Dharmakruthi  Chapters   Last Page

 

32. మహామఖ స్నానం

1909లో కుంభకోణంలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహామఖం వచ్చింది. మాఘపూర్ణిమనాడు సూర్యుడు కుంభరాశిలోనూ, బృహస్పతి సింహరాశిలోనూ, చంద్రుడు మఖా నక్షత్రంలోనూ కూడి ఉన్నప్పుడు ఈ పుణ్యకాలం వస్తుంది. రమారమి అయిదెకరాల విస్తీర్ణమున్న మహామఖ సరస్సులో ఆ రోజు 66 కోట్ల తీర్ధములు, గంగాది సకల పవిత్ర నదులు తమ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాయట. ఇక్కడ మహామఖ సరస్సు, కుంభకోణం గురించిన ఒక ఐతిహ్యం చెప్పుకోవాలి.

మహాప్రళయకాలంలో జీవరాసులన్నీ బీజరూపంగా ఒక అమృత కుంభంలో జాగ్రత్తబరచబడినవట. ఆ కుంభం మేరు పర్వతంపై ఉంచబడింది. మహాజల ప్రళయంలో ఆ కుండ కొట్టుకొంటూ దక్షిణాదికి వచ్చేసింది. ఇంతలో వరద నెమ్మదించింది. ఈ కలశం మఖా సరస్సు ప్రాంతంలో బురదలో కూరుకొని పోయింది. ఈ కుంభాన్ని వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలు వచ్చారు. కుంభమో! మహాతేజస్సుతో వెలిగిపోతూ దుర్నిరీక్ష్యంగా ఉంది. బ్రహ్మగారు కూడా దగ్గరకు చేరలేక మరల సృష్టి చేసే అవకాశం లేక పరమేశ్వరుణ్ణి ప్రార్ధించారు. పినాకపాణి తన వాడి అయిన బాణంతో ఆ కుంభాన్ని ఛేదించారు. కుండ ముక్కలు ముక్కలయి చుట్టుపక్కల పడిపోయింది. ఆ ముక్కలు పడిన ప్రదేశాలన్నీ క్షేత్రాలయి పోయాయి. కోణంగా ఉన్న ముక్కు వంటి ముక్క పడటంతో ఊరు కుంభకోణంగా పిలువబడింది. బురదలో ఇరుక్కుపోయిన కుండ మొదలు మహామఖ సరస్సులో మిగిలిపోయింది. కుండలోని అమృతంతో సరస్సు నిండిపోయింది. పరమేశ్వరుడు అమృతంతో తడిసిన ఆ బురద తీసుకొని లింగాకారంగా చేసుకొని దానిలో అంతర్గతుడయి అందరినీ ఆదికుంభేశ్వరునిగా అనుగ్రహీతులను చేశాడు. మహామఖ పుణ్యకాలంలో ఆ సరస్సులో గంగాది సర్వ పుణ్యనదులు, 66 కోట్ల తీర్ధములు, 33 కోట్ల దేవతలు తమ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తారు. కుంభకోణంలో ఉన్న ఆదికుంభేశ్వర దేవాలయం మొదలు అన్ని గుళ్ళ నుంచి స్వామి ఊరేగింపుగా తీర్ధ స్నానానికి వస్తారు. లక్షలాది ప్రజలు ఈ తీర్ధమునకు వస్తారు. అట్లాంటి ముఖ్య సందర్బాలలో ముఖ్య సమయానికి అన్ని ప్రధాన రహదారుల వెంబడి పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి మొదటి స్నానం చేసే గౌరవం కామకోటి పీఠ ఆచార్యులకు అనూచానంగా వస్తున్నది.

మహాస్వామివారు తంజావూరు రాజ పరివారం వెంటరాగా ఏనుగు అంబారీపై పెద్ద ఊరేగింపుగా మహామఖ స్నానానికి వెళ్ళారు. కుంభకోణపు ప్రజలు గుర్తుంచుకోదగిన చారిత్రాత్మక సన్నివేశమది. తేపరమానల్లూరు శివం ఆధ్వర్యంలో మఠంలో లక్షలాది ప్రజలకు భారీగా అన్నదానం చేయబడింది. ప్రభుత్వ గెజెట్లలో ఈ అన్నదానం ఎంతో గొప్పగా శ్లాఘించబడింది.

Dharmakruthi  Chapters   Last Page