Dharmakruthi  Chapters   Last Page 

15. సంగీతాభ్యాసము

తరువాత సంవత్సరము పచ్చియప్ప పై#్రమరీస్కులులో నాల్గవ తరగతిలో చేరారు. ఆ సంవత్సరము గినికి చదువు సరిగా అబ్బలేదు. అన్ని సబ్జెక్టులలోనూ తక్కువ మార్కులే. ఈ పరిస్థితి శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రిగారికి ఆందోళన కలిగించింది. ఇక ఇంగ్లీషు చదువు లాభం లేదనుకున్నారు. పెద్ద కుమారునికి ఇంగ్లీషు బాగానే అబ్బుతోంది కదా! వీనిని సంగీతంలో పెడదాం. గొంతు ఎంతో మధురంగా ఉంటుంది, స్వరం బాగా వంటపడుతోంది అని నిర్ణయించుకొన్నారు.

శాస్త్రిగారికి సంగీతంపై ఎంతో అభిమానం. స్వామివారు ఒక సందర్భంలో తమ తండ్రిగారి గురించి చెబుతూ, నాన్నగారిది ఇంగ్లీషు ఉద్యోగం. ఇంట్లో ఉన్నంతసేపు సంగీత సాధన. ఫిరంగిపేటలో సాయిబ్బులందరూ వీరి మిత్రులు. ఆయనకు ఆచార అనుష్ఠానములు అంతగా లేవు. అంతగా లేవంటే మాతాతగార్లకు ఉన్నంత లేవు అని. మా అమ్మదయితే శ్రాద్దమడి. అంటారు. (శ్రాద్ద దినాలలో సామాన్యులు కూడా ఎంతో మడి పాటిస్తారు. పూర్వాచార పరాయణుల ఇళ్లల్లో మరీనూ. దీనినే శ్రాద్ధమడి అంటున్నారు స్వామివారు). ఈ సంగీతాభిమానం వల్లనే శాస్త్రిగారు తెలుగు కూడా నేర్చుకొన్నారట.

ఆ రోజులలో కేవలం రాగానికే ప్రాధాన్యతనిచ్చి అర్దం తెలియకుండా అరకొరగా పాడే అలవాటు లేదు. సంగీతం పాడేటప్పుడు సాహిత్యం అర్ధం చేసుకొని భావనష్టం లేకుండా పాడేవారు. కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులలో ఇద్దరు తెలుగులో కృతులు వ్రాశారు కదా! గినిని ఇంటి వద్దనే ఉంచి సంగీత విద్యకు ప్రాతిపదికగా సంగీతములోనూ, తెలుగులోనూ శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ఈ శిక్షణ ఆరునెలలు సాగింది. ఈ ఆరునెలల శిక్షణకే మహాస్వామివారు విద్వాంసులను సైతం ఆశ్యర్యపరిచే విధంగా సంగీతములోని మెలుకువలను ఎత్తి చూపేవారు. తెలుగే మాతృభాష అనేంత హృద్యంగా తెలుగులో మాట్లాడేవారు. తండ్రిగారికి వెంట వెంటనే బదిలీలు అవటంతో ఈ సంగీత విద్యావ్యాసంగం ఆగిపోయింది. విల్లుపురం, తిండివనంలలో తెలుగు చెప్పేవారూ, సంగీతంలో సరి అయిన విద్వాంసులూ లేరు.

Dharmakruthi  Chapters   Last Page