Sri Bhagavatha kamudi    Chapters   

తొమ్మిదవ కిరణము

సుకన్యోపాఖ్యానము

వేదార్థతత్వవిదుడగు శర్యాతి సుకన్య అను తన కుమార్తెతో చ్యవనుని ఆశ్రమమునకు జనెను. ఆ ఆశ్రమములో ఆ కన్య అటునిటు తిరుగుచూ ఒక పుట్టలోన మిణుగురుల తెరంగున మెరయు రెండు వెలుగులను గాంచి అవి ఏమియో తెలిసికొనక ఒక మల్లుతో పొడువగా రక్తము కారెను. ఆవెంటనే అచటనున్నవా రందరకూ మలమూత్ర నిరోధ మయ్యెను. అందకు శర్యాతి అశ్చర్యపడి ఎవరివల్ల అపచారముజరిగినదా యని విచారింప అతని కుమార్తెయగు సుకన్య తాను తెలియక చేసినపనిని గూర్చి చెప్పెను. అంతట శర్యాతి ఆ పుట్టలోనున్న చ్యవనమహర్షివద్దకు పోయి తన కుమార్తె తెలియకచేసిన తప్పు క్షమింపమని ప్రార్థించగా ఆముని తన కన్నులు పోయినవిగనుక ఉపచారముచేయుటకు అతని కుమార్తెనిచ్చి వివాహముచేయమని కోరెను. అంత శర్యాతి తన కుమార్తెయగు సుకన్యను చ్యవనున కిచ్చి వివాహము చేసి వెడలిపోయెను. పరమకోపిష్ఠియైన భర్తకు సుకన్య ఎంతో శాంతముతో పరిచర్యలుచేయుచూ పరమపతివ్రతగా సేవించుచుండ అశ్వనీదేవతలు అచ్చటకు వచ్చిరి. వారిని చ్యవనుడు తనకు చక్కని ¸°వనరూపము ప్రసాదింపుమని, అందకు ప్రతిఫలముగా వారికి సోమపానములో భాగము ఇప్పించెదనని వాగ్దానము చేసెను. అందుకు ఆ యశ్వనీదేవతలు చ్యవనుని అచ్చటనున్న సిద్ధసరస్సులో ముంచి, తాముగూడా మునిగిరి. అంతట ముగ్గరునూ ఏకరూపులై అద్భుత సౌందర్యముతో బయటకు వచ్చిరి. ఏకరూపులుగావున్నవారిలో తన భర్తయెవరో గుర్తించలేక తన పాతివ్రతమును స్మరించి 'ఆశ్వనీదేవతలు నాభర్తను నాకు చూపుదురుగాక' యన ప్రార్థించగా, ఆమె పాతివ్రత్యమునకు మెచ్చి ఆమె భర్తను చూపి అశ్వనీదేవతలు స్వర్గమునకు వెడలిపోయిరి ఇట్లుండ శర్యాతి, చ్యవనుని ఆశ్రమమునకు వెడలగా, తనకుమార్తెపక్కన రవి తేజముతో విరాజిల్లు యువకుని చూచి, తన కుమార్తె గ్రుడ్డివాడగు ముసలిభర్తను విడచి పరపురుషుని స్వీకరించినదని భ్రాంతిపడి, నిందించగా సుకన్య జరిగినదంతయు తండ్రికి చెప్పెను. అంతట శర్యాతి కుమార్తె అదృష్టమునకు సంతసించి ఆశీర్వదించెను. తర్వాత శర్యాతి కోరిన యాగమును చ్యవనుడు చేయించి సోమపానమునకు అధికారములేని అశ్వనీదేవతలకు భాగమిప్పించెను. ఇట్లు అధర్మమాచరించినాడని ఇంద్రుడు చ్యవనుని చంపుటకు వజ్రాయాధము నెత్తగా, చ్యవనుడు ఆ భుజమును కదలకుండ చేసెను. అంతట ఇంద్రుడు ఇతర దేవతలు చ్యవనుని స్తుతించి అశ్వనీ దేవతలకు భాగమిచ్చుటకు అంగీకరించిరి.

శర్యాతి పౌత్రుడైన రైవతునకు రేవతియను కుమార్తె పుట్టెను. ఆమెకు తగినవరుడెవ్వరో తెలిసికొనదలచి కుమార్తె తోడ బ్రహ్మలోకమునకు వెడలి అచట గంధర్వగానము జరుగుచుండగా ఆ గానము ముగియువరకు అచ్చటనే వేచి యుండి బ్రహ్మదేవుని తన కుమార్తెనుగూర్చి అడిగెను. అంత బ్రహ్మ నీవు భూలోకమునుండి ఇచ్చటకు వచ్చిన తరువాత ఇరువదిఏడు చతుర్యుగములు గడచెను. నీవెరిగిన వారెవరునూ ఇప్పుడు లేరు ఇప్పుడు ద్వాపరయుగములో బలరాముడు భగవవంశమున అవతరించి యున్నాడు. అతని కిచ్చి వివాహము చేయమని చెప్పిన, రైవతుడు అట్లే రేవతిని బలరామునికి యిచ్చి వివాహముచేసెను.

నాభాగు చరిత్ర

నభగుణకు నాభాగుడను పుత్రుడు కలిగెను. ఈ బాలుడు గురుకులమున నిష్ఠతో అధ్యయము చేయుచుండవాని సోదరులు ఇతడు నైష్ఠిక బ్రహ్మచారియగునని తలంచి వానికి పితృధనములో భాగము యివ్వక తామే పంచుకొనిరి. కొంత కాలమునకు నాభాగుడు తిరిగివచ్చి తనభాగము కోరెను. అంతట అతని సోదరులు అతనికి భాగమివ్వక, తనభాగము క్రింద తండ్రిని తీసికొనమని చెప్పిరి. అంతట అతను తండ్రి వద్దకు రాగా ఆయన, ''నన్ను నీభాగముగా యిచ్చినందులకు నీకు వృత్తిని చూపెద''నని పలికి 'వత్సా ఇపుడు అంగీరసులు సత్రయాగము చేయుచున్నారు. ఆ యాగములో వారికి తెలియని వైశ్యదేవసూక్తద్వయము నీవు వారికి చెప్పిన, వారు కృతజ్ఞతతో నిన్ను గౌరవించి సత్రయాగశేషము నీకిత్తురు'' అని చెప్పగా, అతడు అట్లే సూక్తద్వయము చెప్పి చివరకు సత్రయాగ శేషమైన ద్రవ్యమును తీసుకొని వచ్చుచుండగా రుదుడు ఎదురొచ్చి ''ఈ యాగశేషము నాది, నీది కా''దని అక్షేపించెను. అంతట వారిద్దరు తమ వాదముల పరిష్కారమునకు నభగుని వద్దకు వెళ్ళగా, ఆయన ఆ భాగము రుద్రునిదే యనిచెప్పెను. అంతట నాభాగుడు తన తండ్రిగారి తీర్పు ప్రకారము తాను తీసుకువచ్చిన భాగమును రుద్రునికీ యిచ్చెను. తండ్రియైన నభగుడు తన కుమారునియందు పక్షపాతము లేక ధర్మముగా తీర్పు చెప్పినందులకును, కుమారుడు తండ్రి మాటను శిరసావహించి తాను తెచ్చుకున్న భాగము రుద్రునికి ఇచ్చినందులకును. రుద్రుడు వారి సత్యధర్మనిష్ఠలకు మెచ్చి ఈసత్రయాగ శేషమెల్ల నీవే గ్రహింపుమని నాభాగునికి యిచ్చి బ్రహ్మజ్ఞానము కలుగునటు లాశీర్వదించి అంతర్ధానమయ్యెను.

అంబరీష చరిత్ర

నాభాగునకు అంబరీషుడను కుమారుడు కలిగెను. ఆ యంబరీషుడు సప్తద్వీవసమేతమైన క్షితిమండలము నంతనూ ధర్మముగా పాలనచేసి, ఇంతటి వైభవమంతయూ నశ్వరమని నిశ్చయించి, భగవంతుడైన వాసుదేవుని అద్భుతభక్తితో సేవించుచుండెను. ఆయనతన వాగాది యింద్రియములను, జ్ఞానేంద్రియములను, మనస్సును, బుద్ధినిగూడ భగవంతున కర్పించి అసదృశ##మైన భక్తితో భగవంతుని, భగవద్భక్తులను సేవించుచుండెను. అతని ఏకాంతభక్తికి శ్రీహరిమెచ్చి శత్రు శిక్షణమగు ఒక చక్రమును అనుగ్రహించెను. అతడు పతివ్రతయైన భార్యతో విష్ణుదేవుని ఆరాధించుటకు ఒక సంవత్సరము ద్వాదశీవ్రతము జరిపి వ్రతాంతమున కార్తీకమాసములో త్రిరాత్రోపవాస మొనర్చి మరునాడు కాళిందీనదిలో స్నానమొనర్చి మధువనమున మధూసూదనుని మహాభిషేక విధానమున అర్చించి బ్రాహ్మణోత్తముల ఆరాధించి వారిని గోదానముతోను, మృష్టాన్నముతోను తృప్తిపరచి వారి అనుజ్ఞతో భోజనము చేయబోవుచుండెను. ఇంతలో దుర్వాస మహాముని అతిథియైరాగా అతనికి అంబరీషుడు అతిథిపూజలు గావించి భుజంపమని ప్రార్థించెను. అందులకు అంగీకరించి ఆ ముని మాధ్యాహ్నిక కర్మానుష్ఠానమునకు యమునా నదికి అరిగి అపట బ్రహ్మధ్యానము చేయుచూ ఆలస్యము చేసెను. ద్వాదశి ఘడియలు స్వల్పకాలమే వుండుటచే అంబరీషుడు అమహామునిని ఉల్లంఘించి ముందు భుజించుట ధర్మముకాదనియు, ద్వాదశి గవకమున్నే భుజించవలెను కనుక అట్లుచేయకుండుట ధర్మముకాదు కావున, రెండు విధముల ధర్మసంకటము కల్గునని దలచి ద్వాదశి గడవకముందే జలపానముచేసిన ధర్మసంకటము రాకుండునను అభిప్రాయముతో జలప్రాశనము చేసెను. జలప్రాశనము వలన భోజనము చేసినట్లు అగును; చేయనట్లు కూడా అగును అని భావించి భగవంతుని ధ్యానించుచూ దుర్వాసుని రాకకు నిరీక్షించుచుండెను. కొంతసేపటికి దుర్వాసుడు వచ్చి, అంబరీషుడు జలప్రాశనము చేసిన సంగతి తెలసికొని, అతిథిగా వచ్చిన తనను అవమానించెనని కోపగించి తనజడ నొకదానిని ఊడదీసి, దానితో కాలానలతుల్యమైన కృత్సను నిర్మించెను. అది అంబరీషుని మీదకు భయంకరముగా రాగా అంబరీషుడు చలింపక ధైర్యముతో భగవంతుని ప్రార్థింపగా చక్రాయుధమువచ్చి ఆకృత్సను దహించి దుర్వాసుని మీదకు వెడలెను. దుర్వాసుడు దాని బారి నుండి తప్పించుకొనలేక బ్రహ్మను శరణుజొచ్చెను. బహ్మ తన ఆశక్తతను వెల్లడించగా, తరువాత కైలాసమున శంకరుని శరణువేడగా, ఆయనగూడతన ఆశక్తతను వెల్లడించెను. అంత వైకుంఠమున విష్ణువును ప్రార్థింపగా, తాను భక్తపరాధీనడననియు, అందుచేత దుర్వాసుడు ఎవరి విషయమున తప్పుచేసెనో అట్టి సాధుపుంగవుడైన అంబరీషుని వద్దకు జని అతనినే శరణుపొందవలెననియు చెప్పిపంపెను. అంత దుర్వాసుడు అంబరీషుని వద్దకు వచ్చి అతని పాదములపై పడి రక్షింపుమని ప్రార్థింపగా అంబరీషుడు చక్రమును ప్రార్థించి దుర్వాసునకు అపకారము చేయవద్దని వారించెను. అంత ఆ చక్రము శాంతించెను. అంతట దుర్వాసుడు స్వస్థచిత్తుడై అంబరీషుని ఆశీర్వదించి అతని భక్తిని ప్రశంశించి, తాను తప్పుచేసినను తనకు అపకారము చేయకుండ మేలు కోరిన అతని సాధువర్తనమును, యోగ్యతను స్తుతించెను. అంతట తాను అంబరీషుని అతిథ్యమును స్వీకరించి అంబరీషుని భుజించుటకు అనుజ్ఞనిచ్చి. హరిభక్తుల మహిమను నేడు తెలిసికొనగల్గితినని దుర్వాసుడు సంతసించి అంబరీష చరిత్ర పరమపావనమైనదని లోకములలో అతని యశస్సు శాశ్వతముగా నిలచిపోవునని ప్రశంశించెను. దుర్వాసుడు లోకములెల్ల తిరిగి వచ్చునప్పటికి ఒక సంవత్సరము గడచెను. అంతవరకూ అంబరీషుడు జలాహారుడుగాను వుండెను. తరువాత దుర్వాసుని భోజనానంతరము తాను భుజించెను.

అంబరీషుడు వాసుదేవుని యందు భక్తితో కొంత కాలము పాలనచేసి తనకుమారులకు రాజ్యము వప్పగించి వాసుదేవునియందు చిత్తము లగ్నముచేసి తపోవనములకు పోయెను.

మాంధాత చరిత్రము

యవనాశ్యుడను రాజునకు సంతానము లేకపోవుటచే ఋషులాతనిచేత పుత్రాకామేష్టి యాగము చేయించిరి. ఆ యష్టిమధ్యమున అతడు దాహపీడితుడై యాగములో నుంచబడిన కలశములోని మంత్ర పూతజలమును త్రాగెను. మరునాటి ఉదయము కలశములో ఉదకము గానక తమ దివ్వదృష్టిచే యజమానియే త్రాగెనని తెలిసికొనిరి. ఆ ఉదకము పుంసవన జల మగుటచే ఆ జలము త్రాగిన యవనాశ్యుడు గర్భముదాల్చెను. ప్రసవకాల మాసన్నముకాగా అతని కుక్షి పగిలి కుమారుడు బయటికివచ్చి ఏడ్చుచుండెను. ఆ పిల్లవానికి స్తన్యమిచ్చుటకు ఎవరూ లేనందున ఏమిచేయుటకు తోచక విచారించుచుండ ఇంద్రుడు వచ్చి తన తర్జనిని ఆకుర్రవాని నోటీలో పెట్టగా ఆపిల్లవాడు ఆ వ్రేలినికుడిచి పుష్టిగా పెరిగెను. ఇంద్రుని వ్రేలచేత పోషించబడుటవలన అతనికి 'మాంధాత' అని పేరు వచ్చెను. అచటనున్న దేవ బ్రాహ్మణుల అనుగ్రహముచే యవనాశ్యుని కుక్షి పగిలివనూమరణించక కొంత కాలం తపస్సు చేసి సిద్ధిపొందెను. మాంధాత చక్రవర్తియై భూమండలమంతయూ పరిపాలన చేయుచూ రావణాదులకుగూడభయము కల్గునంతటి పరాక్రమముగలవాడుటచే అతనికి ఇంద్రుడు ద్రదస్యుడని పేరు పెట్టెను. ఆ మాంధాత అనేక యజ్ఞములు చేసి భగవంతుని గొప్ప భక్తితో ఆరాధించెను. అతనికీ బిందుమతియను భార్యయందు ఏబదిమంది పుత్రికలును ముచుకుందుడు మొదలగు పుత్రులును కల్గిరి.

సౌభరి చరిత్రము

సౌభరి యను మహర్షి తపము చేయుచూ ఒకనాడు యమునానది మడుగులో మునిగియుండగా ఒక చేప తన సహచరితో సంభోగించుటచూచి తనకుకూడ అట్టిసుఖముపై కోరిక కలిగి బయటికివచ్చి మాంధాత చక్రవర్తి వద్దకు వచ్చి తాను వివాహముచేసుకొనుటకు కన్యనిమ్మని కోరెను అంత మాంధాత, తనకు ఏబదిమంది పుత్రికలున్నారనియు వారిలో ఎవరు అతనిని వరించిన వారిని వివాహము చేసెదనని చెప్పెను. నెరసిన శిరస్సుతో ముదుసలిరూపములో నున్న సౌభరి అట్టి ఆకారములో నుండిన రాచకన్యలు తనను వరించరను తలంపుతో తన యోగమహిమచే తగిన యవ్వన సౌందర్యరూపము ధరించి ఆ రాచకన్యల అతఃపురమునకు జనెను. ఆ కన్యలందరూ అతనిని చూడగానే అతడే తమకు భర్తగా వరించి తండ్రికి తెలిపిరి. అంతట ఆ రాజు యాబది మంది కుమార్తెలను అతనికిచ్చి వివాహము చేసి, వారందరకూ వాసయోగ్యమైన భవనములు కానక, వారి నందరనూ అల్లునితో సౌభరి ఆశ్రమమునకు పంపెను. సౌభరి తన తపః ప్రభావముచే ఈ యాబదిమంది భార్యలకు తగిన భవనములను, ఉపవనములను నిర్మించి ఆ భార్యలతో సుఖించి సంతానమును బడసెను.ఒకనాడు మాంధాత తన కుమార్తెల సంసారములు ఎట్లున్నవో చూచుటకు రాగా ఇన్ని మేడలతో నున్న క్రొత్త పట్టమును చూచి ఇదంతయూ సౌభరి నిర్మించిన పట్టణమే యని తెలిసి ఆశ్చర్యపడి తన కుమార్తెలను పలుకరించగా ప్రతిఒక్క కుమార్తెయూ తన కాపురము ఎంతో సౌఖ్యమయముగానున్నదని సంతోషముతో చెప్పగా సౌభరియొక్క యోఘగశక్తికిని, తపః ప్రభావమునకును ఆశ్చర్యపడి తన సప్తద్వీపభూమండల పరిపాలనము వీరిశక్తిముందు ఎందుకూ పనికిరాదని తెలిసికొని విరక్తుడయ్యెను.

సౌభరి ఒక్కొక్క భార్యయందు నూరుగురు కుమారులను కని చివరకు విరక్తుడై తాను చేపల సంసారమును చూసి మోహితుడై ఇంత సంసారములోనికి దిగి ఐదువేల మంది కుమారులను కని ఇంత అనర్థములకు పాలైనందుకు వగచి అంతయూ త్యజించి అడవికి వెడలి తీవ్రమైన తపస్సును ప్రారంభించి ఆత్మసాక్షాత్కారమును పొంది దేహమును విడచెను. అతని భార్యలునూ అతని వెంబడి దేహత్యాగము చేసిరి.

హరిశ్చంద్రోపాఖ్యానము

అంబరీషుని వంశములో త్రిశంకుడను రాజు పుట్టి వశిష్ఠుని శాపమువలన చండాలుడై విశ్వామిత్రుని తపోబలమున సశరీరముగా స్వర్గమధిరోహింప దేవతలు అతనిని క్రిందికి త్రోయగా తలక్రిందుగాపడుచున్న అతనికి విశ్వామిత్రుడు వేరే స్వర్గము ఏర్పాటుచేసెను. దానినే త్రిశంకుస్వర్గమందురు. ఆ త్రిశంకునకు హరిశ్చంద్రుడు కుమారుడుగా పుట్టెను. ఆ హరిశ్చంద్రునకు సంతానములేకపోగా నారదోప దేశమున వరుణుని శరణజొచ్చి పుత్రుని అనుగ్రహింపుమనియూ, అట్టిపుత్రుడు కలిగిన పశువుగా నరవేధమున అర్చింతుననియూ ప్రార్థింపగా, వరుణుడు అతనికి పుత్రుని అనుగ్రహించెను. లోహితాస్యుడను ఆపుత్రుడు జన్మించగనే వరుణుడు తనకు ఆపిల్లవానిని పశువుగా ఇమ్మని కోరెను. హరిశ్చంద్రుడు జాతాశౌచదినములు గడచిన పిమ్మట ఇచ్చెదనని చెప్పెను. మరల వరుణుడురాగా ఆపిల్లవానికి దంతములు వచ్చినతరువాత యిత్తుననియూ, ఆతరువాత దంతములు రాలినతరువాత యిత్తుననియూ, చెప్పెను. ఇటు హరిశ్చంద్రుడు కుమారునియందు ప్రేమచే నరమేధమున బలి యివ్వలేక కాలము గడుపుచుండగా హరిశ్చంద్రునకు మహోదరరోగము పుట్టెను. ఆ వృత్తాంతము అరణ్యములో సంచరించుచున్న లోహితుడు తెలిసికొని తండ్రివద్దకు వచ్చుచుండగా ఇంద్రుడు అడ్డుపడి ఏదోనెపముల మీద ఆరు సంవత్సరముల వరకూ ఇంటికి రాకుండ చేసెను. చివరకు లోహితుడు తనతండ్రి రోగమునకు, వరుణునికి చేసిన వాగ్దానము ప్రకారము తనను నరమేధమునకు వప్పగించక పోవుటయేనని గ్రహించి, నరమేధము చేయుటకుగాను అజేయకర్తుని మధ్యమకుమారుడైన శునశ్శేపుని విక్రయమున కొని తండ్రిచేత వరుణ ప్రీతిగా నరమేధము పూర్తి చేయించెను. అంతట హరిశ్చంద్రునకు మహోదరవ్యాధి తొలగి పోయెను. హరిశ్చంద్రుడోనర్చిన రాజసూయయాగ దక్షిణ వ్యాజమున విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుని సర్వస్వమునూ హరించిననూ హరిశ్చంద్రుడు సత్యవత్రమును తప్పనందున విశ్వామిత్రుడు మెచ్చి అతనికి ఆత్మజ్ఞాన బోధ చేసెను. హరిశ్చంద్రుడు ముక్తబంధుడై పరమగతిని గాంచెను.

సగర చరిత్రము

హరిశ్చంద్రుని కుమారుడైన లోహితుని వంశములో భాహుకుడు జన్మించి కొంతకాలము పాలన చేసిన తర్వాత రాజ్యమంతయూపోయి చనిపోగా గర్భవతియైన అతని భార్య సహగమనము చేయప్రయత్నించెను. అంతట గర్భవతిగానున్న స్త్రీ సహగమనము చేయగూడదని అచ్చటి మహర్షులు వారించిరి. అంతట ఆమెకు నెలలు నిండుచుండ, సవతులు అసూయతో గరము కలిపిన జలము ఆమెచే త్రాగించిరి. ఆమె తెలియక ఆజలము త్రాగిననూ చనిపోక కుమారుని కనెను. ఆకుమారుడు గరముతో పెట్టెను గాన సగరుడు అని పేరుగల్గి చక్రవర్తియై అనేక అశ్వమేధములు చేసెను. ఒక అశ్వమేధముతో యాగాశ్వమును ఇంద్రుడు హరించెను. ఆ గుఱ్ఱమును వెతుకుటకు ఆ రాజకుమారులు భూమియంతయూ వెదకి కనుపించక చివరకు ఈశాన్యదిశయందు కిపలముని ప్రక్కన ఈ ఆశ్వమువుండుట గమనించి ఈ కపిలమునియే అశ్వమును హరించెనని తలచి అతనిని వధింప ప్రయత్నింపగా, ఆ ముని కన్నులు తెరచి రోషముతో వారిని చూచెను. అంతట వారందరూ భస్మమైపోయిరి. సగరుని మరియొక భార్య కుమారుడైన కుంజసుని కుమారుడు అంశుమంతుడు ఆ గుఱ్ఱమును వెదుకుచూవచ్చి కపిలముని ఆశ్రమమున వున్న గుఱ్ఱమును, ఆమునిని, ప్రక్కననున్న భస్మరాశినీ చూచి ఆ మహర్షిని స్తుతించగా, కపిలుడు సంతసించి వారి ఆశ్వమును వారికి యిచ్చి ఆ భస్మరాశియంతయూ అతని పినతండ్రులని చెప్పి వారందరనూ పవిత్రము చేయుటకు గంగా జలము తప్పవేరొకటి పనికిరాదని చెప్పగా, అంశుమంతుడు గుఱ్ఱమును తెచ్చి తాతగారగు సగరునికి యిచ్చెను. ఆయన యజ్హమును పూర్తి చేసి, అంశుమంతునికి పట్టాభిషేకము చేసి ఉత్తమగతిని పొందెను.

భగీరధుడు గంగను భూమికి తెచ్చుట

ఆ శుమంతుడు తన పినతండ్రుల భస్మరాశిని పవిత్రము చేయుటకై గంగకొరకు చాలకాలము తపమొనరించెను. కాని తపము పూర్తికాకమునుపే చనిపోయెను. అతని కుమారుడు దిలీపుడును అట్టి ప్రయత్నము చేసి విఫలుడయ్యెను. ఆ దిలీపుని కుమారుడైన భగీరధుడు గంగను భూమికి తెచ్చుటకు చాల కాలము తీవ్రతపము చేయగా గంగాదేవి ప్రత్యక్షమై ''నేను వచ్చుయడల నా ప్రవాహవేగమును భరింపగల వారెవరైన ఒకరుండవలెనని లేనియడల భూమిని చీల్చుకొని పాతాళమునకేగెదనని మరియు భూమికి వచ్చుచో భూలోకములోని పాపాత్ములందరూ వారి పాపములను నాలో క్షాళనము చేయగా ఆ పాపమును నేనెట్ల పోగొట్టు కోగలను'' అని అడుగగా, భగీరథుడు 'శివుడు నీ ప్రవాహవేగమును భరింపగలడు. గనుక వారిని ప్రార్థించి తెచ్చుకొందును. నీలో పాపాత్ములు స్నానము చేసినందువలన వచ్చు పాపము, భగవంతుని మనస్సులో నిల్పుకొన్న సాధవుల స్నానపానాదులచే పోవు'నని చెప్పెను. అందుకు గంగ అంగీకరించగా భగీరథుడు శివుని గురించి గొప్పతపమొనర్చి శివుని సాక్షాత్కరింప చేసుకొని తాను తీసుకొనివచ్చు గంగయొక్క ప్రవాహమును భరించి గంగను భూలోకమున నిల్పి భస్మమైపోయిన తనపినతండ్రులు పవిత్రమగుటకు సహాయముచేయమని ప్రార్థింపగా శివుడు అంగీకరించి ఆ గంగా ప్రవాహమును అపెను. అట్లు ఆగిన గంగను భగీరథుడు తన పినతండ్రుల భస్మరాశి మీద నుండి ప్రవహింప చేసిన ఆ సగరపుత్రులందరు బ్రతికి ఉత్తమ గతిని పొందిరి. గంగానది యొక్క మహాత్మ్యము గొప్పగా ప్రకటితమయ్యెను.

శ్రీరామ చరిత్రము

ఖట్వాంగుని వంశమున రఘువును, అతనికీ అజుడును, అతనికి దశరథుడును, క్రమముగా పుత్రులైరి. ఆ దశరథునకు విష్ణువు పుత్రుడై రాముడనుపేర, లక్ష్మణ భరత శతృఘ్నలను సోదరులతో అవతరించెను. పితృవాక్యపరిపాలనకై అడవుల కేగి లక్ష్మణుడును హనుమంతుడునూ పరిచర్యలు చేయుచుండ సంచారము చేయుచూ శూర్పణఖను విరూపత్వము గావించగా, దాని వలన రావణుడు సీతను హరించెను. అంతట రాముడు రావణునితో యుద్ధము చేసి సంహరించెను. అంతట పుష్పవర్షము కురిసెను. బ్రహ్మాదులు ప్రస్తుతించిరి. తరువాత అయోధ్యకు చేరు త్రోవలో భరతుని అనుగ్రహించి అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యెను. రాముని పాలనలో ధర్మము నాలుగు పాదముల నడచుటచే ప్రజలు సుఖించిరి.

చంద్రవంశాభివర్ణన

మహావిష్ణువుయొక్క నాభినుండి జనించిన బ్రహ్మదేవునికి అత్రిముని జనించెను. ఆ ముని నే తములనుండి రాలిన ఆనందా శ్రువులనుండి అమృతమయుడైన సోముడు ఉదయించెను. బ్రహ్మయొక్క ఆదేశము ననుసరించి సోముడు ఓషధులకు బ్రాహ్మణులకు నక్షత్రములకు పతి అయ్యెను. అతడు భువనత్రయము జయించి రాజసూయయాగము చేసి ఆ గర్వముతో బృహస్పతి భార్యయగు తారను హరించి ఆమెతో వుండగా ఆమె గర్భవతియై కుమారుని కనెను. అతని పేరు బుధుడు. ఆ బుధునకు ఇళయను భార్యయందు పురూరవుడు పుట్టెను. ఆ పురూరవుని సౌందర్యాదులచే ఊర్వశి ఆకర్షింపబడి అతనికి భార్య అయ్యెను. ఆమెతో అనేక సంవత్సరములు క్రీడించి ఏదో నెపముమీద ఊర్వశి అతనిని విడిచిపోగా, పురూరవుడు వియోగము భరించలేక శమీగర్భాశ్వత్థముచే రెండు అరణులు నిర్మించి అధరారణి ఊర్వశిగా ఉత్తరారణి తననుగా భావించి జాతవేదసుడు జనించెను. ఆ జాతవేదసుడు త్రయీవిహిత సంస్కారముచే గార్హపత్యాది రూపత్రయమును పొందెను. పురూరవునికి పూర్వము అగ్ని ఒక రూపముతో వుండెను. ఇతని కాలమున అగ్ని మూడురూపములు అయ్యెను. పురూరవునకు ఊర్వశియందు అరుగురు కుమారులు ఉద్భవించిరి వారిలో ఆయువు అనువానికి నహుషుడు జనించెను. అతనికీ యతి, యాయాతి, యయాతి, సంయాతి, వియతి, కృతి అను అరుగురు కుమారులు జన్మించిరి. వారిలో యతి విరాగియై రాజ్యమును స్వీకరించక జ్ఞానియయ్యెను. అంతట యయాతి పరిపాలన స్వీకరించి శు కాచార్యుల కుమార్తెను భార్యగావరించి ఆమె విషయమున కొంచెము అపచారము గావింపగా ఆమె తండ్రితో చెప్పుకొనెను. అంతట శుక్రాచార్యులు కోపగించి మయాతిని వృద్ధుడగునట్లు శపించెను. యయాతి తనకు కామతప్తి కానందున శుక్రాచార్యాల వారిని ప్రార్థింపగా తన వార్థక్యమును మరియొకరికీ యిచ్చి అతని యవ్వనమును తీసుకొనునట్లు వరము అనుగ్రహించెను. అంతట యయాతి తన జేష్టపుత్రుడైన యదువును పలిచి తన వార్థక్యమును తీసుకొని అతని యవ్వనము నిమ్మని కోరగా నిరాకరించెను. మిగిలిన ముగ్గురు కుమారులును కూడా అట్లే నిరాకరించగా కడగొట్టు వాడైన పూరుని పిలిచి తన వార్ధక్యమును తీసుకొనమని కోరగా అతడు ''తండ్రి మనస్సున చింతించిన దానిని తెలిసికొని చేయువాడు ఉత్తముడు. చెప్పిన దానిని చేయువాడు మధ్యముడు. ఆశ్రద్ధగా చేయువాడు అధముడు. చేయనివాడు కొడుకు కాదు, పురీషప్రాయుడు అని చెప్పి తండ్రిగారి కోరిక ననుసరించి తన ¸°వ్వనమును అతనికిచ్చి అతని వార్థక్యమును తాను తీసుకొనెను. అంతట యయాతి తిరిగి యవ్వనంతుడై భార్యయగు దేవయానితో విషయ సుఖములు అనుభవించుచూ రాజ్యమేలెను. ఇట్లు కొంత కాలము గడువగా, తనయొక్క స్త్రీలోలత్వమును విమర్శించుకొని విరాగియై ఉత్తమగతిని పొందెను ఆ పూరు వంశములో కొంతకాలమునకు దుష్యంతుడు పుట్టెను. అతడు ఒకనాడు వేటకై అడవికివెళ్ళి అక్కడ కణ్యాశ్రమములో శకుంతలను చూచి మోహించి ఆమే బ్రహ్మర్షి ఆశ్రమములో ఉన్ననూ. తనమనస్సు ఎన్నడూ అధర్మమును చింతింపదు కనుక, శకుంతలపై మనస్సుపోవుటకు ఆమె క్షత్రియ కన్య అయివుండవలెనని నిశ్చయించి ఆమెతో ముచ్చటించగా ఆమె క్షత్రియకన్యయని తెలియబడెను. అంతట ఆమెను గాంధర్వవివాహము చేసుకొని ఆమెతో వుండగా అతడు ఆమోఘవీర్యుడగుటచే ఆమె గర్భవతి అయ్యెను ఆ విషయము తెలిసికొనక దుష్యంతుడు స్వగ్రామమునకు వెడలెను. శకుంతల తన తండ్రియొక్క ఆశ్రమములో కుమారుని ప్రసవించెను. ఆ కుమారుడు బాల్యముననే సింహుము పిల్లతో ఆడుచూ ఆమిత పరాక్రమమును కనపరచెను. ఆ పిల్ల వానితో శకుంతల దుష్యంతుని వద్దకు వెళ్ళగా దుష్యంతుడు ఆమెను వివాహము చేసికొనిన విషయము మరచి ఆమెను, పిల్ల వానిని నిరాకరించెను. అంతట ఆకాశవాణి, శకుంతల అతని భార్యయనియు ఆ పిల్లవాడు అతని కుమారుడే యనియూ పలుకగా దుష్యంతుడు వారిని స్వీకరించెను. ఆ కుమారుడైన భరతుని వంశములో రంతిదేవుడు జన్మించెను. ఆతడు దైవలభ్యమైన ఆహారమును మాత్రమే భుజించుచూ నలబది ఎనిమిది దినములు ఆహారముగాని, జలముగాని లభ్యముకాక వుండెను. అంత ఒకనాడు ఆహారము లభించగా దానిని కుంటుంబసహితముగా భుజింపనుండగా వచ్చిన బ్రాహ్మణుని భగవత్స్వరూపుడగు అతిథిగాస్వాగతముపలికి తన భాగమును అతనికి ఇచ్చెను. మిగిలిన అన్నమును తన కుంటుంబసమేతముగా భుజింపబోవుచుండ. ఒక శూద్రుడు ఆకలితో వచ్చి అడిగెను. ఇంకొక భాగమునుగూడ భగవదర్పణముగా నిచ్చి శేషమును భజింపబోగా, కుక్కలతో సహావచ్చి ఒకడు తమకు ఆహారము పెట్టమని కోరగా, సర్వమూ హరిమయనని తలచి మిగిలినదంతయూ వారి కొసగెను. అంతట జలముమూత్రము మిగులగా ఒక ఛండాలుడు అరుదెంచి దాహము మిక్కుటముగా నున్నదని జలము కోరగా తాను చనిపోవుస్థితిలో నున్ననూ ఆ జలమును అతనికి యిచ్చెను అంతట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ప్రత్యక్షమై, ''రాజా, నిన్ను పరీక్షించుటకై మేమిట్లు చేసితిమి. నీ త్యాగమునకు మెచ్చితిమి'' అని అతనికి అజ్ఞానముతొలగించి కృతార్థునిచేసిరి.

యదువంశ వర్ణనము

యదువంశములో క్రమముగా వసుదేవుడు జన్మించెను. అతడు జన్మించిన సందర్భమున దేవదుందుభులు ఆనకంబున మ్రోగెను. అందుచే అతనికి 'ఆనకదుందుభి' అను పేరు వచ్చెను. వసుదేవునికి రోహిణి, దేవకి, మున్నగు భార్యలుండిరి. దేవకియందు కీర్తిమంతుడు, సుసేనుడు, భద్రసేనుడు, ఋజువు, సమధునుడు, భద్రుడు, సంకర్షణుడు, మొదలగు ఏడుగురు పుత్రులు పుట్టినపిదప భగవంతుడు అష్టమపుత్రుడై ఆవిర్భవించెను. ఓ పరీక్షిన్నరేంద్రా ! నీ పితామహి అయిన సుభద్ర సోదరిగా జనించెను. భగవంతుడు అధర్మము వృద్ధియై ధర్మము అడుగంటినప్పుడు, ధర్మోద్ధరణకై అవతరించును. భగవంతుడు జన్మకర్మరహితుడైనప్పటికి ఆత్మమాయా యోగమున జన్మకర్మలు కలుగును. ఈ జన్మలన్నింటికి ఉత్పత్తిస్థితిలయములు అన్నియూ ఆయన మాయా విలాసములే. వాని అనుగ్రహమున మాయ నివృత్తమై మోక్షము సంభవించును. భగవంతుడు వసుదేవునికి కృష్ణుడుగా జన్మించి అన్నయగు బలరామునితో కూడి అనేక అద్భతకార్యములు ఒనర్చెను. ఆ కృష్ణుని మధురలీలా విలాసమువలననూ, సర్వాంగసుందరమైన దివ్వశరీరముచేతను మానవలోకమునకు ఆనందము సమకూర్చెను. ఆయన దేవకీనందనుడై అవతరించినక్షణమే పితృగృహమువదిలి సందవ్రజమున కరిగి అచటివారి వాంఛితములను సమకూర్చి అనేక మందిని భార్యలుగా స్వీకరించి అనేక మంది కుమారులను కని, లోకశిక్షణకై వేదమార్గమున ధర్మోద్ధరణము చేసెను. ఇంకనూ భూభారము తగ్గించుటకు కౌరవపాండవులకు అంతఃకలహము రాగా వారిరువురుకూవచ్చిన యుద్ధములో దుష్టుల నందరనూ సంహరించి, పాండవులకు-ముఖ్యముగా అర్జునునకు జయమును సమకూర్చి, ఆత్మతత్త్వము భగవద్గీతద్వారా అర్జునునకూ, వేరుగ ఉద్ధవునకు బోధించి నిజధామమునకు జనియెను.

(తొమ్మిదవ కిరణము సమాప్తము)

నవమ స్కంధము సమాప్తము.

Sri Bhagavatha kamudi    Chapters