Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

2. పరిచయం

బ్రహ్మశ్రీ కులుమణి నారాయణశాస్త్రిగారు తమిళ భాషలో వ్రాసిన శ్రీ శేషాద్రిస్వామివారి జీవిత చరిత్రకు ఇది భావానువాదం. కొన్ని చోట్ల విషయం విక్షిప్తంకాక సంక్షిప్తం చేయబడింది.

అరుణాచల జనులకు రమణ మహర్షి రవి ఐనచో, శేషాద్రిస్వాములు శశివంటివారు. శ్రీ కావ్యకంఠ గణపతి మునులు భగవానుల ఉపదేశాలను భందోబద్ధం చేశారు. అంతేకాదు. వారు స్వయంగా అనేక సిద్ధులను పొందిన మహనీయులు. తెనుగులో రమణలీల లున్నవి; కావ్యకంఠుల చరిత్ర కూడా ఉన్నది. కాని నాకు తెలిసి శ్రీ శేషాద్రిస్వామి చరిత్ర తెనుగులో లేదు.

శేషాద్రిస్వామివారి జీవిత చరిత్ర అనువదిస్తున్నానని ఒకపుడు కామకోటిస్వాములవారి చెవిని వేయగా వారు ఇలా అన్నారు.

''రామకృష్ణ పరమహంస, వివేకానందులు రాగ భక్తితో భగవదారాధన చేసినవారు, రమణమహర్షులు చిన్నతనంలోనే అద్వైతానుభూతి నొంది ఒక విశిష్టమార్గము త్రొక్కినవారు. అరవిందుల విధానం వేరు. సదాశివబ్రహ్మేంద్రులు, శేషాద్రిస్వామి మొదట వైదికంగావుంటూ తర్వాత దానిని అతిక్రమించి అవధూతలైనవారు. వైదికనిష్ఠలో ఉండి ఆత్రోవను వదలవలెనంటే కష్టం. వైదికమార్గం అనుసరించే వారికి ఆదే మార్గం అని తోస్తూ వుంటుంది. ఒకొక్కరిది ఒకొక త్రోవ. అనువాదరూపంగా శేషాద్రిస్వామి వారి కైంకర్యం చేయతగినదే.''

రమణవాణికి పరిచితులైన ఆంధ్రులకు శేషాద్రిస్వామి క్రొత్త కాదు. జీవిత విశేషాలతో వారి చరిత్ర తెనుగువారికి అందించాలనే ఉత్సాహమే ఈ ప్రయత్నం.

ఇతిశం

-విశాఖ

''శ్రీ శేషాద్రిస్వామి చరిత్ర ద్రావిడ భాషలో బ్రహ్మశ్రీ కులుమణి నారాయణశాస్త్రిగారు వ్రాసిరి. ఈ పుస్తకము శ్రీ శేషాద్రిస్వామి అధిష్ఠానసభ - ఊజలూరు ప్రకటించినది. శ్రీ కుళందై ఆనందస్వామి జీవిత చరిత్రలోని అంశములు ఈ అధిష్ఠానమువారు అపుడపుడు ప్రచురించిన తమిళ ఆరాధన సంచికలనుండి ఉద్ధృతములు. వీనిని ఆంధ్రదేశములోని భక్త జనుల ఉపయెగార్థము ఆంధ్రీకరణకు, ప్రచురణకు అంగీకరించి ఎన్నో విధముల సహకరించిన శ్రీ శేషాద్రిస్వామి అధిష్ఠాన సభవారి సౌజన్యమునకు నా కృతజ్ఞత.''

- విశాఖ.

శ్రీ భాగవతుల కుటుంబరావు గారు M.A.

చిలకలపూడి - కృష్ణాజిల్లా.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page