Sri Tattvamu    Chapters   

శ్రీతత్త్వము

మణిద్వీపయాత్ర - ఒక మధుర స్వప్నము

శ్లో|| శివఃశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్‌

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి,

అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి

ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ||

- సౌందర్యలహరి.

రాజరాజేశ్వరీ! జగన్నిర్మాణ శక్తి సంపన్నుఁడగుటచే నీశ్వరుఁడును సృష్టి స్థితి లయములఁ. జేయఁజాలు చున్నాఁడు. కానిచో నణుమాత్రము కదలనుంజాలఁడు. కనుక పూర్వజన్మ సుకృతము లేనిచో హరిహరబ్రహ్మాదులకును బూజ్యవైన నిన్ను స్తుతించుటకుఁగాని మ్రొక్కుటకుఁగాని జీవున కర్హతకల్గదు.

విళంచి కార్తికబహుళైకాదశి నా యీ జీవతమునందత్యంత పుణ్యదినము. నాప్రేమనిధానము నా యాధ్యాత్మిక యాత్రాసహచరి కమల శ్రీమాత్రంకమున నొకచో శాశ్వత స్థానము గడించుకొన్నది నాఁడే.

ఈ కార్తికబహుళైకాదశి (3-12-61) ఆ పవిత్రాత్మకు శ్రద్ధాంజలి ఘటించి కడచిన మధురవార్తలను నెమరునకు దెచ్చికొనుచు శయనించితని.

అంతలోనే కన్నులరమోడ్పులైనవి. ఒడలు సడలినది. ఒక యలైకికశక్తి చేయూఁత నిచ్చినది. స్వప్న జగత్తునందడుగిడితిని. అచటి కొన్ని మధురదృశ్యములివి.

అది యమృతాబ్ధి. దాని నడుమ ననంత ఖద్యోత మయూఖప్రభాభాసమానము మణిద్వీపము. అందు నిఖిల బృందారకబృందజయజయధ్వానసంకలితము, సనకసనందనాది మహాయోగిగణసేవ్యమానము, పావనము, కందంబవనము.

అందు మలయానిల ప్రకంపిత పారిజాత ముఖపరిమళ ప్రసూన సురభిళకుంజపుంజములు, తదంతికమున యక్షగంధర్వకిన్నర కింపురుష సిద్ధ సాధ్య మిథున నృత్తగీతగోష్ఠి. దిఙ్మండలము మత్తపరభృత "కుహూ కుహూ' నినాదసంభరితము.

ఆహా! ఆహ్లాదకరము; తాపహరము; ఆ కదంబకాన్తారము. అందు అంబరచుంబిసౌధరాజవిరాజమాన మొక మహానగరము. తదంతరమున సహస్రనయోజనాయమోన్నత మొక యసమాన మహాసౌధము. తన్మధ్యమున నొక నవరత్నఖచిత సంహాసన, మది బాభానుదీప్త కనక పరికల్పితము.

సప్తర్షులు, అష్టదిక్పాలురు వినయవినమితోత్తమాంగులై నమోవాకములు పలుకుచు పరివేష్ఠించి యుండిరి.

మహాచతుఃషష్టికోటియోగినీవ్రాతము,

శ్లో|| చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి

ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః,

చతుశ్చత్వారిఒంశద్వనుదళకలాశ్రత్రివలయ

త్రిరేఖాభిః సార్థం తవ శరణకోణాఃపరిణతాః ||

--- సౌందర్యలహరి.

శివునికంటె వేఱయిన యేవురు శివశక్తులతోనైన తొమ్మిది మూలప్రకృతులన చేతను, అష్టదళ, షోడశదళ, త్రివలయ త్రిరేఖలతోను, నీ నిలయమైన శ్రీ చక్రము నలువదినాల్గు కోణములు కలది. శ్రీచక్రము త్రికోణ, అష్టకోణ, దశకోణ ద్వయ, చతుర్దశారము లనెడి యైదు శక్తిచక్రములతోను, బిందు. అష్టదళ, షోడశదళ, చతురశ్రములనెడి నాల్గు శివచక్రములతోను గూడి నవచక్రాత్మకమై శివశక్తుభయరూపమున వెలయుచున్నది.

ఓహో! ఇది శ్రీచక్రరాజము. శతయోజనాయామము. వివిధావన్నివారణము. ఇష్టావూర్తాది విశిష్టకర్మ ఫలదము. భక్తాభీష్టప్రదము. బిందుపీఠోపేతము.

అట ధనుర్బాణపాశాంకుశపాణి, అమ్మ, శ్రీచక్రరాజనియల, శ్రీరాజరాజేశ్వరీదేవి. 1. పంచమీ. 2. దండనాథా, 3. సంకేతా 4. సమయేశ్వరీ 5. సమయసంకేతా 6. వారాహ 7. పోత్తిణీ 8. శివా 9. వార్తాళీ 10. మహాసేనానీ 11. ఆజ్ఞా చక్రేశ్వరీ 12. ఆరింధినీ నామ ద్వాదశదండనాధాపరివృత.

1. సంగీతయోగినీ 2. శ్యామా 3. శ్యామలా 4. మంత్రనాయికా 5. మంత్రిణీ 6. సచివేశానీ 7. ప్రధానేశీ 8. కుశప్రియా 9. వీణావతీ 10. వైణికీ 11. ముద్రిణీ 12. ప్రియక ప్రియా 13. నీపప్రియా 14. కదంబవేశ్యా 15. కదంబవనవాసినీ 16. సదామలా నామలైన షోడశమంత్రిణులచే పరిసేవిత.

చంద్రకళాధర, సర్వామ్నాయ నివాసిని, మా యమ్మ, శ్రీ మహాత్రిపురసుందరి నిండుకొలువైయున్నది.

ఇదిగో, ఇచట వైతాళికుల హెచ్చరికలు; అదిగో, అచట వందిమాగధుల జయధ్వానములు.

''తాం తక కిటత ధిమిత కిటత ఝణత కిటత, తక దధిగిణతోం, తద్ధి త్వం, తద్ధి త్వం, తద్ధి త్వం'' అను గంధర్వ మిథున నృత్తవినోదము.

అదే అమ్మ చెంగట భారతీదేవి సుఖాసీనయై మా శ్రియానంద గురుదేవుల దేవీసూక్త పరమార్థము, రాజవిద్యా గీతావ్యాఖ్యానము వినుచున్నది. అమ్మ చిఱునవ్వుతో విను చానందించు చున్నది. బ్రహ్మేంద్రాదులు తదేకచిత్తులై తనియుచున్నారు.

అంతలో "భోం భోం భోం' అను శ్రవణపేయ శంఖారావము. సకలగణపరివృతుఁడై వాసుదేవుఁడు వాకిట నిలిచినాడు.

కొలువువారు దిగ్గనలేచి యమ్మకు వినయవినమితో త్తమాంగులై మ్రొక్కుచున్నారు. అమ్మ అభ్యుత్థానము చేయ నిలిచినది, నడచినది.

చెలికత్తెలు- ""కిరీటం వైరించం పరిహర పురఃకైటభ భిదః కఠోరే కోటీరేస్ఖలసి, జహి జంభారిమకుటమ్‌ ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవసప్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే ||

--- సౌందర్యలహరి.

అమ్మా! ఇది కమలభవుని కిరీటము. తొలఁగి రమ్ము ఇదె కమలనాభుని మకుటము. రత్నఖచితము. కాల్జాఱును సుమా; లేజివురులు బోలు నీ మృదుపాదాంగుళి ముఖముల నెత్తురు చిందగలదు. ఇది యింద్రుని కోటీరము. తప్పుకొమ్ము అని మార్గచోదనము చేయుచున్నారు.

ఇంతలో దానే సమీపించినా డాయుమానాథుడు. చాల డస్సినాడు. పాపము పాశుపతలబ్ధి నుద్దేశించి పోరిన పార్థుని శరవేధబాధ శమింపలేదేమో! నాడు సముద్రమథనావసరమున "స్వాహా' చేసిన కరాళ##క్ష్వేళము కంఠగతముగానే యుండి మాటాడనీయ లేదేమో! పలుకడు; ఉలుకడు. అమ్మ మోకాళ్ళబడి యర్పించిన మ్రొక్కులకు బ్రతిగా ఆశీర్వచన మైన లేదు.

ఏమని యాశీర్వదింపఁగలఁడు! తన విభుత్వ మమ్మచేతిది.తనకు ను సేవ్య.

"శివుఁడు శక్తిని నిన్నుఁగూడినపుడే చెల్లున్విశభుత్వమ్ము; శక్తివియుక్తి గదలంగనైనఁగలఁడే దేవుండె కానిమ్ము' అని మాశ్రీశ్రియానందనాథులు శ్రీ శంకరస్తుతి ననువదింపలేదా?

శ్లో|| సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం

విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః,

కరాళం యత్‌క్ష్వేలం కబలితవతః కాలకలనా

న శంభో స్తన్మూలం జనని తవ తాటంకమహిమా||

అమృతము నానిరైనను బ్రహ్మేంద్రాది సురలు ప్రలయకాలమున విపత్తికి లోనగుట తప్పదు. జగజ్జననీ! సృష్టి స్థితికర్తృత్వము నీశక్తి. తన మృత్యుంజయత్వము నీచెవికమ్మల మహిమతోడిది కదా! శివుడు నిన్నేమని యాశీర్వదించును?

అమ్మ మకుటాగ్రసీమనుండి కళానాథుడు శీతలకరస్పర్శముచే భవుని సేదదేర్చినాఁడు. "మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా' అమ్మ చిఱునవ్వొలకించినది. ఆ నగవు వెన్నెలలో మునిగినాడు శివుడు; ప్రసన్నుఁడైనాడు.

శ్లో|| ''నమః శివాభ్యాం నవ¸°వనాభ్యాం

పరస్వరాశ్లిష్ట వపుర్థరాభ్యామ్‌,

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్‌''

అని దేవగణము స్తుతినమస్కారములు చేయుచున్నది.

శ్లో|| ''అంభోధరశ్యామలకుంతలాయై

తటిత్‌ ప్రభాతామ్రజటాధరాయ,

నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ

నమః శివాయై చ నమః శివాయ|| ''

అని యక్ష గంధర్వ కిన్నర కింపురుషమిథునములు లయతాళయుత లాస్యనాట్యములు చేయుచున్నవి.

ఇంతట నొక నీలజీమూతనిభకాయుడు దంష్ట్రాకరాళుడు, ఆరక్తలోచనుడు కాలపురుషుడు కానోవు. ఔను! అతఁడే ఆతని యంసాగ్రమున పాశము. సందేహమేమి? కాలపురుషుఁడే. దోసిట మందార సంతాన సుమపుంజమున ఒక యపూర్వపరిమళ సంభరిత సుమనోరాజమును గుప్తముచేసి, ఒదిగి దొంగచాటుగా, అమ్మ యడుగుదోయిచెంతజేరి,

శ్లో|| పురందర జలాధిపాంతక కుబేర రక్షోహర

ప్రభంజన ధనంజయ ప్రభృతి వంనానందితే |

ప్రవాళపదపీఠికా నికట నిత్యవర్తిస్వభూ

విరించి విహితస్తుతే విహిత ఏష పుష్పాంజలిః ||

అని పూవులతో బూజించునంతలో - దొంగ, దొంగ, పట్టుకొనుఁడు, పట్టుకొనుఁడు; కట్టుడు, కట్టుడు, అనియెలుగెత్తి యఱచితిని. ఆ కోలాహలములో నాగోడు వినువారెవ్వరు? ఆ యానందమయవేళ, ఆ సభాంగణమున నిందితుఁడు కాలుఁడు; ఫిర్యాదిని నేను; ఇరువురము మాత్రమే వ్యగ్రహృదయులము; కలుషపూరితులము; ద్వేషరాగాశ్లిష్టులము; చింతాక్రాంతులము.

అర్పితవస్తువు స్వీకరింపబడుదాక, దేవి యాశీస్సులనందుకొనుదాక, మనఃశాంతిలేదు. భయాందోళములు తప్పవు.

శ్లో|| కంజాననాది సురబృంద లసత్కిరీట

కోటి ప్రఘర్షణ సముజ్జ్వలదంఘ్రీపీఠే,

త్వామేవ యామి శరణం విగతాన్యభావం

దీనం విలోకయ దయార్ద్రవిలోకనేన ||

అని దండవత్ప్రణామము చుసినాఁడు దండధరుడు. అమ్మ దయార్ద్రచిత్త. ఈషదవనతయై పదపీఠార్పితమైన యా నవ్యకుసుమము నాలోకించినది. అపుడామెకిరీటమణిద్యుతులలో నా పూవు ప్రతిఫలించినది. కళానాథుడు కన్నెఱ్ఱచేసెను.

ఇది నా కుటుంబోద్యానమున బుట్టి విడిన పూవమ్మా! ఇతడు రేజీకటిలో దొంగిలించి తెచ్చి యిపుడిచట నర్పించినాఁడమ్మా! నాటి మార్కండేయ ప్రాణహరణ సందర్భమున పరమశివుని వామపాదతాడనము స్మృతికి రాగా, ఈలాగున సభాంగణమున నొదిగి యొదిగి, పరమశివునిక గనుమఱుగై యదనుచూచి కొలువువారెల్లరు నృత్యగాన తత్పరులై యానందాతిరేకమున మేనులు మఱచియుండ జూచి నీకర్పించినాఁడమ్మా! దొంగదినసు స్వీకరింతువా? తల్లీ! అని ఫిర్యాదు చేసితిని.

నృత్యగీత సంరంభము లాగినవి. స్తోత్రపాఠములు నిల్చినవి. అంతటను నిశ్శబ్దము. చీమ చిలుకుమనినను విన్పించునంతటి ప్రశాంతవాతావరణము.

1. నేరగాడు. 2. ఫిర్యాది. 3. అమ్మ.

అనిమిషులు సనిమేషులయిరి.

''శివే! శరణ్య! శరణాగతవత్సలే! ధర్మాధారే! అవధారయ. న్యాయభిక్షాం దేహి'' అని మఱియొకపఱి బద్ధాంజలినై యర్థించితిని. సకరుణముగా కృపాపాంగములనాలోకించి యమ్మతల పంకించినది. సవిలాసముగా కెంగేలనా నవ్యకుసుమమును చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచమున గూర్చినది సజీవమైనది సభాస్థలి.

శ్లో|| ''అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతమ్‌,

దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజమ్‌.''

అని మహాచతుష్షష్టికోటి యోగినీవ్రాతము ముక్తకంఠముతో గీర్తించినది.

శ్లో|| ''నమస్తే దేవదేవేశి నమస్తే హరపూజితే,

బ్రహ్మవిద్యాస్వరూపాయైతసై#్య నిత్యం నమోనమః''

అని దేవర్షమహర్షి గణములు స్తుతించినవి.

హతభాగ్యుడను నిశ్చేష్టుడనై తల వాంచి యొకచోనొదిగి నిల్చితిని. కొండొకవడి స్వస్థుడనై అమ్మను బిగ్గబిలిచితిని.

1. శ్రీ మేరుతుంగమణి శృంగవిరాజమాన శ్రీచక్రబిందు

గ్రహలక్షిత సుందరాంఘ్రే !

2. భక్తార్తిభంజన ధురీణ గుణప్రధాన శింజాన మంజు

మణి నూపుర రంజితాంఘ్రే!

3. వైకుంఠ ధాతృ శితికంఠ పురందరాది కోటీరకోటిమణి

భూషణ కోమలాంఘ్రే!

4. కామేశ దివ్య కరపంకజలాలనీయకైవల్యకల్పకళలోపమ

శోభనాంఘ్రే!

5. తాపత్రయాంధ తిమిరోద్ధరణప్రవీణ చంద్రాతపోనమ

నఖాంశుసముజ్జ్వలాంఘ్రే!

6. కుంభోద్భవ ప్రభృతి యోగివరేణ్యబృంద స్వచ్ఛాంతరంగ

మణిమందిర భానురాంఘ్రే!

7. ప్రాగ్జన్మకోటి సముపార్జిత పుణ్యజాల దృశ్యానపద్య

కరుణాస్పద దివ్యమూర్తే!

8. పాదాబ్జ భక్తజన కల్మషతూలజాల కాలాగ్నిరూప నిజ

నామజప ప్రభావే!

9. వందారుబృందసచ్చిదానంద సౌఖ్యప్రద

దివ్యనామాంకితే!

10. శరణాగతరక్షణ ధురంధర బిరుదాంకితే! సంకేతశ్యామలా హితాంతికే! శ్రీలలితావరాభట్టారికాంబ!

శ్రీ మహాత్రిపురసుందరీ! జయ, విజయీభవ.

---- వేంకటదీక్షితులు.

''స్తోత్రప్రియ, నామసారాయణప్రీత'' అమ్మ. అమ్మసంక్రమించినదే సమస్తదేవదానవగణములనకు నీస్తోత్ర ప్రియత్వము. పరవశులై యొడలు మఱచి యడుగుటే తడవుగా నిచ్చుటయు ఆపైని తమ యునికికే హాని తెచ్చికొంటయు మన మెఱిగినదే. స్తోత్రప్రియత్వముతో బాటు మనకు లంచగొండితనము అను క్రొత్తవిషయము దేవతలకన్న మిన్నగా సంక్రమించినది. స్వార్థమునకు జీవనభృతికి ననుకూలఫల ప్రదములుగావుట నీ రెండిటి వారసత్వమును స్థిరపఱచికొన్నాము. తక్కు విషయములయెడ శ్రద్ధ చూడము. ఇది దుర్భాగ్యఫలమనెడి మహానీయుల చేరువకు జనము, మన చెంత వారిని జేరనీయము.

ప్రసన్నహృదయ వదనములతో ప్రశ్నార్థకముగా, అమ్మ నాయెడ చూపు సాలించినది.

శ్లో|| ''అవేద్యతామవిదితం కిమథాప్యనుక్తం

వక్తవ్య మాంతరరుజోపశమాయ నాలమ్‌,

ఇత్యర్థసే కిమపి త్వచ్ఛ్రవణ నిధాతుం

మాతః ప్రసీద మలయధ్వజ పాండ్యకన్యే''

--- నీలకంఠదీక్షితులు.

ఔను; తల్లీ! నీకు దెలియని నూతనవిసయమును జెప్పెదనా? అయినను జెప్పవలసినది చెప్పకున్నచో, అంతరమును గలంచు బాధశమింపదు. నాయెడ బ్రసన్నవై యొక్కింత చెవి యొగ్గుము.

గరళము త్రాగియు నీభర్తనీ చెవికమ్మల మహిమచేతనే విపన్నుఁడు కాలేదు. ఆసపడి మక్కువతో రావించు కొని యాదరమున గొప్పున ముడిచికొన్న దివ్యసౌరభ సంభరితము ఆ సమురాజము. అట నున్నంతకాలము నీ సిగపూ వాడదు.

అబ్బా! ఎంతమాట యంటివి! ఆయాసపడకు తల్లీ! క్షమింపుము, కమలయందలి ప్రేమాతిశయమున, అమ్మనే యుపాలంభించితిని, నా యీ దుడుకుఁదనము, నీ యనుగ్రహమున, నీ పుత్రస్నేహమున శుభాశీః సంపాదనమున కగుగాక.

మా యింద్రకీలాద్రివాసిని రాజ్యలక్ష్మివి గదా కొంత చొఱవ చేసికొని, మన యత్యంత సన్నిహితత్వము నవకాశముగా గొని, అంతరరుజోవశాంతి నొక్కింత చేసికొంటిని. ఆయాసపడకు తల్లీ!

నీ యనుంగు బిడ్డడు నా గురుదేవుడు శ్రీశ్రీయానందనాథుఁడు, జరాభారముచే గృశించియు, దృష్టిమాంద్యముచే బాధపడుచును, మొండియై నీ త్రిశతినామ భాష్యము నాంధ్రసాధకలోకమున కందీయ శ్రమ గొనుచున్నాడు. ఆ ధీరుని దివ్యసంకల్పము అచిరముగానే నెఱవేఱి, భాష్యము నీ బిడ్డల కరకమలముల నలంకరించునటు లనుగ్రహింపుము భక్త కల్పద్రుమా!

నన్నుబోలు నినువులకు వెలుగుబాట చూపి, మా హృదయముల నీకభిముఖములగుటేకాక, నీ యడుగులందంటియుండ మప్పుట కా యాచార్యునకు శతాధికాయురారోగ్యపమృద్ధినిచ్చి యనుగ్రహింపుము.

నీ యొడింజేరిన నా 'కమల' స్మృతి చిహ్నముగా వెలయ, మహాసౌరమంత్ర పాఠానువాదము, రాజవిద్యా గీతావివృతి రచింయించి యిచ్చిన శ్రీవారి యప్పు తీర్పజాలను. నేడు నీ సన్నిధిని జూచిని చిత్రవిచిత్రములను గ్రంథరూపమున వెలువరించి గురుదక్షిణగా సమర్పింప సంకల్పించితిని. ఆ సంకల్పము నీ సంకల్పము. సర్వకారణభూతశక్తివైన నీవే శ్రీగురవవు. సంకల్పము సంపన్నము కాదగు శక్తి నీ యంత్రమునకు బెట్టుము.

శ్లో|| ''కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం

భజన్తే యే సప్తః కతిచిదరుణామేవ భవతీమ్‌,

విరించిప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ

గభీరాభిర్వాగ్భిర్వదధతి సతాం రంజనమమీ ||

బాలభానుని యరుణకిరణములు తమ్మిపూల విరియజేయును. అరుణనుగా నిన్నుపాసించు సత్పురుషులు సరస్వతీ ప్రసాదలబ్ధప్రతిష్ఠులై తమ సుభాషితములచే సజ్జనహృదయరంజనము చేయగల్గుదురు. అట్టి సామర్థ్యము నిమ్ము తల్లీ యని సాగిలబడితిని. సాదరముగా, అమ్మ చిఱువగ వొలికించినది. 'తథాస్తు' అని దేవగణముస్వస్తి పలికినది.

భోం-భోం-భోమ్మని శంఖద్వానమైనది. గణగణమని గంటలు మ్రోగినవి.

తధిమి తకిట, తక ఝణుతక, ధిమిత ధిమిత తకతధిగిణ తోం తద్ధిత్వం-తద్ధిత్వం-తద్ధిత్వం- అను నృత్యగీత వాద్యములు నింగిముట్టినవి. చెంతనేయున్న కాలబోధక ఘటికాయంత్ర చక్రము, హ్రీం హ్రీం హ్రీమ్మని మ్రోగినది. మేల్కాంచితిని.

అది తురీయయామము. వినవచ్చినవి నాల్గుగంటలు. కార్తిక బహుళైకాదశి. కడచిన ద్వాదశి ఇందువారము.

శ్లో|| ''శ్రుతీనాం మూర్థానో తధతి తవ¸° శేఖరతయా

మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ,

యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ

యయోర్లా క్షాలక్ష్మీ రరుణహరి చూడామణిరుచిః ||

--- సౌందర్యలహరి.

''ఎవి వేదా న్తశిరోగ్రభూషణములో, యెవ్వాని సంక్షాలనా మ్బువులే, శంభుకపర్దపూతనదియో, పొల్పారు నందౌనల క్తవిశేచ్ఛవి, మాధవారుణ శిరోత్తంసప్రభా పుంజమా భవదీయాంఘ్రులు, నాతలం దయను నిల్పంజూడుమా, తల్లిరో!''

''అమ్మా! ఆత్మసమర్పణదృష్టితో నా నోరి పలుకెల్ల మాతృకా నిర్మాణమే కావున నది నీ మంత్రజపమే. ఈ దేహ యంత్రము నీ విచ్చినది. దీనితో నగు పనులెల్ల నీ పూజవేళనగు ముద్రలే. అంతయు నీవై యంతట నిండియున్న దానవుగాన, నా సంచారము నీకగు ప్రదక్షిణక్రియయే. నా తొంగుండుట నీకు మ్రొక్కుటే. మఱి నీవే జాఠరాగ్నిరూపవై యాహారపాకము చేయుదువుగాన, ఆ శరీరపోషణమునకై నా భుజించుట నీ ప్రీతికైచేయు హోమమే. ఇంతేల, యీ మేనితో నగు నాపనులెల్ల నీ పూజలే.'' యని శ్రీశంకరగురులనినట్లు, ఆత్మార్పణ బుద్ధితో నాచేయు పనులెల్ల నీ పూజలేయగుగాక యని నిత్య కృత్యమున కుపక్రమించితిని.

ఈ మధురదీర్ఘ స్వప్నానుభవము, ఎన్నడును విస్మృతము కాకుండుటే నాయిష్టము. నాయిచ్చ. ఇచ్ఛాజ్ఞాన క్రియా శక్తిస్వరూపిణివి నీవు. ఈశరీరమే మణిద్వీపము.

సహస్రారమందలి చిత్కల, హృదయకమలమందలి జీవ కలయందు ప్రతిబింబితమై, ఆ బింబప్రతిబింబకాంతిపుంజము నఖశిఖాపర్యంతము వ్యాపింపగా నదే కల్పకోద్యానము. అహమిదం అనునప్పుడు ఆకారస్వరూపజ్ఞానమే శ్రీచక్రము. జ్ఞాన వికాసమున జ్ఞాతృజ్ఞేయములు రెండును తల్లీనములుకాఁగా, మిగులు జ్ఞానమే బ్రహ్మము. ఆత్మ, అహమ్‌, జ్ఞాతృజ్ఞేయ జ్ఞానాభిన్నభావనమే శ్రీచక్రార్చన ఫలము. ఇట్టి త్రిపుటి జ్ఞానమును నశింపజేయుము. అదే నీ ధరించిన త్రిశూలాయుధము వలన దెలియునది. అద్వైతభావము స్థిరపడి ద్వైతభావము తొలగుగాక.

శ్రీ మత్సింహాసనేశ్వరీ! ఈ నరసింహము ననుగ్రహింపుము.

---- వెంకటనరసింహరావు.

Sri Tattvamu    Chapters