Dharmakruthi  Chapters   Last Page

11. అవతారము

శ్రీమచ్చంద్ర కిశోర శేఖర గురోరత్రావతారాచ్ఛ్రియా

నామ్నాసౌ జయవత్సరో జయతి తన్మాసోపి సన్‌ మాధవః

సాకృష్ట ప్రతిపత్తిధిర్విజయతే సర్వాదిమో వాసరః

మాంగల్యం మృదుభంచమైత్రమభవల్లగ్నంచ పంచాననమ్‌

- గురుకృపాలహరీ

జితేంద్రియులై, సర్వదిక్కులు విజయం చేయనున్న స్వామి జయనామ సంవత్సరములో జన్మించి, ఆ సంవత్సరపు పేరు సార్దకం చేశారు. వసంతవల్లోక హితం చరంతః అన్న వివేక చూడామణి వాక్యములను యధార్థం చేసిన స్వామి వసంత కాలంలో మాధవ మాసంలో జన్మించారు. నిత్యం నారాయణ స్మరణ చేయనున్న వారు కృష్ణ ప్రతిపత్తున జన్మించడం న్యాయంగానే ఉంది. ఆద్యంత రహితుడు ఆదివారం నాడు ఆవిర్భవించారు. నక్షత్రమో, మంగళ##మై, మృదువై మిత్ర దైవత్వమై యింపొందిన అనూరాధా నక్షత్రము, చతుశ్శిష్య సమేతంగా ఆదిశంకరులు ఒకే మూర్తిగా అవతరించారనే విషయం సూచించడానికేమో పంచానన లగ్నం తమ జననానికి ఎన్నుకొన్నారు.

స్వామి జననం జయనామ సంవత్సర వైశాఖ కృష్ణప్రతిపత్తిధి, ఆదివారం అనూరాధా నక్షత్రం నాడు అనగా క్రీ.శ.. 1894 మే మాసం 20వ తారీఖున పగలు 1.16 ని..కు దక్షిణార్కటు జిల్లా విల్లుపురం గ్రామంలో హనుమాన్‌కోయిల్‌ వీధిలోనున్న చిన్న ఇంట్లో జరిగింది. వీరు శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రి మహాలక్ష్మమ్మల రెండవ సంతానం. పెద్ద కుమారుడు గణపతికి అప్పటికి తొమ్మిదేళ్ళు. ''ఒంటి కన్ను కన్నూ కాదు, ఒంటి కొడుకు కొడుకూ కాదు'' అనే సామెత ననుసరించి పుత్రులకై పుణ్యదంపతులు కులదైవమైన స్వామిమలై స్వామినాధస్వామికి మొక్కుకొన్నారు. కులదైవము యొక్క అనుగ్రహంతో జనించిన కుమారునికి ఆ పేరే పెట్టుకున్నారు. వారి సత్యసంకల్పము చూడండి. స్వామి తరువాతి కాలంలో అనేక కోట్లమంది భక్తులకు కులదైవమయినారు.

శ్రీవారు జన్మించిన ఆ ఇల్లు ప్రస్తుతం శ్రీమఠం అధీనంలో ఉంది. అక్కడ వేద పాఠశాల నిర్వహించబడుతోంది. అహర్నిశలు వేదశాస్త్ర అభివృద్ధికై కృషి సలిపిన మహాస్వామి పుట్టిన ఇల్లు నిరంతర వేదఘోషతో నిండి ఉండటం ఎంతో సబబుగా ఉంది. గిని

సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ఉద్యోగధర్మాన శ్రీస్వామినాధన్‌ బాల్యము విల్లుపురము, తిండివనం, చిదంబరం, ఫిరంగిపేట, వికరవాండి మొదలైన గ్రామాల్లో గడిచింది. ముందు జీవితమంతా గ్రామగ్రామంగా విజయం చేయబోతున్నారనేందుకు సూచనేమో ఈ త్రిప్పట.

పెద్దకుమారుడు కలిగిన తొమ్మిదేళ్ల తరువాత ఇక పుత్రులు కలగరేమోనని బెంగపడుతున్న సమయంలో పుట్టిన వారవడంతో శ్రీస్వామినాధన్‌ అంటే తల్లితండ్రులకు ఎంతో ముద్దు, గారాబం. దానికి తోడు చురుకుదనం, మంచి నడవడి. చక్కదనం, మంచి మాటకారితనం, ఇవన్నీ కలసి వారిపై మరింత ఆదరాన్ని కలుగచేశాయి. ఇన్ని వన్నెలున్న తమ కుమారుని పంచవన్నెల రామచిలుకకు కన్నడ పర్యాయపదమైన ''గిని'' అనే పేరుతో పిలుచుకోసాగారు.
ఆశ

అప్పుడు గినికి మూడేళ్ళుంటాయి. చప్పుడుకు ఒక రాత్రివేళ మెలుకువ వచ్చింది. ప్రక్క ఇంటిలో పెద్ద హడావుడి జరుగుతోంది. ఒకటే శబ్దం. దొంగలు దూరి గిన్నెలన్నీ ఎత్తుకొని పోవడానికి ఆదరాబాదరాగా సర్దుకొంటున్నారేమో! చుట్టు ప్రక్కల వారంతా చేరారు. తలుపు తీస్తే దొంగలు అమాంతంగా మీద పడితేనో! అసలు ఒక దొంగే ఉన్నాడో, ఇద్దరు ముగ్గురు ఉన్నారో! ఎంత వేచి చూసినా ఇంట్లో సందడి ఆగేట్లు లేదు. చివరకు ధైర్యం చేసి చేతిలో కఱ్ఱలు సిద్దంగా ఉంచుకొని నిదానంగా తలుపు తీశారు. లోపల చిన్న మూతి ఉన్న బెల్లపు చెంబులో తల దూర్చి, మళ్ళీ బయటకు తీసుకోవడానికి రాక ప్రాణభయంలో ఖంగారుగా అటూ ఇటూ పరుగెత్తుతున్న ఊరపిల్లి కనిపించింది. తరువాత అందరూ కలిసి పిల్లిని గుంజకు కట్టి చెంబు పట్టుకొని లాగేశారనుకోండి. అయితే ఆ దృశ్యం పసిబాలుడయిన మన గిని స్మృతి పధంతో చెరగని ముద్ర వేసింది.

తమ డెబ్బై సంవత్సరముల వయసులో ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకొంటూ ''ప్రాణులకు ఆశ అనేది ఎంత ఆపదను కొని తెస్తుందో ప్రత్యక్షంగా తెలిసింది'' అంటారు.

ఇదే సంఘటన శ్రీవారు షోలాపూరు మకాంలో ఉండగా పునరావృత్తమయింది. పాలపాత్రలో తలదూర్చి బయటకు తీసుకోవడం రాక ఒక పిల్లి పెద్ద హడావుడే చేసిందట. మెట్టూరు రాజగోపాల అయ్యర్‌ తదితర పారిషదులు పిల్లిని విడిపించి ఇక మీదట మరతోనున్న మూతలు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదనుకుంటున్నారు. స్వామివారో! పెద్దమూతి ఉన్న పాలపాత్రలు వాడితే పిల్లికి ఇబ్బంది ఉండదు కదా! అని సలహా ఇచ్చారట.


Dharmakruthi  Chapters   Last Page