Dharmakruthi  Chapters   Last Page 

12. స్వర్ణోదంతము

తమ నాలుగో సంవత్సరంలో ఒక రోజున గిని వరండాలో కాళ్ళాడించుకుంటూ కూర్చున్నారు. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. దారిని పోయే దానయ్య ఇది గమనించాడు. పిల్లవాని వద్దకు వచ్చాడు. పరిచయంగా నవ్వాడు. పిల్లవాని చేతికున్న బంగారు మురుగులను ముట్టకొని శీల లెక్కడున్నాయో పరీక్షించ సాగాడు. గినికి ఈ పోకడ అర్ధం కాలేదు. (అగంతకుడు తన పేరు పొన్నుస్వామి అని చెప్పాడు. పొన్ను అంటే బంగారం) అయినా మురుగులు మరమ్మత్తు చేయించాల్సిన అవసరం గుర్తుకు వచ్చింది. ''ఇదుగో పొన్నుస్వామీ! ఈ మురుగులు పట్టుకుని పోయి కొక్కెములు కొంచెం వదులుగా ఉన్నాయి కానీ, బిగించుకొని పట్టుకొని రా!'' అని ఆజ్ఞాపించారు. ''చిత్తం! చిత్తం! సాయంకాలనికల్లా బాగు చేయించి పట్టుకొని వస్తాను'' అని ఎంతో వినయంగా మురుగులు సంగ్రహించి ఉడాయించాడు పొన్నుస్వామి.

గిని తాను చేసిన ఈ ఘనకార్యానికి ఎంతో సంతోషించాడు. మురుగులు మరమ్మత్తుకు ఎంత తేలికగా ఏర్పాటు చేశామో అని అబ్బుర పడ్డాడు. పని చేసుకొంటున్న తల్లి వద్దకు పోయి ''చూశావా అమ్మా! మురుగులు మరమ్మత్తుకు ఇచ్చేశాను. సాయంత్రానికల్లా బాగు చేయించుకొని తీసుకొని వచ్చేస్తాడు పొన్నుస్వామి'' అంటూ తన ఘనకార్యాన్ని ఎంతో గొప్పగా వివరించాడు. ఇంట్లోవారికి విషయం అర్ధం అయింది. పిల్లవానిని మోసం చేసి ఎవరో మురుగులు ఎత్తుకు పోయారు. గబగబా బయటకు వచ్చారు. ఇంకెక్కడి పొన్నుస్వామి ఎంత వెతికినా కనిపించలేదు. ''వృద్ధాప్యం వచ్చినా ఇప్పటికీ తేలికగా మోసపోతూనే ఉన్నాను. లేదా ఏదో ప్రయోజనాన్ని అడ్డ దారిలో తొందరగా అందుకోవాలని అనుకుంటూనే ఉన్నాను'' అంటారు. ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న మహాస్వామివారు.

స్వామివారిని చిన్నతనంలో ఒక పొన్నుస్వామి చేసిన మోసానికి పరమేశ్వరుడు మనందరి చేత ఆ పాప పరిహారం చేయించారు. మహాస్వామి ఒప్పుకోకపోయినా ఆయనకు అనేక స్వర్ణాభిషేకాలూ, నవరత్నాభిషేకాలూ, స్వర్ణపుష్ప పాదపూజలు బలవంతాన ఒప్పించి మరీ చేయవలసి వచ్చింది. అనేక స్వర్ణకిరీటాలు, రుద్రాక్ష కిరీటాలు, వజ్రకిరీటాలు సమర్పించబడ్డాయి. అనేక స్వర్ణపాదుకలు అమర్చబడినాయి.

మొదటిగా జరిగిన కనకాభిషేకం శ్రీమఠంలో ముఖ్యుల సమక్షంలో శ్రీజయేంద్రసరస్వతీ స్వామివారిచే జరుపబడింది. శిష్యస్వామి పీఠానికి వచ్చిన కొత్త రోజులు. తమ గురువుగారి షష్ఠిపూర్తికి కనకాభిషేకం చేసుకోవాలనే కోరికను కాదనలేకపోయారు.

రెండవసారి స్వర్ణాభిషేకం చినకాంచీపురములో జరిగింది. శ్రీవారికి కనకాభిషేకం చూసి కనులారా చూడాలని ఒక వృద్ద భక్తుడు పట్టుబడుతూ వచ్చారట. స్వామి వాయిదా వేస్తూ వచ్చారు. ఆ భక్తునికి కంటికి శుక్లాలు వచ్చి కనులు కనబడటం మానేశాయి. ''ఇంక నీకు కళ్ళు కనబడటం లేదు కదా! ఇంకేం కనకాభిషేకం'' అంటూ విషయం దాటించడానికి ప్రయత్నించారు. ఆ ఎనభ్బై ఏళ్ల వృద్ధ భక్తుడు శ్రీవారి కనకాభిషేకం కనులారా చూడాలనే పట్టుదలతో ఈ రోజుల్లో ప్రమాదకరంగా ఎంచబడుతున్న కాటరాక్టు ఆపరేషన్‌ చేయించుకొని ''ఇప్పుడు నా కళ్ళు చక్కగా కనబడుతున్నాయి. ఇక మీకు తప్పదని ప్రార్ధించారు''. స్వామివారికి నిజంగా తప్పలేదు. మహావైభవంగా కనకాభిషేకం జరిగింది.

శ్రీవారు చెన్నపురి వచ్చిన సందర్భంగా కాంచీపురంలో జరిగిన కనకాభిషేకపు వైభవం చూడలేదని మేయర్‌ రామనాధ అయ్యర్‌ మొదలుగా గల పురప్రముఖులు బతిమాలి 1958 లో మద్రాస్‌లో స్వర్ణాభిషేకం ఏర్పాటు చేసుకొన్నారు.

అదే కాలంలో ఒకసారి బంగారు రజనులో కనకాభిషేకం చేయాలని శిష్యులు పట్టుబట్టారు. శ్రీవారు కామాక్షిదేవి ఆలయపు కోనేరులో ఈ అభిషేకం చేయించుకోవడానికి ఒప్పుకొన్నారు. అక్కడయితే మరి రజను అంతా నీటిలో కలిసిపోతుందని స్వామివారు నుంచోబోయే ప్రాంతంలో నీటిలో బండరాళ్ల మీద గుడ్డపరచి కదలకుండా రాళ్ళు పెట్టారట. స్వర్ణాభిషేకం అయిపోయింది. స్వామివారు పైకి వచ్చారు. జాగ్రత్తగా ఆ రజను పోగు చేయడానికి అనుయాయులు నీటిలో దిగుతున్నారు. స్వామివారు - ''ఆ బంగారమంతా కామాక్షీ కొలనులో శాశ్వతంగా ఉండిపోవాలని మీరు వేసిన గుడ్డ కాలితో ప్రక్కకి తొలగించివేశాను. అక్కడ మీకు ఏమీ దొరకదు. పైకి రండి'' అన్నారట.

నూరవ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీవారు ఇద్దరు ముఖ్యభక్తులకు కనాకాభిషేక ఏర్పాటు చేసుకోవడానికి విడివిడిగా అనుగ్రహించారు. రెండు కనకాభిషేకాలు జరిగాయి. కనీవినీ ఎరుగనంత బంగారం వచ్చి పడింది. శ్రీమఠపు ఆవరణ కిక్కిరిసి పోయింది.

ఈ బంగారమంతా ఏం చేశారనే ప్రశ్న మనలో కొందరికి ఉదయించవచ్చు. కొంత బంగారం వేద పరిరక్షణార్ధం ఉపయోగించబడింది. మిగతా బంగారం యావత్తు దైవకార్యాలకు, దేవాలయ పునరుద్దరణకు వినియోగించబడింది. వైష్ణవస్వాములకు రామానుజులపై గల భక్తికి స్వామివారు ఎంతో సంతోషించేవారు. శ్రీ పెరంబదూరు రామానుజ దేవాలయంపై స్వర్ణగోపురం చూసి ఆనందపడుతూ ఉండేవారు. ఇంత శ్రద్ద శంకరానుయాయులకు కూడా ఉంటే బాగుండుననుకొనేవారు. శ్రీవారి శత జయంతి సందర్భములో చేసిన ఒక కనకాభిషేకపు బంగారంతో కంచి కామాక్షి ఆలయగోపురపు రాగి రేకులపై బంగారు పూత కార్యక్రమం పూర్తిచేయడమే కాకుండా అదే ప్రాంగణములో ఉన్న శంకరుల ఆలయగోపురానికి బంగారంపై తాపడం చేసిన రాగి రేకులతో తొడుగు చేయబడింది. రెండోసారి చేసిన అభిషేకద్రవ్యంతో శ్రీమఠపు వెండిపూజామందిరానికి బంగారు తాపడం చేయబడింది.

ఇవన్నీ భక్తజనులు తాము కావాలనుకొని సమర్పించుకొన్నారు. కొన్నిసార్లు స్వామే స్వయంగా అడిగి బంగారం పుచ్చుకొన్నారు. అయితే దేవతల కోసం, వేద పరిరక్షణార్ధం.

చెంగల్పట్టులో ఒకరోజు తన దర్శనార్ధమై వచ్చిన ఒక సంపన్న గృహిణిని నూరుకాసులు బంగారు ఈయగలవా అని అడిగారు. ఆమె మహాప్రసాదం అంటూ అప్పటికప్పుడై తమ ఒంటి పైనున్న ఏభై కాసులు బంగారం సమర్పించి రెండు రోజులలో మిగతా ఏభై కాసులను సమకూర్చారు. ఆ నూరుకాసులూ వేదశాస్త్ర విద్వత్సింహాల హస్తాలకు సింహతలాటాలుగా అలంకరించాయి. మరొక సందర్భంలో సంపన్న గృహస్థులు తలకొక బంగారు కాసు ఇవ్వవలసినదిగా కోరారు స్వామివారు. అనతి కాలంలోనే కామాక్షీదేవి కంఠాన్ని వెయ్యకాసులమాల అలంకరించింది. ఇలానే చిదంబర నటరాజుకు వజ్రకుంచిత పాదం. పళణి సుబ్రహ్మణశ్వరునికి వజ్ర కిరీటం.

తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని కట్టించిన రాజరాజ చోళునికి శివపాద శేఖరుడనే బిరుదు ఉంది. గంగైకొండ చోళపురంలో చండీశ్వరుని తలపై ఎంతో ప్రేమతో తన నిర్మాల్యపు పూమాల చుడుతున్న ఈశ్వరుని శిల్పముంది. అందులో చండికేశ్వరుని విగ్రహము రాజరాజచోళుని రూపురేఖలతో తీర్చిదిద్దబడినదని చెబుతారు. రాజరాజచోళుని వెయ్యవ జన్మదినోత్సవము తంజావూరులో శ్రీమతి ఇందిరాగాంధి అధ్యక్షతన పరమవైభవంగా జరిగింది. ఏలూరులో తమకు సమర్పింపబడిన రుద్రాక్ష కిరీటాన్ని తంజావూరు దేవాలయ ప్రాంగణంలో నున్న రాజరాజుచోళుని విగ్రహానికి అలంకరింప చేశారు మహాస్వామి. రాజరాజుకు పరమేశ్వరుడు తన నిర్మాల్యమును అలంకరిస్తే ఈ పరమేశ్వరుడు రుద్రాక్షలనలంకరింపచేశారు.

1944 లో కామాక్షి ఆలయకుంభాభిషేక నిమిత్తంగా కంచిలో మకాం చేసి ఉన్నారు మహాస్వామివారు. పునరుద్ధరణ కార్యక్రమం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గోపురం మీదనున్న కలశాలు కిలుం పట్టి నల్లగా కన్నిస్తున్నాయి. క్రిందకు దింపించి పరిశీలించారు. వీటికి బంగారు రేకుతో తాపడం చేయిస్తే బాగుంటుందన్నారు స్వామివారు. కామాక్షీదేవాలయ పునరుద్ధరణ ఖర్చు అంతా శ్రీమఠమే భరిస్తోంది. అందువలన ఈ ప్రతిపాదనకు మఠ మేనేజర్‌ కలవర పడసాగారు. స్వామివారు వినిపించుకొనే ధోరణిలో లేరు. అధికారులకు, ప్రత్యేక నిపుణులకు కబురు వెళ్ళింది. అంచనాలు తయారు చేయబడినాయి.

అంతలో ఒక విచిత్రం జరిగింది. గుంపులోంచి పెద్ద ముత్తైదువ ఒకామె త్రోసుకుంటూ ముందుకు వచ్చి తన గాజుల జతనొకటి స్వామివారికి సమర్పించి ఈ పుణ్యకార్యంలో వినియోగించ వలసినదిగా ప్రార్ధించింది. అంతే సువాసినులందరిలోనూ ఒకే కలకలం. కొందరు స్వామివారి వైపుకు తోసుకొని వస్తున్నారు. మరి కొందరు తమ భర్తల అనుమతికై కనులతో సంభాషిస్తున్నారు. గాజులు, గొలుసులు, వంకెలు, వఢ్డాణాలు పోగుబడ్డాయి. కావలసినదానికంటే ఎక్కువ బంగారమే పోగుపడింది. రెండేరోజులలో బంగారంతో తాపడం చేయబడిన కలశాలు తళతళలాడుతూ భక్తుల హృదయాలను తళుకులొలికించాయి. ఇలాటివే వేలకు వేల సంఘటనలు.

స్వామి తలుచుకొంటే కనక వర్షం కురుస్తుంది మరి వారు కనకధార కురిపించిన శంకరుల అపర అవతారం తుండీరమండలంలో కనకవర్షం కురిపించిన కామాక్షీ వారి పీఠ అధిష్టానదేవత. అయితే వారికి ఈ బంగారంపై ఉన్న మక్కువ ఎలాంటిది?

1990 సం.. లలో ఓ రోజు ప్రాతఃకాల దర్శనానికి వరుసలో నుంచొని ఉన్నాను. నా ముందర ఉన్న ఆడిటర్‌ భక్తుడొకాయన స్వామివారికి 24 బంగారు బిల్వదళాలు సమర్పించారు. స్వామివారు వాటిని చేతులో ఉంచుకొని భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. నా దర్శనం అయింది. క్యూలో నుండి ప్రక్కకు తప్పుకొని మేనా ప్రక్కనుంచి స్వామిని చూస్తూ నుంచొని ఉన్నాను. ఇంతలో ఒక పేద మహారాష్ట్ర భక్తుల బృందం స్వామివారి దర్శనానికి వచ్చారు. అతఃపూర్వము శ్రీవారు వారి ప్రాంతాలకు వచ్చినప్పుడు దర్శనం చేసుకొన్నారట. చాలకాలం తరువాత కేవలం స్వామి దర్శనం కోసం అంత దూరం నుంచి వ్యయప్రయాసల కోర్చి కంచికి వచ్చారు. స్వామివారిని చూశారు. హారతులిచ్చారు. పాటలు పాడారు. ఆనందాశ్రువులు కార్చారు. భక్తి పారవశ్యంతో తబ్బిబ్బులవుతున్నారు. స్వామివారి భక్తులమని చెప్పుకొంటున్న మేమంతా వారి భక్తి చూసి సిగ్గుతో తలవాల్చుకొన్నాము.

పాపం! శలవు తీసుకోవలసిన సమయం వచ్చేసింది. వదలలేక వదలలేక కదులుతున్నారు. ఇంతలో వారిలో పెద్ద ఒకాయన స్వామివారి గుర్తుగా ఏదైనా ప్రసాదం ఈయవలసినదిగా కోరారు. స్వామివారు తమ ముందున్న బంగారు దళాలను దోసిలితో ఎత్తి తమ పరిచారకునికి ఇచ్చి వారందరికీ పంచమని ఆదేశించారు. ఎప్పటికీ వాడని, చెడని ప్రసాదం. మహారాష్ట్రుల భక్తి తారస్థాయికి చేరింది. విఠోబా, విఠోబా అంటూ గొంతెత్తి స్వామివారిని పిలుస్తూ సాగిపోయారు. విశేషం ఏమిటంటే ఆ బృందం లోనూ సభ్యులు సరిగా ఇరవై నాలుగు మంది. బంగారు మురుగుల గురించి చెబుతూ అసలు కథలోంచి చాలా దూరం వచ్చేశాను. మళ్ళీ శ్రీవారి బాల్యంలోని మన గిని కధలోనికి వెళదాము.


Dharmakruthi  Chapters   Last Page