Dharmakruthi  Chapters   Last Page

2. కంచి కామకోటీపీఠము - ఆదిశంకరులు

''పదం భూషయతే కాంశ్చిత్‌ కేచిత్తద్భూషయన్తిచ

మిధోభూషణ భూష్యత్వం క్రమ ప్రాప్త మిహాద్బుతమ్‌''

''కొందరికి పదవి అలంకారము. మరి కొందరు పదవికే శోభ##తెస్తారు. ముందుగా పదవి వలన శోభను పొంది తరువాత పదవికే శోభను గూర్చు ఈ పద్దతి మహాద్బుతమైనది'' ''జగద్గురు ప్రశస్తి'' అనే గ్రంథములో జటావల్లభుల పురుషోత్తంగారు శ్రీవారి గురించి చెప్పిన శ్లోకం ఇది. ఆర్ష విద్యాలంకారులు, మహాపండితులు, అద్వైత సంప్రదాయముపైనా, ఆదిశంకరులపైనా అనన్యమైన భక్తితాత్పర్యము కలిగిన జటావల్లభులవారు మహాస్వామివారు సాక్షాత్తు ఆదిశంకరుల అధిష్ఠించిన కంచి సర్వజ్ణ పీఠ ఆచార్య పదమునకే వన్నె తెచ్చారనడం ఇక్కడ ముఖ్యమయిన విషయం. ఎలాంటి మహోన్నతమయిన పీఠానికి శ్రీవారు వన్నె తెచ్చారని వారు నమ్ముతున్నారో మనం చెప్పుకోవాల్సి ఉంది.

తమ 13 ఏండ్ల చిఱుత ప్రాయంలో పీఠాన్ని అధిష్ఠించి, 87 సంవత్సరములు సాగించిన తమ ఆధ్యాత్మికసార్వభౌమత్వంలో, ఏ చిన్నపని చేసినా, ఏ పీఠ ఔన్నత్యాన్ని ఏ ఆదిశంకరుల మహోన్నతిని అనుక్షణం జ్ఞాపకం ఉంచుకొని, తమ చర్యల ద్వారా వారి మహోన్నతికి మచ్చరాకూడదనే ఒక "healthy fear" తో తమ ధర్మాన్ని నిర్వర్తించారో అట్టి పీఠచరిత్ర గురించి, అట్టి ఆదిశంకరుల గురించి స్మరించకుండా శ్రీవారి చరిత్ర చెప్పుకోవడం ఉచితం కాదు. ధర్మాకృతి అయిన మహాస్వామినే నిత్యం జాగరూకులుగా ఉండేట్లు చేసిన ఆపీఠ చరిత్ర ఎట్టిది?

సప్త మోక్షపురులలో దక్షిణాదిన ఉన్న ఏకైక నగరం కంచి, కంచి అంటే మొలనూలు లేక ఒడ్డాణం అని అర్థం. కాంచీపురం భూదేవికి నాభిస్థానంగా వివిధ పురాణాలలో, పురాతన గ్రంధాలలోను అభివర్ణించబడింది. శాక్తేయులకు మూడు ముఖ్యమైన పీఠములలో ప్రధానమైన కామరాజపీఠము, శైవులకు ప్రధానమైన పృథ్వీలింగ క్షేత్రము, వైష్ణవులకు ప్రధానమైన వరదరాజ స్వామి దేవాలయము ఈ కంచి లో ఉన్నవి.

ఇక్కడి శక్తి కంచి కామాక్షి, ఈ పీఠం హయగ్రీవునిచే అర్చించబడినది. ప్రపంచంలోని శక్తినంతా తనలోనికి ఆకర్షించుకొనిన కామకోటి బిలాకాశం కామాక్షీ సన్నిధిలోనే ఉన్నది. కంచి యావత్తూ ఈ శక్తి చిరాకాశరూపంలో వ్యాపించి ఉన్నది. అందువల్లనే ఊరిలో ఉన్న 108 శివాలయాలలోనూ అమ్మవారికి ప్రత్యేక మందిరం లేదు. శ్రీవిద్యకు ప్రధానమైన లలితా సహస్రనామం, లలితా త్రిశతి వంటి అన్ని స్తోత్రాలలోనూ, గ్రంధాలలోనూ కామకోటి ప్రసక్తి ఉన్నది. ఈ ఊరిలో ఏ దేవాలయంలో ఏ ఉత్సవమైనా ఊరేగింపు కామక్షీదేవికి ప్రదక్షిణంగా తీసుకొని వస్తారు. చివరికి తురకలు కూడా తమ ఊరేగింపు అమ్మవారికి అప్రదక్షిణంగా చేస్తారు. కంచిలోని కామరాజ పీఠాన్ని శ్రీరాముడు, బలరాముడు వంటి పురాణపురుషులు, హయగ్రీవుడు, అగస్త్యుడు, దుర్వాసుడు, వ్యాసుడు మొదలైన మహాపురుషులు సేవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వైదికములైన శైవ, శాక్తేయ, వైష్ణవ, కౌమార సంప్రదాయాలే కాక, అవైదికములైన కాపాలిక, తాంత్రిక, జైన, బౌద్ధ మతాలకు కూడా ఒకప్పుడు ఈ క్షేత్రాము ప్రధాన కేంద్రంగా ఉన్నది. అద్వైత సంప్రదాయానికి చెందిన ఈ క్షేత్రం కాలక్రమేణా తాంత్రిక పూజా విధానాలకు పరివర్తన చెందగా, ఆదిశంకరులు సాలగ్రామశిలపై శ్రీ చక్రమును స్వయముగా లిఖించి, ప్రతిష్ఠ చేసి, అద్వైత సంప్రదాయాన్ని పుసరుద్దరించారు. అప్పటి నుండి అనగా రమారమి 2500 సం.. నుండి ఆదిశంకరులచే అధిష్ఠింపబడి, అవిచ్చిన శిష్య పరంపరలో వెలుగొందుచున్న ఈ కంచి కామకోటి పీఠము, కాంచీపురము అద్వైత సంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా పరిఢవిల్లినవి.

Dharmakruthi  Chapters   Last Page