Dharmakruthi  Chapters   Last Page

34. కావ్య పాఠములు

1909 నాటికి శ్రీవారు వేద, మంత్ర శాస్త్ర భాగాలలో తగిన అధికారం సంపాదించిన తరువాత సంస్కృత విద్యాభ్యాసం కోసం ఏర్పాటు జరిగింది. సన్యాసి అయినందువలన శృంగార పరమైన వర్ణనలు ఎక్కువ ఉండే కావ్యాలు వీరికి పాఠంగా చెప్పలేదు. సంస్కృత భాష కూడా పురాణాల ద్వారానే బోధింపబడినది. శ్రీవారు తమ సంస్కృత విద్యాభ్యాసం గురించి ఈ విధంగా అన్నారు. ''నాకు సంస్కృతం చెప్పడానికి ఏర్పాటు చేయబడిన పండితులు భాగవతము, విష్ణుపురాణాలలో నుంచి అనేక ముఖ్య ఘట్టాలను అత్యంత రమ్యముగా వ్యాఖ్యానిస్తూ భాష నేర్పేవారు. ఈ రెండు పురాణాలలోని ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర వంటి ఘట్టాలు నాకు కంఠోపాఠం చేయించేవారు. నేను స్వయంగా పెరియపురాణం, ఉపమన్యు భక్తి విలాసం, తిరుజ్ఞాన సంబంధుల చరిత్ర వంటి తమిళ పుస్తకాలను తెప్పించుకొని చదువుతూ ఉండేవాణ్ణి. ఎప్పుడైన తమిళ విద్వాంసులు, అధ్యాపకులు వస్తే వాటిలోని స్వారస్యాలను చర్చించి అర్ధం చేసుకొంటూ ఉండేవాడిని. ప్రహ్లాదుని మైత్రీ భావం నాకెంతో నచ్చింది. నన్ను ముగ్ధుణ్ని చేసింది. హిరణ్యకశిపుని ఆజ్ఞపై ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి అభిచారిక హోమాలు కూడా చేశారు. అందునుంచి కృత్య అనే శక్తి ఉద్భవించింది. అది ప్రహ్లాదుని చంపలేక హోమం చేసిన రాక్షసుల పైనే పడుతుంది. ఆ రాక్షసులు హతయోగ్యులే. చంపవద్దని సిఫార్స్‌ చేయడానికి వారి యెడ ఏ యోగ్యతలూ లేవు. అయినా ప్రహ్లాదుడు 'వీరు నాకెంత అపకారం చేసినా వారి యెడ నా మిత్ర భావం చెక్కు చెదరని మాట నిజమే అయితే ఈ కృత్య నుండి వారు రక్షించబడతారు గాక!' అంటున్నారు. ఆ శ్లోకం, ఆ భావం నా హృదయాన్ని కదిలించి వేసింది. మనస్సులో హత్తుకు పోయింది''. ఆ శ్లోక భావం అంతగా హత్తుకు పోవడం చేతనేమో, తమపై అకారణంగా ద్వేషాన్ని పెంచుకొన్న వ్యక్తుల యందు కూడా పరమ ప్రేమ భావాన్ని చూపేవారు. ప్రాతఃస్మరణీయులు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చెప్పారు. వారు ఒకప్పుడు స్వామివారితో ''స్వామీ! మా వాడు తెలియక మీ యెడ, పీఠం యెడ వైరభావం పెంచుకొన్నాడు. వానిపై మీ దయ ప్రసరింపచేయాల''ని ప్రార్థన చేశారట - దానికి స్వామివారన్నారు ''నా దయ ప్రవహిస్తూనే ఉంది. అతడు అందుకో లేక పోతున్నాడు'' రా. గణపతి చెబుతారు... స్వామివారి గురించి, పీఠం గురించి విపరీత విమర్శతో ఒక పుస్తకం ప్రచురించబడింది. అది చదివి కోపంతో ఊగిపోతూ ఆ పుస్తకం గురించి శ్రీవారితో ప్రస్థావన చేశారట ఈయన. శ్రీవారు చిరునవ్వుతో ''అది సరే! ఆయన ఆలోచన ఎంత స్పష్టంగా ఉందో చూశావా? ఆయన గురుభక్తి ఎంత మహత్తరమైనదో గమనించావా?'' అన్నారట.

ఈ శిక్షణ రెండు సంవత్సరములు సాగింది. స్వామివారు ఏకసంతాగ్రహులు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలలో వారి అభిరుచి, ఆదరము వారికి ప్రాచ్యగ్రంధాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడంలో ఉపయోగపడింది. అధ్యాపకులు వారి ఈ అవగాహన శక్తికి ఆశ్చర్యపడేవారు. శ్రీవారి జ్ఞాపక శక్తి ఆత్యాశ్చర్యకరమైనది. అప్పుడు చదువుకొన్న శ్లోకాలు తమ నూరవ సంవత్సరములో కూడా మరచి పోలేదు. కుంభకోణం ప్రధాన తీర్ధయాత్రా స్థలం. అదీకాక ప్రయాణ సౌకర్యాలన్నిటికీ అందుబాటులో ఉండటంతో పీఠ భక్తుల రాక పోకలు ఎక్కువ. అందువల్ల శ్రీవారి చదువుకు అంతరాయం కల్గుతోందని భావించిన మఠ నిర్వాహకులు విధ్యాభ్యాసం కోసం అనువైన ప్రదేశం కోసం వెదికారు! మధుర నాయక రాజులలో చివరి వాడైన విజయరంగ చొక్కానాధుడు శ్రీమఠానికి ఎనిమిది గ్రామాలలో భూములను సమర్పించుకొన్నాడని చెప్పుకొన్నాం కదా! ఆ గ్రామాలలో ఒకటైన మహేంద్ర మంగలం శ్రీవారి విద్యాభ్యాసానికి అనువైనది అని భావించారు. ఆ రోజుల్లో ఆ ఊరికి ప్రయాణ సదుపాయాలు లేవు. ఆ ఊరు చేరడం కష్ట సాధ్యంగా ఉండేది. అఖండ కావేరీ తీరాన రమణీయమైన ప్రాకృతిక దృశ్యాల నడుమ స్వామివారికి అధ్యయనం కోసం కుటీరం ఏర్పాటు చేయబడింది. మహాస్వామివారు 1911 లోలాల్గుడి మీదుగా మహేంద్రమంగలం చేరుకున్నారు. లాల్గుడిలో స్వామివారు శంకర ప్రతిష్ట చేసి శాస్త్ర పాఠశాలను ఆరంభించారు. తరువాతి కాలంలో ఆ పాఠశాలలో మహామహులయిన పండితులు తయారయినారు.

Dharmakruthi  Chapters   Last Page