Dharmakruthi  Chapters   Last Page 

7. పూర్వీకులు

తంజావూరు మహారాష్ట్ర ప్రభువుల పాలనలోనికి రాకముందు కర్ణాటక నాయక రాజుల పరిపాలనలో ఉండేది. నాయక రాజులలో ప్రసిద్ధులైన సేవప్ప నాయకుని కాలంలో శ్రీగోవింద దీక్షితులవారు నాయకరాజుల కులగురువుగా ఉండేవారు. వారు బహుశాస్త్రకోవిదులు. యజ్ఞదీక్షితులు. అనుష్ఠానపరులు. రాజుగారి కోరికపై ప్రధాని మంత్రి పదవిని స్వీకరించారు. అనతికాలంలో మంచి పరిపాలనా దక్షులుగా విఖ్యాతి సాధించారు. వీరి కాలంలో తంజవూరు సీమ అన్ని రంగాలలోనూ ముందంజ వేసింది. అనేక ప్రజోపకరములైన కార్యములు చేబట్టబడినవి. అయ్యన్‌ అనేది దీక్షితుల వారి గౌరవ నామము. వీరి కాలంలోనే వీరి పేరుతో తంజావూరి సీమ కంతటికీ సేద్యపునీటి నందించు అయ్యన్‌ కాలువ, అయ్యన్‌ కోనేరు త్రవ్వబడినాయి. వీరు కుంభకోణములో రాజా వేద పాఠశాలను ఆరంభించారు. ఈనాటికి కూడా ఆ పాఠశాలలో నూరుకు పైగా విద్యార్దులు వేద శాస్త్రములు అధ్యయనం చేస్తున్నారు. చతుర్దండి ప్రకాశిక అనే పుస్తకాన్ని రచించిన ప్రసిద్ధ స్వరమేళకర్త శ్రీవేంకటమఖి వీరి పుత్రులు.

దీక్షితులవారు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. వీరిని ఆశ్రయించుకొని అనేక కర్ణాటక బ్రాహ్మణ కుటుంబాలు తంజావూరి సీమకు తరలి వచ్చాయి. నాయకరాజులు కూడా కన్నడిగులే కదా! ఇలా స్థిరబడిన కుటుంబాల వారందరూ వేద శాస్త్రములలో మహత్తరమైన కృషి చేశారు. తంజావూరి సీమకే గర్వకారణ మయినారు. పీష్వాల చేత అపరిమితమైన గౌరవాన్ని పొందిన మణికుట్టి ఈ వంశములోని వారే. మణికుట్టి చివరి పేష్వాకు అత్యంత ఆంతరంగికులయ్యారు. చివరికి అ పీష్వాను తెల్లవారు బంధించి తీసుకొని వెళుతున్నపుడు కూడా దారిలో బిచ్చమెత్తుకుని జీవిస్తూ బహుకాలం వారికి శాస్త్ర విజ్ఞానపు విందు చేశారు. తరువాత మైసూరు మహారాజు చేత విశేష సత్కారాలను పొందారు.

కంచి కామకోటి పీఠ పరంపరలో 59వ ఆచార్యులవారయిన శ్రీ భగవన్నామ భోధేంద్ర సరస్వతీ స్వామి వారు రామేశ్వర యాత్ర ముగించుకొని కంచి తిరిగి వస్తూ పవిత్ర కావేరీ తీరంలో ప్రకృతి రమణియమైన గోవిందపురంలో బహుకాలం ఉండి అక్కడే సిద్ధి పొందారు. వారి శిష్యులయిన శ్రీఅధ్యాత్మిక ప్రకాశేంద్రులు కూడ చాలా కాలము గురువుగారి అధిష్ఠానము వద్దనే ఉండిపోయారు. వారు తమ వారసుని మహాపండితులయిన ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబం నుంచే ఎన్నుకొన్నారు. అప్పటి నుంచి మన మహాస్వామి వారి వరకు వచ్చిన పీఠాధిపతులందరూ ఈ కుటుంబాల నుంచి వచ్చినవారే.

17వ శతాబ్దంలో కర్ణాటక యుద్ధం కారణంగా కాంచీపురంలో అశాంతి నెలకొన్నది. అప్పటి కామకోటి పీఠ ఆచార్యులయిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు బంగారు కామక్షీ విగ్రహాన్ని తీసుకొని ఒడయార్‌పాళెం చేరారు. ఒడయార్‌పాళెం జమీందారులు శ్రీచరణుల యెడ అపరిమితమైన భక్తి ప్రపత్తులున్న వారు అప్పటి తంజావురు పాలకులైన శ్రీప్రతాపసింహరాజా స్వామివారిని తంజావూరు విచ్చేసి ఉండవలసినదిగానూ, బంగారు కామాక్షిని తంజావూరులో ప్రతిష్టించవలసినదిగానూ కోరారు. రాజాగారి వినతిని అనుసరించి స్వామివారు తంజావూరు విచ్చేసి, కామాక్షీ విగ్రహ ప్రతిష్ట చేయించి, శంకర మఠంలో కొంతకాలం బస చేశారు. స్వామివారు ముఖ్యపట్టణానికి కొంచెం దూరంగా నదీతీరంలో ఉండటానికి సంకల్పించడంతో అప్పటి తంజావూరు ప్రధాని శ్రీదాబిర్‌పంత్‌ శ్రీమఠానికి కుంభకోణం కావేరీ తీరంలో ఆదికుంభేశ్వర మంగళాంబాదేవి సమక్షంలో మఠనిర్మాణం చేసి ఇచ్చారు. శ్రీమఠ ప్రధాన కార్యాలయం కుంభకోణానికి మార్చబడింది. కంచిలో నామమాత్రంగా శాఖా కార్యాలయం నిర్వహించబడుతూ వచ్చింది.

శ్రీమఠము కుంభకోణానికి వచ్చినది ఆదిగా అప్పటికే ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతిగాంచిన హోయసల కర్ణాటక బ్రాహ్మణులు పీఠమునకు యధోచితమైన సేవ చేస్తూ స్వామివారలను ఆశ్రయించి ఉన్నారు. మన మహాస్వామివారి మాతామహస్థానము గోవింద దీక్షితులవారి పరంపరలోని వారు. వారి ప్రపితామహులైన శ్రీసుబ్రహ్మణశాస్త్రిగారు తిరువిడైమరుదూరు మహాలింగస్వామి ఆలయవీధీలో ఉన్న శంకరమఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు. శ్రీ శేషాద్రిశాస్త్రి శ్రీగణపతి శాస్త్రి శేషాద్రిశాస్త్రిగారు ఋగ్వేదాధ్యయనం పూర్తిచేసి తండ్రిగారి ముద్రాధికారిత్వం చేపట్టి శంకరమఠంలో పూజ చేస్తూ తిరువిడై మరుదూరులో స్థిరబడ్డారు. శ్రీగణపతిశాస్త్రి ఋగ్వేదము సాంగోపాంగంగా అధ్యయనం చేశారు. మంచి శాస్త్ర పండితులు. మాతృభాష కన్నడం, తెలుగు, తమిళం, మరాఠీ భాషలలో మంచి ప్రవేశం ఉన్నది. 50 సంవత్సరములు శ్రీమఠ సర్వాధికారిగా తమ యావచ్చక్తి యుక్తులు ధారపోశారు. ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబములలో తిరువిసైనల్లూరులో స్థిరబడిన కుట్టకవి మనుమడు మహాపండితుడు అయిన ''మణికుట్టి'' గురించి, శ్రీగణపతిశాస్త్రిగారి గురించి మహాస్వామివారు ఇష్టాగోష్టిలో చెప్పిన రసస్ఫోరకమైన విషయాలు శ్రీ.రా.. గణపతిగారిచే తమిళభాషలో కల్కిలో ప్రచురించబడినవి. ఇందు చెప్పబడిన విషయములు శ్రీమఠ ఆచార్యుల చరిత్రతోనూ, శ్రీవారి పూర్వీకులతోనూ ముడివడి ఉన్నందున, వీని స్వేచ్చానువాదములు ఇక్కడ పొందుబరచబడినవి.

Dharmakruthi  Chapters   Last Page