Dharmakruthi  Chapters   Last Page

 

25. పీఠాధిపత్యము

తిండివనం తురకవీధిలో ఉంటూ అమెరికన్‌ మిషనరీ స్కూలులో ఆంగ్లవిద్యనభ్యసిస్తున్న 13 ఏళ్ల శ్రీస్వామినాధన్‌ హిందువులకు పరమోత్కృష్టమయిన శ్రీకంచి కామకోటి సర్వజ్ఞ పీఠపు 68వ శంకరాచార్యులు అయినారు.

పీఠాధిపతులుగా వీరు చేయవలసివచ్చిన మొదటి కార్యములు తమ గురువుల పూజాకార్యక్రమము, అనగా సన్యాసులు సిద్ధిపొందినప్పుడు చేయవలసిన పూజా ఖననాదాదికములు, పరమగురువుల దశాహ్నసంబంధమయిన మహాపూజా కార్యక్రమము. కంచి పీఠములో యోగలింగమునకు బ్రహ్మచారులుగా సన్యాసము స్వీకరించిన పీఠాధిపతులే పూజ చేయడానికి అర్హులు. అంతకు ముందు మూన్నాళ్లుగా గురువులు అస్వస్థులుగా ఉన్నందున తొమ్మిదికాలముల పూజ ఒకేసారి చేయవలసి ఉన్నది. ఇవన్నీ ఎంత త్వరితగతిని ముగించినా రాత్రి అయిపోతుంది. రాత్రిపూట సన్యాసులు భోజనం చేయడానికి వీలు లేదు. మహా అయితే ఫలహారం చేయవచ్చునేమో! అప్పటి వరకూ ముప్పొద్దులా భోజనం చేసిన బ్రహ్మచారి బాలునికి ఒకేసారి ఎంత బాధ్యత! శంకర పీఠపు నిర్వహణ శంకరాచార్యులవారి అనుగ్రహంతో నడుస్తుందనే మహాస్వామివారి నిశ్చయబుద్ది వారికి ఆస్థైర్యాన్ని ప్రసాదించి ఉంటుంది. ఇక్కడ శ్రీచరణశరణయతులు తమ శంభోర్మూర్తిః సంస్కృత వ్యాసములో ఈ సందర్బముగా చెప్పిన విషయాలను ఉటంకించడమెంతో ఉపయుక్తంగా ఉండగలవు.

ఆ పీఠానికి అభిషిక్తుడైన యతివరుడే ఆ పీఠ అధిదేవతలను పూజించాలనీ, ఇతరులు మహాపండితులైనా సరే, అందుకు తగరనీ అక్కడి నియమం. ఆ పీఠ మర్యాదలు తెలిసిన ఆస్థాన విద్వాంసులు పరంపరా ప్రాప్తమైన ఆ దేవతామూర్తులను చూపించి, పూజా ప్రక్రియను బోధించుతూ - ఇది శ్రీచంద్రమౌళీశ్వరమూర్తి, ఇది శ్రీమత్రిపురసుందరీ మూర్తి, ఇవి పంచాయతన మూర్తులుగా ప్రసిద్ధమైన గణనాధాదులు - అంటూ వివరించారు. ఒకసారి చెప్పినంత మాత్రమునే శ్రీబాలయతి, ఎంతో కాలమునుండి సుపరిచితమైనవాని వలె ఇంటి యజమానికి అలవాటైన గృహపరికరముల వలె ఆ విషయాలన్నీ అవగతమై పోయినాయి.

తరువాత అర్చన సందర్బములో - దేవతలను అర్చించేటప్పుడు త్వమేవాహమస్మి (నువ్వే నేనయి ఉన్నాను) అనెడి అబేధ దృష్టి కర్తవ్యం - అని ఆస్థాన పండితులు చెప్పారు. ఆ మాటలు బాలయతికి క్రొత్తగా అనిపించింది. అప్పుడా బాలయతి మంజుల దరహాసంతో గంభీరమైన చూపులతో అర్చించేటప్పుడా అని పలికారు. ఎల్లప్పుడూ ఈ విధమైన దృష్టి అవసరం కదా! అర్చించేటప్పుడు అనడం ఎందుకు - అనే భావంతో ఉపదేష్ట వైపు చూచారు.

ఇంగితజ్ఞులూ శ్రీవారి భావాన్ని గ్రహించినవారూ అయిన ఆ పండితశ్రేష్ఠుని హృదయం అహో! ఈ బాలకుని ప్రతిభ విశిష్టమయినది అనెడి విస్మయంతో మా ఈ పీఠానికి గొప్ప అర్హత కలిగిన అధిపతి లభించారు అని హర్షాతిరేకంతో సమజ్జృంభితమైనది. ఈ వృత్తాంతం తెలసి పీఠానుయాయులు అందరూ అమందానంద నిర్బరులయినారు.

ఈ పీఠ పూర్వాచార్యులచే స్థాపించబడి పరిపాలించబడుచున్న అద్వైత సభకు అద్యక్షులు. పండితాగ్రగణ్యులు, అనేక ఆధ్యరములను నిర్వహించి యష్ట, పంచవద క్షేత్రవాసి అయిన శ్రీబాలకృష్ణశాస్త్రి మహోదయులు - ఒక బాలుడు మా పీఠంలో అధిపతిగా అభిషిక్తులైనారు. వారు ఆచార్య స్థానంలో ఉండటానికీ, మహత్తరమైన పీఠకార్యమును నిర్వహించడానికీ సమర్దులేనా - అనే సందేహంతో స్వయంగా చూచి నిర్ణయించుకోవాలనే నిశ్చయంతో ఈ బాలయతి ఉన్న చోటుకు విచ్చేశారు. ఎంతో దూరం ప్రయాణించి లోనికి ప్రవేశిస్తున్న ఆయనకు ఎదురుగా, సమీపంలో ఆశీనులైయున్న రుచిరాకృతీ, ప్రసన్న శరీరులూ, చిరునగవుతో ప్రకాశించే వదన మండలంలో నిశ్చింతగా ఉన్న బాలయతి దృగ్గోచరులయినారు.

వారిని చూసిన వెంటనే పండితాగ్రగణ్యునకు - ఆహవనీయాద్యగ్నులన పరిచర్యతో తృప్తులను చేసి తత్త్వోపదేశం పొంది, పరమార్ధాన్ని బడసిన ఉపకోసలుని ముఖాన్ని ప్రవాసం నుండి వచ్చి పరమమైన అనుకంపతో చూచిన ఆచార్యుడు బ్రహ్మవేత్త వలె సౌమ్యమైన ముఖంతో ప్రకాశిస్తున్నాన నిన ఉపకోసల కధ వృత్తాంతం స్మృతి పధంలో మెదిలింది.

అహో! ఈ బాలయతి విశిష్టంగా ప్రకాశిస్తున్నాడనుకుంటూ సమీపానికి వచ్చారు. తమను సమీపించిన పండితాగ్రగణ్యుని చూసి ఆ బాలయతి ఆర్యా! తమ యొక్క ధర్మము, అగ్నిహోత్రాద్యనుష్టానము, తపశ్చర్య నిరంతరంగా నడుస్తోంది కదా అని అడిగారు.

పండితవర్యుని హృదయం హర్ష విస్మయములతో నిండిపోయింది. అహో! ఎవరీ బాలకుడు. విశేష శాస్త్రములను అధ్యయనం చేయలేదు. తల్లిదండ్రుల ఒడి నుండి ఇప్పుడే కదా బయటకు వచ్చారు! అయినా మహాపండితుని వలె ప్రకాశిస్తున్నారు. ఉచితతమంగా మాట్లాడుతున్నారు. వీరి వదనం బ్రహ్మజ్ఞత్వాన్ని అభివ్యాంజనం చేస్తోంది. వచనం ధర్మవిత్తమునిగా తెలియజేస్తోంది. ఈతనిని సామాన్య బాలకునిగా భావించరాదు. అతి త్వరలోనే ఈయన ద్వారా ఈ గొప్ప పీఠము సర్వతోముఖ వికాసాన్ని పొందుతుంది అని నిశ్చయించుకొని తన భావాలను అక్కడ ఉన్న వారి వద్ద వేనోళ్ల పొగిడి సంతోషంతో తన పురానికి తిరిగి వెళ్ళారు. ఆ బాలయతి ఖ్యాతి - బాగా కుసుమించిన వృక్షపు గంధం వలె దూర దూరములకు బాగా వ్యాప్తి చెందింది.

మఠనిర్వహణము సామాన్యమైన విషయం కాదు. మఠంలోని అధికారులందరూ రెండు మూడు తరములుగా పాతుకొని పోయి ఉన్నవారు. ఎంత ఆచార్యభక్తి ఉన్నప్పటికీ మొన్నటి వరకు పసిబాలునిగా భావించిన వారికి ఆచార్యులవారికి చూపవలసిన వినయ విధేయతలు చూపడానికి సమయం పడుతుంది కదా! ఈ ఆచార్యులవారు కూడా తమ నిర్వహణాసామర్ధాన్ని ఋజువు చేసుకోవలసి ఉన్నది. పరిచారక వర్గంలో కొందరు ఉద్దండ పండితులు. మరి కొందరు పరమగురువులకు అత్యంత ఆంతరంగికులయిన అధికారిక వర్గము. ఇంకొందరు బహుకాలంగా శ్రీమఠమును ఆశ్రయించి బ్రతుకుతూ ఆనుపానులన్నీ సంపూర్ణముగా ఎరిగి ఉన్నవారు. వీరందరి మీదా ఆధిపత్యం నెరపడానికి కుశాగ్రమైన ధీసంపత్తి, అనుభవము, జాగరూకత అవసరము. ఇది పీఠనిర్వహణ విషయం.

సన్యాసాశ్రమపు నియమ నిష్టలు, శంకరులవారి నుండి వస్తున్న ఆచారములు పూజాపద్దతులను సంపూర్తిగా తెలుసుకొని తమ అలవాటులోనికి తెచ్చుకోవడమూ, అద్వైతపీఠ నాయకులైనందున పండితులతో, ప్రతివాదులతోనూ చర్చించి అద్వైతమతాన్ని సుప్రతిష్ఠితం చేయడానికి తగిన పాండిత్యమూ అవసరము. హిందూమతమునకు అధినాయకులైనందున వారి ప్రయోజనాలను దృష్టిలో నుంచుకొని తగిన రక్షణ చర్యల గురించి ఆలోచించడం ఇక పని. ఇవన్నీ కాక ప్రతిదినము ఆధ్యాత్మికగురువుగా, దైవప్రతినిధిగా, దైవంగా భావించి వచ్చే అనేక మంది భక్తజనుల ఆదిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి తగిన తపోబలం అత్యంత ఆవశ్యకము. ఈ రకంగా ఒక పీఠాధిపతికి ఆచారానుష్ఠానాలలోనూ, శాస్త్రంలోనూ, తపోనిష్ఠలోనూ, లౌకికమైన తెలివితేటలలోనూ, బలం ఉంటే కానీ పీఠనిర్వహణ సాధ్యపడదు. ఇంతటి మహత్తరమైన బాధ్యత పదమూడేళ్ల బాలసన్యాసి పైన పడింది. పై విషయాలను దృష్టిలో ఉంచుకొనే ''నాకు గురుసాన్నిధ్యంలో ఉండే భాగ్యము లేదు. సన్యాసాశ్రమపు మొదటినాటి నుండే పీఠాధిపత్యపు కష్టసుఖాలు, బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి'' అంటారు స్వామివారు. దీనికి తోడు ఈ మఠంలో ఏమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు గమనించుతూ అవకాశం దొరికితే హాని చేయాలని కాచుకొని కూర్చుని ఉన్న వర్గం ఆనాటికి కూడా ప్రబలంగా ఉన్నది.

పీఠాధిపత్యపు మొదటి రోజు విరామం తీసుకోబోయే సమయానికి శ్రీమఠపు కార్యనిర్వాహణాధికారి సదాచార సంపన్నుడయిన ఒక వృద్ద బ్రాహ్మణుని స్వామివారికి పరిచయం చేస్తూ ఇక నుంచి వీరు తమకు పరిచర్య చేస్తారని చెప్పి వెళ్ళారు. సర్వాధికారి అలా వెళ్ళారో లేదో ఈ వృద్ద బ్రాహ్మణుడు స్వామివారికి సాష్టాంగంగా నమస్కరించి ''స్వామీ! మహాపురుషులయిన తమ పరమగురువుల పరిచర్యలో ఈ జీవితం ఊదన్యమయింది. వారి సేవలో పునీతమయిన ఈ తనువును ఇంకొకరి సేవను వినియోగింపజాలను. స్వామివారు ఈ అపరాధమునకు నన్ను క్షమించాలి. అంటూ వినమ్రముగా శలవు తీసుకొన్నారట. అప్పుడు స్వామివారు ఏమనుకొన్నారో! 99వ ఏట తమ పరిచారకుల ఎదుట ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్న స్వామివారు వారిది ఎంత గొప్ప అనన్యమైన ఆచార్యభక్తి'' అని మెచ్చుకొన్నారు.

పీఠాధిపత్యము స్వీకరించిన తరువాత పీఠపరిస్థితులు ఆకళింపు చేసుకోవడానికి, పీఠనిర్వహణలోనూ, వివిధ శాస్త్రములలోనూ, పూజాపద్దతులలో సుశిక్షుతులవడానికి పీఠమునకు అప్పటి ప్రధాన కేంద్రమయిన కుంభకోణం బయలుదేరారు. దారిలో తమ పూర్వాశ్రమపు కుటుంబమన్న తిండివనములో కొంతకాలము బస చేశారు.

Dharmakruthi  Chapters   Last Page