Dharmakruthi  Chapters   Last Page

21. పరమగురువులు

>1905 లో గిని ఉపనయనం జరిగినప్పుడు శ్రీ కంచి శంకరాచార్యుల వారు ప్రసాదాలు పంపారని ఇంతకుముందు చెప్పుకొన్నాం. ఆ స్వామివారి పేరు కూడా శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారే. అంతేకాదు, వారి పూర్వాశ్రమనామం కూడా స్వామినాధుడే. పేర్లలో కూడా ఈ సారూప్యము ఆశ్చర్యజనకమే కదా! గురుస్వామినాధుని తండ్రి పేరు శ్రీసీతారామశాస్త్రి. చెంగల్పట్టు జిల్లా ఉదయంబాక్కం వీరి స్వగ్రామము. హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. వీరి కుటుంబము పూర్వపీఠాధిపతులచే ఉదయంబాక్కంలో విజయనగర రాజులు పీఠానికిచ్చిన ఆస్తుల పరిరక్షణ కోసం ఆ ఊరిలో ప్రతిష్ఠించబడింది. ఈ రోజునకు కూడా ఉదయంబాక్కంలో కంచి పీఠానికి ఆస్తులున్నాయి.

శాస్త్రిగారు స్వయముగా మంచి స్థితిపరులు. మంచి వేద పండితులు. అనుష్ఠాత. శ్రీవిద్యా సంప్రదాయంలో ఎంతో పరిశ్రమ చేసినవారు. కంచి కామకోటిపీఠంలో ప్రధానదేవతలకు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం పుచ్చుకొన్న సన్యాసులే పూజ చేసే ఆచారం అనూచానంగా వస్తోంది. అయితే పరివార దేవతలకు పూజ చేయడానికి, మఠంలో అవసరమైన హోమా ధికాలు నిర్వహించడానికీ సర్వతంత్ర స్వతంత్రులైన పండితులుండేవారు. సీతారామశాస్త్రిగారు శ్రీమఠంలో ఈ పూజాకైంకర్యము చేసేవారు.

వారి పుత్రులు శ్రీస్వామినాధన్‌ ఋగ్వేదం అద్యయనం చేసి శాస్త్రమందు అత్యంత ఆసక్తి చూపిస్తూ వచ్చారు. శ్రీవిద్యాసంప్రదాయంలో కూడా ఆరి తేరారు. కంచి పీఠంలోనే ఉంటూ పరివార దేవతార్చన చేస్తూ శ్రీచరణుల వద్ద బాష్యాదికాలు చదువుకుంటూ ఉండేవారు. కాంచీపీఠ ఆచార్యులలో 65వ వారయిన శ్రీసుదర్శన మహాదేవేంద్రులు తమ తదనంతర పీఠాధిపతులుగా వీరిని నియమించి సిద్ధి పొందడంతో వీరు కామకోటి పీఠ 66వ శంకరాచార్యులవారయ్యారు. ఇలయాట్రంగుడిలో వీరి 17 ఏళ్ళ పీఠాధిపత్యం ఆరంభమయింది. వీరి ఆశ్రమనామం శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి.

ఈ స్వామివారు పీఠాధిపత్యానికి వచ్చేటప్పటికి ఇంకా మైనారిటీ తీరలేదు. శ్రీమఠపు శ్రీకార్యం ఏజంటు గార్డియన్‌గా పీఠ వ్యవహారాలను చూడటం ఆరంభించారు. వీరికి శాస్త్ర అభ్యాసం పైనున్న అత్యంత ఆసక్తి కారణంగా 1891 నుండి 1897 వరకూ కుంభకోణంలోనే ఉంటూ శాస్త్ర అభ్యాసం చేశారు. ఎప్పుడూ మహామహులైన పండితుల మధ్యలో ఉంటూ శాస్త్రచర్చలు చేస్తూ ఉండేవారు.

ఈ స్వామివారు 1896లో మన్నారుగుడి పెరియవాగా ప్రసిద్దులైన శ్రీరాజుశాస్త్రి శ్రీశ్వేతారణ్యం నారాయణశాస్త్రి, శ్రీతిరువయ్యార్‌ బాలకృష్ణశాస్త్రి, శ్రీచిదంబరం హరిహరశాస్త్రివంటి మహామహులైన పండితులలో అద్వైత సభను ఏర్పాటు చేశారు. అధ్వైత వేదాంతాన్ని శంకరుల ప్రస్థానత్రయ భాష్యం ద్వారా బహుళ ప్రచారంలోనికి తీసుకొని రావడం ఈ సభ ఉద్దేశ్యం. పరీక్షలను ఏర్పాటు చేసి, ఉత్తీర్ణులయినవారిని స్వర్ణకంకణాలతో సన్మానం చేసేవారు. ఆంధ్రదేశంలో దాదాపు లుప్త స్థితిలోనికి వచ్చిన వేదాంత శాస్త్రాన్ని తిరిగి ఉన్నత స్థితిలోనికి తెచ్చిన దెందుకూరి నృసింహశాస్త్రిగారు, శ్రీతిరువయ్యార్‌ బాలకృష్ణ శాస్త్రిగారి వద్ద వేదాంతశాస్త్రం చదువుకొనే రోజులలో అద్వైతసభలలో పాలు పంచుకొన్నవారే.

ఎక్కువ కాలం మఠం ఒకే చోటున ఉండటం వలన ఆర్ధిక ఇబ్బందులు వచ్చిపడినాయి. మఠానికి పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు కేవలం తామ్రశాసనాలుగానే మిగిలిపోయాయి. ముస్లింలు, ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించడాన వారు ఈ పీఠముల మీద శ్రద్ధ తీసుకోలేదు. పీఠమును కాపాడుకోవడమే పెద్ద సమస్య అయిపోయింది. ఉన్న భూములనుండి వచ్చే ఆదాయం కేవలం ఆ దానశాసనాల్లో తేటతెల్లంగా నిర్దేశ్యించబడిన చంద్రమౌళీశ్వర పూజకు, బ్రాహ్మణ సమారాధనకు మాత్రం బొటాబొటిగా సరిపోయేవి. మఠసిబ్బంది వేతనాలు ఆ కాలంలో నెలకు 5000 రూ. లు. ఇవి చెల్లించడానికి స్వామివారు నిరంతరం సంచారంలో ఉండాల్సిందే. ''శ్రీ మఠపు ఆర్ధిక స్థితి శుక్ల కృష్ణ పక్షాల చంద్రుని వలె మారిపోతూ ఉంటుంది'' అంటారు మన స్వామివారు. నిరంతరం పర్యటనలో ఉంటూ ధర్మప్రచారం చేయాలనే శ్రీ శంకరుల ఉద్దేశ్య సాఫల్యత కోసమే చంద్రమౌళీశ్వరుడు ఈ మఠ ఆర్ధిక స్థితిని ఈ విధంగా ఉంచుతాడేమో! బ్యాంకులు లేని కాలం కదా అది. కొంతమంది పీఠభక్తులు మఠంలో డబ్బు దాచుకొనేవారనుకుంటాను. మఠపు ద్రవ్య సరఫరాను నియంత్రించడంలో ఇట్టి మదుపులు ఉపమోగించేవి. ఈ స్వామివారు పర్యటనకు బయలుదేరడానికి కారణభూతమైన ఒక సంఘటనను మన స్వామివారు వివరించారు.

మఠంలో పూర్తిగా డబ్బే లేదు. స్వామి చంద్రమౌళీశ్వర పూజకై కావేరీ నదిలో స్నానం చేసి మఠానికి బయలుదేరారు. ''ఓయ్‌! బ్రాహ్మణా'' అనే గొంతు వినిపించింది. వెనుకకు తిరిగి చూస్తే ఒక వయసయిన మామ్మగారు నుంచొని ఉన్నారు. ఏమిటన్నట్టు చూశారు స్వామివారు. ''నా డబ్బు అక్కడ పెట్టి పూజకు కదులు'' అని గద్దించారామె. ఎంతో కోపంగా ఉన్నారామె. ''ఏమి డబ్బు'' అని తెల్లబోతూ మెల్లిగా అడిగారు స్వామి. ''ఏమి డబ్బా! తమకు తెలియనే తెలియదా? నేను మఠానికి అప్పుగా ఇచ్చిన డబ్బు నా జీవనాధారమే అది అయిన డబ్బు రోజూ సహస్రబ్రాహ్మణ సమారాధన నవకాయపిండివంటలతో జరగాలని ఆదేశించి, జరుగుతుంటే మేడపైనుండి చూసి సంతోషించి వెళుతున్నారే! దీనికంతా డబ్బు ఎక్కణ్నుంచి వచ్చిందని ఆలోచించలేదా? అంతా నాలాంటి వాళ్ళు అప్పుగా ఇచ్చిందే. దేశం అంతా మఠం దివాళా తీయబోతోందని చెప్పుకొంటున్నారు. మీ కార్యాలయంలో ఇవ్వాళ్ల, రేపు అని తిప్పుతూనే ఉన్నారు. అడిగి అడిగి గొంతు బొంగురు పోతోంది. ఈ రోజు వదిలేది లేదు. ఎన్ని సాకులు చెప్పినా వెళ్లేది లేదు'' అంటూ పట్టుదలగా కూర్చున్నారు. స్వామివారికి ఏమి బదులు చెప్పాలో తెలియలేదు. ఏమి చెప్పకపోతే ఆమె తనను పూజ చేయనిచ్చేలా లేదు. ''మీరు అప్పు ఇచ్చినట్టు దస్తావేజులో, పత్రాలో ఉంటాయి కదా! పట్టుకొని రండి'' అని చెప్పారు. అప్పటికి ఆమె వెళ్ళిపోయారు. చంద్రమౌళీశ్వరుడు ఊరేగింపు కోరుతున్నాడేమో ననుకొని స్వామివారు విజయయాత్రకు బయలుదేరారు.

క్రీ.శ.. 1897 - 1900 వరకూ పర్యటన చేశారు. మాయవరం, తిరువారూరు, ఆవడియార్‌ కోయిల్‌లలో చాతుర్మాస్యాలు చేసి మళ్ళీ వేదాంతాభ్యాసంకై కుంభకోణం చేరి తిరువిసైనల్లూరు వేంకటసుబ్బుశాస్త్రిగారిని పెట్టుకొని వేదాంతభ్యాసం చేయ మొదలిడినారు. 1904 నుండి తిరిగి పర్యటన ఆరంభించారు. ఆర్కాటుజిల్లాలలో గ్రామగ్రామం పర్యటన చేశారు. ధర్మ ప్రచారం చేశారు.

ఒకసారి మన మహాస్వామివారి వద్దకు ఎంతో బీదస్థితిలో యాచన కోసం ఒక బ్రాహ్మణుడు వచ్చారు. పరిచారకులు విసుక్కొన్నారు. శ్రీవారు ఆయన తండ్రి పేరు, తాత పేరు ఫలానానా? అని కనుక్కొన్నారు. అవునన్నాడు ఆ అగంతకుడు. వెంటనే శ్రీవారు అతనికి భోజనానికి, బట్టలకు, కొంత ద్రవ్యానికి ఏర్పాటు చేసి పంపించి పాపం వాణ్ని విసుక్కోవద్దురా! వాని తాత మన పరమ గురువుల కాలంలో కోటీశ్వరుడు అంటూ కధ ఆరంభించారు.

పరమగురువులు ఆర్కాటుజిల్లా పర్యటనలో ఉన్నప్పుడు దర్శనానికి ఒక కోటీశ్వరుడు వచ్చాడట. అతనికి అనేక ఓడలున్నాయి. మరి అతనికేమి వినాశకాలమో! నమస్కారాదులు అయిన తరువాత స్వామిని చూసి ఒక వెలితి నవ్వు నవ్వి ''జటిలో ముండీలుంచిత కేశ, కాషాయంబర బహుకృత వేషః..... ఉదర నిమిత్తో బహుకృత వేషః'' అన్నాడట. స్వామివారు మౌనముద్రాంకితులయ్యారు. ప్రక్కనున్న పండితుడికి ఎంతో కోపం వచ్చింది. ''మా కురు ధనజన ¸°వన గర్వం హరతి నిమేషాత్కాలాత్సర్వం'' అన్నారట. శ్రీవారు వారిస్తున్నా వినకుండా. ఆ పండితుని వాక్శుద్ధో, స్వామివారిని దూషించిన దోషమో అతని ఆస్తి యావత్తూ పోయి మనవడికి ఇప్పుడీ స్థితి వచ్చింది.

ఇప్పుడు శ్రీమఠంలో చాతుర్మాస్యాలలో భాష్యశాంతి జరిగినట్లు, ఈ స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు ప్రస్థాన త్రయ భాష్య శాంతి జరిగేది. వీరి భాష్యశాంతిలో తిరువిసైనల్లూరు సుబ్బుశాస్త్రి ఉండేవారు. కడలూర్‌ పశుపతినాధ అయ్యర్‌ వంటి ముమక్షువులు ఎంతోమంది స్వామివారితో పాటే ఉంటూ వేదాంతశ్రవణం చేసేవారు. స్వామివారు 1905 లో అరుణాచలంలోనూ, 1906 లో పెరుముక్కల్‌లోనూ చాతుర్మాస్యాలు చేశారు. 1907 ఫిబ్రవరిలో కంచికి నలభై మైళ్ల దూరంలో ఉన్న కలవై గ్రామంలో సిద్ది పొందారు.


Dharmakruthi  Chapters   Last Page