Sri Tattvamu    Chapters   

అవతారిక

శ్రీతత్త్వమనే ఈ గ్రంథరాజమునకవతారికలో మూడు విషయములు ముచ్చటింతును. మొదటిది గ్రంథ విషయములలో ప్రత్యేక ప్రశస్తి. రెండవది ఈ విషయముల కింకను మెఱుగుపెట్టు నవకాశము. మూడవది ఈశాస్త్రమునే నేటి కాలమున వేరొక దృకృథముతో పరిశీలింపవచ్చునా? అనునవి. గ్రంథకర్త నాకపరిచితుడైనందున నేను నిర్మమతతో నీనాల్గు వాక్యముల రచింతును. స్తోత్రపాఠములు నర్పించుట కాని కైకొనుటకాని నాయుద్దేశము కాదు.

రచననుబట్ట అపరిచితుడగు నీసోదరునియందు గురుదేవతాభక్తి, పవిత్ర ప్రేమ, సత్యజిజ్ఞాన అనుగుణము లభివ్యక్త మగుచున్నవి. సంస్కృతాంధ్రాంగ్లభాషల నీజన్మమున నభ్యసించి మంచిప్రవేశమును గణించివాడు. అనేక జన్మార్జిత సుకృత పరిపాకమున శ్రీవిద్యాసక్తి కల్గినదని పొంగిపోయినాడు. సత్సంప్రదాయలాభమున ధన్యుడనని తలచినాడు. దైవసాక్షాత్కృతి ననుభవించితి ననినాడు. ఇట్టి సుగుణము లొక్కచో రాళీభూతమై శ్రీతత్త్వమును వెలువరించినవి. లేకున్న నీ కాలమున నిట్టి గ్రంథ మెట్లు వెలువడును?

''మణిద్వీపయాత్ర'' అను నొక ''మధురస్వప్నముతో'' నీ గ్రంథము ప్రారంభ##మైనది. తన ''ప్రియురాలి పవిత్రాత్మకు శ్రద్ధాంజలి ఘటించి కడచిన మధరవార్తలను నెమరునకు తెచ్చుకొనుచుండ'', ''అమృతాబ్ధిలో కదంబకాంతారమున యోగినీపరివృత్తమైన శ్రీదేవి'' సాక్షాత్కరించినది. అచ్చట కాలపురుషునిచే అపహరింపబడి శ్రీదేవి కర్పింపబడిన ఒక సుమమును గూర్చి కాలుడను నిందితునిపై గ్రంథకర్త శ్రీదేవికి ఫిర్యాదు చేసెను. ఆమె ఈ సుమమును ధరించుటచే ఫిర్యాది మౌనమున వహించెను. 'ఈమధురస్వప్పమున' ఒక మనోహర కావ్యరూపమున వెలువడి గ్రంథమునకొక నూత్నశోభతో అంకురార్పణ మొనర్చినది. పిమ్మట రెండు భాగములలో బ్రహ్మతత్త్వము విశదీకరింపబడినది.

పిమ్మటి అధ్యాయములో ''షోడశీ-కామకళా'' స్వరూపములు వివరింపబడినవి. ''పరదేవతకు త్రిపురసుందరి యను నామమెట్లు కల్గినది'' ''బ్రహ్మమును స్త్రీరూపమున వర్ణించిరేల'', ''ఆమెకు షోడశీ యను నామాంతర మెట్లు చెల్లినది?'' ''ఆమెను చంద్రునియం దుపాసించుటకు హేతువేమి?'' అను ప్రశ్నములను చక్కగా విమర్శించుచు కామకళాస్వరూపము వివరింపబడినది. పిమ్మట ''మహేశ్వరుని స్వరూపమెట్టిది?'' ''షోడశీ కళాస్వరూప మెట్టిది'' అను విషయములు సవిమర్శముగా పరామర్శింపబడినవి.

అటుపిమ్మట ''శ్రీమాతా - గాయత్రీమాతా'' యను ఖండమున గాయత్రి యొక్క ప్రకట గుప్తరూపములు వివరించబడినవి. 'తదంగముగా సంధ్యాదేవత నెట్టి రూపమున నుపాసింపవలయునో'' అని విమర్శించుచు శైవులు, వైష్ణవులు, బ్రహ్మవిదులు గాయత్రి నుపాసించు విశేష విధానములు నిరూపింపబడినవి. పిమ్మట ఋషి చ్ఛందో మంత్ర జప వివరణము, తత్ఫలము, తురీయగాయత్రీ వివేచనము, పూర్ణగాయత్రి స్వరూపము, తదుపాసన ఫలము, షోడశీ మంత్ర స్వరూపము గాయత్రి సమ్మిశ్రితముగా తదుపాసించు విధము చక్కగా వివరింపబడినవి. ఉపనిసత్తులుమొదలు అధునికులవరకును సంస్కృతాంధ్రములలో పలువురు సాధకుల వాక్యములతో అలంకరింపబడుటచే ఈ గ్రంథకర్త ర్తతనయభీష్టమును సవిమర్శముగసాధించి కృతార్థుడగుటయేగాక జిజ్ఞాసువులకును పరమోపకారియాయెనునుటలోసందేహము లేదు. ఇక రెండవ అంశము.

ఉపాసకులకు ప్రథమతత్వము శివుడు. అతడు సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహాత్మక పంచకృత్యవిధాత. పృథిని చరమతత్వము. శివాది క్షిత్యంత షట్త్రింశత్తత్వ కదంబము వారి పరిధి. దేవత, తత్వసందోహరూప - ఆత్మగురు దేవతా యంత్ర మంత్రా భేదభావన ముపాసనము - తదుపాసనా దార్ఢ్యము. సిద్ధి. ప్రథమతత్వము జ్ఞానరూపము - చరమతత్వము క్రియారూపము - జ్ఞానక్రియలకు పరమార్థభేదము లేదు - గృహీత కఠినత్వగుణమగు జ్ఞానము క్రియ - విరళిమాశ్రయమగు క్రియ జ్ఞానము - శివాది క్షిత్యంతము ప్రవృత్తిమార్గము - క్షిత్యాది శివాంతము నివృత్తిరూపము - స్వాంతర్జగత్కలన మీశ్వరలక్షణము - బాహ్యజగత్కలనము జీవచిహ్నము. ఉపాసనాదార్ఢ్యమున జీవుడు శివత్వమునొందును. ప్రవృత్తినివృత్తు లతని విలాస విహారము అని ఉపాసకులు వివరించిరి. ఈ భావముల సాధించుటకు ప్రాచీనులు పరిణామ వాదమును స్వీకరించిరి. నేటి అరవిందులును మాయావాదమును విమర్శించిరి.

సత్యమో అసత్యమోకాని ఉపాసకులకొక తత్వసిద్ధాంతమున్నది తదితరులకువలెనే! ఆ సిద్ధాంతము ననుసరించియే ఆ శాస్త్రమర్యాద నడువవలయును. అట్టి సూత్ర మొకటి అనున్యూతమై ఈ రచనయందున్నదా? అని సందేహము, 37-వ పేజిలో 'ఆత్మసత్తు' ప్రపంచము 'అసత్తు' అనియు - 26-వ పేజీలో 'ప్రపంచ మసత్యమనెడి బుద్ధిని విడువవలయును' అను వాక్యాదు లిట్టి సందేహమును కూర్చుచున్నవి.

అటులనే సంస్కృతశ్లోకముల వివరించు సందర్భమున మఱికొంత ఎక్కువ శ్రద్ధ చూపవలయునేమో? చూడుడు!

2-వ పేజీ శివునికంటే వేరయిన యేవురు శివశక్తుల తోడను etc 'చతుర్భిః శ్రీకంఠైః' అనునది వివరింపబడలేదు.

33-వ పేజీ 'మధ్యమ వికాసాచ్చిదానందలాభో భవితి' ఇది శివసూత్రము కాదేమో! శక్తిసూత్రము. వివరణము వేరొక విధమున నున్నదేమో!

55-వ పేజీ ఆరోహావరోహి క్రమముల సరిగా నిర్వచింపబడినవా?

సరియే, ఈ చిన్నవిచారణములకేమిగాని, ఇట్టి ఉదాత్త గ్రంథమున వీలయినంతవఱకు విషయమునకే ప్రాముఖ్యమిచ్చి వ్యక్తుల నామధేయాదులు తగ్గించుట గ్రంథమున కధికశోభాదాయకమగునేమో యని భావము.

మూడవ అంశము :-

విశ్వమంతయు శక్తిమయమని దివ్యదృష్టితో నాశ్చర్యకరముగ మహర్షులు మంత్రద్రష్టలు ననేక వేల సంవత్సరముల క్రిందటనే గ్రహించి తదుపాసనా విధానమును మానవజాతికి దయామయులై అందిచ్చిరి. బ్రహ్మమునందు చైతన్యరూపమున నున్న ఆ శక్తియే పరిమాణువునందును క్రియారూపముననున్నదని ప్రకృతిశాస్త్రవేత్తలు నేడు బాహ్యసాధనసంపత్తితో గుర్తించిరి. ప్రాచీను లాంతరమున దర్శించిరి. ఆధుని కులు బాహ్యమున దర్శించిరి. కనుక విశ్మమును శక్తిమయముగ దర్శించిన మన శాస్త్రమునకును, ఆధునిక భౌతిక తత్త్వ శాస్త్రమునకును కల సంబంధ బాంధవ్యము లెట్టివి? అను దృష్టితో విమర్శించుటయు బ్రహ్మచింతన మగునేమో!

"Supersonic vibrations were first used for practical purposes in France. Especially note worthy in this connection are the works of acadenician Langevin-" ఫ్రాన్సు మొదలగు దేశములలో నాదస్పందములను ప్రత్యక్షకార్యముల సాధించుట కుపయోగించుచున్నారట. భారతదేశములో మహర్షులు మంత్ర శక్తితో నిట్టిఘనకార్యముల నెన్నటినుండియోసాధించుచున్నారు.

కనుక నీయుపాసన మొక మూఢవిశ్వాసము కాదనియు ప్రత్యక్షఫలదమగు నొక శాస్త్రమనియు పాశ్చాత్యులును అంగీకరించుచుండ మనము వారి విజ్ఞానముతో మన శాస్త్రమును పోల్చి చూచుకొనుట అధిక ఫలప్రదమగునేమో! పరతత్వమునుండి శబ్దార్థరూపమున సృష్టి వెలువడిన దనినచో పరా పశ్యంతీ మధ్యమానస్థలను దాటిపంచాశద్వర్ణరూపమున వైఖరీవాక్కు శబ్దరూపమున ప్రసరించినదనియు అటులనే అర్థసృష్టియు శుద్ధమశ్ర జడతత్వరూపమున వెలువడినదనియు స్ఫురించును. అట్టియెడ శబ్దవిశేషము అర్థవిశేషమునకు వాచకమే కాక సాధనమును కాగలదు. కనుక ఒకానొక నాదో చ్చారణమున కల్గిన నొకానొకస్పందవిశేష మొకానొక తత్త్వమును స్పందింపజేయును. కనుక మంత్రము కొన్ని నాదముల సముదాయమగుటచే కొన్ని తత్త్వముల నొకానొక క్రమమున స్పందింపచేసి ఫలసిద్ధిని కూర్చును. కునుకనే ''మంత్రో హీనః స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్తో సతమర్థ మాహ సవాగ్యజ్రో యజమానం హినస్తి'' అన్నారు. కనుకనే మంత్రములు H20 (water) వంటి formulaeల వంటివి. కార్యసిద్ధికి ప్రతిబంధకము లేవో గుర్తించి తొలగించుకొనినచో నవి సఫలములు కాక తప్పదు.

ఇట్టి దృక్పథముతో పరిశీలించినచో కామకళారూపము ..... (therefore) వంటి అర్థములేకాక శాస్త్రసిద్ధములగు సగాధార్థరత్నములు గోచరించును. ఇది యొక మానవునికి సాధ్యమగు కృత్యము కాదు. పరిశోధనకు లెందరో ఎంత కాలమో శ్రమపడి పరిశోధనచేయవలసిన విషయము. 'ప్రథమ బిందువు' నిష్పందమగు తత్వమును అనగా షట్త్రింశతత్వములలో శుద్ధతత్వములను 'విసర్గము' సృష్ట్యున్ముఖమగు మిశ్రతత్వములు శబ్దార్థరూపమున విభాగము నొందు నవస్థను ''పిమ్మటి భాగము' కేవలము జడరూపముగానున్న అశుద్ధతత్వములను నిరూపించుచు ''పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్వామృతందివి'' అను వాక్యమును వివరించుచు విశ్వము నంతటిని విశ్వాతీతునికూడ కామకళ నిరూపించుచున్నదనిన దోషమా!

ఏమైన నేమి? అనేక మహాత్ములీ దివ్వ శాస్త్రమును పరిశోధించుచున్నారు. ఎవరి కెట్టి రత్నములు లభించునో! ఇట్టి ఉద్యమమునకు ప్రచారమిచ్చిన ఈ గ్రంథకర్తకు నా ధన్యవాదములు నా వాక్యములు ఉపస్కారములైన ''నందంతు లేకున్న ''నిందంతువా'' శుభం భూయాత్‌-

నరసరావుపేట తూములూరు శివరామకృష్ణమూర్తి

20-8-63 ఎం.ఏ.,

Sri Tattvamu    Chapters