సువలన సిద్ధపొందిన అర్జునునికి దైవత్వప్రాప్తి, ఇంద్రలోక గమనం సిద్ధించాయి.

భక్తితో కూడిన శక్తి దైవత్వాన్ని ప్రసాదిస్తే-భక్తి లేని శక్తి దానవత్వాన్నిస్తుంది.

ప్రశ్నలు

1. అర్జునుడు అస్త్రసంపాదనకై ఏమి చేసెను?

2. పరమశివుడు అతనిని ఎట్లు పరీక్షించెను?

3. అర్జునునకు శివుడు ఏమి ప్రసాదించెను?

Neetikathamala-1    Chapters    Last Page