Dharmakruthi  Chapters   Last Page 

20. పరమేష్టి గురువులు

తంజావూరు పాలించిన శరభోజీ రాజాగారికీ పినతండ్రి అమర సింహరాజాగారికీ మధ్యనున్న తగాదా వలన అమరసింహరాజా తిరువిడై మరుదూరులో కోట కట్టుకొని జీవించనారంభించారు. పండిత పోషకుడు, పరమధార్మికుడు అయిన అమరసింహుని కుటుంబానికి వంశ పారంపర్యంగా సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కుటుంబం గురుత్వం వహిస్తూ వచ్చింది. వారి తరువాత వారి కుమారులు శేషాద్రిశాస్త్రిగారు ఈ బాధ్యత స్వీకరించారు. వారు ఋగ్వేదం సాంగోపాంగంగా చదువుకోవడమే కాక, ప్రయోగంలో కూడా నిష్ణాతులు.

శేషాద్రిశాస్త్రిగారు తిరువిడైమరుదూరు మహాలింగస్వామివారి ప్రసాదంగా కలిగిన కుమారునికి మహాలింగమనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొంటున్నారు. శ్రోత్రియ కుటుంబం అయినందువల్ల వారికి వైదిక సంస్కారములన్నీ విధివృత్తుగా జరిగినాయి. గర్బాష్టకములలో ఉపనయనం జరిగింది. తండ్రిగారి వద్దనే ఋగ్వేద నియమాధ్యయనం చేసి, ప్రయోగ విధులలో ప్రావీణ్యత సంపాదించారు. తిరువిడై మరుదూరు బ్రాహ్మణులందరూ, అగ్నికార్యము చేసి హోమభస్మాన్ని తిలకంగా ధరించి మహాదాన వీధిలో భిక్షాచర్యనాచరించే ఈ వటువును అబ్బురపాటుగా చూసేవారు.

స్పురద్రూపి, మహాతేజశ్శాలి, మహాబుద్దిశాలి సాంగోపాంగ ఋగ్వేదాధ్యాయి అయిన మహాలింగము మహాతపశ్శాలి అయిన కంచి కామకోటి 64వ పీఠాధీశ్వరులు శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారి దృష్టినాకర్షించారు. శ్రీచరణులు వారిని తమ వద్దనే ఉంచుకొని వేదాంతశాస్త్రమును బోధింపనారంభించారు. అంతేకాదు. శ్రీమఠములో నిర్వహించబడే హోమములు, వ్రతములు, పూజలు అప్పటికే ఋగ్వేద మంత్ర ప్రయోగములో అధికారమున్న మహాలింగము ఆధ్వర్యములో జరిగేవి. స్వాభావికముగా అణుకువ, వినయసంపత్తి గల ఈ షోడశ వర్షప్రాయుడైన బాలుడు అందరికీ ఆత్మీయుడై మెలిగారు.

తిరువానైక్కావల్‌ అఖిలాండేశ్వరీ దేవాలయ కుంభాభిషేకములో లౌకిక కార్య నిర్వహణ అంతా గణపతిశాస్త్రిగారి (మహాలింగముగారి పినతండ్రి) భుజస్కందములపై మోపబడగా, హోమాది కార్యక్రమముల నిర్వహణమంతా మహాలింగము కరకమలముచే నిర్వర్తింపబడింది. యాగశాల అంతా తానుగా అయి నిర్వహిస్తూ స్వామివారికి ఎంతో ప్రేమపాత్రులయినారు. తిరువానైక్కావల్‌ కుంభాభిషేకానంతరము కుంభకోణం తిరిగి వచ్చిన స్వామివారు తమ అవసాన కాలం గుర్తించి, శేషాద్రిశాస్త్రి దంపతుల అనుమతి పద్దతులలోనూ, మఠనిర్వహణములోనూ శిక్షణ ఇచ్చి 1851 లో సిద్ధి పొందారు. దీనితో మహాదేవేంద్రుల 40 ఏండ్ల పీఠాధిపత్యము ఆరంభమయింది.

పీఠాధిపత్యము స్వీకరించిన స్వామివారు కొన్ని సంవత్సరములు కుంభకోణములోనే ఉంటూ తమ తపోశక్తిని, శాస్త్ర పటిమను పెంపొందించుకొన్నారు. మహాస్వామివారు శ్రీమఠం ఖైదు అయిన కథలో చెప్పిన విధంగా ఈ స్వామివారు ఎంతో జాలి హృదయం కలవారు. వీరు ఆర్తత్రాణ పరాయణం, అన్నదానం, ఔదార్యముల మూలంగా మఠం ఆస్తులను కూడా కరిగించి ఖర్చు చేశారు.

శ్రీవారి పూజావిధానం అత్యంతరమణీయంగా ఉండేదని అనేక కృతులలో బహుధా ప్రశంసింపబడింది. చంద్రమౌళీశ్వరుని యోగలింగానికి పూజ చేస్తున్న సొగసు రెండు కళ్ళతో చూసి తీరవలసినదేనట. బిల్వదళాలలో పొరపాటున మూడో ఆకు లేకపోతే పూజచేస్తున్న స్వామివారి చేతినుండి అసంకల్పితంగా క్రింద పడిపోయేవట. అమ్మవారి పూజలకు, అలంకారానికి, చేయించే నైవేద్యాలకు అంతే ఉండేది కాదట. పూజ అయిన పిదప అమ్మవారి శోభను తిలకిస్తూ స్వామి కన్నీళ్లతో కరిగి పోయేవారట. తరువాతి కాలంలో మహాస్వామివారి పూజ చూసిన ఆ కాలపు పెద్దలు ఆ స్వామివారి పూజ పద్దతికి, మహాస్వామివారి పూజాపద్దతికీ మధ్యనున్న సారూప్యానికి ఆశ్చర్యపోయేవారు.

అంతేకాదు! వీరు దేశ##క్షేమం కోసం లెక్కలేనన్ని అతిరుద్ర, మహారుద్రాలు, సహస్ర చండీయాగాలు చేయించారు. ఋతిక్కులకు భూరి దక్షిణ ఇచ్చారు. నవరాత్రి పూజాకాలాల్లో రోజూ అనేక రకములైన పారాయణలు, పూజలు, హోమములు జరిగేవి. వీటన్నిటితో సన్యాసికి ప్రయోజనం ఏమిటి? లోకక్షేమం తప్పితే? ఆ కాలంలో అనంతమైన అన్నదానం జరిగేది.

శ్రీవారి సన్నిధిలో నిరంతరం భాష్యపాఠం జరిగేదట. ఆ రోజుల్లో మహామహాపాధ్యాయులైన మన్నారు గుడి పెరియవాగా ప్రసిద్ధి చెందిన రాజుశాస్త్రిగారు, హరిహరశాస్త్రిగారు, తిరువయ్యార్‌ బాలకృష్ణశాస్త్రిగారు వంటి మహాపండితులు తరచుగా శ్రీవారి సమక్షంలో వాక్యార్ధం చేస్తూ ఉండేవారట. స్వామివారికి స్వయంగా సంగీతంలో అభినివేశం ఉంది. అనేక మంది సంగీత విద్వాంసులు శ్రీవారి వద్ద తమ సంగీతాన్ని వినిపించి వారి మన్ననలనందుకోవడం మహా గౌరవంగా భావించేవారు. పాపనాశం శివం వంటి వాగ్గేయకారులు వీరిపై కృతులు కూడా చేశారు.

కొంతకాలం తరువాత ధర్మప్రచారానికి బయలుదేరిన స్వామివారు తంజావూరు ఒడయార్‌పాళెం, దక్షిణార్కాటు, తిరుచ్చి, కోయంబత్తూరు, మళయాళ దేశాలలో విస్తృత పర్యటన చేశారు. వీరు పండితులలోనూ, పామరులలోనూ ప్రతి ఒక్కరిని పలుకరించి మాట్లాడి, వారి సుగుణాలను ఉత్సాహపరుస్తూ, కష్టాలకు తరుణోపాయం ప్రసాదిస్తూ అందరికీ అత్యంత ప్రేమాస్పదులై ఉండేవారట. వీరు కోపమన్నదే ఎరుగరని చెబుతారు.

1878 లో పంచాంగ గణన రీతులపై వేంకటేశ్వర దీక్షితులు, సుందరశ్రౌతి ఒక పక్షంగానూ, తిరునల్వేలి కృష్ణజోశ్యులు వేరొక పక్షంగాను వివాదపడగా, స్వామివారు ఆ కాలంలో ప్రముఖ గణితశాస్త్ర పండితులయిన శ్రీనివాసయ్య, అప్పుశాస్త్రి అప్ఫదీక్షితులు మధ్యస్థులుగా ఇద్దరి వాదనలనూ ఆసాంతముగా విని, మధ్యస్థులు సుందర రామశ్రౌతి పక్షమైన దృక్సిద్ధాంతమే సమంజసమైనదని అభిప్రాయపడగా, స్వామివారు కూడా నిర్ణయాన్ని పరిశీలించి, శ్రీముఖం ద్వారా దృక్సిద్ధాంతమే సమంజసమైనదని కట్టడి చేశారు. దక్షిణదేశంలో, ఆంధ్రదేశములోనూ ఈ సిద్ధాంతమే ప్రస్తుతము ఎక్కువ ప్రచారంలో ఉంది.

కంచి పీఠాధిపతుల పూర్వీకులు ఎంతో మంది యావద్బారత విజయ యాత్ర చేసినట్లు వారి గురు సంప్రదాయం చెబుతోంది. స్వామివారు కూడా వారి పూర్వాచార్యుల బాటలోనే 1877 లో ఉత్తర దేశయాత్ర సంకల్పించారు. మాయవరం, చిదంబరం, వైదీశ్వరం, విల్లుపురం మీదుగా కాంచీపురం చేరి తమ మఠంలో కొంతకాలం ఉండి, మదరాసు మీదుగా తిరువట్రియూరు చేరారు. తిరువట్రియూరుకు కంచిపీఠానికి అనేక తరాలుగా సంబంధం ఉంది. శంకరుల విగ్రహం ఉన్న అతి కొద్ది శివాలయాలలో ఈ ఊరి దేవాలయము ఒకటి. ఇక్కడి అమ్మవారికి శంకరులే స్వయంగా శ్రీచక్రప్రతిష్ఠ చేశారని ప్రసిద్ధి. కంచి కామకోటి పీఠానికి ఇక్కడ స్వంత మఠమున్నది. పూర్వాచార్యుల సిద్ధి క్షేత్రములో కట్టిన బృందావనాలున్నాయి. స్వామివారు ఆలయ ప్రధాన దేవత అయిన త్యాగేశ్యరుని, అతి పురాతనమైన దక్షిణాముర్తిని, ఆదిశంకరుని, అమ్మవారిని దర్శించి ఆంధ్రదేశములో అడుగు పెట్టారు. మూడు ఏనుగులు, రెండు లొట్టిపిట్టలు, పది గుఱ్ఱపు బళ్ళు, నలభై ఎడ్ల బళ్ళు, ఆవులు, మూడు వందల మంది పరివారంతో యాత్ర సాగింది.

ఆంధ్రదేశ ప్రజల శ్రద్ధాభక్తులకు సంతుష్ఠులయిన స్వామివారు యాత్ర ఎంతో నిదానంగానే కొనసాగించారు. దారిలోని సంస్థానాధీశ్వరులైన కార్వేటి నగరపు రాజా వంటి వారి ఆహ్వానములను అందుకొని, వారి దేశములలోని ముఖ్య గ్రామములను పావనము చేస్తూ, ధర్మ ప్రచారము ముఖ్యకార్యంగా యాత్ర సాగించారు.

పూర్వాచార్యుల కాలంలో ఆరంభించబడిన పీఠవ్యతిరేక ప్రచారము వీరు చేరక ముందే అయా సంస్థానములకు వెళ్ళింది. అక్కడి సంస్థానాధీశ్వరులందరూ సభ చేసి ఆధారాలను పరిశీలించి, కంచి కామకోటిపీఠాన్ని ఆదిశంకరులు అదిష్ఠించిన సర్వజ్ఞ పీఠంగా గుర్తించి, స్వామివారిని ఎంతో ఆదర భావంతో ఆహ్వానించారు. శ్రీమఠపు ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి అందరికీ ఈ పరిక్రమ ఎంతో ఉపయోగకారి అయింది. విజయనగర రాజసంస్థానపు పండితులు తాము ఈ దుష్ర్పచారాన్ని ఖండించడమే కాక, తగిన సమాధానమియ్యవలసినదని మదరాసు మహాజన సభను కోరడం జరిగింది. తత్ఫలితమే ''శంకరతత్త్వ సుబోధిని'' అనే పేరుతో ఏలూరు వాస్తవ్యులు గాధిజగన్నాధపాకయాజి గారిచే వ్రాయబడిన గ్రంథము.

పీఠాపురం తుని సంస్థానాల మీదుగా 25.7.1865 న శనివారం ఉదయం పదిగంటలకు విజయనగరము (తూర్పు ఆంధ్ర) విజయం చేశారు. స్వామివారి ఈ విజయనగర విజయయాత్ర ఆ సంస్థాన పక్షాన రికార్డు చేయబడి ముద్రించబడినది. వారి మాటలలో విజయనగరమునకు స్వామివారిని ఆహ్వానించిన తీరు ఈ దిగువ వివరించబడింది. ''శ్రీ జగద్గురు భగవత్పాదులు శ్రీపీఠ పరివారంతో విజయనగరమునకు విజయము చేయునవసరమున శ్రీ విజయనగర సంస్థానము రెండేనుగులు, తురుపు సవర్లు, కుడతా ఘాట్లు, లౌక్యులు, పండితులు, పురోహితులును, నయోధ్యప్రాంతమునకు ముందుపోయి, శ్రీవారి నెదుర్కొని, భక్తిపూర్వకముగా స్వాగతమొనర్చి, పాలకీ నధిరోహించి ఉన్న శ్రీవారిని తీసుకొనివచ్చి, శ్రీ ఓరుగంటి లక్షీకాంతముగారింట్లో నిలిపిరి. బ్రాహ్మణ భోజన నిమిత్తము 300 మందికి వలసిన సామాగ్రి శ్రీమఠముకు సమర్పించబడినది. 26వ తేదీ వ్యాసపూజ అనంతరము మహారాజావారు స్వామివారికి వ్యాసపూజ చేసి 116/- రూ.లు 600 ల మందికి భోజన సామాగ్రి సమర్పించినదే కాక, శ్రీవారికి నగరములో ఏర్పాటుకాని రోజులలో రోజుకు 25 రూ.లు చొప్పున సంస్థాన పక్షాన భిక్ష చేయవలసినదని'' ఆదేశించారు. ఆ రోజుల్లో బంగారం తులం 13 రూ. లు ఉండేది.

''23.9.1885 - భాద్రపద శుద్ద బుధవారము. శ్రీ పూజ్యపాదులకు శ్రీమహారాజావారు భిక్షమొనర్ప సంకల్పించుటచే నీ యుదయమున బ్రహ్మశ్రీ ద్వారకా భమిడిపాటి పెద సూర్యనారాయణశాస్త్రిగారు శ్రీవారికి భిక్షావందనమొనర్చిరి. పిమ్మట శ్రీచరణులను స్వాగతదినోత్సవ తుల్యమగు నుత్సవముతో కోటకు తీసుకొని వచ్చిరి. శ్రీ భగవత్పాదులాందోళికా నిహితదేవ పురస్కృతులై తమ ఏనుగుపై కట్టిన అంబారీపై గూర్చుండి సపరివారముగ కోటకు విజయము చేయు సమయమున దివాన్‌జీ సాహేబువారును, రాజపరివారమును కోటయొద్ద శ్రీవారి నెదుర్కొని లోనికి దీసికొని వెళ్ళిరి. కోటలో శ్రీమహాలక్ష్మీ సన్నిధానము యొద్ద శ్రీవారేనుగు నుండి దిగి, శ్రీ మహాలక్ష్మీసన్నిధి నెదురుగ బీఠముంచిన స్థలమున శ్రీవారు కూర్చుండి, రాజపరివార మొనర్చు సాష్టాంగ నమస్కారముల నందుకొనిరి. స్నాన జప పూజాద్యనుష్ఠానములు పూర్తియైన పిమ్మట రాత్రి 7 గంటలకు శ్రీవారికి భిక్ష జరిగినది. మహాబ్రాహ్మణ సమారాధనమును జరిగెను. ఈ రాత్రి 10 గంటలకు శ్రీమహారాజావారు, శ్రీమహారాజ కుటుంబమువారును శ్రీ మహాలక్ష్మీ సన్నిధికి విజయము చేసి, శ్రీమహాలక్ష్మీగణశుల సందర్శించుకొనిన పిమ్మట శ్రీపీఠసన్నిధిని శ్రీశ్రీశ్రీ పెదమహారాణి సాహేబావారొక మొహరును, శ్రీరీవా మహారాణీవారును, శ్రీమహారాజావారును, శ్రీచిన మహారాణీవారును ప్రత్యేకముగ నొక్కొక గిన్నీకాసు నిమిత్తము రు.13/-ను సమర్పించిరి. శ్రీమహారాజావారు పెద సూర్యనారాయణశాస్త్రిగారిచే శ్రీపాదుకలకు బాదపూజ జరిపించి అష్టోత్తర సహస్రనామార్చనకై రు. 1116/- సమర్పించిరి. పీతాంబరముల నిచ్చిరి. శ్రీమహాలక్ష్మీ మందిరము నెదుట సానిమేళములు రెండాడు చుండెను. శ్రీస్వాములవారికిని శ్రీపీఠస్థ దేవునికిని మధ్యను పరదా కట్టబడెను. శ్రీస్వాములవారిసన్నిధిని పెదసూర్య నారాయణ శాస్త్రిగారుండిరి. శ్రీస్వాములవారి సన్నిధిని పరదాలోను చిత్రాసనములు వేయబడెను. శ్రీమహారాజకుటుంబమునకును శ్రీభగవత్పాదులకును బరదాలో నుండి సంభాషణము జరిగెను. శ్రీ చరణుల సన్నిధిని శ్రీమహారాజావారు సాలువుల జోడును రు. 116/- సమర్పించి, అచటనున్న చిత్రాసనమున ఉపవసించిరి. శ్రీజగద్గురువులు శ్రీమహారాజ కుటుంబమునకు ప్రత్యేకముగ నొక్కక్కరికిని సాలువుల జతను, వెండి గలాసులు, వెండి కుంభకోణము, గుల్లీలు, మంత్రాశ్రీతలును మున్నగు ప్రసాదముల ననుగ్రహించిరి. శ్రీబాబుసాహేబువారి కుటుంబమునకును, ప్రత్యేకముగ పీతాంబరాది ప్రసాదముల నిచ్చిరి. శ్రీపీఠాధీశుల యాజ్ఞను పొంది శ్రీమహారాజకుటుంబము రాత్రి 1.30 గంటలకు నగరులోనికి విజయము చేసిరి''.

కోటలో శ్రీవారు రెండు మూడు రోజులుండి తమ విడిదికి వేంచేశారు. శ్రీవారు కోటనుండి వెళ్ళిపోయే సమయములో కీంఖాపు జూవాలుతో అలంకరించిన ఏనుగును శ్రీవారి సేవార్ధము సమర్పించారు. 23.10.1985 న కన్యాశుల్క విషయకమైన నిషిద్దపత్రికను శ్రీవారు దయచేశారు. 29.10.85 న మహారాజాగారికి స్వామివారు పంచసూత్ర స్పటిక లింగాన్ని దయచేశారు. మహారాజావారు స్వయముగా మాద్యాహ్నిక పూజ చేశారు. స్వామివారు ఈ ఊరిలో ఉన్నంత కాలము మహారాజులగారి కుటుంబానికి చందన కుంకుమాది ప్రసాదములు, భోజనమును శ్రీ పీఠమునుండే అనుగ్రహింపబడినది.

విజయనగర విజయానంతరము స్వామివారు బొబ్బిలిరాజావారి ప్రార్థనపై బొబ్బిలి విజయం చేసి బరంపురం మీదుగా ఒరిస్సాలో ప్రవేశించారు. పూరీ మహోదధిలో స్నానం చేసి జగన్నాధుని దర్శనం చేసి విమలా మఠాధిపతులచే సమ్మానింపబడినారు. ఇక్కడ నుండి వారణాసి పోవడమా, తిరిగి మరలడమా అనే విషయం మీద దీర్ఘకాలం యోచించారు. ప్రజలందరూ మత్య్సభుక్కులుగా ఉండటమూ, ఆచారము కొరతగా ఉండటమూ చూసి కుంభకోణము తిరుగు ముఖము పట్టారు.

తిరుగుముఖంలో తాము ముందు విజయం చేసిన సంస్థానాలకు వెళ్ళక క్రొత్తదారిలో క్రొత్త క్రొత్త గ్రామములలో ప్రజలకు ధర్మబోధ చేస్తూ వేంకటగిరి సంస్థానాధీశుల పూజలు స్వీకరించి కాళహస్తి సంస్థానం విజయం చేశారు. కాళహస్తి రాజా శ్రీవారికి దంతము నగిషీ చేయబడిన సింహాసనాన్ని సమర్పించి పాదపూజ చేశారు. (ఈ సింహాసనం మహాస్వామివారు కలవైలో ఉండగా కాళహస్తి రాజా కుటుంబసభ్యులచే మహాస్వామివారికి స్వాధీనం చేయబడింది). అక్కడ నుండి తిరుమల విజయం చేసి ఆలయ మర్యాదలతో వేంకటేశ్వరుని దర్శించి తిరువేంగాడు చేరారు. తిరువేంగాడులో కామకోటి పూర్వపీఠాధిపతులయిన సర్వజ్ఞ శివేంద్రుల అదిష్ఠానం ఉంది. అధిష్ఠానాన్ని పూజించి మళ్ళీ మహామఖానికి కుంభకోణం చేరారు. ఎంతో కాలం తరువాత కుంభకోణం చేరిన స్వామివారి దర్శనానికి ఊరు ఊరు విరగబడింది. మళ్ళీ మఠంలో యధావిధి, పూజలు, హోమాలు, సంతర్పణాదులూ మొదలైనాయి.

కొంతకాలానికి రామేశ్వరయాత్ర ఆరంభించిన స్వామివారు కొచ్చిన్‌ సంస్థానాధీశుల ఆహ్వానంపై మళ్ళీ కేరళ ప్రాంతాలకు విజయం చేశారు. ఒడయార్‌పాళెం పాలక్కాడ్‌ మీదుగా కోజికోడ్‌ కొచ్చిన్‌ చేరారు. అక్కడ కొచ్చిన్‌ రాజుగారి చేత బహుధా సన్మానించబడి తిరుచిరాపల్లి మీదుగా జంబుకేశ్వరము చేరారు. తిరువానైక్కావల్‌లో తమదైన మఠంలో కొంతకాలముండి శ్రీరంగనాధుని సేవించారు. శ్రీరంగదేవాలయ దర్శనానికి వచ్చే ముఖ్యుల పేర్లు నమోదు చేసే రివాజు ఉన్నది. కంచి పీఠాధిపతుల పేర్ల ముందు మాత్రం జగద్గురు పదం ఉపయోగించడం విశేషం.

పుదుక్కోట విజయం చేసిన స్వామివారు అక్కడి రాజా చేత బహుధా సమ్మానింపబడి, వారిచే కనకాభిషిక్తులయ్యారు. ఆ రోజుల్లో 36,000 రూ.లు విలువగల బంగారం శ్రీవారికి సమర్పించబడింది. అక్కడ నుండి రామనాధపురం చేరి అక్కడి రాజా సేతుపతి వెంటరాగా రామేశ్వరం విజయం చేశారు.

ఆ రోజుల్లో వెంకట్రామయ్యర్‌ అనే ఒకరు శివపురాణం అత్యంత రమణీయంగా చేప్పేవారట. మైకులు లేని కాలంలో వారి ప్రవచనానికి వందల మంది శ్రోతలు వచ్చి సమ్మోహితులై వింటూ ఉండేవారట. తన శిష్యులైన వెంకట్రామయ్యర్‌ గ్రామానికి విజయం చేసిన స్వామివారు పదిరోజులు వారి ప్రవచనము ఆసాంతము విని వారిని అనుగ్రహప్రసాదాలతో సన్మానించారు. శ్రీవారు భక్తితో కూడిన జ్ఞాని. శివ అనే పదం వింటూనే పరవశించి పోయేవారట.

మానామధురై మీదుగా శివగంగ సంస్థానాధీశులను అనుగ్రహించి నాటుకోటి చెట్టియార్ల కోరికపై తిరుపుత్తూరు మీదుగా ఇలయాట్రం గుడి చేరారు. అగ్రహారంలో చెట్టియార్లు వారి కులదైవమైన నిత్యకల్యాణి సహిత కైలాసనాధుల దేవాలయం అత్యంత రమణీయంగా కట్టించారు. అర్చకులు, పరివారం ఉండేందుకు వసతి, వేద పాఠశాలకు వసతి, కొలను ఇవన్నీ శ్రీవారికి ఎంతో నచ్చినవి.

ఇలయాట్రంగుడిలో తనతోనే ఉంటున్న ఉదయంబాక్కం సీతారామశాస్త్రి పుత్రుడు శ్రీస్వామినాధన్‌కు సన్యాసాశ్రమం ఇచ్చి, మఠ నిర్వహణలో శిక్షణ నీయనారంభించారు.

ఒకరోజున దేవాలయ దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న స్వామి ఆలయ సమీపములోని ఒక చిన్న స్థలం ఆ గుడి ట్రస్టీకి చూపి ఈ స్థలం నాకీయగలరా అని అడిగారట. ట్రస్టీ అంత కంటే మంచి స్థలమే ఇస్తామన్నా అదే కావాలన్నారట. ట్రస్టీ మహద్బాగ్యం అలాగే ఇస్తామన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు స్వామివారికి నలత చేసింది. నాలుగు రోజుల తరువాత సాయంకాలం పూజ ముగించి బిల్వదళం ప్రసాదంగా స్వీకరించి, ఇలయాట్రం గుడి ఆలయం ప్రక్కనున్న ఈ బిల్వ వృక్ష దళములంత మనోహరంగా ఏ బిల్వదళములు ఉండవు. అంత మనోహరమైన బిల్వదళంతో చంద్రమౌళీశ్వరునికి తుదిగా పూజ చేశానన్నారట. రాత్రి తమ శిష్యస్వామితోనూ, కార్యనిర్వహణాధికారులతోనూ మాట్లాడి పంపివేశారు. రాత్రంతా తన మధురమైన కంఠంతో అమ్మవారిపై, చంద్రమౌళీశ్వరునిపై సంస్కృత శ్లోకాలు పాడుతూనే ఉన్నారట.

తెల్లవారుఝామున 4.30 గంటలకు కొలనులో స్నానాధికాలు ముగించుకొని దర్బాసనంపై కూర్చుని ధ్యానగతులై ఉన్నారు. పరివారజనం అలవాటు ప్రకారం దూరంగా కూర్చుని ఉన్నారు. స్వామివారు మధ్యలో ఒకసారి ''శంభో! చంద్రమౌళే'' అని పలికి తిరిగి సమాధిగతులయ్యారు. సూర్యోదయమైనా స్వామివారు కదలకపోవడంతో పరివారజనం, శిష్యస్వామి దగ్గరకు వెళ్ళి చూశారు. స్వామివారు బ్రహ్మలీనులై పోయారు.

స్వామివారు సూచించిన ఆలయం ప్రక్కన గల చిన్న స్థలంలోనే అధిష్ఠానం కట్టబడింది. శివలింగ ప్రతిష్ఠ చేయబడింది. శిష్యస్వామి స్వామివారికి ప్రియమైన బిల్వ దళాలతో పూజ చేశారు. ఇప్పటికీ చెట్టియార్ల నిర్వహణలో ఈ అధిష్ఠానం నిత్యపూజలు అందుకుంటోంది.

Dharmakruthi  Chapters   Last Page