Dharmakruthi  Chapters   Last Page

5. కామకోటి పీఠ అవిచ్ఛి న్న పరంపర

ఆదిశంకరుల కాలం నుండి ఈ రోజు వరకూ కంచి కామకోటి పీఠాచార్యులు అవిచ్ఛిన్నంగా యోగ లింగాన్ని, శ్రీమేరువునూ అర్చిస్తూనే ఉన్నారు. వీరి ఉనికి కారణంగానే కాంచీపురంలో తరువాత కట్టిన అన్ని దేవాలయాలలోనూ, శంకరుల విగ్రహాలు అనేక భంగిమలలో వారికి కంచితో ఉన్న సంబంధాన్ని వేనోళ్ళ చాటుతూ దర్శనమిస్తుంటాయి. శంకరులకు సంబంధించిన ఏ క్షేత్రంలోనూ ఇన్ని విగ్రహాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇది అప్పటి రాజులపై, ప్రజలపై కంచి పీఠాధిపతుల ప్రభావాన్ని తెలియజేస్తోంది. ఒక్క కాంచీపురంలోనే కాదు, కంచి పీఠానికి సంబంధం ఉన్న అంబి, తిరువత్తియూరు, జంబుకేశ్వరము మొదలైన అన్నిగ్రామాలలోనూ శంకరుల విగ్రహాలు పూజనందుకొంటున్నాయి. శంకరులకు కంచిపీఠానికి గల పురాతన సంబంధాన్ని ఋజువుపరచడానికి శివరహస్యము, మార్కండేయ సంహిత, అనేక శంకర విజయాలు, సర్వజ్ఞ శివేంద్రుల పుణ్య శ్లోకమంజరి, సదాశివబ్రహ్మేంద్రుల గురు రత్నమాలిక ఇలా అనేక గ్రంధాలున్నాయి. 1935 సం.. ప్రాంతాలలో కాశీ పండితులు పెద్ద సభ చేసి, తర్జన భర్జనలు జరిపి, పురాతన గ్రంధాలు, సాక్ష్యాలూ పరిశీలించి చేసిన వ్యవస్థ ''శంకర పీఠతత్త్వదర్శనము'' అనే పుస్తకంలో క్రోడీకరించబడి ఉన్నది.

మెకంజీ కలెక్షన్స్‌ అనే పుస్తకంలో శ్రీబాబూరావు రిపోర్టులో, 10.04. 1817 లో అప్పటి కంచి శంకరాచార్యులవారిని కుంభకోణంలో కలిసినట్లూ, వారి వద్ద 125 తామ్రశాసనాలు చూసినట్లూ, అందులో రెండు శాసనాలకు తాము నకలు వ్రాసుకున్నట్లు ఉటంకించారు. కాంచీపురంలో వెలువడిన అనేక శంకరుల విగ్రహాలు, క్రీ.శ. 1111 లో విజయగండ గోపాలదేవుని తామ్రశాసనము, క్రీ..శ. 1500 లో వీరనృసింహదేవరాయల దానశాసనము, క్రీ..శ. 1522 లోని కృష్ణదేవరాయల శాసనము, క్రీ..శ. 1708 లో చోక్కనాథయ్యవారి శాసనము, క్రీ..శ. 1710 లోని ఢిల్లీ పాదుషా ఫర్మాన్‌, కంచి, తిరువత్తియూరు, జంబుకేశ్వరం, అంబి, చెన్నపట్నం, తంజావూరు, కుంభకోణంలోని శిలాశాసనములు, ఈ రకంగా చరిత్రకారులు ఒప్పుకున్న అనేక చారిత్రక ఆధారాలు, తరతరాల కామకోటి పీఠ పారంపర్యమునూ, అవిచ్ఛిన్నత్వాన్ని, చాటుతున్నాయి. క్రీ.శ. 1111 లోని గండగోపాలదేవుని శాసనము అప్పటి కంచి శంకరాచార్యులవారికి అంబికాపురపు సమర్పిస్తున్నట్లు తెలియజేస్తోంది. క్రీ.శ. 1514 లో అంబికాపురపు అంబికా పటీశ్వరస్వామి దేవాలయములో అప్పటి కంచిస్వామివారయిన చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు కృష్ణదేవరాయలవారి ఆరోగ్యమునకై ప్రత్యేక పూజలు జరిపించవలసినదిగా ఒక శాసనం వేయించారు. అందులో అంబి గ్రామాన్ని ''మన మఠగ్రామమైన అంబి'' గా వివరించారు. ఈ రోజునకూ అంబిలో శ్రీమఠానికి సేద్యపు భూమి ఉంది. కృష్ణదేవరాయల వారి చేత క్రీ.శ. 1522 లో సమర్పించ బడిన ఉదయంబాక్కంలోనూ, 1708లో చొక్కానాధయ్యవారి చేత సమర్పించబడిన ఏడు గ్రామాల్లోనూ ఈ రోజుకూ శ్రీమఠానికి భూములున్నాయి. పుణ్యశ్లోకమంజరిలో కంచి పీఠాధిపతులు 15వ శతాబ్దంలో నేపాలు వెళ్ళారని వ్రాశారు. ఆంగ్లేయ చరిత్రకారుడు బుహలర్‌ క్రీ..శ. 1503 లో ఒక శిలాశాసనమును అనుసరించి సోమశేఖరేంద్రులనే యతి దక్షిణదేశం నుంచి నేపాలు యాత్ర చేసినట్లు ఉన్నదని వ్రాసినదానికి, ఇది సరిగ్గా సరిపోయింది.

మహాస్వామివారికి పీఠచరిత్ర విషయంలో తమ చరిత్ర గురించి పటిష్టంగా చెప్పుకోవడమే అభిమతం. ఇతరులు శంకించినప్పుడు, ఆ ఆ శంకలకు మాత్రమే సమాధానం చెప్పడం ఇష్టం. అంతే కానీ ఆ శంకించిన వారి చరిత్ర శోధించి, వారికి వారు చెప్పుకొనే ఉన్నతి లేదనీ, మరి కొంతకాలం ముందు వారికసలు చరిత్రే లేదనీ నిరూపించడము ఇష్టం లేదు. వారి చరిత్రే సరిగా లేనపుడు మనలను విమర్శించే అధికారం వారికెక్కడిది అనే వాదనను వారు అంగీకరించినట్లు కనబడదు. అలాటి వాదనలు, పటిష్ఠమైన ఆధారాలతో వెలువరిద్దామనుకొన్న పుస్తకాలు వారి దృష్టికి వచ్చినప్పుడు వాటి ప్రచురణను నిలిపివేసేవారు. అది దృష్టిలో ఉంచుకొని మఠ చరిత్ర విషయంలో విమర్శ ప్రతివిమర్శల జోలికి పోలేదు.

ఆదిశంకరుల నుండి మహాస్వామివారి వరకు వచ్చిన శంకరాచార్యుల వారందరూ మహామహులైన వారు. వారిలో చాలా మంది ఆసేతు హిమాచలం తీర్థయాత్ర చేశారు. వీరిలో కృపాశంకర, అభినవశంకర, చంద్రశేఖర (3), విద్యాతీర్ద, పరమశివేంద్ర, బోధేంద్ర, చంద్రశేఖర (4), మహాదేవేంద్ర (7) వంటివారు అనేక గ్రంధాలలో విశేషంగా ప్రస్తుతించబడినారు.

శంకర పీఠదర్శనం (కాశీ విద్యావిలాస ప్రెస్‌ ప్రచురణ) లో ఓరియంటల్‌ సంస్కృత మహావిద్యాలయాధ్యక్షులయిన శ్రీపండిత మాధవశాస్త్రి భండారిగారి వాక్యాలతో ఈ అధ్యాయం ఉపసంహరిస్తాను.

''సతి చైవం శ్రీకాంచీ కామకోటి పీఠం అనాది సిద్ధం భగవత్పాదాధి రూఢం, సురేశ్వరాచార్యాదీనామపి పరమాదర పాత్రం శిష్యపరంపరయా పరిరక్షణీయత్వేన భగవత్పాదాభి ప్రేతం ప్రధాన తమ పీఠమితి నిగద వ్యాఖ్యాతమితి''

కనుక కంచి కామకోటి పీఠము అనాది సిద్ధమైనది. ఆదిశంకరులు అదిష్ఠించినది. సురేశ్వరులకిది పరమాదర పాత్రమైనది. శిష్య పరంపరతో పరిరక్షింప బడవలెననునదే భగవత్పాదుల అభిప్రాయము. ఇది ప్రధాన తమ పీఠము. ఇదే సారాంశము.

Dharmakruthi  Chapters   Last Page