Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

19. కుళందైఆనందస్వామి

సంగ్రహ చరిత్ర

ద్రావిడ భాషలో 'కుళందై' అనగా శిశువు. కుళందై ఆనందస్వామి అన్న పేరుతో వారు ఎప్పుడూ శిశువువలె ఆనందస్థితిలో వుండేవారన్న భావ మున్నది. మహాత్ములు, 'బాలోన్మత్త పిశాచవత్‌' బాలురవలె, ఉన్మత్తులవలె, పిశాచములవలె సంచరిస్తారని మనము వినియే యున్నాము.

కుళందై ఆనందస్వామి సుమారు మూడువందల సంవత్సరముల క్రితం హాలాస్యక్షేత్రమని ప్రసిద్ధి చెందిన మధురా నగరంలో అవతరించారు. రాణీ మంగమ్మ పరిపాలనా కాలంలో, వీరితండ్రి సంస్థానంలో ఉద్యోగిగా ఉండేవారు. వీరి తల్లిపేరు త్రిపురసుందరి. చాలరోజులుగ సంతతి లేనిదానివలన ఆమె మీనాక్షిని సంతానార్థము ప్రార్థిస్తూ వచ్చినది. ఒకరోజు మీనాక్షి స్వప్నములో కనపడి ఆమెకు పుత్రప్రాప్తి కలుగుతుందని అనుగ్రహము చేసినది. కొంతకాలమునకు ఆమెకు కవలపిల్లలు జన్మించారు. మొదటి బిడ్డకు రాముడనీ, రెండవ పిల్లవానికి లక్ష్మణు డనీ నామకరణము చేశారు. మొదటి పిల్ల వాడైన రాముడే, కుళందై యానందస్వామి. రెండవ పిల్లవాడైన లక్ష్మణుని సంతతి - ఇప్పటికీ, మధురలోనూ, బత్తలగుండు అనే చోటులోనూ వున్నారు. త్రిపురసుందరి తాను మొక్కుకొన్న విధముగా రాముని రూపాయలతో సహా మీనాక్షికి సమర్పించినది. పిల్లవాడు ఆలయంలోనే పెరుగ సాగినాడు.

దర్శనార్ధం వచ్చే జనులందరూ, కుళందై ఆనందస్వామిని చూచి ఆశ్చర్యపడేవారు. అతనిని మీనాక్షి బాలకునిగా పరిగణించేవారు. కుళందై ఆనందస్వామికి ఏడో ఏడు రాగా కాశీనుంచి శ్రీగణపతిబ్రహ్మము తగినశిష్యుని అన్వేషిస్తూ మధురకు వచ్చారు. మధుర ఆలయములో ఉన్న కుళందై ఆనందస్వామిని చూడగానే ఆయనను కాశీక్షేత్రానికి తనతోబాటు రమ్మన్నారు. కుళందై ఆనందస్వామి, తన తల్లిదండ్రులకు తాను చేయవలసిన కర్తవ్యమును పూర్తిచేసి కాని రానని చెప్పినందున, గణపతి బ్రహ్మము కూడ మధురలోనే తాత్కాలికముగా స్థిరపడ్డాడు.

కుళందై ఆనందస్వామికి 16వ ఏడు వచ్చినది. ఒకరోజు ఈయన తండ్రి సమయనల్లూరు అనే గ్రామసమీపమున నున్న తన భూములను చూచునిమిత్తము వెళ్ళి తిరిగివచ్చుచుండగా, దస్యుడొకడు ఆయనను హత్య చేసాడు. కుళందై ఆనందస్వామి తండ్రికి చరమకార్యముల పూర్తి చేశారు. ఆయనతల్లి త్రిపుర సుందరి, భర్తతో బాటు సహగమనము చేసినది. అంతటితో కుళందై ఆనందస్వామికి ఐహిక బంధనములు తొలగిపోయినవి. వారు గణపతిబ్రహ్మముతో బాటు కాశీకి వెళ్ళ సిద్ధపడ్డారు.

కాశీక్షేత్రములో, గణపతిబ్రహ్మము వద్ద కుళందై ఆనందస్వామి ఎన్నో యోగరహస్యములు గ్రహించారు. సుమారు రెండువందల సంవత్సరములు ఉత్తరభారతదేశంలో వారు సంచారం చేశారు. హిమాచలసానువుల నున్న టిబెట్టుకు వెళ్ళారు. నేపాళానికి వెళ్ళారు. నేపాళ దేశంలో ఒక రోజు స్నానం చేసి ఉదయం కుళందై ఆనందస్వామి వస్తూండగా, నేపాళ దేశపురాజు అంతఃపురములో, వ్యాధిగ్రస్తుడై మరణావస్థలో ఉన్నట్టు ప్రజలు వారికి తెలిపారు. అంతఃపురమునకు కుళందై ఆనందస్వామి వెళ్ళి తనచేతనున్న గంధపు బెత్తముతో రాజుగారి దేహమును తడమగానే రాజు వ్యాధివిముక్తుడై లేచి కూరుచున్నాడు. రాజు కుళందై ఆనందస్వామికి ప్రణమిల్లి, మీరు కోరినది ఇచ్చుటకు సిద్ధముగా నున్నానని విన్నవించారు. నాకేమీ అక్కలేదు. కానీ సమాధిలో ఉండవలెనని ఇచ్ఛవున్నది గనుక 'ఆరు అడుగుల నేల ఇచ్చినావంటే చాలని' రాజుతో స్వామి బదులుపలికారు. వెంటనే రాజు తన సేవకులతో చెప్పి కుళందై ఆనందస్వామి సమాధి నిమిత్తము ఒక చక్కని ప్రదేశము నిర్మించి ఇచ్చినాడు. ఆ చోట వారు పండ్రెండు ఏళ్ళు కాలము జీవసమాధిలో వుండినారు. అటుపై ఉత్తరభారతంలో మరల సంచరించసాగినారు.

దక్షిణభారతమున సంచరించుకాలమున, తిరువణ్ణమలెలో రెండవమారు చాలాకాలము జీవసమాధిలో నుండినారు. తిరువల్వేలిజిల్లాలో తెన్‌ కాసి అనుచోట మూడవమారు జీవసమాధి అయ్యారు. అచ్చట సమాధికి నెల్లియప్ప సమాధి అని పేరు.

దాదాపు వారు ఉత్తరభారతమున రెండువందల సంవత్సరముల కాలము వసించినారు. పిదప దక్షిణభారతమునకు విజయము చేశారు. ఆంధ్రదేశములో వీరికి త్రిలింగస్వామి అని పేరు. ఇచ్చట వీరు కౌపీనధారులై ఉండేవారు. తంజావూరులో దాదాపు ఇరవై ఏళ్ల కాలముండినారు. మధురలో నలువది ఏండ్ల కాలముండినారు,

వీరి నాలగవసమాధి మధురలో వున్నది. వీరు కడపటి కాలమున రాచపుండుతో బాధపడిరి. కాని వారు దానిని లెక్కచేయలేదు. అలాగే దొర్లాడేవారు. వైద్యులను చికిత్స చేయుటకు అనుమతించలేదు. అంగీరసవర్షము (1932) ఆశ్వీజమాసము శనివారము దశమి శ్రవణానక్షత్రమునాడు సిద్ధి పొందిరి.

కుళందై ఆనందస్వామి కాశీక్షేత్రంలో చాలకాలమున్నారు. అక్కడక్కడ వారు త్రైలింగస్వామియనియే వ్యవహరింపబడ్డారు. వారు నిరంతర మౌనవ్రతధారులుగ యుండేవారు. ఒకపుడు శ్రీరామకృష్ణపరమహంస కాశీక్షేత్రమునకు వెళ్ళిన సందర్భములో త్రైలింగస్వామిని దర్శించారు.

పరమహంసను చూచి స్వామి స్వాగతముగా తనపోడుముపెట్టనిచ్చారు. ఆయనయందు కాశీ విశ్వనాధుడు సజీవముగ ప్రత్యక్షమైనట్లు పరమహంసకు తోచెను. వారికి దేహభావమే యుండెడిది కాదు. ఎండలో మాడిపోవుచున్ననూ, ఇసుకపై అనాయాసముగా స్వామిపండుకొని యుండేవారు.

రామకృష్ణపరమహంస, స్వామిని భగవంతుడు ఒకడా పలువురా? అని ప్రశ్నించిరి. మౌనములో యున్నందున అభినయములద్వారా, స్వామి సమాధిస్థితిలో చూచినపుడు భగవంతుడు ఒక్క డనియు, ద్వంద్వతాదృష్టిలో చూచినపుడు పలువురనియూ ప్రత్యుత్తరమిచ్చారు.

రామకృష్ణపరమహంస స్వామిస్థితి, పరమహంసస్థితియని హృదయనితో చెప్పెను. హృదయుడు రామకృష్ణ పరమహంసకు మేనత్తకుమార్తె పుత్రుడు. త్రైలింగస్వామి అప్పుడు మణికర్ణి కాఘట్టమున నొక స్నానఘట్టము కట్టించుచుండెను. పరమహంస ఆజ్ఞమేరకు హృదయుడు కొన్ని పారలమన్ను త్రవ్వెను. ఇందులకు స్వామి చాలసంతోషించెను. రామకృష్ణపరమహంస స్వామికి పాయసము నిచ్చి సత్కరించెను.

త్రైలింగస్వామినిగూర్చి అనేక గాథలు, అద్భుత చర్యలు ప్రచారంలో వున్నవి. ఆయన ఎంతటి విషాన్నైనా గడగడ త్రాగివేసేవారట. కాశీప్రజలు తరచు చూచే దృశ్యము, స్వామి గంగానదిలో పద్మాసనస్థుడై తేలుతూ వుండటం. కొన్ని రోజులపాటు నీళ్లలో అలాగే వుండిపోయే వారట. అట్లా నీళ్ళలో లేకపోతే, మండుటెండలో, మణికర్ణికా ఘట్టములో దిగంబరులుగా కాలుతున్న మెట్లపై, వెన్నెలలో శయనించివున్నట్టు శయనించి వుండేవారు.

స్వామి మహాత్ములే కాదు, మహాకాయులు కూడ. వారిది బాలస్థూలశరీరం. వారి వయస్సు అంచనా మూడువందలు వేసే వారుకనుక, సంవత్సరమునకు ఒక్క పౌండు చొప్పున బహుశా మూడువందల పౌండ్లు తూగేవారు. ఇంతకూ వారు దాదాపు నిరాహారులే. కొన్ని రోజులపాటు ఆహారం లేకుండా వుండే వారు. ఉపవాసం విరమించిన రోజు విస్తారంగా మజ్జిగ త్రాగే వారట.

ఒకమారు దుష్టు డొకడు వారిని పరీక్షించదలచి, సున్నపునీళ్ళను మజ్జిగ అని తెచ్చి వారిచేత త్రాగించాడట. స్వాములవారు మారు చెప్పక వాడు తెచ్చిన నీటినంతా త్రాగారు. వారు త్రాగిన రెండుమూడు నిముషములకు వీని కడుపులో ఎక్కడలేని మంట పుట్టినది. కుర్రోమొర్రో అంటూ స్వామి పాదాలమీద పడ్డాడు. ''దుష్ఠుడా! నీలోని ప్రాణమూ, నాలోని ప్రాణమూ ఒకటి అని నీవు గ్రహించలేదు. ఇక మీద నైనా జాగ్రత్తగా వుండు'' అని మౌనవ్రతమును వదలి మందలించారట.

త్రైలింగస్వామి ఎప్పుడూ దిగంబరముగా వుండేవారు. వీరి దిగంబరత్వమును చూచి పోలీసువారికి చికాకుపుట్టేది. స్వామిని పోలీసువాడు ఒకరోజు పట్టుకొని జైలులోపెట్టి భద్రంగా తాళంవేసి బైటకువచ్చాడు. వచ్చి వెనుకకు తిరిగి చూడగా స్వాములవారు గదిలో లేరు. జైలుగది మీదనున్న డాబామీద పచారు చేస్తున్నారు. పోలీసువిసిగి స్వాములవారిని క్రిందికి దిగి రమ్మన్నాడు. వారు మారుమాటాడక దిగివచ్చారు. మళ్ళా వారిని గదిలోత్రోసి పోలీ సుబంధించాడు. మళ్ళా పోలీసు వెనుకకు తిరిగిచూస్తే యథాప్రకారం స్వాములవారు గదిలో లేరు; డాబామీద పచారు చేస్తున్నారు. అంతటితో ఇక లాభము లేదని పోలీసు వారిని వదలిపెట్టివేశాడు. వారి దిగంబరత్వం పోలీసువానికి అసహ్యంగా వుండేది. కాని వారేమోనిర్లేవులు. వారికి దిగంబరత్వం, పట్టుదుకూలాలను ధరించినంత హాయిగా వుండేది.

ఒకరికి చాలాకాలముగా కుదరని రోగముండేది. వారు స్వామిని దర్శించారు. చొరవచేసుకొని స్వామి పాదములను గట్టిగా పట్టుకొని వారికి నమస్కరించి లేచారోలేదో వారివ్యాధి అద్భుతముగా నివారణ ఐనది. ఇలాంటి అద్భుతములు జరిగినా, వారేమో తనకేమీ పట్టనట్లు, కర్త ఎవరో ఐనట్లు వుండిపోయేవారు.

ఒకప్పుడు స్వామి తిరునల్వేలి ప్రాంతములో సంచిరించుచున్నప్పుడు మరొక సాధువును కలిసికొని - 'ఏరా నీవు తొమ్మిది తూటులుగల దేహానికి లోబడిన వాడవేకదా?' అని అన్నారు. అందులకు అసాధువు 'మీరుమాత్రం' అని బదులు ప్రశ్న వేశారు. స్వామి 'నన్ను యోనిజుడనియా అనుకొన్నావు? నేను పదవతూటు (రంధ్రము) గుండా వెళ్ళిపోయేవాడిని. అని బదులిచ్చారు.

1930 లో ఒకానొక శిష్యుడు సత్యాగ్రహం చేయబోతూ స్వామివద్దకు చెప్పడానికి వెళ్ళాడు. స్వామి సత్యాగ్రహపు బెదడ అంతా నీ కెందుకు? అని ప్రశ్నించారు. అందుల కతడు 'నేను మీవద్ద ఉత్తరవు కోసం రాలేదు. మీకు చెప్పి పోదామని మాత్రం వచ్చాను.' అని అన్నాడు. స్వామి అపుడన్నారు. నేను పాసీయుద్ధము జరుగుతున్నపుడు సమాధిలో ఉండినాను. తెల్లవాళ్ళు నాచుట్టూ గుండ్లువేస్తూ వచ్చారు. వాళ్లు ఎపుడు మనదేశం వదలి వెళ్లుతారని నీ ఉద్దేశం?'' అందులకు శిష్యుడు, 'మీరే చెప్పండి' అని తప్పుకొన్నాడు. స్వామి '1950 వ సంవత్సరం తానుగా వాడే మూటాముల్లె కట్టుకొని వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళటానికి కారణం నీవు కానీ, నీ గాంధీ కానీ కాదు.' అని బదులు చెప్పారు.

స్వామివారివద్ద పెద్ద శ్రీచక్రముండేది. కానీ దానికి ఒకనాడైనా వారు పూజచేసేవారు కాదు. వారే దేవీస్వరూపులు కనుక వారికి బాహ్యపూజయొక్క అవసరము లేదని మనము అనుకోవాలి.

వారు సాధారణంగా పెసరపప్పుపాయసం తీసుకొనే వారు. ఆపాయసమూ కనీసము రెండు గంటలైనా పక్వం కావాలి. శిష్యుడొకడు పాయసాన్ని తయారు చేసి తన స్నేహితుని కోసం ఒక లోటా ప్రత్యేకంగా వుంచి స్వామి అహరించిన పిదప నీవు పాయసం తీసుకొనేదని అతనితో చెప్పి స్వామివద్దకు మిగతాపాయసమును తెచ్చాడు. 'చేసిన పాయసాన్ని అంతా తెచ్చావా?' అని స్వామి అడిగారు. 'ఆ' అని బదులుచెప్పాడు శిష్యుడు. 'నిజంగానా?' అని మళ్ళా అడిగారు. 'ఈ సందేహమేమి? రోజూ తెచ్చే విధంగానే ఈ రోజూ తెచ్చాను' అని శిష్యుడు తలాయించాడు.' స్వామి పాయసం తీసుకొన్న తర్వాత నీవు తీసుకో అని వాడితో చెప్పి, ఒకలోటా అతని కిచ్చిరాలేదా? చెప్పు' అని స్వామి నిలదీసి అడిగారు. అంతటితో శిష్యుడు నిరుత్తురు డయ్యాడు.

మరొకపుడు పళనిలో స్వాములవారున్నారు. క్షేత్రాటనకోసం వచ్చిన దంపతులు స్వాములవారున్నారు. క్షేత్రాటనకోసం వచ్చిన దంపతులు స్వాములవారిని దర్శించారు. వారిని చూడగానే సంతానం కోసం క్షేత్రాటనము చేస్తున్నట్లున్నది అన్నారు. 'ఔను' అని దంపతులు బదులిచ్చారు. 'నాగప్రతిష్ఠ మొదలైన పరిహారాలు కూడ చేసినట్లున్నది' అని మరలస్వామి అన్నారు. దానికీ వారు ఔనన్నారు. అందులకు స్వామి, 'అదిసరే, నీవు మొదటి భార్యను వదలిపెట్టి, ఈ రెండవ భార్యతో క్షేత్రాటన చేస్తూ పుత్రకామేష్ఠికర్మలు ఎన్ని చేసినా, మొదటి భార్య కడుపు రగులుతూవుంటే, ఈ కర్మలు ఎలా ఫలవంతము లౌతవి?' అని ప్రశ్నించారు. అంతటితో ఆగృహస్థునకు తన తప్పిదం తెలిసింది.

రామకృష్ణయ్యరు అనే ఆయన తిరుపతి వెంకటాచలపతి భక్తుడు. వారి ఇంట ఏడుకొండలవానికై ఒక ఉండియుండేది. దానిలో అప్పుడప్పుడు ఆయన కుటుంబము డబ్బు వేయుట వాడుక. ఒకమారు కుళందై ఆనందస్వామి 'ఆ ఉండిలో వున్న ఫ్ఫాలాని మొత్తము నాకీ' అని అడిగారట. ఉండి తెరచి లోన ఉన్న డబ్బును లెక్కింపగా స్వామి చెప్పిన మొత్తమునకు అందులోని పైకము ఒక్క రూపాయి అధికముగా ఉండెను. రామకృష్ణయ్యరు కుటుంబము వారు - 'స్వామీ మీరు ఉండిలో ఉన్న డబ్బును సరిగా చెప్పలేదు కనుక మీకు ఏలాగు ఇవ్వగలము?' అని అడిగారట. కుళందై ఆనందస్వామి అంతటితో ఆ ఉండిలోని డబ్బును లాగుకొని, ఒక్క రూపాయి దూరముగ విసరివేసి, 'ఈ రూపాయి మీది కాదు' అని అన్నారట. ఇంతలో పక్కింటివారువచ్చి తాము కొన్ని నెలల క్రితము రామకృష్ణయ్య ఉండిలో ఒక రూపాయ వేసినది గుర్తుకు తెచ్చుకొని స్వామి చెప్పినది 'సరే' అని అన్నారట. వెంకటాచలపతి ఉండిలోని డబ్బు స్వామికి సమర్పణ ఐనది.

ఒకరోజు స్వామి వీధిలో తెన్నెమీదకూర్చుని ఉండగ ఆ వూరిలోనే వున్న కుప్పదిబ్బస్వామి వచ్చాడు. కుప్పదిబ్బ స్వామి ఒక సాధువు. అతనిని చూడగానే కుళందై ఆనందస్వామి 'పోరాపో త్రాగుబోతా' అని హాస్యం చేశారు. కుప్పదిబ్బ స్వామి పోతనగారు వర్ణించినట్లు - అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పానవి శేషమత్తుడు. అందులకు కుప్పదిబ్బ స్వామి 'నీ చేతిలోనుండి విభూతి తీసుకొని కానీ ఇక్కడ నుంచీ కదలను' అని భీష్మించుకొని కూరుచున్నాడు. స్వామి ప్రక్కనున్న కఱ్ఱతీసుకొని కుప్పదిబ్బస్వామికి దేహశుద్ధి చేయటం ప్రారంభించారు. ఆ దెబ్బలకు అంతు లేదు. ఇతరులు ఓర్చుకో లేరు. కుప్పదిబ్బస్వామి దెబ్బలు తింటున్నా ఆ చోటువిడిచి కదలలేదు. 'వేయి మరో రెండు దెబ్బలు వేయి' అని పైగా కుప్పదిబ్బస్వామి అంటున్నాడు. కొంతసేపటికి కఱ్ఱదించి ప్రక్కన ఉంచి, తనవిభూతి సంచిలో నుంచి ఒక పిడికెడు విభూతిని తీసి 'ఇదో తీసికో' అని స్వామి అన్నారు. కుప్పదిబ్బస్వామి దానిని తీసుకొంటూ - 'అబ్బ! ఒక మెట్టు ఎక్కినాను' అని వెడలిపోయాడు.

మరోపక్కమారు ఈ కుప్పదిబ్బస్వామి, కుళందై ఆనంద స్వామిని చూచి, ''ఎందుకు ఈ దేహాన్ని ఇట్లా పెంచుతున్నావు నీవు త్రాగే పెసలపప్పు గంజితో ఈ దేహం ఇట్లా వృద్ధి కాగలదా? ఇంత పెద్ద దేహమున్నా, నీమనస్సేమో రాయి. అది శిలాసదృశం. నీవేమో ఉద్ధరిస్తానని నమ్ముకొన్నవారికి పంగనామములు పెట్టి ఒక్కరోజు సడీ చప్పుడూ లేకుండా వెళ్ళి పోతావు. అని నిందాస్తుతి చేశాడు. సిద్ధులు లోకంలో కొంతకాలం సంచిరించి అదృశ్యు లౌతారని కుప్పదిబ్బస్వామి ఉద్దేశ మని కనిపిస్తుంది.

ఒకరోజు, స్వామి నిద్రిస్తుండగా ఒక రైతుపిల్లవచ్చినది. పగలు సుమారు 1-30 గంట. స్వామి లేచేంతవరకూ ఆ పిల్ల కాచుకొని కూచున్నది. ఇంతలో స్వామి నిద్రనుంచి లేచారు. వారితో ఈ అమ్మాయి ప్రసాదం కోసం కాచుకొని వుందని ప్రక్కన ఉన్నవారు చెప్పారు. స్వామి ఆ అమ్మాయి వంక చూడగానే, ఆ అమ్మాయి గ్రహం ఉన్న వాళ్ళు ఆదే విధంగా ఆడసాగింది. అందరూ వేడుకగా చూస్తున్నారు. కొంతసేపటికి స్వామి ఆ అమ్మాయిని చూచి, 'నీ వెవరు.' అని ప్రశ్నించారు. ఆ అమ్మాయి మీదనున్న దెయ్యం - 'నేను కరుప్ప&. పదిసంవత్సరాలుగా ఈ అమ్మాయిని ఆవేశించి వున్నాను. నీవు ఇక్కడ వుండటం నాకు తెలయదు. నాకు ఒళ్ళు ఒకటే మండిపోతున్నది. ఉష్ణం దహిస్తున్నది. నేను వెళ్ళిబోతాను' అని అన్నది. ''ఐతే వెళ్లు'' అని స్వామి అన్నారు. అంతటితో ఆ అమ్మాయి స్వస్థతైనది. ఆ అమ్మాయికి విభూతి ప్రసాదం ఇచ్చి స్వామి పంపారు.

ఒకనికి మహావాక్యోపదేశము కలుగవలెనన్న అతడెంతో పుణ్యము చేసుకొని యుండవలెను, గురువును పండ్రెండు సంవత్సరములు సేవచేసిన వారికి కానీ, మహావాక్యోపదేశ లబ్ధి కలుగదు. ఒకరోజు స్వామి చిన్నప్పను చూచి, వచ్చే పౌర్ణమి నాడు నీకు మహావాక్యోపదేశము చేస్తాను,'' అని సెలవిచ్చారు. చెప్పినవిధముగా పౌర్ణమినాడు చిన్నప్పకు మహావాక్యోపదేశం చేశారు. సాధారణంగా కుళందై ఆనందస్వామి మాటలు చిన్న పిల్లలు మాట్లాడే విధంగా వుండేవి. అంత స్పష్టంగా వుండేవికాదు. ఆరోజు మాత్రం ప్రణవం స్ఫుటంగా ఉచ్చరించారు. స్వామి శిష్యుడు పరశురామ& అనే అతడు తనకు స్వామి ఉపదేశించలేదు కదా అని చింతించినాడు. స్వామి స్నానానికి లేచారు. స్నానం చేస్తూ పరశురాముని చూచి, ఏరా! ఎందుకు చింతిస్తున్నావు! ఉపదేశం నీకు చేయలేదే అనా? ఆ ఉపదేశం నీకు కూడా, నీవూ రోజుకు 108 మార్లు జపం చేస్తూ రా- జపఫలాన్ని విభూతీ అవీ ఇచ్చి వృధా చేసుకోకు -' అని అనుగ్రహించారు.

చిదంబర క్షేత్రం నుంచీ ఒక ధనికుడు సంతానము లేక, స్వామి అనుగ్రహం అర్థించివచ్చాడు. దోషపరిహారానికి ఎంత ధనమైననూ ఖర్చుపెట్టడానికి తయారుగా ఉన్నానని చెప్పు కొన్నాడు. స్వామి ప్రత్యేక పూజ చేయుటకు సమ్మతించారు. కొన్ని రోజులు ఇలా గడిచినవి. చిదంబరం ధనికుడు వెళ్ళి పోవలసిన దినము సమీపిస్తున్నందున స్వామిని హెచ్చరిక చేశాడు. అందులకు స్వామి ''దేనికీ మా అమ్మ ఉత్తరువును అడిగి నీకు విషయం చెబుతాను'' అని అన్నారు. మరుసటి రోజు స్వామి ''అమ్మ ఉత్తరువు ఇవ్వలేదు. నీవు వెళ్ళవచ్చును' అని అన్నారు. చిదంబరం వర్తకుడు ఆశాభంగంతో వెళ్ళి నాడు. అతని ప్రారబ్ధకర్మ బలీయమైనది.

పై చెప్పబడినవన్నీ తమిళ##దేశంలో స్వాములవారున్నపుడు జరిగిన సంఘటనలు. వంగ దేశములోనూ, ఉత్తర భారత దేశములోనూ త్రైలింగస్వామిగ వ్యవహరించినపుడు జరిగిన కొన్ని సంభవములు క్రింద వ్రాయబడుచున్నవి.

స్వామి నర్మదాతీరంలో మార్కండేయ ఆశ్రమములో కొన్ని రోజులు నివసించారు. ఆ ఆశ్రమంలో 'తాకీబాబా' అనే మహనీయుండేవాడు. ఒకరోజు పౌర్ణమి రాత్రి తాకీబాబా నర్మదాతీరంలో ధ్యానమగ్నులై వున్నారు. అర్థరాత్రి కళ్ళు తెరచి చూచారు. ఎదురుగా ప్రవహిస్తున్న నర్మదలో నీళ్ళకు బదులు పాలున్నవి. త్రైలింగస్వామి ఆపాలను తమదోసిళ్ళతో త్రాగుతున్నారు. తాకిబాబా కూడా లేచి పరీక్షిద్దామని నర్మదలో దిగి తమ దోసిలితో పాలను తీసుకొనబోగా, పాలకు బదులు యథాప్రకారం నీళ్లే వచ్చినవి. అంతటితో తాకీబాబా త్రైలింగస్వామి మహత్త్వాన్ని గుర్తించారు.

ఒకరోజు స్వాములవారు తమవాడుక ప్రకారం గంగా తరంగములలో తేలుతున్నారు. అపుడు ఉజ్జయినీ మహారాజు తమవాహ్యాళికి వెళ్లే పడవలో పోతున్నారు. మణికర్ణికా ఘట్టమువద్ద స్వామి తేలుతుండటం చూచి, ఆశ్చర్యపడి తమ సేవకులను వీరెవ్వరు అని అడిగారు. వారు ఆయనొక మహనీయుడని బదులు చెప్పారు. రాజు వారివద్దకు పడవపోనిచ్చి స్వామిని పడవలోనికి రమ్మన్నారు. స్వామి లోనికి వచ్చారు. రాజును పరిశీలనగా చూచారు. రాజువద్ద బ్రిటిషు ప్రభుత్వమువారు ఇచ్చిన ఒక పెద్దకరవాల ముండినది. స్వాములవారు దానిని చూడవలెనని కోరి తీసుకున్నారు; రాజు కరవాలమును ఇచ్చాడు. స్వాములవారు దానిని చూస్తూచూస్తూ వున్నట్టుండి దానిని విసిరి గంగలో పారవేశారు. రాజుగారి కోపము మితిమీరిపోయినది. ఆయన నేత్రములు క్రోధారుణితము లైనవి. ఆకత్తిపై ఆయనకు అంత ప్రేమ. స్వాములవారు రాజును చూచి చిరునవ్వునవ్వి గంగలోనికురికి మళ్ళా పడవలోని కొచ్చారు. వారి చేతులలో ఇపుడు రెండు కరవాలములున్నవి. రెండిటికీ వెంట్రుకవాసి వ్యత్యాసము లేదు. ''ఈ రెండు కత్తులలో నీకత్తి ఏదో తీసుకొని, రెండవదానిని నాకివ్వమని'' స్వామి అన్నారు. రాజుకు ఎంతపరీక్షించినా తనకత్తి ఏదో తెలియలేక పోయినది.

నీ కత్తిని నీవేగుర్తించకపోతే ఆకత్తి నీది ఎలా ఔతుంది? అని ప్రశ్నించి రెంటిలో ఒకకత్తిని రాజుకు ఇచ్చి, రెండవ దానిని గంగలో పారవేశారు రాజు స్వామిని క్షమాభిక్ష వేడుకొన్నాడు.

ఉమాచరణుడు అనే ఆయన స్వామిశిష్యుడు. ఒకరోజు ఈయన ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో శాస్త్రవిచారణ జరుగుతున్నది. ఇంతలో ఆకాశం మేఘావృతమైనది. తుఫాను గాలి వీచడానికి ప్రారంభించినది. ఆశ్రమంలోని సన్యాసులు శాస్త్రవిచారణ కట్టిపెట్టి తమ తమ గదులకు వెళ్ళిపోయారు. ఉమాచరణుడుకూడ వెళ్ళవలెనని ప్రయత్నపడగా స్వాముల వారు అతనిని కూచోమన్నారు. మారుమాటాడక ఉమాచరణుడు కూచున్నాడు. కొంతసేపటికి ప్రబలవర్షం ప్రారంభ##మైనది. వానప్రారంభంకాగానే స్వాములవారు ఉమాచరణుని చూచి 'ఇక నీవు వెళ్లవచ్చును' అని అన్నారు. 'ఈవానలో ఎలా వెళ్ళటమా?'అని ఉమాచరణుడు తటపటాయించాడు. దానిని చూచి స్వామి 'ఇంకా వెళ్ల లేదా' అని మళ్ళా అడిగారు. అంతటితో ఉమాచరణుడు ఆశ్రమం వదలి రోడ్డుపైకి వచ్చాడు. గాడాంధకారం. తనముందు ఎవరో వ్యక్తి లాంతరుతో వెడుతున్నాడు. ఉమాచరణుడు ఆవ్యక్తిని అనుగమించాడు. చిత్రంగా అతనిమీద ఒక్కచుక్కైనా వర్షం పడలేదు. కానీ చుట్టూ ద్రోణవర్షం కురుస్తున్నది. ఇంతలో ఉమాచరణుని ఇల్లువచ్చింది. ముందున్న వ్యక్తి, లాంతరు రెండూ అదృశ్యమైంది. ఇది అంతా తనగురుప్రభావమే అని ఉమాచరణుడు అనుకొన్నాడు.

మరొకరోజు ఉమాచరణుడు ఆశ్రమానికి రాగా స్వామి అతనిని చూచి, ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి, రమ్మన్నారు. ఆలయానికి వెళ్ళిచూస్తే, గర్భగుడిలో అమ్మవారున్న చోటు ఖాళీగావుంది. అమ్మవారి మూర్తి లేదు. ఉమాచరణుడు ఆశ్చర్యపడి ఈ విషయాన్ని స్వామితో విన్నవించాడు. ''ఆలాగా ఐతే అమ్మవారు నిన్ను చూడటానికి ఇక్కడికే వస్తుందిలే'' అని తన మధురకంఠంతో రెండుమార్లు అమ్మా అమ్మా అని పిలిచారు. ఇంతలో వారున్న ప్రదేశం దివ్యజ్యోతితో వెలిగిపోయింది. నవవర్షుక, బాలిక, త్రినయిని వారి ముందు గోచరించింది. ఉమాచరణుడు ఆనందంలో మునిగి పోయినాడు. స్వామి ఆజ్ఞ మేరకు అమ్మవారికి ప్రణమిల్లి లేవగానే ఆమె అదృశ్యమైనది. స్వామి ''ఇపుడు గుడిలో పోయి చూడు.'' అని ఆజ్ఞాపించారు. గుడిలో యథాప్రకారం దేవీ విగ్రహం ఉన్నది. ఉమాచరణుడు ఆ శిలాచైతన్యమూర్తికి నమస్కరించి వెనుతిరిగినాడు.

ఒకరోజు స్వాములవారు కాళికాలయంలో వున్నారు. విజయకృష్ణ అనే ఆయన ఆమార్గము వెంట వెళ్ళుతున్నాడు. స్వాములవారు విగ్రహం ముందు మూత్రించి, మూత్రమును చేతులలో తీసుకొని అమ్మవారిపై చిలకరిస్తున్నారు. విజయకృష్ణకు ఇది గొప్ప అపచారంగా తోచి, మీరు చేస్తున్న దేమి పని అని గద్దించి అడిగారు. స్వామి నవ్వుతూ ''నేను అమ్మకు గంగాభిషేకము చేస్తున్నాను.'' అని సెలవిచ్చారు. విజయకృష్ణ ఈ విషయం భక్తసోదరులతో చెప్పగా వారు - ''ఆయన కాశీ విశ్వేశ్వరుడు. అందుచేత వారి మూత్రం గంగాజలమే సందేహంలేదు.'' అని అన్నారట.

సిద్ధులు ఈశ్వరుని ప్రమధగణంలాంటి వారు. వారి చర్యలు దురూహ్యములు. వారి చరిత్ర అతిగహనము. వారికి వారేసాటి.

కుళందై ఆనందస్వామి లేక త్రైలింగస్వామి జీవిత చరిత్ర మనకు పరమవస్తువు ఒక్కటి వున్నదని సూచిస్తూ బృహదారణ్యక ప్రోక్తమైన -''ఆత్మావా అరే ద్రష్టవ్య శ్శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్యః విజ్ఞానే నేదిగ్‌ం సర్వం విదితం''- అనే ఉపనిషత్సూక్తిని గుర్తుకు తెస్తున్నది.

శ్లో|| యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం

యద్వందనం యచ్ఛ్రవణం యదర్హణం,

లోకస్య సద్యో విధునోతి కల్మషం

తసై#్మ సుభద్ర శ్రవసేన మోనమః.

శ్లో|| తపస్వినో దానపరా యశస్వినో

మనస్వినో మంత్రవిద స్సుమంగళాః,

క్షేమం నవిందంతి వినా యదర్పణం

తసై#్మ సుభద్ర శ్రవసే నమోనమః.

ఓం తత్సత్‌

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page