Dharmakruthi  Chapters   Last Page

18. ప్రిన్స్‌ ఆర్ద్రర్‌ పాత్రలో

1906 వ సంవత్సరంలో గిని నాలుగో ఫారంలోనికి వచ్చారు. పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. కింగ్‌జాన్‌ నాటకం ప్రదర్శించాలని ప్రధానాధ్యాపకుల అధ్యక్షతన ఉన్న ఉత్సవ కార్యవర్గం నిర్ణయించింది. పెద్ద క్లాసులలో ఉన్నవారెవరూ ప్రిన్స్‌ ఆర్ద్రర్‌ పాత్రకు సరియైన వారుగా అధ్యాపకులకు తోచలేదు. వారందరూ గినికి ఆంగ్లభాషపై గల అధికారం, చక్కటి ఉచ్ఛారణ ఎరిగిన వారు. అందువలన ప్రిన్స్‌ ఆర్ద్రర్‌ పాత్రకు గిని సరి అయిన వాడని వారంతా నిర్ణయించారు. వీరి సామర్ద్యంపై అధ్యాపక వర్గానికి అంతటి నమ్మకం మరి! తమ ఆర్ధిక వెసులుబాటు అంతంత మాత్రమే అయినా కుమారుని ఉత్సాహం, అతనిపై అధ్యాపకులుంచిన నమ్మకం దృష్టిలో ఉంచుకొని తండ్రిగారు ఆ పాత్రకు తగిన దుస్తులు సమకూర్చుకోవడానికి అయ్యే ఖర్చు భరించడానికి ఒప్పుకొన్నారు. రెండు రోజులలో ఆ పాత్రకు కావలసిన భాగాలు క్షుణ్ణంగా వల్లె వేసుకొన్నారు గిని. నాటక ప్రదర్శనం రోజు రానే వచ్చింది. వారు తమపాత్రలో పూర్తిగా లీనమయిపోయారు. వారి హావభావ ప్రదర్శన, ఆంగ్లేయములో వారి అసమానమైన ఉచ్ఛారణ ప్రేక్షకుల మనస్సును కదిలించి వేసింది. డైలాగు పంక్తి పంక్తికీ కరతాళ ధ్వనులతో వారిని ఉత్సాహపరిచారు. వారు పాత్రను నిర్వహించిన తీరు ప్రధానాధ్యాపకునితో సహా అందరి అధ్యాపకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి వేసింది. శ్రీస్వామినాధన్‌ ప్రతిభను వారందరూ శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వద్ద వేనోళ్ల పొగిడారు. అభినయములో ప్రధమ బహుమతి మరి వీరిని కాక ఎవరిని వరిస్తుంది? అయినా ఆధ్యాత్మక సార్వభౌములు కానున్న స్వామి రాకుమారుని పాత్రలో అత్యంత సహజంగా లీనమవడం ఆశ్యర్యమేమున్నది? ఒక మేధావిని, ఏ విద్యలో పెట్టినా ఆ విద్య యొక్క పారమును ముట్టి దాని అవతలనున్న అపారమైన వస్తువును గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఏ శాస్త్రం అయినా పూర్తిగా అభ్యసించిన తరువాత దాని వెనుక అనంతమైన వస్తువున్నట్టు లీలగా అవగతమవుతుంది. అయితే స్వామివారి విషయంలో లౌకిక విద్యలలో పూవు పుట్టగానే వచ్చే పరిమళం తెలిసినప్పడికీ, వారి ఆధ్యాత్మిక తృష్ణ, ఈ చదువుకు అతీతమయిన వస్తువును గురించిన జిజ్ఞాస వారి పరమగురువుల దర్శనంతో ఏర్పడిందని చెప్పుకోవాలి. స్వయంగా స్వామివారు దర్శనం చేసే అవకాశం లేకపోయినా మహామహిమాన్వితులయిన పరాపర గురువులు సుదర్శన మహాదేవేంద్ర సరస్వతీ స్వామివారు పూర్వాశ్రమంలో వీరి పెద్ద తాతగారికి కుమారులే కదా! వారి అనుగ్రహం కూడా వీరిపై బీజప్రాయంగా ఉండి ఉండాలి. శ్రీవారి చరిత్రను సాగించే ముందు తురీయాశ్రమములో ఉన్న సన్యాసులు తమ గురు పరంపరలో తమపై నాలుగు తరాల గురువులను ప్రార్ధించుతారు. కాబట్టి శ్రీవారి పరాపర, పరమేష్టి, పరమగురువుల చరిత్ర ఇక్కడ చెప్పుకొందాం.

Dharmakruthi  Chapters   Last Page