Sruthi Sourabham    Chapters    Last Page

10. దేవేంద్రునకు పాపమంటునా ?

దేవేంద్రుడు విశ్వరూపుణ్ణి సంహరించిన వృత్తాంతం జగద్విదితం. ఆ కృత్యం వల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా దోషం కలిగిందని కొన్ని స్థలాల్లో, ఆయనకు పాపం లేదని మరికొన్నిచోట్ల కనబడుతుంది. దానిలో తత్త్వాన్ని గ్రహించాలి.

బ్రహ్మసూత్ర భాష్యంలో ఇంద్ర ప్రాణాధికరణంలో కౌషీతకీ బ్రాహ్మణంలో ఉన్న ఇంద్ర ప్రతర్దనాఖ్యాయిక ఉదాహరింపబడింది. దానిలో ''త్రిశీర్షాణం త్వాష్ట్ర మహనమ్‌. అరున్ముఖాన్‌ యతీన్‌ సాలా వృకేభ్యః ప్రాయచ్ఛమ్‌. తస్య మే తత్ర లోమచ నమీయతే'' అని మూడు శిరస్సులు కల విశ్వరూపుని సంహరించడం, వేదాంత విముఖులయిన యతులను అడవి కుక్కలకు వేయడం అనే కృత్యాల వల్ల దేవేంద్రునికి కేశం కూడ ఊడలేదని తెల్పబడింది.

- బ్రహ్మసూత్ర - 1 అ. 1పా. 28 సూ. 11 అధి.

కాని శ్రీ మద్భాగవతంలో విశ్వరూప వధచే దేవేంద్రునికి బ్రహ్మహత్యా దోషం కలిగిందని, దానినతడు భూమికి, నీటికి, చెట్లకు, స్త్రీలకు పంచి యిచ్చి వారికి వరాలను ప్రసాదించినాడని ఉంది. - శ్రీ మద్భా - 6 స్కం. 9 అ.

శ్రీకృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితలో గూడ ఈ కథ ఉంది. (2 అష్ట - 5 ప్రపా. 1,2 అను.) కాబట్టి దేవేంద్రునికి హత్యాదోషం ఉందా? లేదా? అని ప్రశ్న బయలుదేరుతోంది.

బ్రహ్మజ్ఞానం కలవానికి శరీరేంద్రియ మనస్సులచే చేయబడిన దోషాలంటవు. బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడైన దేవేంద్రునికి బ్రహ్మహత్యా దోషమంటదని చెప్పాలి. కనుక ''తస్యాఞ్జలినా బ్రహ్మహత్యాముపాగృహ్ణాత్తాగ్‌ం సంవత్సరమబిభః'' (ఆ విశ్వరూపుని వధచే కలిగిన దోషాన్ని దోసిలితో గ్రహించాడు. అనగా బుద్ధిపూర్వకంగా చేశానని యమ చిత్ర గుప్తాదులు యెదుట అంగీకరించినాడన్నమాట. కాని ప్రాయశ్చిత్తం చేసికోకుండా సంవత్సరం గడిపినాడు. బ్రహ్మహత్యకు భయపడలేదు.) ''ఆత్మతత్త్వజ్ఞానేః పాప లేపా భావాద్భీత్య భావః యుక్తః'' (ఆ ఆత్మ తత్త్వ జ్ఞానికి పాపమంటదు కనుక ఆయనకు పాపభయం లేకపోవడం యుక్తమే) అని సాయణాచార్యుల వారు భాష్యములో వివరించారు. కనుక బ్రహ్మహత్యను లోక శ్రేయస్సునకై చేసినట్లంగీకరించి, పాపం తన కంటదని ఆయన నిర్భయంగా సంవత్సర కాలం గడిపినాడు.

- శ్రీకృష్ణ యజుస్సంహిత - 2 అ. 5 ప్ర. 1 అను.

కాని లోకులు మాత్రం ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకుడని ఆక్రోశింప సాగినారు. ఆ అపవాదాన్ని తొలగించుకొనడానికి ఆ పాపాన్ని భూమ్యాదులకు పంచినాడు.

ఇక్కడ తెలియదగిన విషయమిది. బ్రహ్మజ్ఞానికి సంచిత వర్తమాన కర్మ ఫలా లంటవు. ''తదధిగమ ఉత్తర పూర్వాఘయోరశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్‌'' (బ్రహ్మసూత్ర - 4 అ. - 1 పా. - 9 అధి.) అని వ్యాస భగవానుల సూత్రం. ప్రారబ్ధ కర్మను మాత్ర మతడు అనుభవించ వలసి యుంటుంది. బ్రహ్మజ్ఞానియైన దేవేంద్రునికి విశ్వరూప హత్యాదోషం లేదు. కావుననే ఆయన భయపడలేదు. ప్రాయశ్చిత్తం చేసికోలేదు. కాని ఈ విషయం ఎరుగని లోకులు 'ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకుడ'ని నిందించడం చేత లోక సంగ్రహార్థం ఆ పాతకాన్ని భూమ్యాదులకు పంచి యిచ్చినాడు.

తనకు లేని దోషాన్ని పంచి యివ్వడమెట్లని ప్రశ్న కలుగుతుంది. చేసిన కర్మకు ఫలమవశ్యముంటుంది. బ్రహ్మజ్ఞాని చేసిన పుణ్యకర్మను అతనిని గౌరవించేవారు, అతనిని ద్వేషించేవారతని పాపాన్ని గ్రహిస్తారు. ''తస్య పుత్రాదాయ ముపయన్తి. సుహృద స్సాధు కృత్యామ్‌. ద్విషన్తః పాపకృత్యామ్‌' అని శ్రుతి చెబుతోంది. కావున దేవేంద్రునకు విశ్వరూప హత్యా దోషమంటదని చెప్పాలి. కాని విశ్వరూప హత్య వలన దోషం లేదని మాత్రం చెప్పరాదు.

బ్రహ్మజ్ఞానుల దోషాలను వారిని ద్వేషించేవారు గ్రహిస్తారు. దేవేంద్రుని దోషాన్ని భూమ్యాదులు గ్రహించాయని సారాంశం. కాబట్టి దేవేంద్రుడు తనకా హత్యా దోషాలు అంటవని చెప్పుకోవడం సముచితమే.

Sruthi Sourabham    Chapters    Last Page