Dharmakruthi  Chapters   Last Page

 

28. ఆర్థిక అస్తవ్యస్తత

9; 62వ ఆచార్యులవారు కంచినుండి కుంభకోణం వెళ్లినప్పుడు పూర్వపు రాజులు చేసిన వ్యవస్థ అంతా తురుష్కుల దండయాత్రలలో చెడిపోవడంతో కామకోటిపీఠపు ఆస్తులన్నీ కేవలం తామ్రశాసనాలుగా పురాతత్వ పరిశోధకులు మాత్రమే ఉపయోగించేవిగా మిగిలిపోయాయి. భూములు అనేకుల చేతులలో చిక్కుకుపోయాయి. బ్రిటిష్‌వారి ఆధీనంలోని కొన్ని గ్రామాల నుంచి రావలసిన శిస్తులోని భాగం ఆగిపోయింది. బహుపరివారమున్న పీఠనిర్వహణ కేవలం కొన్ని గ్రామములలో వచ్చే అగ్రసంభావనలతోనూ, అప్పటికే చితికిపోయిన తంజావూరు, ఒడంయార్‌పాళెం ప్రభువుల పోషణలోనూ చాలీ చాలనట్టు సాగుతోంది. ఇదికాక కంచి ఆచార్యుల వితరణశీలురు. 65వ పీఠాధిపతుల పండిత పోషణ, 66వ ఆచార్యుల నిరంతర అన్నదానం మఠపు నిలవలను కరిగించి వేసింది. 66వ ఆచార్యులు అప్పులు మాత్రం తీర్చివేసి కొంత నిల్వ ఉంచారు. అదీ అంతంత మాత్రమే. మహాస్వామివారు పట్టానికి వచ్చినప్పుడు బాలురు కదా! పరిచారక వర్గం ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకోవడం మొదలుపెట్టారు. మఠం ఆస్తులనుంచి రాబడి తగ్గుతూ వస్తోంది. కౌలుదార్లు కౌలు సమర్పించడం లేదు. దినసరి ఖర్చులు భరించేందుకు పీఠ భక్తులెవరూ ముందుకు రావడం లేదు. నిర్వాహణ, యాజమాన్యం సమర్దవంతమైనదిగా లేదు. మహాస్వామివారీ విషయాన్ని ప్రస్తావిస్తూ క్రింద విధంగా అన్నారు.

''నేను పట్టానికి వచ్చిన అయిదేళ్ల వరకూ మైనర్‌ని కదా! నిర్వాహణ అంతా ఒక వృద్ద బ్రాహ్మణుని చేతిలో ఉంచబడింది. పరమగురువులు మైనర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయనే గార్డియన్‌. వృద్దాప్యపు లక్షణాలు అయిన మరుపు, చిరాకు, చాదస్తం ఆయనకు ఆవహించాయి. ఎవరి మాటా వినేవారు కాదు. శ్రీమఠ సర్వాధికారి కదా! పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తించసాగారు. ఇది ఆసరాగా తీసుకొని అమరావతి కృష్ణస్వామి అయ్యర్‌ అనే డిప్యూటీ కలెక్టర్‌ ఒకాయన మఠం నిర్వహణ బ్రిటిష్‌ ప్రభుత్వం అధీనంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా అసమర్దత, అలసత్వం కారణాలుగా చూపి పై అధికారులకు చెప్పి, వారిని ఒప్పించి శ్రీమఠం సర్వాధికారిని (శ్రీమనక్కాల్‌ కందస్వామి అయ్యర్‌) గార్డియన్‌గా తొలగింపచేశారు. శ్రీకృష్ణ అయ్యర్‌ ప్రయత్నాలు విఫలమయి క్రొత్త గార్డియన్‌ రావడానికి మూడేండ్లు పట్టింది. ఈ సంధి కాలంలో మఠ ఆర్థిక నిర్వహణ కష్టమై పోయింది. రావలసిన డబ్బు వసూలు చేయడానికి, బ్యాంకులలోని డబ్బు తీసుకోవడానికి సరి అయిన అధికారి లేడు. భగవదనుగ్రహాన ఇంతలో తిరువానైక్కావల్‌ కుంభాభిషేకం వచ్చింది. అఖిలాండేశ్వరీ దేవి శ్రీమఠానికి కూడా కనకవర్షం కురిపించింది. తిరిగి వచ్చేటప్పుడు తంజావూరు రాజకుటుంబ సభ్యులు మహారాణి జీజాబాయి సాహెబా మహారాణి రామకుమారాంబా సాహెబా అనే రాణులు శ్రీమఠాన్ని ఎంతో ఆదరంగా నెలరోజులు పోషించారు. అంతేకాదు, పుష్కలమైన ధన సహాయం కూడా చేశారు''.

''1909లో మహామఖం వచ్చింది. తేపరమానల్లూరు అన్నదానం శివం శ్రీమఠం ఆవరణలో లక్షమంది బ్రాహ్మణులకు, లక్షలాది ఇతరులకు అన్నదానం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్టు చేశారు. సంభారాలు పర్వతోపమానంగా వచ్చిపడ్డాయి. ఎంత వితరణగా అన్నదానం చేసినా పదార్దాలు అనంతంగా మిగిలిపోయాయి. ఇంత విందు ఏర్పాటు చేసిన శివం పూచిక పుల్ల కూడా పట్టుకొని పోలేదు. మిగిలిన పదార్దాలు శ్రీమఠంలో ఎంత పుష్కలంగా ఉపయోగించినా ఒక సంవత్సరము పూర్తిగా సరిపోయాయి. చరిత్రలో అందరూ మహామఖంలో లక్షలాది మందికి ఆశ్చర్యకరమైన రీతిలో శ్రీమఠం అన్నదానం ఏర్పాటుచేసిందని అపురూపంగా వ్రాస్తారు కానీ నిజానికి ఆ గౌరవం దక్కవలసినది అన్నదానం శివంకే. అంతేకాదు. ఆ కష్టకాలంలో శ్రీమఠానికి సంవత్సరగ్రాసం ఏర్పాటు చేసినందుకు శ్రీమఠమే ఆయనకు ఋణపడి ఉంది.''

''ఆ రోజుల్లో కాలడిలో శంకరులవారి జన్మస్థలాన్ని గుర్తించి శంకరపీఠాలచే దానిని కొనిపించాలనే పెద్ద ప్రయత్నంతో ఒకాయన శ్రీమఠానికి వచ్చారు. కేవలం 11,000 రూ..లు ఇస్తే ఆ ప్రదేశం ఇప్పిస్తానని బ్రతిమాలారు. అప్పటి శ్రీమఠ పరిస్థితికి 11,000 రూ..లు ఎక్కడివి? శ్రీమఠ భక్తులయిన సంస్థానాధీశులను కలసి ఏర్పాటుచేయించడానికి తగిన నిర్వాహకులేరి?''

''పరమగురువులు అనుష్టానం చేసుకొనే పెద్ద చెంబు, హరివేణం చిత్రపటంలో మీరంతా చూసే ఉంటారు కదా! అది బంగారు హరివేణం. పట్టానికి వచ్చిన క్రొత్తలలో సంధ్యావందనం ముగించి ప్రక్కగదిలోనికి వెళ్ళి వచ్చేసరికి హరివేణం మఠంలోని ముఖ్యులొకాయన దాచివేయడం కంటబడింది. ఆయన మంచి పండితులు. శ్రీమఠానికి ఎంతో కైంకర్యము చేసినవారు''. శ్రీచరణులు పట్టాభిషేకానంతరం ఎదుర్కొన్న పరిస్థితులు ఇలాంటివి.

శ్రీవారి చరిత్ర వ్రాసేవారందరూ శ్రీవారు పడిన కష్టాలగురించి ప్రస్తావించనేలేదు. తొలిరోజులలో ఎదుర్కొన్న ఆర్ధిక కష్టాలు, అవిధేయతలు, ఉత్తరదేశయాత్రలో ముఖ్యంగా ఈ పీఠాన్ని, పీఠాధిపతిని కించపరచాలనే ఉద్దేశ్యంతో జరిగిన ప్రయత్నాలు, వాటిని శ్రీవారు అధిగమించిన తీరు అధ్యయనం చేస్తే కానీ వారి మహోన్నతమయిన వ్యక్తిత్వం, ధార్మికత, నైతికత, శాస్త్రములపైన, శంకరులపైన వారి అచంచలమైన విశ్వాసం అర్దం కాదు. తమ ఋజుప్రవర్తనతో ప్రత్యర్ధులమనుకొనే వారికందనంత ఎత్తుకు ఎదిగిపోయారు.

తరువాతి కాలంలో శ్రీవారు తలపెట్టిన కార్యక్రమాలన్నింటికీ డబ్బు వర్షించింది కానీ, శ్రీమఠపు ఆర్దికస్థితిని మాత్రం అలానే చాలీ చాలనట్లుగాను, బొటాబొటిగానూ ఉండేది. స్వామివారు శ్రీమఠానికి డబ్బు, భవనాలు ఏర్పరచడానికి వ్యతిరేకి. అన్ని మహత్తరమైన కార్యములను భక్తసంఘాలచే జరిపింప చేశారు. పూర్వ ఆచార్యులు నిర్దేశించిన చంద్ర మౌళీశ్వర పూజ, సంతర్పణకు తగినంత మాత్రమే శ్రీమఠానికి వచ్చే ఏర్పాటు చేశారు. పట్టణాలలో పర్యటిస్తే కానీ పీఠానికి మంచి ఆదాయం ఉండదు. వీరు ఆచారానుష్ఠానాలకు ఇబ్బంది అవుతుందని పల్లెటూరులలోనే పర్యటిస్తుండేవారు. అక్కడ మఠానికి రోజువారీ ఖర్చు పూరించడమే పెద్ద కష్టం.

ఓసారి శ్రీవారు ఒక గ్రామంలో చాలాకాలం మకాం చేసి ఉన్నారు. గ్రామం గ్రామమూ పూజ చూడటానికి వచ్చి సంతర్పణలో భోజనం చేసి వెళ్ళిపోయారు. భిక్షచేసేవారే లేరు. స్వామివారో! ఆ ఊరునుంచి కదలడం లేదు. మేనేజర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఓ రోజు సంతర్పణకు సామాను వెళుతుంటే స్వామివారికి వినిపించేటట్లుగా ''ఏమయ్యా! ఈ రకంగా సంతర్పణకే కొలుస్తూ పోతే రేపు చంద్రమౌళీశ్వర పూజకు కొలవడానికి సంభారాలే మిగలవు'' అని కేకవేశారట. విషయం చేరవలసిన చెవికి చేరింది. స్వామివారు మేనేజర్‌ను పిలిపించి ''చంద్రమౌళీశ్వరునికి సంభారాలు కొలవడానికి మనమెవరం. ఆయన దృష్టిపడితే దనపురాసులే కొలుచుకోవలసి వస్తుంది'' అని చెప్పి ముగించేలోగా ప్రక్క ఊరి మిరాసీదారు నాలుగుమూటలు మోయించుకొని దర్శనానికి వచ్చారట. నమస్కారం అయిన తరువాత ''స్వామీ! చాలాకాలంగా తమను అర్ధిస్తున్నాను. మా వూరు దయచేయలేదు. ఇప్పుడు నేను కాశీకి పోతున్నాను. తిరిగి రావడానికి ఆరేడు నెలలు పడుతుంది. అప్పుడు శ్రీవారు ఎక్కడుంటారో! నా పరిస్థితి ఎలా ఉంటుందో. నేను ఉడుతా భక్తిగా తమకు సమర్పిద్దామనుకొన్న ఈ నాణములు స్వీకరించండని'' ప్రార్థించాడట. మేనేజర్‌ నోట మాట రాలేదు. స్వామివారు మిరాసీదారుతో కాశీయాత్రా విశేషాలు ముచ్చటించి ఆశీర్వదించి పంపి ''అయ్యా! మేనేజరుగారూ! ఈ నాణములు కొలుచుకోండి. చంద్రమౌళీశ్వరుని నైవేద్య సంభారాలు కొలవడం సంగతి తరువాత ఆలోచించుకోవచ్చు'' అని చురక వేశారట. సంఘటనను బట్టి చదవరులకు మేనేజర్‌ స్వామి మహిమ తెలియని తొందరబాటు మనిషిగా కన్పించవచ్చు. స్వామివారి మహిమ పూర్తిగా తెలసి వారికి అత్యంత నమ్మకస్తులలో ఒకరిగా మెలిగిన వారు ఈ మేనేజర్‌. వీరి ఈ ఖచ్చితమైన నడవడి శ్రీమఠపు ఆర్దిక పరిస్థితులను మెరుగు బరిచింది.

ఈ గ్రామవాసులే ఇంకో సందర్బంలో స్వామివారిని వారి ఊరు ఆహ్వానించారు. అప్పుడు ఆ గ్రామంలో పేరు మోసిన పండితులుండేవారు. వారితో శాస్త్రవిషయాలు చర్చించడమే శ్రీవారికి పెద్ద విందు. శ్రీమఠాన్ని ఆహ్వానించినవారు మోతుబరులైన భూకామందులు. రోజూ వచ్చి ఈ రోజు తమ భిక్ష అని చెప్పి డబ్బులు చెల్లించకుండానే భిక్ష చేసి యావన్మందీ భోజనాలు చేసి వెళ్లిపోయేవారట. నెలరోజులు జరిగింది. కాగితం మీద భిక్ష చేసిన వారి పేర్లున్నాయి. డబ్బు మాత్రం రాలేదు. శ్రీవారు పక్క గ్రామం వెళ్లిపోయారు. మఠం కదలబోతోంది. మేనేజర్‌ బాకీ వసూళ్ళకు కబురు పంపారు. ఎవరూ రాలేదు. మేనేజర్‌గారికి ఒళ్ళు మండిపోయింది. పరివారాన్ని వెంటబెట్టుకొని ప్రతి ఇంట్లోనూ బాకీకి సరిపడినంత వెండి, ఇత్తడి పాత్రలు లెక్క వ్రాసి బండి కెక్కించారుట. భూకామందులకు మింగా క్రక్కాలేని స్థితి. స్వామివారితో మేము భిక్షకై డబ్బు చెల్లించనందువల్ల సామాను జప్తు చేసుకు పోయారు మేనేజరు అని చెప్పడానికి మర్యాదగా ఉండదు. మేనేజర్‌నే బ్రతిమాలి డబ్బు చెల్లించి సామాను విడిపించుకొన్నారట. మేనేజర్‌గారు మంచి సాహసి. మఠ ఔన్నత్యాన్ని కాపాడటమే తమ ఊపిరిగా జీవించిన ఉన్నతులాయన.

మొత్తానికి శ్రీవారి మఠనిర్వాహణ కాలంలో శ్రీమఠానికి ధనం బొటాబొటిగానే వస్తూ ఉండేది. ధర్మకార్యాలు మాత్రం వారి ఆదేశం వల్ల కోట్ల ఖర్చుతో జరిగిపోతూనే ఉండేది.

Dharmakruthi  Chapters   Last Page