Dharmakruthi  Chapters   Last Page

17. ఉపనయనం - సంధ్య

1905వ సంవత్సరం గినికి ఉపనయనం అయింది. ఆ సమయంలో ఆర్కాటు జిల్లాలలో పర్యటిస్తున్న శ్రీకంచి కామకోటి పీఠ 66వ శంకరాచార్యులవారు వటువును ఆశీర్వదిస్తూ మంత్రాక్షతలు పంపారు. తమ సంధ్యావందనం, ఆటల గురించి శ్రీవారు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ''ఆ రోజుల్లో మా స్కూలులో మూడే మూడు ఆటలు ముఖ్యంగా ఉండేవి. ఒకటి గోడుంబిళ్ల. దాన్నే అభివృద్ధి, మార్పులు చేసి ఇప్పుడు క్రికెట్టుగా రూపొందించారు. ఆ ఆటంటే అసలు ఇష్టం ఉండేది కాదు. రెండో ఆట ఫుట్‌బాల్‌. ఫుట్‌బాల్‌ ఆడటానికి శరీర ధారుఢ్యం సరిపోనందున పూవులా ఉండే బంతితో ఆడే బాట్‌మింటన్‌ చాలా ఇష్టంగా ఆడేవాడిని. క్లాసులు అయిపోయిన తరువాత సూర్యాస్తమయం వరకూ ఆడి సంధ్యాకాలంలో ఆట ఆపి స్కూలు ప్రక్కనే ప్రవహించే సెలయేటికి వెళ్ళేవాళ్లం. ఊరి బయట ఇళ్ళు కప్పులు కనిపించే ఆరుబయట కూర్చుని సంధ్యావందనం చేయాలనుకొనే పెద్దవాళ్లు విభూతి మొదలైన సరంజామాతో అక్కడికి వచ్చేవారు. మేము గబగబా పంచె, చొక్కా విప్పేసి, గోచిగుడ్డతో సెలయేటిలో దిగి ముఖం, కాళ్లూ, చేతులు కడుక్కొని, ఆ పెద్దవాళ్ళను అడిగి విభూతిపుచ్చుకొని సాయం సంధ్య వార్చుకొనేవాళ్ళం. పంచె బడి బట్టలని అనుమానం. సంధ్యావందనం అయిన తరువాత ఇంకా వెలుగు ఉంటే మళ్ళీ ఆడేవారం. చీకటి పడుతుండగా ఇంటికి చేరేవాళ్ళం. ఆటలకు టీమ్‌గా పోయినట్లే సంధ్యావందనానికి కూడా టీమ్‌గా వెళ్ళేవాళ్లం'' అని తమ సాయం సంధ్యా వృత్తాంతాన్ని వివరించారు.

గిని ఇల్లు చేరేటప్పటికి అప్పుడప్పుడు రాత్రి 7 గం.. అయిపోయేదట. ఒకసారి వారి పెద్దన్నగారు తాము అప్పుడు చదువు కోసం మకాము ఉన్న కడలూరు నుంచి ఇంటికి వచ్చారు. గిని చీకటి పడిన తరువాత ఇంటికి రావడం చూసి కోపగించుకొని ఒకటి తగిలించి ''సాయం సంధ్య లేకుండా ఏమిటీ తిరుగుళ్ళు'' అని గద్దించారట. ''నేను నిజంగా సంధ్య వార్చకపోతే కొట్టడంలో తప్పులేదు. అయితే నుదుటన విభూతి అయినా చూడకుండా, నన్ను సంధ్యావందనం చేశావా అని అడుగకుండా కొట్టడం అన్యాయం కాదా!'' అని కన్నీళ్లతో ప్రశ్నించారట. అన్నగారు వెంటనే పశ్చాత్తాపంతో ''మన పూర్వీకులు చేసిన ఆచారానుష్ఠానాలు, వేదశాస్త్ర అధ్యయన అధ్యాపకత్వాలు మనము వదిలి వేశాము. కనీసం సకాలంలో సంధ్యావందనమైనా చేయడము లేదేమోనని కోపం వచ్చింది. నిజం తెలుసుకోకుండా కొట్టడం తప్పే'' అని పూజామందిరం దగ్గరకు పోయి దేవునికి నమస్కారం చేశారట. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు సారీ చెప్పే అలవాటు లేదు. తాతగారి పేరు పెట్టుకొన్నందుకు వారి ధర్మబుద్ధి, వ్యవహార దక్షత పుణికి పుచ్చుకొన్నారు శ్రీ గణపతి శాస్త్రిగారు.

వేదాధ్యయనం వంటి పెద్ద పనులు ఏమీ చేయకపోయినా సంధ్యావందనం మాత్రం విడువకుండా చేసేవాళ్లం అంటారు మహాస్వామి. ఇంకో పర్యాయం ఉపనయనం మొదలుకొని సన్యాసం పుచ్చుకొనేవరకు ఉదయానే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని, వేదము, సంస్కృతము చదువుకోవడానికి ఆచార్యులవారి వద్దకు వెళ్లి వచ్చి తిరిగి రాగానే, ఫలహారమో, భోజనమో చేసి స్కూలుకు పరిగెత్తుకు పోయేవాణ్ణి అంటారు. వేదాధ్యయనం వంటి పెద్ద పనులు చేయలేదనే దానికి గురుకుల పద్ధతిలో సాంగోపాంగంగా తమ స్వశాఖ అయిన ఋగ్వేదాధ్యయనం చేయలేదనే అర్ధం చెప్పుకోవాలి. తిండివనంలో ఋగ్వేదపండితులు లేరు. అందువల్ల గిని యజుర్వేద సూక్తములు, నమక చమకములు చెప్పుకొన్నారు. ఉపనయనం కాక ముందు చిదంబరంలో వారి పెత్తల్లి కుమారులు వీరి ఇంట్లో ఉండి వేదాధ్యయనం చేసుకొంటూ ఉండేవారట. వారు వల్లె వేసుకొంటుంటే వినికిడి వలన వీరు కూడా కంఠస్థం చేసి తిరిగి సుస్వరంగా, శ్రావ్యంగా చెబుతుంటే విని పెద్దవాళ్ళంతా ఆశ్యర్యపోయేవారట. అయితే వీరి మేనమామగారు ఉపనయనం కాని వారు వేదం చెప్పకూడదని వారించడంతో ఆగారు.

Dharmakruthi  Chapters   Last Page