Sri Jayendravani    Chapters    Last Page

12. స్వధర్మం లేక వ్యక్తి యొక్క విధి

మనది అనుభవం మీద ఆధారపడిన మతం. అది అధ్యయన ఫలితంగా పుట్టిందికాదు. మనం సేకరించిన ధర్మాలన్నీ అనుభవంద్వారా మనకు సంక్రమించినవే తప్ప గ్రంథస్థమైన విజ్ఞానంద్వారా సమకూరినవి కాదు. ఇదే విషయాన్ని కృష్ణభగవానుడు గీతలో ఈ క్రింది వాక్యంలో చెప్తాడు.

''స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ||''

తన స్వధర్మాన్ని నిర్వర్తించటం ద్వారా మానవుడు సఫలీకృతుడౌతాడు. భగవత్కృపకు పాత్రుడౌటకు, మోక్షసాధనకు తరుణోపాయం కర్తవ్య నిర్వహణమే. విధి నిర్వహణ తర్వాతే భక్తి చోటు చేసుకుంటుంది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను సేవించినా, భార్య భర్తసేవకు అంకితమైనా చాలు. వారు వేరే దైవతను ఆరాధించ పనిలేదు. అలా చేయకుండా తమవిధులను నిర్లక్ష్యం చేసినవారే దేవాలయాలకు వెళ్లి దేవతారాధన అంటూ జరుపుతారు. పురుషుడు తల్లిదండ్రుల సేవలోను, భార్య తన పెనిమిటి సేవలోను నిమగ్నమైతే దైవారాధన కొరకు గుళ్ళు గోపురాలు దర్శించపనిలేదు. మహాభారతంలో ఇదే విషయాన్ని విశదీకరించటానికి ఒక కథ ఉంది. తల్లిదండ్రుల సేవను పట్టించుకోని ఒక యువకుడున్నాడు. తన ఆశ్రమ ధర్మాన్ని కూడ లక్ష్యం చేయలేదు. అతడు ఇల్లు వదలి అడవికివెళ్లి మహర్షుల నాశ్రయించి మంత్రోపదేశాన్ని పొంది 10 రోజులు ఆ మంత్రజపం చేశాడు. అలా పదిరోజులు తపస్సు చేసిం తర్వాత తపస్సిద్ధి లభించిందని తలంచాడు. అతడు ఒక వృక్షం క్రింద కూర్చొని తపస్సు చేస్తుండగా చెట్టు మీద వున్న కొంగ అతని తలపై రెట్ట వేసింది. ఆగ్రహా వేశుడై అతడు కొంగవైపు తీక్షణంగా చూచాడు. కొంగ క్రిందపడి బూడిదగా కాలిపోయింది. ''తపోబలంతో మంత్రసిద్ధి సాధించిన నాతలపై మామూలు పక్షివి రెట్టవేసి నన్ను అవమానించినందుకు నీకు తగిన శాస్తి జరిగింద'ని ఆ యువకుడు విర్రవీగాడు.

తన మంత్రసిద్ధితో మొత్తం ప్రపంచాన్ని గడగడ లాడించ గలనని తలంచాడు. తానుచేసిన తపస్సు చాలని కూడ భావించాడు. యువకుడీ ఆలోచనలతో పోతూ ఉండగా అతనికి ఆకలిబాధ ఎక్కువైంది. ఆకలిగొన్న మనిషి అన్నిటిని విస్మరిస్తాడు. అతడు చాలా ఇళ్లు దర్శించాడు. కాని అన్ని ఇళ్లకు తలుపులు మూయబడే వున్నాయి. ఒక ఇంటి తలుపులు మాత్రం తీసి వున్నాయి. గృహిణి ఇంట్లో బయటకు, లోపలికి తిరుగుతూ వుంది. యువకుడు ఆ యింటికి వెళ్లి ఆమెను భిక్షకొరకు ఆర్థించాడు. ఆమె అతని అభ్యర్థనను విన్నదికాని, బదులు పలుకలేదు. ఆమె తన ఇంటిపనులలో నిమగ్నమైఉంది. యువకుడు ఆమెవంక కోపదృష్టితో చూశాడు. వెంటనే ఆమె కూడా అతనివంక తీవ్రంగా చూచి ''నీవు చెట్టు క్రింద చంపి బూడిద కావించిన కొంగనుగా భావించావా నన్ను'' అని పలికింది.

తన తపోశక్తిచే కొంగను చంపిన విషయం ఈమె కెలా తెలిసిందని అతడు నిజంగా ఆశ్చర్యపోయాడు. ఆ యువతి తనకంటే ఎక్కువ జ్ఞానం గల వ్యక్తియని భావించాడు. నేను కొంగను కాల్చివేసినట్లు నీకెలా తెలుసని ఆమెను ప్రశ్నించాడు. ''నాకు ఇంట్లో చేయవలసిన పనులు చాలావున్నాయి. నీకు సమాధానం చెప్పటానికి తగిన సమయం నాకు లేదు. ఆ వీధిమూలలో వున్న కసాయివాని దగ్గరకు వెళ్లి అడిగితే అతడు నీకు తగు సమాధానం ఇస్తాడు.''అన్నది.

అంత నాయువకుడు కసాయివాని దగ్గరకు వెళ్లాడు. కసాయివాడు అతన్ని చూడగానే 'ఆ యువతి నిన్నిక్కడికి పంపిదా?' అని ప్రశ్నించాడు. యువకుడింకా ఆశ్చర్యచకితుడయ్యాడు. 'ఈ విషయం నీకెలా తెలుసు' అని కసాయివాణ్ణి ప్రశ్నించాడు. నాకు నీతో మాట్లాడే సమయంలేదు. కొంతసేపు వేచియుండు అని కసాయివాడు చెప్పాడు. యువకుడు తనకున్న ఆకలిని కూడ అణచుకొని ఓర్పుతో కూర్చున్నాడు. తన వ్యాపారం ముగించుకొని కసాయి తన ఇంటికి వెళ్లి తనవృద్ధ తల్లిదండ్రులను స్నానం చేయించి, వారికి భోజనం పెట్టి, కావల్సిన సేవలన్నింటిని పూర్తిచేసికొని యువకునివద్దకు వచ్చాడు. యువకుడు తన ప్రశ్నను మరల వినిపించాడు. అప్పుడ కసాయి ''నీవు వారింటికి వెళ్లినపుడు ఆ యువతి తన పెనిమిటి సేవలో ఉంది. పతిసేవవలన ఆమెకు దైవానుగ్రహం ప్రాప్తించింది. దాని ప్రభావంవల్ల ఆమె భూత భవిష్యత్‌, వర్తమానకాలాల ఘటనలన్నీ తెలిసికునేశక్తి కల్గివున్నది. ఆమెకు తపస్సుతో పనిలేదు. దైవానుగ్రహం పొందటానికి దేవాలయాలు దర్శించాల్సిన అవసరం కూడ ఆమెకు లేదు. నీ స్వధర్మాన్ని నీవు పాటిస్తే చాలు. దైవం గుడిలోనే కాదు నీ ఇంటిలో కూడ వుంటాడు. ధర్మపత్నికి తన పెనిమిటే దైవం. అలాగే కుమారునకు తన తల్లిదండ్రులే భగవత్స్వరూపులు.''అని కసాయి సమాధాన మిచ్చాడు. తమిళ సాహిత్యంలో 'క రైక్కాల్‌ అమ్మెయార్‌' ను గురించి ఒక కథ వుంది. అందులో ఆమె తన భర్త సేవవలన సంపాదించిన శక్తి సహాయమున కేవలం ధ్యానం ద్వారా ఏ పండునైనా పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉండేది.

అప్పుడా కసాయి యువకునితో ఇలా అన్నాడు. ''నీవు ఏదైనా కర్మను చేశావా? ఎవరికైన ఏదైనా సేవ చేశావా? కనీసం నీ భార్యకైనా ? నాకు సంబంధించి నంతవరకు వృద్ధులైన నా తల్లిదండ్రులకు నిత్యం సేవచేస్తూ వుంటాను. మన మతంలో 'మాతృదేవోభవ, పితృదేవోభవ' అని చెప్పబడివుంది. కనుక నేను వారిని దైవస్వరూపులుగ ఎంచుకొని సేవ లందిస్తున్నాను. అన్నివేళల వారిని గురించే ఆలోచిస్తాను. నేను కసాయిననే భావన నాకెన్నడూ రాదు. కేవలం నా స్వధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తల్లిదండ్రులకు చేసే సేవ సర్వోత్కృష్టమైన ధర్మం. కాని నీవు ఈ ప్రధాన విషయాన్ని అలక్ష్యం చేశావు. కనుక నీకీవిషయాలు ఏమీ తెలియవు.'' యువకుడప్పుడు కసాయితో ''పది దినాలు

8)

తపస్సు చేయుట ద్వారా సాధన చేశాను.'' అన్నాడు. దానికి కసాయి సమాధానం చెబుతూ 'నీ మంత్రాలు చిల్లిగవ్వక్కూడ సరికావు. పాముకాటునకు, తేలుకుట్టినందుకు కూడ మంత్రాలున్నాయి. నీ మంత్రాలు కూడ వాటికి సరియైనవే', అన్నాడు.

మహర్షులు పూర్వకాలం ఆకలిదప్పులనుండి, శీతోష్ణాల నుండి తమనుతాము రక్షించుకోవటానికి ఈ మంత్రాలను అధ్యయనంచేశారు. తమ తపస్సును నిర్విఘ్నంగా కొనసాగించుకోవటానికి కూడ ఈమంత్రాల్ని అనుష్ఠానంచేసి వాటిలో సిద్ధిని సాధించారు. సిద్ధులు ఒకసారి సిద్ధించింతర్వాత దేవతలు వారుకోరినవన్నీ వార్కి ప్రసాదించారు. మన పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ వీటికిచాల తార్కాణాలున్నాయి.

పురాణాలు మన ధర్మాన్ని గురించి వివరాలు యిస్తూ మనం ఏమి చేయవచ్చో మన కర్మకు ఏ ఏ ఫలితాలుంటాయో కూడ విశదీకరించాయి. కనుక స్వధర్మాన్ని నిర్వర్తించటమే అన్నిటికంటే ముఖ్యమైనది. స్వధర్మం అంటే భార్య భర్త పట్ల చేయవలసిన విధులు. కుమారుడు తనతల్లిదండ్రుల విషయంలో నిర్వహించవలసిన కర్తవ్యాలు మొదలైనవి. మనం శ్రేయస్సును, సుఖాన్ని సంతరించుకోటానికి ఇంతకంటే మంచి మార్గం లేదు.

Sri Jayendravani    Chapters    Last Page