Dharmakruthi  Chapters   Last Page 

13. చిదంబర అగ్ని ప్రమాదము

అప్పుడు గినికి అయిదేళ్ళు. చిదంబరం ఇలైమైక్కినార్‌ గుడిలో ఉత్సవం జరుగుతోంది. అ సమయంలో ఫిరంగిపేటలో ఉన్న శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రి ఈ ఉత్సవం చూడటానికి చిదంబరం బయలుదేరారు. తాను కూడా వస్తానని మారాం చేశాడు గిని. తన గారాబుల పట్టి కోరితే కాదనగలడా? కుమారునితో కూడి చిదంబరం చేరి తన సహోద్యోగి అయిన శ్రీవేంకటపతి అయ్యర్‌ ఇంట్లో బస చేశారు. రాత్రి భోజనాలయినాయి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమనీ, రాత్రి తాను వెళ్ళేటప్పుడు నిద్రలేపి తీసుకొని వెళతాననీ చెప్పి పుత్రుని పడుకోబెట్టారు. తీరా రాత్రి బయలుదేరేటప్పుడు చూస్తే పిల్లవాడు మంచి నిద్రలో ఉన్నాడు. లేపితే ఏడుస్తాడేమో. తల్లి కూడా దగ్గరలో లేదు అనుకొని తాము మాత్రం ఊరేగింపు చూడటానికి వెళ్ళారు శాస్త్రిగారు. ఆ రాత్రి ఊరేగింపులో కనీవినీ ఎరుగనంత పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఆ త్రొక్కిసలాటలో ఎలాగోలా తప్పించుకొని బ్రతుకు జీవుడా అంటూ ఇంట్లో పడ్డారు శాస్త్రిగారు.#

గినికి నిద్ర నుండి మెలుకువ వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయి ఉంది. ఎంతో కోపం ఏడుపూ వచ్చాయి. తండ్రి దగ్గర పెద్దగా ఏడ్చాడు. నిష్ఠూరమాడాడు. ఇంకా నయం. నీవు రాకపోవడమే మంచిదయింది. లేకుంటే ఆ త్రొక్కిసలాటలో ఏమయిపోయి ఉండేవాడివో అంటూ విషయం చెప్పి ఊరడించారు శాస్త్రిగారు. పిల్లవాడు నమ్మలేదు. తనను సముదాయించడానికి ఏదో సాకు చెబుతున్నారనుకొన్నాడు. గునుస్తూనే ఉన్నాడు. అయితే తిరిగి వెళ్ళేదారిలో అగ్నివాత బడిన ఇల్లు తదితర నిర్మాణాలూ చూసిన తరువాత నమ్మిక కలిగింది.

ఆ రాత్రి ఫిరంగిపేటలో ఉండిపోయిన మహాలక్ష్మమ్మగారికి ఒక కల వచ్చింది. చిదంబర అగ్నిప్రమాద దృశ్యం. జనమంతా బతుకు కొఱకై పరుగులెత్తే భయానక దృశ్యం. ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. కలే అయినా చిదంబరంలో అగ్నిప్రమాదం జరిగినట్లే కల రావాలా? పిల్లవాడు వద్దంటున్నా వినకుండా పట్టుబట్టి వెళ్లాడే. మనసంతా దుడుకు దుడుకుగా, భయం భయంగా ఉంది. అలాగే మనస్సు చిక్కబట్టుకొని తెల్లవారుఝాము వరకూ నామస్మరణ చేసుకొంటూ పడుకున్నారు. వాకిళ్లు ఊడ్చే సమయానికి పెరుగుతో పాటు ఊరి వార్తలు మోసుకొని వచ్చే పెరుగు అవ్వ ''చూశావా అమ్మా! ఎంత ఘోరం జరిగి పోయిందో! చిదంబర ఉత్సవంలో పెద్ద అగ్నిప్రమాదం జరిగిందట. ఎన్నో ఇళ్ళు కాలిపోయాయిట. ఎందరో విగత జీవులయి పోయారట'' అంటూ వివరాలు చెప్పజొచ్చింది. మహాలక్ష్మమ్మగారి పై ప్రాణాలు పైననే పోయాయి. ''అయ్యో! పిల్లవాడు కూడా వెళ్ళాడే, ఆ వేడిలో, ఆ తోపులాటలో ఈయన వీడిని పట్టుకోగలిగారో లేదో! నా బంగారు తండ్రి గిని ఎలా ఉన్నాడో ఏమో!'' అనుకుంటూ చిదంబరం నుంచి వచ్చేవాళ్ళేవరైనా ఉంటే వార్తలు తెలుసుకోవాలని రైలు స్టేషన్‌కు పరుగెత్తారు. అదిగో! దూరంగా తండ్రి చంకన గిని. ఆత్రంగా పరుగెత్తుకొని వెళ్లి కుమారుని గుండెలకు హత్తుకొని ''ఆ దేముడు నా కోసమే నిన్ను రక్షించాడు. నిన్ను వదిలి నేనుండలేనురా! ఇంక నిన్నెప్పుడూ ఎక్కడికీ పంపను. చివరకు నాన్నగారితో నయినా సరే!'' అంటూ బావురుమన్నారు ఆ మాతృమూర్తి. ఇంతకీ చిదంబర అగ్నిప్రమాదం నుంచి గినిని ఆ దేముడు రక్షించింది ఆ అమ్మకోసం కాదు. మనందరి కోసం! భక్తజనులందరి కోసం! ఆర్ష సంస్కృతీ పరిరక్షణ కోసం!


Dharmakruthi  Chapters   Last Page