Dharmakruthi  Chapters   Last Page

16. అమెరికన్‌ మిషనరీ పాఠశాలలో

గినికి ఇప్పుడు తొమ్మిది సంవత్సరములు. తండ్రిగారికి వీరి భవిష్యత్తు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. విల్లుపురం బోర్డుస్కూలు ప్రధానోపాధ్యాయులు శాస్త్రిగారి మిత్రులు. వారి ప్రోద్బలంతో గిని ఆ స్కూలులో మొదటి ఫారంలో చేర్చబడినాడు. ఆశ్చర్యంగా మళ్ళీ ఇంగ్లీషు చదువు ఎంతో చురుకుగా అబ్బడం మొదలుపెట్టింది. రెండవ ఫారం చదువుతుండగా మళ్ళీ శాస్త్రిగారికి బదిలీ అయింది. ఈ సారి గిని తిండివనం అమెరికన్‌ మిషనరీ స్కూలులో రెండవ ఫారంలో చేరాడు. వీరి చురుకుదనం తెలివితేటలు అక్కడి క్రైస్తవ అధ్యాపకులను ఎంతో అబ్బుర పరిచేవి. సబ్జెక్టులన్నింటిలోనూ, చివరకు బైబిల్‌ క్లాసులో కూడా వీరే ప్రధములుగా ఉండేవారు. శ్రీశామ్యూల్‌ అనే క్రైస్తవ అధ్యాపకునికి వీరంటే ప్రత్యేక అభిమానం. ఈయన అసమానమైన తెలివి తేటలు గుర్తించి ముందు ముందు వీరో మహావైజ్ఞానిక శాస్త్రవేత్త అవుతారని చెబుతుండేవారు. వీరు విద్యార్ధులందరికి ఆదర్శప్రాయులుగానూ, అధ్యాపకులకు గర్వకారణంగానూ ఉండేవారు.

గిని రెండవ ఫారం చదువుతున్నప్పుడు వారి ముఖ్యమిత్రులు శ్రీకృష్ణస్వామి. కృష్ణస్వామి తండ్రిగారు శ్రీ టీ.కే. వెంకట్రామయ్యగారు సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మిత్రులు వీరు న్యాయవాది. తెలుగువారు, పంచాయతీ నాయకులు. జ్యోతిశ్శాస్త్రము మొదలుగాగల ప్రాచీన శాస్త్రములందు లోతైన పరిజ్ఞానము కలవారు. మంచి అనుష్ఠాత. రెండవఫారం చదువుతున్నప్పటి గ్రూపు ఫోటోలో తాము వేసుకొన్నకోటు, టోపీ ఆ కృష్ణస్వామిగారివే నని ఆ ఫోటో చూస్తూ చెప్పారు స్వామివారు. అంతటి ఆత్మీయ మిత్రులు శ్రీ కృష్ణస్వామి.

Dharmakruthi  Chapters   Last Page