Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

13. స్వామి అతీంద్రియశక్తి

స్వామివారికి అతీంద్రియశక్తులుండుట అందరికీ తెలిసిన విషయమే. ఈ లోకమందు జరిగేవేకాక పరలోకమందు జరిగేవిషయాలను, స్వాప్నిక విషయాలను ఆయన గ్రహించే వారని కొన్ని దృష్టాంతాలు ఈ క్రింద ఇవ్వబడును.

సుబ్రహ్మణ్యయ్యరు బంధువు ఒకాయన, తనపిల్లవాడు ఇల్లువిడిచి పరుగెత్తి పోయాడనీ అతడు తిరువణ్ణామలెకు వచ్చినాడనీ, వాడు కనపడితే వానిని వెంటనే తనవద్దకు పంపమని ఒక ఉత్తరం వ్రాశాడు. ఆ పిల్లవానిని సుబ్రహ్మణ్యయ్యరు ఏదో విధంగా తిరువణ్ణామలెలో కనిపెట్టారు. అతనిని పిలుచుకొని స్వామివద్దకు రాగా, 'వీనితండ్రి వీడురాగానే వెంటనే పంపమని నీకు ఉత్తరం వ్రాశాడుకదా? నీవు ఎందుకు ఇంకా వీనిని పంపకున్నావు' అని అడిగారట.

శ్రీరంగం సుదరంపిళ్ళె శ్రీమంతుడు. వివాహంకాగానే తిరువణ్ణామలె వచ్చి కొన్ని రోజులుండినాడు. అతని భార్యకు దాదాపు పదివేల రూపాయల కిమ్మతుగల నగలున్నవి. అతని నౌకరుకు ఆ నగలపై ఆశ. అతడు నగలను తస్కరించి, ఇంటి వెనుక మురుగుకాలువ క్రింద గుప్తం చేసి ఎమీ తెలియని వాని వలె మసలినాడు. పిళ్లె ఏమిచేయుటకూ తోచక స్వామి వద్దకు వచ్చాడు. ఆయనతో బాటు దొంగనౌకరు కూడ వచ్చాడు. స్వామి నానిని చూడగానే-' దొంగ వెధవా? నీకు సిగ్గులేదూ? మురుగు కాలవుల క్రింద పెట్టిన నగలన్నీ ఒక్కటి వదలక తెచ్చి ఇయ్యి' అని అన్నారట. వాడు నేరమును ఒప్పుకొనక బింకము చూపినాడు. పోలీసుల దండోపాయంతో ఆ నగలన్నీ స్వయంగా తెచ్చి ఇచ్చినాడు.

ఈ సంఘటన జరిగేదానికి ముందు, స్వామి - అతనిని చూచినపుడంతా, 'నీవు చేతికి బంగారుమురుగులు వేసుకో పోతావా? వ్రేళ్ళకు ఉంగరాలు ధరిస్తావా?' అని అడిగే వారట. స్వామిధోరణి వారికి అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఆనౌకరుచర్య, ఆయనవాక్కును ఋజువు పఱచినది.

తిరువణ్ణామలెకు సమీపంలో శీలైపందిల్‌ అని ఒక గ్రామం. ఆ గ్రామంలో జగదీశయ్యరు అనే ఆయన ఉండేవారు వారి ఇంటిలో దీక్షితులు పూజారి. దీక్షితులంటే అయ్యరుకు గురుభావం. కాని దీక్షితుల సంస్కారం అంత మంచిది కాదు. అయ్యరుపట్ల అతనికి ద్రోహచింతన ఉండేది.

అయ్యరు ఇంటిలో ఎనిమిదిసవరనుల నగ ఒకటి దీక్షితులు దొంగిలించి ఆ ఊరి గ్రామదేవత ఉన్న ఆవరణంలో దాచిపెట్టినాడు. ఇంట్లోని వారు నగకోసం వెదకి వెదకి నిరాశ చేసుకొన్నారు. ఒకరోజు అయ్యరు తన గుఱ్ఱపుబండిలో తిరువణ్ణామలై వచ్చారు. తిరిగి పోతున్నపుడు, అయ్యరును చూచి స్వామి 'ఈ బండిలో నేను రావచ్చునా?' అని అడిగారు. 'దాని కేమి? ధారాళంగా రావచ్చును' అని స్వామిని అయ్యరు బండిలో ఎక్కించుకొన్నారు.

బండి పోతూవుండగా అయ్యరు స్వామికి తన ఇంటిలో జరిగిన దొంగతనం గూర్చి చెప్పుకొన్నారు. స్వామి 'అందుకే కదా నేను రావటం' అని అన్నారు.

శీలై పందిల్‌ చేరగానే స్వామి - నీ ఇంటిలోనే దొంగ ఉన్నాడు. ఇంకేం నీకు కుక్క ఉందికదా? నేను వెళ్ళుతాను' అని బయలు దేరారు. 'ఆరుమైళ్ళదూరం మీరు నడువలేరు నేను బండి పంపుతాను.' అని అయ్యరు చెప్పినా వినక స్వామి విసవిస నడిచివెళ్ళిపోయారు.

జగదీశయ్యరు ఇంటికి వచ్చిన కొంతసేపటికి, ఊరివారు, దీక్షితులవాలకం సందేహంగా వుంది, అతనిని గమనించడం మంచిదని' అప్పుడే అతనిని పిలువనంపి తీవ్రంగా ప్రశ్నించేసరికి అతడు తనదోషాన్ని ఒప్పుకొని దొంగిలించిన నగలను తెచ్చి ఇచ్చి మన్నన వేడుకొన్నాడు.

తిరువణ్ణామలెలో స్వామివారు దాదాపు నలభై ఏళ్ళున్నారు. ఈ కాలంలో శీలై పందిలికి వెళ్లిరావటం తప్ప, ఆయన తిరువణ్ణామలె ఎల్లవిడిచి బయటకు ఎప్పుడు పోయినది లేదు.

ఇక స్వామివారి అనాగతజ్ఞానమును గూర్చి మరికొన్ని ఘట్టములు,

అలుమేలు ప్రసవించి కాయిలాలో ఉండగా స్వామి ఆమె మంచము ప్రక్క కూర్చుండి ఆమె చేతిని తాకినారట. ఆమె భయపడి కేకలు వేసింది. అలుమేలు అన్న నరసింహారావు వచ్చి స్వామిని దూషించినాడు. స్వామి ఏమీ బదులు చెప్పక వెళ్ళిపోయారు. మరునాడు ఎచ్చమ్మ స్వామిని చూచి 'అలుమేలుకు ఒళ్ళు బాగా లేదటనే? నయమవుతుందా?' అని అడిగెను. స్వామి 'అలుమేలు చనిపోయినదని అందరూ చెప్పుకొంటున్నారే?' అన్ని అన్నారట. ఆ రోజు రాత్రియే అలుమేలు గతించింది.

ముత్తుస్వామి మొదలి స్వామికి శిష్యుడు. స్వామిని భక్తితో సేవించేవాడు. అతనిపై అతనిదాయాది ఒక వ్యాజ్యంవేశాడు, 'స్వామీ నాపై వచ్చిన వ్యాజ్యం గతి ఏమిటి అని అడిగాడు. 'నీ కేమి భయం లేదు. వానికి అనుకూలం కాదు' అని స్వామి అన్నారు. అదే విధంగా కేసు మొదలిపక్షంలో నెగ్గింది.

దానితో దాయాది హైకోర్టుకు వెళ్ళాడు. మొదలి మరల స్వామివద్దకు వచ్చి, 'కేసు ఇపుడు హైకోర్టుదాకా వెళ్ళింది' అని అన్నాడు. ' ఆ కేసును ఎప్పుడో త్రోసివేశార¸°్య! నీకు భయం ఎందుకు?' అని అన్నారు స్వామి. హైకోర్టులోకూడ మొదలి పక్షంలోనే నెగ్గింది.

శివప్రకాశం మొదలియారును చూచి ఒకరోజు, స్వామి 'పెద్దమంట అంటుకొన్నది' అని అన్నారు. మొదలికి ఆమాట సరిగా అర్థం కాలేదు. మరుసటిరోజు మొదలికుమార్తె పట్టమ్మ గతించినట్లు వార్త వచ్చింది. పదిరోజులు గడచిన పిదప మొదలి స్వామిని దర్శించారు. 'ఏ వస్తువూ మనం సొంతం అని అనుకోడానికి వీలు లేదు' అని స్వామి అన్నారట.

శ్యామారావుతల్లి వృద్ధు. అపుడపుడు ఆరోగ్యంలో తొందరలు. శ్యామారావు స్వామిని చూచి 'మా అమ్మ చెల్లి పోతుందా?' అని అడిగారు. ''తిరువణ్ణామలెకు టిక్కెట్టు తీసింది. ఇదే కదా తిరువణ్ణామలె?'' అని అన్నారట. శ్యామా రావు 'నాకు అర్థం కావటం లేదు' అని అన్నాడు. స్వామి ఊరకున్నారు.

ఆ రోజు సాయంత్రం ఆమె మరణించింది. మరుసటిదినం దహనం ఐంది. శ్యామారావును చూచినపుడు స్వామి 'ఇపుడు అర్థమయినదా?' అని అడిగారట.

సుందరేశయ్యరు ఐదారు రూపాయలు వెలగల రుద్రాక్షమాలను ధరించి ఒకపుడు స్వామివద్దకు వెళ్ళి నమస్కరించారు. మెడలోని మాలను చూచి స్వామి, 'ఈమాలను అమ్మితే నలుగురికి అన్నం పెట్టవచ్చునే?' అని అన్నారు. 'ఇది ఏమంత వెలగల్గినది కాదు. అమ్మితే రెండు మూడు రూపాయలు కూడ రావు' అని అయ్యరు బదులిచ్చినాడు. మూడు రోజుల పిదప ఆయన తిరుచునాపల్లికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ నదిలో స్నానం చేస్తున్నపుడు మాలజారిపోయి 'నదీనాం సాగరోగతిః' ఐనది.

మరొకమారు ఈ విధంగానే దాసికన్నామ్మాళ్‌ను స్వామి 'జాగ్రత, దొంగరాబోతున్నాడు. దొంగతనం జరుగుతుంది' అని హెచ్చరించారు. కన్నామ్మాళ్‌ ఎంతజాగ్రత్తగా ఉన్నా రెండు వందల రూపాయల నగల దొంగతనము ఆమె ఇంటిలో జరిగినది.

మంగళూరు రఘునాధరావు రామభక్తుడు. స్వామి యందు విశేషమైన భక్తిగలవాడు. ఒకరోజు స్వామిని దర్శించడానికి వెళ్లగా ఒక పెద్దరాయి తీసుకొని స్వామి అతనిని కొట్టవచ్చెను. రఘునాధరావు చలించలేదు. 'ఇదేమి సేతు బంధనమా? సముద్రలంఘనమా?' అని అన్నాడట. స్వామి రాతిని దూరముగా పారవేసి - ''పోపో కోతీ'' అని అన్నారట. ఆ రోజు నుంచి ఆయనకు రఘునాధరావు అన్న పేరు పోయి హనుమంతరావు, మారుతి అన్న పేర్లు వ్యవహారమయింది. దానికి సార్ధకముగా ఆయనకు ఆంజనేయస్వామిపైన భక్తి మరింత వృద్ధి ఐనది.

రామారావు పోస్టాఫీసులో గుమాస్తా, అతని తమ్ముడు తిరుపతిలో సంస్కృతం అభ్యసిస్తూ వున్నాడు. కానీ చదువు ఎక్కేది కాదు. తమ్ముని తిరుపతి నుంచి పిలుచుకొని వచ్చి స్వామి వద్దకు పిలుచుకొని పోయాడు. స్వామి ఆపిల్లవానిని చూడగానే - 'వీడు ఆరునెలలో మృత్యువాత పడుతున్నాడు. ఏమి ప్రయెజనం?' అని అన్నారట. వానికి ఆరునెలల తీరలేదు. చనిపోయాడు పాపం.

నటేశయ్యరును చూచి స్వామి అప్పుడపుడూ 'నీకు నామం వేసుకొన్నకొడుకు పుట్టపోతాడు.' అనే వారట. స్వామి చెప్పిన కొన్ని నెలలకు మూడు నామములు వేసుకొన్నట్లు నల్లరక్తం ప్రవహించే నాళములతో ఒక కుమారుడు అయ్యరుకు కలిగినాడు.

సుందరశాస్త్రి వైదికనిష్ఠాపరుడు. రామభక్తుడు. స్వామి అతనిని చూచి నీకొక సత్పుత్రుడు పుట్టుతాడు. వదలక లలితాసహస్రనామం పారాయణ చేస్తూరా అని అన్నారట. స్వామి అనుగ్రహఫలితంగా శాస్త్రికి స్వామి జన్మనక్షత్రమైన హస్తనక్షత్రంలో పుట్టినాడు. వానికి శాస్త్రి శేషాద్రి అని నామకరణం చేశాడు.

అప్పాచెట్టి అనే ఆయన అరుణాచలేశ్వరునికి ఒక రథం నిర్మించి దాని ఊరేగింపునాడు, స్వామిని ఊరేగింపులో కలసి కొనవలసినదని ప్రార్థించాడు. స్వామి వెంటనే చెట్టితో యిది అల్పయుష్యు. త్వరలో స్వాహా కాబోతుంది. 'దీనికి లక్ష్మి శాపం' అని అన్నారట. చెట్టి ఈ మాటలకు ఖేదపడ్డాడు. స్వామి చెప్పినట్లే మూడేళ్ళ పిదప ఒకరోజు పిడుగుపడి ఆ రథం కాలిపోయింది. కాలుతున్న రథం చూసి స్వామి, 'చూడు, రథం ఎట్లా కాలుతున్నదో? లక్ష్మి శాపం' అని అన్నారట.

మెయ్యప్ప చెట్టియారు అరుణాచలేశ్వరుని ఆలయంలో విద్యుద్దీపాలను అమర్చినాడు. ప్రారంభోత్సవమునాడు చెట్టి స్వామిని ఆహ్వానించగా - ''పోపో. చక్రం తిరుగదు.'' అని అన్నారట. చెట్టియారు దిగులుపడి అలయానికి వెళ్ళితే అక్కడ పనివాళ్ళు విద్యుద్యంత్రాన్ని త్రిప్పలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇక స్వామిని విడిస్తే గతిలేదు. అని మరలావచ్చి బ్రతిమాలినాడు. స్వామి చెట్టి వెంటవచ్చి యంత్రచక్రమును చేతితో తడివి, దానికి సాష్టాంగపడినారట. వెంటనే పెద్ద శబ్దంతో ఆ యంత్రం గడగడ పనిచేయడానికి ప్రారంభించింది.

స్వామి ఒకమారు నారాయణశాస్త్రులను చూచి - 'యేకే చాస్మ త్కు లేజాతా' అని పితృదేవతల నుద్దేశించిన శ్లోకం చదివి 'నీవు సంతకు వెళ్ళినావా? నూరుతమ్ముళ్ళు నూరుసహోదరులు అక్కడ నూరు ఇక్కడ నూరు. ఆ దేశంలో నూరుమంది జనం అంతా కలిపితే ఎంత?' అని అడిగారు. శాస్త్రికి ఈ సంభాషణ అర్థం కాలేదు.

నాలుగు నెలలపిదప శాస్త్రుల ప్రియసహోదరుడు మరణించినాడన్న వార్త వచ్చింది. అప్పటికి కాని అంతరార్థం శాస్త్రికి బోధపడలేదు. ఆ శ్లోకం చదవటంలో - నీ ఆత్మీయుడు మరణిస్తాడన్న భావం ఇమిడి వుంది. నూరు తమ్ముళ్లు - అని అంటే ఆచనిపోయేవాడు నీతమ్ముడు, అని అర్థం. సంతకుపోతావా? అంటే చావుకు సంతవలె జనం కలుస్తారని అర్థం. నూరు అనే మాట చాలమార్లు వాడటంలో - లోకంలో ఉన్న వారందరూ సహోదరులే అనీ - ఎన్నో జన్మలలో ఎంతో మంది మనకు సహోదరులని, ఆత్మీయులు పోయినా శోకించడం అజ్ఞానమనీ భావం. ''గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః'' ఔను మరి.

నారాయణశాస్త్రులు భార్యతో బాటు స్వామిని వెళ్ళి చూచాడు. 'మిమ్ములను ఇరువురినీ చూడాలనుకొంటే మీరు నన్ను త్రోసివేస్తున్నారే?' అని స్వామి అన్నారు. ఈ మాట అర్థం కాలేదు. నీవు మళ్ళా పెళ్ళి చేసుకోబోతున్నావా?' అని నారాయణశాస్త్రిని అడిగారు. ఇది జరిగిన మూడవమాసంలో నారాయణశాస్త్రుల భార్య పాపం గతించినది.

కుమారపెళ్ళె పెళ్ళి చేసుకొని పదేళ్ళు కాపురం చేసినాడు సంతతి లేదు. భార్యచనిపోయింది మళ్ళా రెండో పెళ్ళి చేసుకొన్నాడు. ఆ పిల్లకూడ సంవత్సరం దాటక మునుపే చెల్లి పోయింది. పిళ్లె మూడో పెళ్ళి యత్నంలో ఉన్నాడు.

పొళూరులో ఒకపిల్ల, తిరుక్కోవిలూరులో ఒక పిల్లనూ చూచినాడు. పోళూరు అమ్మాయి అందగత్తె. డబ్బు గల మనిషి. తిరుక్కోవిలూరు పిల్ల బీదది. సాధారణంగా వుంటుంది. పిళ్ళె మనసు పోళూరిపిల్లపైనే మొగ్గింది. కానీ గృహస్థ జీవితం ఇంతవరకు వడిదుడుకులతో నడవడం వల్ల స్వామి సలహా తీసుకొందామని వెళ్లాడు.

''తిరుక్కోయిలూరు కాకిచే చేసుకో అది నిన్ను కాపాడుతుంది. పోళూరు చిలుకను చేసుకొన్నావంటే ఎవరో ఒకరు దానిని పట్టుకొని పోతారు'' అని అన్నారట. పిళ్లె తిరుక్కోవిలూరు అమ్మాయినే వివాహం చేసుకొని భార్యతో సుఖంగా కాపురం చేసినాడు.

ఒక రోజు స్వామి వెంకటసుబ్బయ్యరు ఇంటిలో ఉన్నప్పుడు వుదుచ్చేరి నుండి ఒక ధనికుడైన కుష్ఠురోగిని అతని స్నేహితులు స్వామివద్దకు తీసుకొనివచ్చారు. ఈ వ్యాధికి ఏదైనా మందు చెప్పండి అని ప్రార్థంచారు. స్వామి శ్వాసగంధిని సేవించిన సయంకావచ్చును అని అన్నారు. శ్వాసగంధి ఎక్కడ దొరుకుతుందన్న ప్రశ్నకు గంగానదీ తీరంలో కాశీకి మూడుమైళ్ళ దూరంలో దొరుకుతుందని చెప్పారు. వెంకటసుబ్బయ్యరు వనమూలికలను గూర్చిన గ్రంథము తిరుగవేయగా శ్వాసగంధి Avilable near Benares కాశి సమీపములో దొరుకును అన్న వివరణ చూచి ఆశ్చర్యపోయాడు. ''శ్వాసగంధిని సేవించిననూ, సగము మాత్రము కోలుకోగలడు తక్కిన సగము ఇతడు అనుభవించవలసినదే. ఇతడు కర్మి'' అని స్వామి తర్వాత అన్నారట.

'మీరు కంచిని వదలి తిరువణ్ణామలెలో స్థిరపడితిరికదా? మీకు ఈ మూలిక కాశీలో దొరుకుతుందని ఎట్లా తెలుసును? అన్న ప్రశ్నకు స్వామి జవాబు ఇవ్వలేదు.

సేలం పోలీసు డిపార్టుమెంటులో శేషాద్రిఅయ్యరు అనే ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ప్రప్రధమం ఆయన స్వామికి నమస్కరించగా, 'నీవూ శేషాద్రివి, నేనూ శేషాద్రిని. నీవు రామనామజపం ఎందుకు చేయరాదు?' అని అడిగారట. ఆ రోజు నుంచి శేషాద్రి రామనామజపం చేస్తూ వచ్చారు.

శంకరానందస్వామి అనే ఆయన ఒకరు స్వామివద్దకు వచ్చి 'ఈ ఊరిలో చెట్టియారు కాశీయాత్రికులకు అన్న సదుపాయం చేస్తారటనే నాకొక పదిరోజులకు చీటీలను ఇప్పించండి' అని అడిగారు. 'ఇదొ, ఇపుడే చెట్టి రైలుబండిదిగి స్టేషనులో గుఱ్ఱపుబండి ఎక్కినాడు. నీవు ఆయన ఇంటికి వెళ్ళితే ఆయన నీకు చీటీలిస్తారు'. అని అన్నారట.

త్రోవలో శంకరానందం చెట్టి బండిలో ఇంటికి పోవుట చూచినారు. బండివెంట చెట్టి ఇంటికివెళ్లి ఈ మాట చెప్పగా చెట్టి పదిరోజులకు బదులు సంవత్సరకాలము శంకరానందము నకు అన్ని వసతులను ఏర్పాటు చేసెను.

తిరువెంకట మొదలియారు బంధువులపెండ్లికి పోగా ఆయనకు మూడు లడ్లను ఇచ్చిరి. వానిని తెచ్చి ఆయన అలమారులో జాగ్రత్త చేసినాడు. ఇంతలో స్వామి ఇంటికి వచ్చి 'నాకు లడ్డు ఇస్తావా?' అని అడిగారు. మొదలి స్వామికి ఏది ఇచ్చిననూ అటూ ఇటూ పారవేయనని ఒక లడ్డూమాత్రం తెచ్చి ఇచ్చినాడు. స్వామి దానిని తీసుకొని, ఏమి? ఒకటే తెచ్చినావు? మిగతా రెండు ఎక్కడ?' అని అడిగారు. మిగిలిన లడ్లను కూడ మొదలి స్వామి చేతిలో ఉంచెను. అతడు ఎదురు చూచినట్లే స్వామి లడ్లను ఇటూ అటూ పారవేసి వెళ్ళి పోయిరి.

మరొకమారు కొండపైన గుహలో ఉన్న ఒక సాధువుకు భక్తులు 'మైసూరు పాకు' అనే భక్షణచేసి తెచ్చి ఇచ్చారు. దానిని ఆయన ఒక మూల దాచియుంచెను. ఒక రోజు వాన. స్వామి ఆ వానలో తడుసుకొంటూ గుహకు వెళ్ళినాడు. 'మీవద్ద మైసూరు పాకు ఉన్నదికదూ? మీకు అదంటే ఇష్టమా? నాకు చాల ఇష్టం అని అనిరి. అసాధువు ఆశ్చర్యపడి లోనికి వెళ్ళి కొన్ని భక్ష్యములు స్వామికిచ్చెను.

జయరామ మొదలికి స్వామి అన్నచో ప్రాణమే. సాధారణముగా ఆయన స్వామికి ఆతిథ్యమిచ్చుటకు యత్నించు చుండును. ఒకరోజు చంద్రగ్రహణము. గ్రహణ కాలము పూర్తి అయిన పిదప చాలమంది భక్తులు స్వామికి వివిధములైన ఆహారములను తెచ్చి బలవంత పెట్టుచుండిరి. మొదలి రాగానే స్వామి మొదలిని చూచి, 'నీవు కొంచెము అన్నము, చారు, కందిపప్పు పచ్చడి పట్టుకొనిరా' అని అనిరి. మొదలి ఇంటికి వెళ్లగా అతని భార్య స్వామికోరిన వంటకములే చిత్రముగా చేసి యుండెను. అతడు ఆశ్చర్యపడి స్వామికి తెచ్చి నివేదించెను.

మొదలి భార్య మరొకమారు ఒక లోటా పాలు తెచ్చి స్వామికి నివేదించెను. స్వామి ఆపాలను త్రాగి 'నీవు ఇంటికి వెళ్ళకు. ఇంట్లో పామువచ్చి వుంది. వెళ్ళి నావంటే కరుస్తుంది. అన్ని అన్నారు. మొదలి భార్య ఏమీతోచక అక్కడే చతికిల బడ్డది. కొంతసేపయిన పిదప - 'ఇపుడుపో - పామును చంపివేసినారు'. అని అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళగా ఇరుగుపొరుగు వారు చచ్చిపడివున్న పామును ఆమెకు చూపారు.

ఒకరోజు జయరామమొదలిని చూచి, 'ఒకమామిడి పండు ఉంటే బాగా వుండును' అని అనిరి. 'స్వామీ ఇది కాలంకాదే? మామిడి పండు మందుకుకూడ దొరకదే, పాలు తెచ్చి యిస్తాను త్రాగండి.' అని మొదలి అన్నాడు. ఔను కానీ మామిడిపండును తిన్నపిదప పాలుత్రాగితే బాగా వుంటుంది. పోయి వెదకు. వెదకితే దొరకకపోదు.' అని అన్నారు స్వామి. మొదలి పండ్లదుకాణాలన్నీ గాలించినాడు. ఒక అంగడిలో అబ్బురంగా ఒక్క పండుమాత్రం ఉండినది. దానిని కొని పాలతో సహా మొదలి స్వామివద్దకు వచ్చాడు.

ఒకమారు నడివీధిలో స్వామి పడిపడి సాష్టాంగనమస్కారాలు చేస్తున్నారట. 'స్వామి ఏమి ఇట్లా నమస్కారాలు చేస్తున్నారు. 'స్వామి ఏమి ఇట్లా నమస్కారాలు చేస్తున్నారు.' అని జపం అడిగినారు. ''కంచిలో ఏకామ్రనాథుడు రథం ఎక్కుతున్నాడు. అందుకోసం నమస్కరిస్తున్నా. మీరూ ధారాళంగా ఈశ్వరుణ్ణి సేవించ వచ్చును.'' అని స్వామి బదులు చెప్పారు.

మాణిక్యస్వామిని చూచినప్పుడంతా స్వామి, నిద్ర బోకు. యముడు నిన్ను పట్టుకొనిబోతాడు అని అనేవారు. ఒకరోజు రాత్రి తొమ్మిదిగంటలకే తిన్నెమీద కూరుచుని తూగడానికి ప్రారంభించాడు. కొంతసేపటికి అతనికి ఒక కల వచ్చింది. ఆకలలో యమదూతలు భయంకరాకారములతో అతనికి కనపడ్డారు. వారి యజమాని ఎనుముపై ఎక్కి వస్తున్నాడు. యముడు వారిని పట్టుకో వీరిని పట్టుకో అని పురమాయిస్తున్నాడు. ఇంతలో మాణిక్యస్వామి యముడి కంట్లో పడ్డాడు. ''ఈ సోమరినికూడ బంధించండి'' అని యముడు భటులకు అజ్ఞాపించినాడు. అపుడు మాణిక్యస్వామి, ఎక్కడనుంచో వస్తున్న స్వామిని చూశాడు. ''స్వామీ! మీ శిష్యుడనుకదా రక్షించండి.'' అని స్వామి పాదములు మాణిక్యస్వామి పట్టుకొన్నాడు. స్వామి అతని వీవుతట్టి ''నీవు భయపడకు'' అని ధైర్యం చెప్పారట. ఇంతలో కలమెలకువ ఐంది.

అపుడే స్వామివచ్చి అరుగుమీద కూరుచున్నాడు. ''ఏమి? మాణిక్యస్వామి! యమదూతలు చాలభయకరంగా ఉన్నారా? పట్టుకొనిపోతా మన్నారా? నిద్రపోవద్దని నేను చెప్పలేదూ? నీవు మాటవింటేకదా?'' అని మందలించారట. మాణిక్యస్వామి, ''స్వామీ! బుద్ధివచ్చింది'' అని అన్నాడు. ఆభయంతో పన్నెండుగంటలైన మాణిక్యస్వామి కండ్లు మూయలేదు. ''ఆ! పన్నెండుగంటలైంది. ఇక నిద్రపో'' అని అన్నారు. 'ఊహూ! నేను ఇక నిద్రపోను.' అని మాణిక్యస్వామి. స్వామి నవ్వుతూ 'మంచిది నిద్రపోయేముందు, నన్ను స్మరించి విభూతి పూసుకొని పండుకో. యముడు నిన్ను పట్టుకొనిపోడు.' అని అభయవాక్కులు పలికినారట.

చెంగల్వరాయనికి మహాగణపతిపై భక్తి, స్వామి వద్దనే చాలసేపు గడిపేవాడు. సెలవుతీసుకొని ఇలయనార్‌ గుడికి వెళ్ళి పడుకొన్నాడు. అతనికి ఒక కల.

కలలో పెద్దేనుగు. ఆ ఏనుగు భూనభోంతరాళమునిండి వున్నది. దాని తొండము తాళప్రయాణముగా నున్నది. దాని ప్రక్కన ఒక స్త్రీ మూర్తి. స్వప్నంలోనే చెంగల్వరాయనికి జగన్మాతతో గణపతి దర్శనమిస్తున్నట్లు అనిపించింది. కలలో నుంచి మేల్కొన్న పిదప చెంగల్వరాయడు ఆనందంలో మునిగి నాడు. మరల నిద్రపోవుటకు అతనికి మనస్కరించక, అట్లాగే కాలంగడిపి ఉదయం కాగానే కాలకృత్యాలను దీర్చుకొని స్వామివద్దకు వెళ్ళాడు. స్వామి అతనిని చూడగానే - 'నీవు చూచిన ఏనుగు బ్రహాండంగా ఉందికదూ! తొండం తాటి చెట్టు అంత పెద్ద. దానిమహిమ నీకు తెలుసా? అది 'అణోర ణీయా& మహతో మహీయా&' అని అన్నారట. తన స్వప్న వృత్తాంతము స్వామి అంతవిశదంగా చెప్పుట విని చెంగల్వ రాయుడు ఆశ్చర్యపోయాడు.

సబ్‌రిజిస్ట్రారు సుందరేశం చెట్టికి ఇరువురమ్మయిలు. జానకి, పార్వతి అని వారి పేర్లు. ఇద్దరూ అవివాహితలు. స్వామివద్దకు వస్తూపోతూ వుండేవారు. ఒకరోజు జానకికి కల. పార్వతీ తనూ శివగంగతీర్థంలో స్నానం చేస్తున్నపుడు పార్వతి జారినీటిలోపడి రెండుమునుకలు వేసినదట. స్వామి వచ్చి పార్వతిని గట్టులోనికి లాగివేసిరట. ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగివస్తూ ఉండగా త్రోవలో ఒక పెద్దతొండ జానకిని తరుమసాగింది. స్వామి మళ్లావచ్చి తొండను తోలి జనాకిని సమాధానం చేశారు. తెల్లవారిన పిదప జానకి తన కలను పార్వతికి చెప్పింది. ఇరువురూ కలిసి స్వామిని చూడడానికి వెళ్ళినపుడు జానకినిని చూచి స్వామి- 'శివగంగతీర్థం చాలలోతని నీవు పార్వతిని జాగ్రత్తగా ఉండవలెనని మందలించలేదా? దానిని పట్టుకోవడానికి వచ్చిన యముడె తొండరూపంలో నిన్ను పట్టుకొని పోవాలనిచూచాడు. ఫరవాలేదు. ఇక మీదట భయంలేదు. అని స్వామి అన్నారట.

ఇందువల్ల తన ఆశ్రితులపట్ల స్వామికి ఎంత అప్రమత్తతనో, అనుగ్రహమో, రావలసిన అపమృత్యువును గూర్చి వారు ఎట్లు స్వప్నమూలకంగా తెలియచేసి హెచ్చిరిక చేసే వారో తెలుస్తున్నది.

ఇంతేకాదు. ఇతరుల స్వప్నములను తెలుసుకోవటం ఇతరులకు అట్టిస్వప్నములను కలిగించడం - వీనితో బాటు సూక్ష్మదృష్టి అనగా భౌతికం కాని రూపాలను, అతీంద్రియ శక్తులతో కనిపెట్టేశక్తి స్వామికి కలదనీ, స్వామి దివ్యదృష్టికి అర్చిరాది మార్గములలో ప్రయాణంచేసే జీవకోటి వృత్తాంతాలూ గోచరించేవనీ ఈ క్రింది సన్నివేశములవలన వ్యక్తమవుతున్నది.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page