Sruthi Sourabham    Chapters    Last Page

8. వేదంలో జ్యోతిషం

వేదానికి జ్యోతిశ్శాస్త్రం ఒక అంగం.

శ్లో. శిక్షావ్యాకరణం ఛన్దో నిరుక్తం జ్యోతిషం తథా

కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః

(శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం వేదాంగాలని బుద్ధిమంతులు చెప్పారు.) అను ఆర్యోక్తి జ్యోతిషాన్ని వేదాంగంగా తెల్పింది. వేదాన్ని ఒక పురుషునిగా భావిస్తే ఆయనకు జ్యోతిషం కంటివంటిదని మరో శ్లోకం చెబుతుంది.)

శ్లో. ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పోథ పఠ్యతే

జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం శ్రోత్ర ముచ్యతే

శిక్షాఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతమ్‌

తస్మాత్సాఙ్గ మధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే

(వేదానికి ఛందస్సు పాదాలు, కల్ప సూత్రాలు చేతులు, జ్యోతిషం కన్ను, నిరుక్తం చెవి, శిక్ష ముక్కు, ముఖం వ్యాకరణం, అందువల్ల అంగాలతో కూడిన వేదాన్ని అధ్యయనం చేస్తేనే బ్రహ్మలోకంలో గౌరవాన్ని పొందుతాడు.)

శ్రీ కృష్ణ యజుర్వేదంలో జ్యోతిశ్శాస్త్రానికి చెందిన విషయాలనేకం కనబడతాయి. నక్షత్రాలను వాటి అధిష్ఠాన దేవతలను వేదం పేర్కొంది.

ఉదా :- కృత్తికా నక్షత్ర మగ్నిర్దేవతాగ్నే రుచస్థ ప్రజాపతేర్థాతు స్సోమస్యర్చేత్వా

రుచేత్వాద్యుతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా

(అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనే ఏడు చుక్కల సమూహం కృత్తికా నక్షత్రం. దీనికి అగ్ని దేవత. దీనిలో అగ్ని, ప్రజాపతి, ధాత, సోముడు అనే దేవతల కాంతులున్నాయి. పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత. పైన చెప్పబడిన దేవతారూపమయిన ఇష్టకా! స్తోత్ర రూపమయిన మంత్ర సిద్ధి కోసం ఆ దేవతల వివిధ కాంతుల కోసం నిన్ను ఉపధానం చేస్తున్నాను.

- తైత్తిరీయ సంహిత - 4 కాం. 10 అను. 1ప.

నక్షత్రేష్టకోపాధాన సందర్భంలోనివీ మంత్రాలు. ఈ అనువాకంలో మిగిలిన నక్షత్రాలు, వాటి దేవతలూ పేర్కొనబడ్డాయి. నేటి వాడుకలో అశ్వినితో నక్షత్రాల లెక్క ప్రారంభిస్తున్నాం. వేదంలో కృత్తికతో ప్రారంభించడం విశేషం. నక్షత్రాల మహాదశలను లెక్కపెట్టేటప్పుడు ఇప్పటికీ కృత్తికతోనే ప్రారంభిస్తున్నారు. కృత్తికా నక్షత్రంలో ఏడు చుక్కలుండడం, వాటికి ప్రత్యేకంగా పేర్లుండడం గమనింపదగిన విషయం.

అగ్నికాంతికి ద్యుతి అని, సూర్యకాంతికి భాసమని, సోముని కాంతికి జ్యోతిస్సు అని ఇచట ప్రత్యేక నామాలున్నాయి. ఈ కృత్తిక కాంతులు ఆ నక్షత్రంలో ఉన్న సూర్యచంద్రుల ద్వారా భూమిని చేరుతున్నందున వారి కాంతులలో కలిపి ఈ నక్షత్రాన్ని ఇష్టకగా భావించి ఉపధానం చేస్తున్నారు. వీటినన్నిటిని సృష్టించిన వాడు సృష్టికర్త కనుక ఇక్కడ ప్రజాపతి కూడా పేర్కొన బడ్డాడు. ప్రజాపతి పాలకుడు, ధాత ఉత్పాదకుడు. ఈ గుణ భేదాన్ని బట్టి ఇద్దరు పేర్కొనబడ్డారు.

ఈ అనువాకంలో పుష్యమిని 'తిష్య' అనీ, జ్యేష్ఠను గూడ రోహిణీ అని, మూలను 'విచృతౌ' అని , శ్రవణాన్ని శ్రోణ అని, ధనిష్ఠను శ్రవిష్ఠ అని, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రలను ప్రోష్ఠపదా అని పేర్కొనడం జరిగింది. భరణికి అపభరణి అని ఇచ్చట పేరు.

'పునర్వసూ, విశాఖే, విచృతౌ, అశ్వయుజౌ' అనే నక్షత్రాలకు చుక్కలు రెండేసి ఉండడం వల్ల ద్వివచనం ఉపయోగించబడింది. ఫల్గుని, ఆషాఢ, ప్రోష్ఠపద అనే నక్షత్రాలు రెండేసి సార్లు పేర్కొనబడితే వాడుకలో వాటిని పూర్వఫల్గుని, ఉత్తర ఫల్గుని, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర అని పూర్వోత్తర పదాలను చేర్చి స్పష్టం చేస్తున్నారు. ఈ నక్షత్రేష్టకల ఉపధాన పద్ధతి గమనింపదగింది.

''పూర్ణాపశ్చాదితి పౌర్ణమాసీం పురస్తాదుపధాయ కృత్తికా నక్షత్రమితి నక్షత్రేష్టకాః పురస్తాత్ర్పతీచీరసంస్పృష్టాః పూర్వాం పూర్వాముపధాయ అపరామపరా మావిశాఖాభ్యాం దక్షిణన స్వయమాతృణ్ణాం రీతిం ప్రతిపాదయతి. యత్తే అదధురిత్యమావాస్యాం పశ్చాదుపధాయ అవశిష్టానాం పూర్వాం పూర్వామప భరణీమారభ్య ఉత్తరేణ స్వయమాతృణ్ణాం రీతిం ప్రతిపాదయతి. పౌర్ణమాసీమన్తత ఋచేత్వా రుచేత్వేతి సర్వాసు నక్షత్రేష్టకాస్వనుష్వజతి''.

('పూర్ణాపశ్చాత్‌'అని మొదట పౌర్ణమాసి ఇష్టకను తూర్పున ఉపధానం చేసి తరువాత కృత్తికా నక్షత్రమనే అనువాకంతో నక్షత్రేష్టకలను తూర్పు నుండి పడమరగా స్వయమాతృణ్ణకు దక్షిణంగా ఒకదానికొకటి తగులకుండ కృత్తిక నుండి విశాఖ వరకు వరుసల్లో ఉపధానం చేయాలి.

పడమర 'యత్తే అదధుః' అనే మంత్రంతో అమావాస్యేష్టకను ఉపధానం చేసి, స్వయమాతృణ్ణకు ఉత్తరంలో అపభరణిని ఆరంభించి ముందు ముందున్న నక్షత్రేష్టకలను అనూరాధ వరకు ఉపధానం చేయాలి. అంటే అప భరణి, అశ్విని, రేవతి అనే రీతిగా వ్యుత్క్రమంగా ఉపధానం చేయాలి. చివర పౌర్ణమాసిని ఉపధానం చేయాలి.

'ఋచేత్వారుచేత్వా ద్యుతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా' అనే మంత్రం ప్రతి నక్షత్ర మంత్రానికి చివర చేర్చాలి (తైత్తిరీయ సంహితా భాష్యం - 4 కాం. -10 అను. - కల్పం 2091 పు). ఇచ్చట నక్షత్రాలకు ప్రతీకలుగా ఇష్టకలనుపధానం చేస్తున్నాము.

స్వయ మాతృణ్ణకు దక్షిణ భాగంలో తూర్పున ఆరంభించి పడమర సమాప్తి అగునట్లు కృత్తిక మొదలుకొని విశాఖ వరకు ఇష్టకలను ఉపధానం చేయాలి. స్వయ మాతృణ్ణకు ఉత్తర భాగంలో అనూరాధ మొదలుకొని అప భరణి వరకు ఉండే నక్షత్రేష్టకలను పడమర ఆరంభించి తూర్పున సమాప్త మయ్యేలా ఉపధానం చేయాలి. స్వయ మాతృణ్ణకు దక్షిణోత్తర భాగాల్లో ఉండే పఙ్తుల నడుమ పశ్చిమ దిక్కు నందు సమరూపంగా అమావాస్యేష్టకను, స్వయ మాతృణ్ణకు దక్షిణోత్తర భాగ పంక్తులకు మధ్యలో తూర్పు దిక్కున సమరూపంలో పౌర్ణమాస్యేష్టకను ఉపధానం చేయాలని భావం. (తైత్తిరీయ సంహితా భాష్యం - 4 కాం. - 4 ప్ర. - 10 అనువాకంలో చివర).

వేదంలో ఋతువులున్నాయి

''మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతూ శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మా వృతూ

నభశ్చ నభ్యస్యశ్చ వారుషికా వృతూ ఇషశ్చోర్జశ్చ శారదావృతూ

సహశ్చ సహస్యశ్చ హైమన్తికా వృతూ తపశ్చ తపస్యశ్చ శైశిరా వృతూ'

(మధు మాధవ మాసాలు వసంత ఋతువు. శుక్రము శుచి మాసాలు గ్రీష్మర్తువు. నభము, నభస్యము, వర్షర్తువు, ఇషము, ఊర్జము శరదృతువు. సహము, సహస్యము హైమంతిక ఋతువు. తపము, తపస్యము శైశిర ఋతువు.)

- శ్రీ కృష్ణయజుర్వేదము, తైత్తిరీయ సంహిత - 4 -4 -11

ఇక్కడ ఋతువులను పేర్కొనేటప్పుడు చైత్రాది మాసాలు చెప్పకుండా మధువు మొదలయిన మాసాలను పేర్కొన్నారు. ఇపుడు ఫాల్గున శుక్ల పంచమీ ప్రాంతానికే వసంతర్తువు వచ్చేస్తోంది. అపుడే మధుమాసం ప్రారంభమవుతోంది. మధుమాసం చెట్లు చిగురించడం మొదలయిన ప్రకృతి లక్షణాల ద్వారా గుర్తించదగింది. చైత్ర మాసం చిత్రా నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చిన నెల కనుక వసంతర్తువులో మధుమాసం మొదటి నెల అని చెప్పడం సముచితం. ఒకప్పుడు మధుమాసం చైత్రమాసం ఒకేసారి వచ్చినా ఎల్లవేళలా అవి ఒకేసారి రావు కనుక చైత్ర వైశాఖాలు వసంతర్తువు అని చెప్పడం సార్వకాలిక సత్యం కాదు. కాని వేదం చెప్పినట్లు మధు మాధవ మాసాలు వసంతర్తువనే మాట సార్వకాలిక సత్యము. ఇచట వేదం పేర్కొనిన మాస నామాలు గూడా అర్థానుగుణములని గ్రహించాలి.

1. మధునా పుష్పరసేన యోగాన్మధుః (పుష్ప రసంతో సంబంధమున్న మాసం కనుక మధుమాసం.) 2. మధు ప్రచుర మస్మిన్నస్తీతి మాధవః (పూలతేనే విస్తారముగా గలిగినది మాధవ మాసం) 3. శోచయతి ప్రాణిన ఇతిశుక్రః (తాపముచే ప్రాణులను దుఃఖింపజేయునది శుక్రమాసం) 4. తాపేన శుగ్విద్యతేస్మిన్నితి శుచిః (తాపము వలన దుఃఖమీ మాసమందు కలదు కనుక శుచిమాసం) 5. నభాసతే మేఘ చ్ఛన్నత్వాదితి నభాః (మేఘచ్ఛన్నమై ప్రకాశించనిది నభోమాసము). 6. నభాంసి మేఘాః, తేషు సాధుర్నభస్యః (నభస్సులనగా మేఘములు. వానియందు సాధువయిన మాసం నభస్య మాసం) అంటే బాగా వర్షించే మాసమన్న మాట. 7. ఏషణం ఇట్‌ యాత్రా సా అస్మిన్నితి ఇషః విజిగీషాయాః కాలత్వాత్‌. (ఇట్‌ అంటే యాత్ర. శత్రువులను గెలుచుటకు యుద్ధ యాత్ర చేసే మాసము.) 8. ఊర్జ ముత్సాహః తదస్మిన్‌ విజిగీషుణా మస్తీతి ఊర్జః (ఊర్జమనగా ఉత్సాహం. విజిగీషులకీ మాసంలో ఊర్జము కలదు కనుక ఊర్జ మాసం) 9. సహంతే హిమ మత్ర ప్రాణిన ఇతి సహాః (దీనియందు ప్రాణులు, హిమమును సహించుదుర గాన సహోమాసం.) సహ్యన్తే శక్త్యాయుజ్యన్తే అత్ర ప్రాణిన ఇతి సహాః సహశక్తౌ. (సహ ధాతువుకి శక్తి అర్థం. దీనియందు ప్రాణులు శక్తి యుక్తులవుతారు కనుక సహోమాసం.) 10. సహః బలమస్మిన్నితి సహస్యః (బలము దీనియందు గలదు కనుక సహస్య మాసము.) 11. తపంతి వ్రతం కుర్వన్త్యస్మిన్నితి తపాః (దీనియందు తపోయుక్తులగుదురు గనుక తపోమాసం) 12. తపసి సాధుః తపస్యః (తపస్సునందు యోగ్యమైనది కనుక తపస్యమాసం) అని ఈ మాసాల పేరులు ప్రకృతి మార్పులు మొదలయిన వాటిని సూచిస్తున్నాయి.

- అమరకోశం - సంస్కృతాంధ్ర వాఖ్యానం - 97, 98 పుటలు

కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ బ్రాహ్మణంలో తృతీయాష్టకంలో 1వ ప్రపాఠకంలో నక్షత్రాలకు చెందిన యాజ్యా పురోనువాక్యలున్నాయి. దీనిలో మొదటి అనువాకంలో దేవ నక్షత్రాల యాజ్యా పురోను వాక్యలు. 2వ అనువాకంలో యమ నక్షత్రాల యాజ్యా పురోనువాక్యలు ఉన్నాయి. 3వ అనువాకంలో చంద్రుడు, అహోరాత్రాలు, ఉష, ఇంద్రుడు, సూర్యుడు, అదితి, విష్ణువు, అగ్ని అనే దేవతలకు యాజ్యా పురోనువాక్యలున్నాయి. వీరందరు ఆకాశంలో జ్యోతీ రూపంతో ఉన్నవారే అని గమనించాలి. పై యాజ్యా పురోనువాక్యలను నక్షత్రేష్టులలో వినియోగిస్తారు.

తైత్తిరీయ బ్రాహ్మణంలో 1వ కాండలో నక్షత్రేష్టకా మంత్రాలున్నాయి. ఒకానొక వికృతి చయనంలో వీటి వినియోగం ఉంటుందని శ్రీ సాయణాచార్యులు వ్రాశారు. ఇక్కడ మృగశీర్షను ఇన్వకా అని, ఆర్ద్రను బాహూ అని వ్యవహరించారు. పూర్వ, ఉత్తర పదాలతో ఆషాఢ, ఫల్గుని, భాద్ర నక్షత్రాల ప్రయోగం కూడా కనబడుతుంది.

ఇచ్చట ఒక పుణ్యకాల నిర్ణయరీతి కనబడుతోంది.

యత్పుణ్యం నక్షత్రమ్‌. తద్బట్కుర్వీతోపవ్యుషమ్‌.

యదావై సూర్య ఉదేతి. అథ నక్షత్రం నైతి. యావతి

తత్ర సూర్యో గచ్ఛేత్‌. యత్ర జఘన్యం పశ్యేత్‌.

తావతి కుర్వీత యత్కారీస్యాత్‌. పుణ్యాహ ఏవ కురుతే.

(జ్యోతిశ్శాస్త్ర ప్రసిద్ధి చేత యజమానునకు - ఆచరించే కర్మకు, అనుకూలమయిన పుణ్య నక్షత్రాన్ని ఉషః కాల సమీపంలో ఆకాశంలో సూర్యోదయ ప్రదేశానికి పై భాగంలో ఉండడం గమనించాలి. సూర్యుడుదయించినపుడు నక్షత్రం కనబడదు. కనుక సూర్యోదయానికి ముందే నక్షత్రాలు కనబడే సమయంలో ఆ నక్షత్ర స్థానం గుర్తుంచుకోవాలి. ఆ నక్షత్రం తూర్పున ఉదయించి పశ్చిమాభిముఖంగా వెడుతుంది. ఏ ప్రదేశాన్ని ఆ నక్షత్ర స్థానంగా తాను గుర్తించాడో ఆ స్థానం కంటే క్రిందికి తూర్పున సమీప దేశానికి సూర్యుడెంతలో వస్తాడో ఆ సమయంలో తాను చేయదగిన పుణ్యకర్మ నారంభించాలి. ఆ సమయంలో మరే కాల దోషాలున్నా పట్టించుకోనక్కరలేదు.)

నక్షత్ర సమూహాన్ని ప్రజాపతిగా ధ్యానించిన వాడు భూలోకంలో, స్వర్గలోకంలోను ప్రఖ్యాతుడవుతాడని ఒక ఉపాసన నిక్కడ చెప్పారు.

''యోవై నక్షత్రియం ప్రజాపతిం వేద. ఉభయోరేనం లోకయోర్విదుః- హస్త ఏవాస్య హస్తః, చిత్రా శిరః, నిష్ట్యా హృదయమ్‌, ఊరూ విశాఖే, ప్రతిష్ఠానూరాధాః, ఏషవై నక్షత్రియః ప్రజాపతిః. య ఏవం వేద. ఉభయోరేనం లోకయోర్విదుః''

నక్షత్ర సమూహ రూపుడైన ప్రజాపతికి హస్తా నక్షత్రం చేయి. చిత్ర శిరస్సు, స్వాతి హృదయం, విశాఖలు తొడలు. అనూరాధ ప్రతిష్ఠ. ఈ ప్రజాపతి నెరిగినవాడు భూలోక స్వర్గలోకాల్లో విఖ్యాతుడవుతాడు.

- తైత్తిరీయ బ్రాహ్మణం - 1 కాం. 5 ప్ర. 2 అ. 2 ప.

కొన్ని నక్షత్రాలు కొన్ని ప్రత్యేక కార్యాలకు మంచిపని గూడా వేదం చెప్పింది.

''యం కామయేత దుహితరం ప్రియాస్యాదితి. తాం నిష్ట్యాయాం దద్యాత్‌. ప్రియైవ భవతి. నైవతు పునరాగచ్ఛతి''

(తన కుమార్తె భర్తకు చాలా ప్రియురాలు కావలెనని కోరిన తండ్రి స్వాతిలో కన్యాదానం చేయాలి. ఆమె భర్తను వదలి పుట్టింటికి గూడ రాలేనంత ఇష్టురాలవుతుంది.)

-(తైత్తిరీయ బ్రాహ్మణం 1-5-2-3 పనసలు

అభిజిన్నామ నక్షత్రమ్‌ ఉపరిష్టా దషాఢానామ్‌

అవస్తాచ్ఛ్రోణాయై . . . . . . . . . . . . . . . . . .

యం కామయేతానపజయ్యం జయేదితి. తమేతస్మిన్నక్షత్రే యాతయేత్‌. అనపజయ్యమేవ జయతి. పాప పరాజితమివతు. (ఉత్తరాషాఢకు నాల్గవ పాదం, శ్రవణానికి 1వ పాదం కలిసి అభిజిన్నక్షత్రం. జయింప శక్యం కాని వానిని జయింపజేయాలంటే అభిజిత్తులో యుద్ధానికి బయలుదేరమని చెప్పాలి. పాపం వల్ల ఓడిపోయిన వానిలా శత్రువు అవలీలగా ఓడిపోతాడు.)

- (తైత్తిరీయ బ్రాహ్మణం 1-5-2-3 పనసలు

దేవ నక్షత్రాలు, యమ నక్షత్రాలు అనే విభాగాన్ని శ్రుతి పేర్కొంది.

'కృత్తికాః ప్రథమమ్‌. విశాఖే ఉత్తమమ్‌. తాని దేవ నక్షత్రాణి. అనూరాధాః అప భరణీ రుత్తమమ్‌. తాని యమ నక్షత్రాణి, యాని దేవ నక్షత్రాణి. తాని దక్షిణన పరియన్తి. యాని యమ నక్షత్రాణి. తాన్యుత్తరేణ. (కృత్తిక మొదలుకొని విశాఖ వరకు ఉన్న నక్షత్రాలు దేవలోకానికి సమీపంలో దక్షిణం ప్రక్కన సంచరిస్తున్నాయి. అనూరాధ మొదలుకొని భరణి వరకు ఉన్న నక్షత్రాలు యమ లోకానికి సమీపంలో ఉత్తర ప్రక్కన సంచరిస్తున్నాయి.

- (తైత్తిరీయ బ్రాహ్మణం 1-5-2-7 పనసలు

సావిత్రీ చయన సందర్భంలో తిథులు, పక్షాలు, ముహూర్తాలు మొదలయిన వాటికి ప్రత్యేక నామాలు చెప్పబడ్డాయి.

శుక్ల పక్షంలో 15 పగళ్ళకు వరుసగా అక్కడ ఇచ్చిన పేర్లు.

1 సంజ్ఞానం, 2 విజ్ఞానం, 3 ప్రజ్ఞానం, 4 జానత్‌, 5 అభిజానత్‌, 6 సంకల్పమానం, 7 ప్రకల్పమానం 8 ఉపకల్పమానం, 9 ఉపక్‌ప్తం, 10 క్‌ప్తమ్‌, 11 శ్రేయః, 12 వసీయః, 13 ఆయత్‌, 14 సంభూతమ్‌, 15 భూతమ్‌

ఈ పగటి వేళలను 15 ముహూర్తాలుగా విభజించి ఆ ముహూర్తాలకు పేర్లు ఏర్పరచింది శ్రుతి.

1 చిత్రః, 2 కేతుః, 3 ప్రభాన్‌, 4 ఆభాన్‌, 5 సంభాన్‌, 6 జ్యోతిష్మాన్‌, 7 తేజస్వాన్‌, 8 ఆతపన్‌, 9 తపన్‌, 10 అభితపన్‌, 11 రోచనః, 12 రోచమానః, 13 శోభనః, 14 శోభమానః, 15 కల్యాణః

ఇలాగే శుక్ల పక్ష రాత్రులకు 15కి ఆ రాత్రులలో 15 ముహూర్తాలకు కృష్ణ పక్షంలో 15 పగళ్ళకు, పగటిలో 15 ముహూర్తాలకు, 15 కృష్ణ పక్ష రాత్రులకు, వాటిలో 15 ముహూర్తాలకు సంవత్సరంలో 12 శుక్ల పక్షాలకు, 12 కృష్ణ పక్షాలకు, అధిక మాసంతో కూడా 13 మాసాలకు, పేర్లను ఈ తైత్తిరీయ బ్రాహ్మణం పేర్కొంది. ఒక పూటను 15 భాగాలుగా విభజిస్తే ప్రతి భాగం ఒక ముహూర్తమవుతుంది. ఒక ముహూర్తాన్ని 15 భాగాలు చేసి ఆ భాగాలకు 15 పేర్లు కూడా ఇచట పేర్కొన్నారు. వీటికి క్షుద్ర ముహూర్తాలని పేరు.

ఇక్కడ అగ్నిఋతువు, సూర్యర్తువు, చంద్ర ఋతువు అని మూడు ఋతువులను కూడా పేర్కొన్నారు.

బహుశః చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢాలు సూర్యర్తువు, శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీకాలు చంద్ర సంబంధమయిన ఋతువు కావాలి. అపుడు వర్షం లేనపుడు వెన్నెల బాగుంటుంది కదా! మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గునం అగ్ని ఋతువు కావాలి. అపుడు చలి అధికంగా ఉండడం వల్ల అగ్ని అవసరం అవుతుంది కదా!

తరువాత సంవత్సరాల పేర్లు నాలుగు పేర్కొన బడ్డాయి. 1 ప్రజాపతి, 2 సంవత్సరః, 3 మహాన్‌, 4 కః

- తైత్తిరీయ బ్రాహ్మణం - 3 కాం. 10 ప్ర. 1 అ

జ్యోతిశ్శాస్త్ర గ్రంథాల్లో 1 సంవత్సరము, 2 పరివత్సరము, 3 ఇదావత్సరము, 4 ఇద్వత్సరము, 5 వత్సరము అని అయిదు సంవత్సరాలుగా పరిగణనం కనబడుతోంది.

పైన పేర్కొన్న నామాల్లో సంవత్సరం ఇప్పటికీ సంవత్సర నామమే. ప్రజాపతి 60 సంవత్సరాలల్లో 5 వ సంవత్సరానికి పేరు. కః అనేది ప్రజాపతికి పర్యాయం.

'సమ రాత్రిం దివే కాలే విషువత్‌'

(రాత్రి పగలు సమంగా ఉండే కాలం విషువత్తు)

(అమరకోశం - 1 కాం. 14 శ్లో)

ఈ విషువత్తును వేదం తెల్పింది. గవామయనమని ఒక సంవత్సర కాలం చేసే యాగం. దీనిని కల్పసూత్రం ఇలా చెప్పింది.

'త్రిషు పరస్సామసు త్రీనతి గ్రాహ్యాన్‌ గృహ్ణాతి ఉపయామ గృహీతోస్సద్భ్య స్తౌషధీభ్యో గృహ్ణామితి ప్రథమే హని గృహ్ణాత్యౌషధీభ్యస్త్వా ప్రజాభ్య ఇతి ద్వితీయే ప్రజాభ్యస్త్వా ప్రజాపతయ ఇతి తృతీయ, ఏతావానేవావృత్తా నర్వాక్సామసు తానూర్ధ్వానా వృత్తాంశ్చ విషువతి' దీనికి సాయణాచార్యుల వారి వివరణ మిది.

'అస్తిగవామయనం నామ సంవత్సరం సత్రం, తస్య పూర్వమాస షట్కముత్తరమాస షట్కంచేతి ద్వౌ భాగౌ, తయోర్మధ్యే విషువత్సంజ్ఞ మేకం ప్రధానమహర్భవతి. తస్య చాహ్నః పూర్వభావీని పరస్సామ నామకాని త్రీణ్య హాని భవన్తి తాని పూర్వస్య మాస షట్కస్యాన్తిమాని తథా విషువతోహ్న ఉత్తర భావీన్యనన్తరాణ్యర్వాక్సామనామాని త్రీణ్యహాని భవన్తి. తాన్యుత్తరస్య మాసషట్కస్యాది భూతాని.

తత్రాపి పరస్సామ నామకేషు త్రిష్వహస్సు క్రమేణోక్తై స్త్రిభిర్మన్త్రైః త్రయోతి గ్రాహ్యాః సోమరసా గృహీతవ్యాః. అర్వాక్సామ నామకేషు త్రిష్వహస్సు తేషామేవ మన్త్రాణాం విపరీత క్రమేణ త్రయోతి గ్రాహ్య గృహీతవ్యాః. విషువ న్నామకేతు ముఖ్యదినే సమామ్నాత క్రమేణ విపరీత క్రమేణ చేత్యేవం షడతి గ్రాహ్యా గృహీతవ్యాః

(గవామయనమని సంవత్సరం చేసే సత్రయాగం ఉంది. దానికి ముందు ఆరు నెలలు ఒక భాగం. తరువాత ఆరునెలలు ఒక భాగం. వాటి మధ్యలో విషువత్తు అనే ప్రధానమయిన అహస్సు, దానికి ముందు పరస్సామలనే మూడు అహస్సులుంటాయి. అవి విషువానికి ముందుండే 6 మాసాలకు చివరివి. విషువానికి తరువాత అర్వాక్సామలనే మూడు అహస్సులుంటాయి. అవి విషువత్తు తరువాత ఉండే ఆరుమాసాలకు మొదటివి. పరస్సామాలనే మూడు అహస్సులలో క్రమంగా చెప్పబడిన మూడు మంత్రాలతో అతిగ్రాహ్యాలనే సోమరసాలను గ్రహించాలి. అర్వాక్సామలనే మూడు అహస్సులలో ఆ మంత్రాలతోనే తలక్రిందు క్రమంలో మూడు అతి గ్రాహ్యాలను గ్రహించాలి. విషువత్తు అనే ముఖ్య దినంలో చెప్పబడిన క్రమంలో 3, విపరీత క్రమంలో 3 మొత్తం ఆరు అతిగ్రాహ్యాలను గ్రహించాలి.) అని చెప్పారు. ఈ యజ్ఞం విషువత్తు ఆధారంగా జరుగుతుందని స్పష్టం.

ఋగ్వేదం సంవత్సర చక్రాన్ని పేర్కొంది.

ద్వాదశ ప్రధయశ్చక్రమేకం

త్రీణి నభ్యాని క ఉత చ్చికేత

తస్మిన్‌ సాకం త్రిశతా న శంకవో

ర్పితాః షష్టిర్న చలా చలాసః

- ఋగ్వేదం - 1 మం. 22 అ. 164 సూ. 48 మం.

(పన్నెండు మాసాలనే పరిధులు కల్గినది సంవత్సరమనే చక్రం. దీనికి గ్రీష్మకాలం, వర్షాకాలం, హేమంత కాలమనే నాభిస్థానీయ మయిన ఫలకాలున్నాయి. ఈ కాల చక్రంలో 360 రోజులనే శంకువులున్నాయి. దీని నెవరెరుగ గలరు ?)

ఇలా వేదాల్లో జ్యోతిశ్శాస్త్ర విషయాలనేకం ఉన్నాయి. ఇక్కడ దిఙ్మాత్రంగా చూపడం జరిగింది.

Sruthi Sourabham    Chapters    Last Page