Sri Bhagavatha kamudi    Chapters   

8వ కిరణము

గజేంద్రమోక్షము

త్రికూటమను గిరి సమీపమున దర్శనీయమైన ఒక విశాల సరోవరము కలదు. ఒకనాడు అచటి వనమున నుండు మత్తగజము వేసవికి దాహముకాగా తన ఆడయేనుగులతో ఆ సరోవరమునకు వెళ్ళెను. ఆ కొలనులోని అతి నిర్మలమై, మధురమైన నీటిని తనివితీర త్రాగుచుండెను. అట్లు త్రాగుచున్నపుడు ఒక బలమైన మొసలి ఆ యేనుగు పాదమును పట్టుకొని లోనికి లాగుచుండెను. ఆ ఏనుగు దానితో బలము కొలది పోరాడుచుండెను. ఆరెంటికిని ఘోరమైన పోరు ప్రారంభ##మై క్రమముగా ఏనుగునకు బలముతగ్గి, ప్రాణసంకటము సంభవించగా, తనను రక్షించుకొనుటకు వేఱొక ఉపాయము కానక భగవంతుని శరణు వేడుటకు నిశ్చయించుకొని, భగవంతుని ప్రార్థించెను. ఏకాగ్రమైన మనస్సుతో ఆ గజేంద్రుడు గావించిన ప్రార్థనకు జగన్నివాసుడైన శ్రీహరి చక్రాయుధము చేతబూని, గరుత్మంతుని అధిరోహించి గజేంద్రుని సన్నిధికి విచ్చేసెను. అంతట ఆ గజేంద్రుడు భగవంతుని గాంచి. 'స్వామీ ! నీకు నమస్కారము. అతి కష్టదశలో నున్న నన్ను రక్షింపు'మని ఎంతో దుఃఖముతో ప్రార్థింపగా, భగవంతుడు చక్రాయుధముతో ఆ మొసలిని సంహరిచెను. అంతట పుష్పవర్షము కురిసెను దేవదుందుభులు మ్రోగెను. ఋషులు, సిద్ధ, చారణులు ఆ పురుషోత్తముని స్తుతించిరి.

భగవంతుని చక్రము తగులగానే ఆ మొసలి బయటకు వచ్చి హూహూ నామక గంధర్వరూపమున నిలిచి ఆ భగవంతుని అనేకవిధముల స్తుతించెను. భగవంతునివలన తనకు శాపవిమోచనమై, స్వకీయమైన గంధర్వరూపము గాంచినందుకు భగవంతుని స్తుతించి తనలోకమునకు జనియె.

ఆ హూహూ గంధర్వునికి శాపమెట్లు వచ్చినదనగా: పూర్వము ఒక సరోవరములో దేవలముని స్నానమాడుచుండగా, ఈ హూహూ గంధర్వుడు తను భార్యలతో జల క్రీడ లాడుచూ జలములోనికి పోయి. ఈ దేవలముని కాలు పట్టి యీడ్చెను. మొసలివలె యీడ్చినందున ఆముని, నీవు మొసలివి కమ్మని శపించెను. ఆశాపముకు మోక్ష మెప్పుడని యడుగగా, నీవు గజేంద్రుని పట్టి యీడ్చునపుడు భగవంతుడు గజేంద్రుని రక్షించు సమయమున నీకు శాపవిముక్తి కలుగునని శాపవిమోచనము నను గ్రహించెను. అందుచేత ఇపుడు ఆ మొసలిరూపున ఉన్న గంధర్వుడు శాపవిమోచనము కాగా, భగవంతుని స్తుతించి తనలోకమునకు వెడలెను. గజేంద్రుని పూర్వచరిత్ర ఏమనగా: పూర్వము ఇంద్రద్యుమ్నుడను రాజు మలయాచలమున ఆశ్రమ మేర్పచుకొని విష్ణువ్రత పరాయణుడై తపస్సుచేయుచుండెను. అంత నొకనాడు అచటకు అగస్త్యముని తన శిష్యులతో కూéడ రాగా, ఆ సమయమున ఇంద్రద్యుమ్నుడు మౌనముతో విష్ణువును పూజచేయుచుండుట చేత, అగస్త్యుని చూచియు లేచి వారిని గౌరవింపకపోవుటచే, ఇతడు గజమువలె స్థబ్దుడై నా కవమాన మొనర్చినాడు కనుక గజజన్మ మెత్తుగాక యని శపించి వెడలిపోయెను. అందుచేత ఆ ఇంద్రద్యుమ్నుడు ఇట్లు గజేంద్రుడు అయ్యెను. పూర్వజన్మలో చేసిన హరి పూజ్రాపభావమువలన ఆ గజేంద్రునికి ఏకాగ్రమైన విష్ణుభక్తి కలుగగా విష్ణువును స్తోతముచేసి, ఆ విష్ణువువలన మొసలి నుండి రక్షింపబడెను. ఈ గజేంద్రమోక్షమను కథను విను వారికి శాంతియు దుస్స్వప్ననాశము కలుగును. ప్రభాతమున నిదురలేచి ఈ గజేంద్రమోక్షకథ చదివినవారికి ప్రాణావసాన సమయమున అనుగ్రహింతునని తెలిపి భగవానుడు గరుత్మంతు నెక్కి వెడలెను.

క్షీరసాగర మధనము

ఇంద్రుడొకనాడు ఐరావతమునెక్కి వచ్చుచుండగా దూర్వాసుడు ఎదురుగావచ్చి తన మెడలోనున్న పూలదండ ఇంద్రున కిచ్చెను. ఇంద్రుడు తన ఐశ్వర్యమదముచే ఆ దండను ధరించక తన ఐరావత కుంభస్థలమున పడవేయగా, అది ఆ దండను క్రిందకులాగి కాలితో త్రొక్కెను. దూర్వాసుడు ఇంద్రుడుచేసిన ఈ అగౌరవమునకు అతని ఐశ్వర్యమదమే కారణము కనుక, ముల్లోకములలోను ఇంద్రుని ఐశ్వర్యము పోవుగాక యని శపించెను. ఇట్లుండగా రాక్షసులు ఇంద్రునిమీదకు యుద్ధములకు వచ్చిరి దూర్వాస శాపవశమున ఇంద్రుడు అతని పరివారము యుద్ధమున ఓడిపోయి, బ్రహ్మదేవునితో మొరపెట్టుకొనిరి. బ్రహ్మవారిని విష్ణుమూర్తివద్దకు తీసుకొని వెళ్లెను. బ్రహ్మ, విష్ణుదేవుని ఎంతో గొప్పగా స్తుతించగా శ్రీహరి ప్రత్యక్షమై ఇంద్రునికి వచ్చిన కష్టస్థితిని తెలిసికొని ఇట్లనెను. 'బ్రహ్మేంద్రులారా!మీ కిప్పుడు కాలము మంచిదికాదు. మంచికాలము వచ్చువరకూ రాక్షసులతో సంధిచేసుకొని అమృతముకొరకు క్షీరసాగర మధనము చేయుడు అందు పుట్టిన అమృతమును మీరు త్రాగిన మీరు అమరత్వము నొంది రాక్షసుల జయించి సుఖముగా నుందు'రని చెప్పి అంతర్ధాన మందెను.

రాక్షసులు ఇంద్రుని గెలిచిన తరువాత స్వర్గలోకమునకు అధిపతియైన బలిచక్రవర్తియొద్దకు ఇంద్రాదులు వెడలి, 'మన మందరము కలసి క్షీరసాగరమధనము చేసిన అమృతము పుట్టును. దానిని సేవించి మన మందరము సుఖించగము' అని చెప్పిరి. అందుకు బలిచక్రవర్తి సంతోషముతో అంగీకరించి క్షీరసాగర మధనమునకు ఉభయులు ప్రయత్నములు చేయసాగిరి.

దేవదానవు లందరు మందరగిరిని పెకలించి తీసుకొని వచ్చుచూ మోయలేక నారాయణుని ప్రార్ధించిరి. అంత నారాయణుడు ప్రత్యక్షమై మందరగిరిని గరుత్మంతునిచే మోయించి క్షీరసాగరమున దింపి వెడలిపోయెను.

క్షీరసాగర మధనమునకు ముందుగా దేవతలు, దానవులు అందు పుట్టు అమృతమును ఉభయులు పంచుకొనునట్లు ఏర్పాటు చేసికొని, వాసుకిని ఆ పర్వతమునకు త్రాడుగా చుట్టి సురాసురు లిద్దరూ క్షీరసాగరము మధింపప్రారంభించిరి. దేవతలు వాసుకి తలభాగమును పట్టుకొనగా, రాక్షసులు తోకభాగమును పట్టుకొనవలసివచ్చెను. అసురులు అందుకు అంగీకరించక తాము శిరస్సుభాగమును పట్టుకొనెదమని పట్టుపట్టగా దేవతల పక్షమున హరి అంగీకరించి దేవతలను తోకభాగము పట్టుకొనమనెను. మధనము ప్రారంభించగా పర్వతము సాగరములోనికి దిగిపోయెను. అప్పుడు హరి ఆ విఘ్నమునకు ప్రతిక్రియగా కూర్మరూపము దాల్చి ఆ మందర గిరిని తన వీపుపై దాల్చి లేవనెత్తెను. అఁతట మధనము మరల సాగుచుండగా వాసుకి ముఖమునుండి విషము బయటకు రాగా రాక్షసులుకొందరు హతులైరి మరికొంతకాలము ఉభయులు మధించుచుండగా హాలాహలమను విషము పుట్టినలుదిశలు ప్రవహించుచుండగా అందరునూ భయపడి సదా శివుని శరణుజొచ్చిరి. సర్వభూతదయాళువగు సదాశివుడు కరుణించి, ప్రక్కనవున్న భార్యతో లోకరక్షణార్థమై ఈ విషమును మ్రింగుచున్నానని ఆమె అంగీకారము తీసుకొని ఆ విషమును తనవామహస్తమునగ్రహించి కబళించెను. అది శివునికంఠమునందు నిలుచుటచే ఆమహానుభావుడు నీల కంఠుడయ్యెను. ఆయనకు అది భూషణమయ్యెను. అంతట బ్రహ్మాదిదేవతలందరూ ఆపరమశివుని గొప్పగా స్తుతించిరి. ఆమహాదేవుడు విషమును కబళించుచున్న సమయమున చెదిరి క్రిందబడిన విషబిందువును వృశ్చికములు, సర్పములు విషఓషధులు గ్రహించినవి. ఆతరువాత మధనమునందు కామధేనువుపుట్టగా దానిని ఋషులు గ్రహించిరి. తరువాత పుట్టిన ఉచ్చైఃశ్రవమను అశ్వరాజముని బలిచక్రవర్తి గ్రహించెను. తదుపరి ఐరావతము. పారిజాతము, అప్సరసలు, రమాదేవి ఉద్భవించిరి. రమాదేవిని అందరూవాంఛించిరి గాని, పురుషోత్తముడే గ్రహించి వక్షస్ధలమునధరించెను. తరువాత పుట్టిన వారుణి అను మద్యమును రాక్షసులు గ్రహించిరి. ఆతరువాత ధన్వంతరి అమృతకలశముతో సాక్షాత్కరించెను. అమృతకలశమును చూచిన రాక్షసులు దానిని ఎత్తుకొనిపోయిరి. అంత దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా, ఆయన మోహినీరూపముదాల్చి ప్రత్యక్షమయ్యెను. ఆమోహినీరూపమునుచూచిన రాక్షసులు ఆమెను మోహించి ఆమెవద్దకు వచ్చి ఆమెను కోరగా, ఆమోహిని వారిచేతులోనున్న అమృతకలశమును తీసుకొని సురులను అసురులను వేరువేరు పంక్తులలోకుర్చుండబెట్టి ముందు దేవతలందరకూ అమృతమును పంచిపెట్టెను. దేవతల వేషముతో వారిపంక్తిలో కూర్చుని అమృతము త్రాగబోవు రాహువును పసిగట్టి సూర్యచంద్రులు విష్ణువునకు చెప్పిరి. అంతవిష్ణువు చక్రాయుధముప్రయోగింపగా అమృతపానము వలన రాహువుశిరస్సుమాత్రము అమరమై, గ్రహమై, సూర్యచంద్రులను పర్వదినములందు గ్రహింప మొదలుపెట్టెను. ఇట్లు ఆమోహినీ అవతారమున దేవతలందరకూ అమృతమును పంచిపెట్టి రాక్షసులకు ఏమియులేకుండచేసి, తన నిజరూపము దాల్చి విష్ణువువెడలిపోయెను. అంతట దేవాసురులకు గొప్ప యుద్ధము ప్రారంభ##మై, అమృతపానము చేయుటవలన దేవతలు అమరులై రాక్షసులనోడించి తిరిగి స్వర్గాధిపత్యముపొందిరి.

శివుడు మోహినీరూపము చూడగోరుట

శ్రీహరి మోహినీరూపమున అసురులకు మోహము గావించి దేవతలకు అమృతము పంచెనని శివుడు విని, విష్ణువు వద్దకు వచ్చి, తాను మోహినీరూపమును చూడగోరి వచ్చితినని చెప్పగా విష్ణువు అందుల కంగీకరించి అంతర్ధానమయ్యెను. భవానీతోకూడ వెళ్లిన శివుడు. ఎటువోయెనో యని చూచుచుండగా కొద్ది దూరములో లోకమోహన రూపములో మోహిని కనిపించెను. ప్రక్కనవున్న భవానినిగూడ మరచి, మదనవివశుడై ఆ మోహిని వెంటబడి కొంతదూరముపోయి, ఆమోహినీరూపమును పట్టుకొని కౌగిలి చేర్చుకొనెను. కౌగిలి తప్పించుకొని మోహిని పారిపోవుచుండగా శివుడు ఇదంతయూ విష్ణుమాయ యని తెనిసికొని తన స్వస్థవృత్తిలో నుండగా విష్ణువు తన పురుషరూపములో ప్రత్యక్షమైశివునితో ఇట్లనెను: 'నాయొక్క మోహినీరూపమునకు మోహము చెందియూ వెంటనే మోహమునువిడచి ఆత్మనిష్ఠలోనుండ గలిగితిని. నీవుతప్ప మరె వ్వరూ నామాయనుదాటలేరు' అని చెప్పి అంతర్ధానమయ్యెను. శివుడు, తనభార్యతో విష్ణుమాయాప్రభావమునుచెప్పి నిజధామమునకు వెడలిపోయెను.

వామనావతారకథ

తరువాత శుకుడు పరీక్షత్తునకు వామనావతారకథను చెప్పమొదలుపెట్టెను. సప్తమమన్వంతరములో కశ్యపునకు అదితియందు విష్ణువు వామనుడుగా అవతరించెను. అది ఎట్లు సంభవించెననగా, బలి ఇంద్రునికి ఓడిపోయి సర్వమూ గోల్పోవుటచే గురువైన శుక్రాచార్యులను ఆశ్రయించి తాను తిరిగి విజయమునుపొందు వుపాయము కోరగా, ఆయన బలిచే విశ్వజిన్మాను యాగము చేయించెను. ఆయాగప్రభావము చేత, కాంచనాలంకృతమైన రథము, ఉచ్చైశ్రవవర్ణములు అను అశ్వములునూ ఆఅగ్నినుండి ఉద్భవించినవి. ప్రహ్లాదుడు అతనికి కాంచనకార్ముకమును అక్షయతూరము దివ్యకవచము మున్నగువానిని వొసంగెను. అట్లతడు దివ్యసాధనములను సాధించి, గురువునకును, ప్రహ్లాదునకును ప్రదక్షిణప్రణామము లాచరించి ధనుర్బాణతూణీరాదులను గ్రహించి, ఆ దివ్యరథమునుఎక్కి అసురసేనలతోకూడి ఇంద్రపట్టణమును ముట్టడించెను. ఇంద్రుడు బలియొక్క ఉద్యమమును తెనిసికొని తాను ఆసమయములో గెలుచుటసాధ్యము కాదని నిశ్చయించుకొని గురువైన బృహస్పతివద్దకుపోయి బలియొక్క ఉద్యమమును తెలియబరచి, అతనిని జయించుమార్గము తెల్పమని వేడుకొనెను. అంత బృహస్పతి ఇంద్రా! ఇప్పుడు బలియొక్క తెజస్సు, పరాక్రమమును ఎదుర్కొనుటకు హరితప్ప ఇంకెవ్వరునూ చాలరు. కనుకబలియొక్క బలపరాక్రమములుతగ్గువరకూ స్వర్గమునువిడచి ఎచ్చటనైననూ తలదాచుకొన'మని చెప్పెను. అంతట బలి ఇంద్రలోకమును స్వర్గలోకమును ఆక్రమించి మూడులోకములకు తనఅధికారమును తెలియబరచెను. అట్టి శిష్యుడైన బలిచేత శుక్రాచార్యుడు నూరు అశ##మేధయాగములు చేయించెను బలియొక్క కీర్తి ముల్లోకములలో ప్రకాశించెను.

ఇట్లు స్వర్గము అర్యాక్రాంతమగుటయు, తన కుమారుడగు ఇంద్రుడు ఎచ్చటికో పోవుటయు, తెనిసికొని అదితి, తన కుమారునికీ దుస్ధితి సంభవించినందుకు ఎంతయో దుఃఖించి తన భర్తయైన కశ్యపునివద్దకు పోయి దేవతలకు వచ్చిన కష్టములను విన్నవించి, ఈకష్టములు తొలగి ఇంద్రునకు జయముకలుగు ఉపాయము చెప్పమని ప్రార్ధించెను. కశ్యపుడు అదితికి వయో వ్రతమును అవలంబించమని చెప్పెను. ఆ వ్రతమును ఫాల్గుణ శుక్లపక్షమున పండ్రెండు దినములు పరమ భక్తితో విష్ణుమూర్తిని పూజింపవలెను. అమావాస్యనాడు వరాహము త్రవ్వినచోట మట్టి తెచ్చి శరీరమునకు అందుకొని స్నానముచేయవలెను. వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రముతో భగవంతుని ఆరాధనచేసి, పాద్యాదు లొసంగి, క్షీరముతో అభిషేకము గావించి. వస్త్రచందనమాల్యాదులు అర్పించి, క్షీరముతో అన్నము వండి, ఘృతగుడ సమన్వితముగా నివేదించి, ద్వాదశాక్షరీమంత్ర హోమము నిర్వర్తించి. అష్టోత్తరశతసంఖ్య ఏర్పడ మూలమంత్రము జపించి, స్త్రోత్రములతో దేవుని స్తుతించి, ప్రదక్షిణ సాష్టాంగ ప్రణామములు చేసి, నిర్మావ్యకుసుమములను తలదాల్చి ఇద్దరకు తగ్గకుండ, పాయసముతో భోజనముపెట్టి శేషమును ఇష్టజనములతో భుజింపవలెను. ఆరాత్రి బ్రహ్మచర్యమున గడపవలెను. ఈవిధముగ వయోవ్రతనామక వ్రతమును విష్ణు సమర్చనాదరంబుతో పండ్రెండు దినములు గడపవలెను ప్రతిపత్తుమొదలు శుక్లత్రయోదశివరకూ హరిపూజనము, హోమము, బ్రాహ్మణసంతర్పణము నడుపూచూ బ్రహ్మచర్యము పూని, అధశ్శయనము, త్రికాలస్నానము చేయవలెను, అసత్పురుషులతో సంభాణ, భోగములు వర్జించవలెను, సర్వభూతములను అహింసకుడై త్రయోదశినాడు పంచకవ్యములచే హరికి అభిషేకించి మహాపూజచేసి, చరునిర్వహణ మొనర్చి పురుషసూక్తమునవేల్చి పరమపురుషతోషణంబుగా నివేదింపబవలెను. ఆచార్యునకు ఋత్విక్కులకును, వస్త్రాభరణ, ధేనుధానములతో తృప్తిపరుపవలెను. ఆతరువాత వారికి ఉత్తమాన్నమును, అభ్యాగతులైన విప్రులతోకూడ భోజన మొసంగవలెను. గురువులకు ఋత్విక్కులకు, ఇతరులకు దక్షిణలు ఇవ్వవలెను. ఛండాలాదిగ అందరకునూ అన్నము పెట్టి తృప్తిగావించి బంధువులతో భుజింపవలెను, ప్రతిరాత్రి నృత్తగీత వాద్యములతో హరికధలతో భగవత్పూజగావింపవలెను. ఈ పయోవ్రతము సర్వయజ్ఞాత్మకము, సర్వవ్రతాత్మకము, సర్వదానాత్మకము. తపస్సారమునై హరికి తృప్తిగా వించును. కనుక నీవు శుచివై శ్రద్ధతో ఈ వ్రతమును ఆచరించితివేని హరి సంతుష్టుడై నీమనోరధమును ఈడేర్చును. అని కశ్యపుడు భార్యయైన అదితికి ఈ వయోవ్రతమును ఉపదేశించెను. ఆవ్రతమును ఆవిధముగా ఆచరింపగా భగవంతుడు శంఖచక్రములతో సాక్షాత్కరించెను. హరికి ఆమె సాష్టాంగ ప్రణామములాచరించి తనకు సంభవించిన కష్టములు చెప్పుకొనగా భగవంతుడు 'పుత్రరక్షణార్థము వయోవ్రతమున నన్ను అర్చించితివిగాన నేను నీకు నిజాంశమున నీకు పుత్రుడనై పుట్టి నీకుమారులకు రక్షణ గావించెద' అని అంతర్ధానమయ్యెను. అంతట కశ్యపునిలో హరియొక్క అంశప్రవేశించి అతని వీర్యము వలన అదితి గర్భవతి అయ్యెను. కాలక్రమమున హరి శంఖచక్రాదులతోను చతుర్భుజములతోను పీతాంబరముతో, శ్రీవత్సలాంఛనములతోను కిరీటాది భూషణములతో, అవతరించెను. భాద్రపదశుద్ధ ద్వాదశీ శ్రవణా నక్షత్రమున అభిజిన్ముహూర్తమున భగవంతుడు వామనమూర్తిగా అవతరించెను. ఆ శుభసమయమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టికురిసెను దేవతలు స్తుతించిరి. ఆదితికశ్యపులకు అట్టిరూపమున సాక్షాత్కరించి వెంటనే వామనాకృతియై చూపట్టెను. ఆపిల్లవాని జాతకర్మాదులొనరించిన తరువాత క్రమముగా ఉపనయము చేసిన సమయమున పవిత్రుడు సావిత్రిని ఉపదేశించెను. బృహస్పతి బహ్మసూత్రమును, కశ్యపుడు మైఖలను, భూదేవత కృష్ణాజినమును, సోముడు దండమును, తల్లి కౌపీనాచ్ఛాదనములను బ్రహ్మ కమండలమును, సప్తఋషులు కుశులను, కుబేరుడు భిక్షాపాత్రను ఒసంగిరి. అంబికాదేవి భిక్షమొసగెను. బ్రహ్మవర్చస్సుతో విరాజిల్లు ఆవటువు యధావిధిగ అగ్నిఘ్ని కార్యము నిర్వర్తించెను.

ఇట్లుండ బలిచక్రవర్తి తన గొప్పతనమును ప్రపంచమునకు వెల్లడిచేయుటకై ఒక గొప్పఅశ్వమేధయాగమును జరుపుచచున్న వార్తవిని వామనమూర్తి ఆ యజ్ఞశాలకు జనెను. వచ్చుచున్న ఆవామనుని చూచి సదస్యులును యజమానియును, కేవలము సూర్యుడే మనయజ్ఞమును చూడవచ్చుచున్నాడాయని ఆశ్చర్యమును పొందుచుండిరి, సూర్యుని మించు తేజస్సుతో మౌంజికట్టి ఉపవీతము ధరించి, కృష్ణాజినము కప్పుకొని జడలుదాల్చి, ఛత్రకమండలములు చేతబూని వచ్చిన ఆవామనమూర్తిని చూచిన సదస్యులందరూ ప్రత్యుత్థానము జరిపి ఆదరించిరి. యజమానుడైన బలి బ్రహ్మానందముతో ఆ వామనుని ఉచితాసనాసీనుని చేసి నమస్కారము చేసి, పాదప్రక్షాళనము చేసి, ఆ ప్రక్షాళన జలము శిరస్సున ధరించి వామనునితో "ఓ బ్రాహ్మణోత్తమా! బ్రహ్మఋషుల తపములెల్ల మూర్తీభవించి వచ్చినట్లున్న నిన్నుచూడ నాకులముపావనమైనది. నాపితరులు తృప్తులైరి. నాకృతువు జయప్రదమయ్యెను. తమ పాదవిన్యాసముచే భూమిపవిత్రమాయ్యెను, నీకేది కావలయునో దానినేల్ల కోరుకొనుము, నీవుకోరినదెల్ల యిచ్చెదను. గోవులు, బంగారము, గ్రామములు, గజ, తురంగ, రథములు, మృష్టాన్నము అన్నియు సిద్ధముగా నున్నివి. నీకేది అభిమతమో చెప్పిన ఇచ్చెదను." అని బలి చెప్పగా వామనుడు ఇట్లనెను."రాజా! కులోచితము, ధర్మయుతము, యశస్కరము అయిన నీపలుకు నాకెంతయె సంతోషము చేకూర్చినది. నీ పితామహుడైన ప్రహ్లాదునిచే పవిత్రమైన మీ వంశములో కృపణుడుగాని, విప్రునకు ఇచ్చెదనని మాటతప్పినవాడుగాని ఇంతవరకు పుట్టలేదు. మీతండ్రియైన విరోయనుడు విప్రవేషములో విబుధులు తనను యాచించరాగా, వారి వంచన స్వభావము ఎరిగియూ వారికి తన ఆయువు నొసగెను. అట్టి గొప్ప దాతల వంశమున పుట్టి వారి ధర్మములెల్ల ఆచరించు నిన్ను, నా మూడు అడుగులకు చాలినమాత్రము భూమిని యాచించుటకు వచ్చినాను. వేరొక్కటి నేను యాచింపను." అని చెప్పగా బలి "ఓ బ్రాహ్మణోత్తమా! నీవు బాలుడవు కావున స్వార్ధము నెరుగవు. జగదీశ్వరుడైన నన్ను ప్రశంశించి, ద్వీపములనైన ఇచ్చుటకు సిద్ధముగానున్న నన్ను మూడు అడుగులుమాత్రము అడిగెద వేమి? నాయొద్దకు యాచించుటకు వచ్చిన పురుషుడు ఇంకెవరినీ యాచింపనక్కరలేనట్లుగా ఇవ్వగలిన నన్ను నీ జీవితమునకు చాలినంత భూమినికోరుకొనిన ఉచితముగానుండును. అంతేకానిమూడు అడుగులు మాత్రము కోరుట ఏమి?" అని బలిచక్రవర్తి అడుగగా వామనుడు ఇట్లనెను: "రాజాధిరాజా! జితేంద్రియుడుకానివాడికి ఎంతయిచ్చిననూ తృప్తిలేదు. జితేంద్రియునకు ఎంత స్వల్పముగా ఇచ్చిననూ అతడు తృప్తినొందును. పూర్వము మహారాజులు అర్థకామముల తృష్ణకు తుది కాననట్లు విందుము. అర్థకామములయెడ తృప్తిలేకపోవుటయె సంస్కారకారణమనియూ, యదృచ్ఛాప్రాప్తమునకు తృప్తిపడుటయె ముక్తికి కారణమనియూ పెద్దలు చెప్పుదురు. తృప్తిగల విప్రుని తేజస్సు వృద్ధిపొందును. అసంతుష్టి తేజస్సును నశింపజేయును. కావున ఓ వరదోత్తమా! నేనుకోరిన మూడడుగుల భూమిని మాత్రమే నాకొసంగుము." అన్న వామనుని మాటలకు బలిచక్రవర్తి నవ్వుచూ నీ%ివను కోరిన వరము నిచ్చితిని. గ్రహింపుమని ఆవామనునికి భూమి దానముచేయ జలము స్వీకరించెను. అయ్యవసరమునమ బలికి గురువగు శుక్రాచార్యుడు వామనుని నిజస్వరూపము గుర్తించి, బలితో ' ఓ రాజేంద్రా! ఈతడు సాధారణవటువు కాడు, సాక్షాత్తు విష్ణువు దేవకార్యము సాధింప ఈ రూపమున నిన్ను యాచించుచున్నాడు. రాబోవు చేటు గుర్తింపక, ఆయన కోరిన ప్రకారము మూడడుగూలు ఇచ్చుటకు వాగ్దానము చేమితివి. దీనివలన ఇతడు నీ స్ధానమును, ఐశ్వర్యమును, యశస్సును, తేజస్సును హరించి ఇంద్రున కిచ్చును; మీకును దైత్యులకును అంతులేని అనర్థములు వాటిల్లును. ఈ మూడడుగులతో మూల్లోకముల నాక్రమించును. సర్వమునూ వానికి దానము చేసి, నీ వెట్లు వర్తింతువు. ఇచ్చెదనని చెప్పి యీయకున్న నరకము వచ్చును. కావున దేశకాలాదులు పరికించి జాగ్రత్తగా వర్తింపవలెను. స్త్రీలయెడల, వివాహప్రసంగమున, వృత్తి విషయముననూ, గోబ్రాహ్మణ రక్షణార్థము, భూతహింసావనరమునను అసత్యము నింద్యముకాదు. కనుక నీవు తప్పించుకొటను మంచిది." శుక్రాచార్యుని బోధవిని, కొంచె మాలోచించి బలి ఇట్లనెను: " మహాత్మా ! ప్రహ్లాదుని కులమున బుట్టిన నేను ఇత్తునని ప్రతిజ్ఞచేసి ఎట్లు కాదందును? సత్యమునకు మించిన ధర్మము లేదనియు, అసత్యవాదిని ఒక్కని తప్ప ఎంతభారమైననూ భరించెదనని భూదేవి చెప్పినదిగదా! విప్రుని వంచించినదానికి భయపడినట్లుగా నేను; నరకమునకును, పేదరికమునకును, దుఃఖపరంపరలకును, స్థానచ్యుతికిని, మరణములకును వెరవను శిబి, దధీచి మున్నగు ప్రముఖులగు సాధువులు, విడువరాని ప్రాణములనైన విడచి ప్రాణులకు మేలు గావించిరిగదా. అనుసరించినవారికి దేవమైన ఇచ్చువారు లభింతురుగాని పాత్రభూతులు లభించినప్పుడు శ్రద్ధతో ధనము నిచ్చువారు దుర్లభము. అర్ధుల కోరికను ఈడేర్చుసమయమున దుర్గతి కలిగిననూ ధీరునకు అది మేలే! కావున ఈ బ్రహ్మచారి యాచించినదానిని యిచ్చెదను. సాక్షాత్తు విష్ణుదేవుడే వచ్చి యాచించుచుండగా, అతని కోరిక నెరవేర్చుట ధర్మము. కావున ఇచ్చెదనన్నదానిని యిచ్చెదను." అని చెప్పెను. తన ఉపదేశము విననందుకు శుక్రాచార్యుడు కోపించి బలిని 'నీ సిరియు, యశస్సు పోవుగాక' యని శపించెను. గురుండిట్లు శపించిననూ సత్యము తప్పక బలి వామనునకు కోరిన భూమిని దానముచేయుటకు నిశ్చయించి, పత్నియగు వింధ్యావళి బంగారుపాత్రతో ఉదకముతేగా, వామనుని పాదములు స్వయముగ కడిగి ఆ పాదజలమును శిరస్సున ధరించగా షప్పువృష్టి కురుసెను. దేవదు దుభులు మ్రోగెను. పాదత్రయము భూమిని దానముచేసిన ఈ వామనుడు ముల్లోకములు ఆక్రమించుననియూ దానివలన తనకు కీడు వాటిల్లుననియు తెనిసికూడ, ఆ సత్యవంతుడు పదత్రయమిత భూమిని దానముచేసెను. ఆ తరువాత వామనాకారము పెరిగి భూమియు, ఆకాయశము, దిక్కులు దివము, పయోధులు అంతయూనిండెను. దానిలో విశ్వమునంతయూ కనుగొనెను సాక్షాత్తు విష్ణుమూర్తి తన శంఖచక్రకిరీట కేయూరాదులతో ప్రత్యక్షమయ్యెను. ఇట్లు ఒక అటుగుతో వామనుడు భూ మండలమెల్ల అక్రమించి, రెండవఅడుగుతో ఊర్థ్వలోకము లెల్ల కప్పి, మూడవఅడుగు పెట్టు ప్రదేశము కానడయ్యెను. ఊర్ధ్వలోకములన్నయూ ఆక్రమించిన ఆ భగవంతుని రెండవ పాదము సత్యలోకమునుగూడ ఆక్రమించగా అచటనున్న బ్రహ్మాదులు ఆ పాదమునకు నమస్కరించి, పరమభక్తితో కమండలజలము తెచ్చి ఆ పాదమును ప్రక్షాళనచేయుగా ఆ ఉదకము అచటనుండి క్రిందికిప్రవహించి గంగానది యనుపేర లోకత్రయమును పవిత్రవంతము చేసెను. అంతట బ్రహ్మాదులు ఆ పాదమునకు సోత్రముచేసి పూజలు కావించిరి.

అపుడు బ్రాహ్మణవేషముతో విష్ణువు వచ్చి తమ ప్రభువునకు అపకారముగావించెనని అసురులు వామనుని వధింప ప్రయత్నించిరి. అంతట విష్ణువుయొక్క సేనవచ్చి వారందరనూ సంహరించెను. ఆసమయమును బలి తనసేనా నాయకుని పిలిచి మీరందరూ నామాట వినుడు. పోరు మానుడు. ఇదిమనకు శుభసమయముకాదు. పూర్వము మనకు మనకు మేలును దేవతలకు కీడును గావించిన ఆ యీశ్వరుడే ఇప్పుడు దేవతలకు మేలును మనకు కీడును చేయుచున్నాడు. కాలమును ఎవరునూ దాటలేరు. దైవము మనకు ప్రసన్నమైన కాలము వచ్చినమనమునూ వీరిని గెలువగల్గుదుము. కావున మనకు మంచికాలము వచ్చువరకూ ప్రతీక్షింపవలెనని వారికి హితబోధ చేయగా దైత్యులందరునూ వెడలిపోయిరి. అంతటా వామనుని అభిప్రాయము ప్రకారము గరుత్మంతుడు బలిని పరుణ పాశములతో బంధించెను. అంత వామనుడు బలితో తన మూడవపాదమునకు చోటుచూపమని కోరెను. ''ఇత్తుననిచెప్పి మూడవపాదమునకు స్థానము ఇవ్వని యడల నీకు శాశ్వత నరకము సంభవించును. నేనే ఐశ్వర్యవంతుడనని, గొప్పదాతనని మదించి, నేనడిగిన మూడు పాదముల ఇత్తునని పలికి ఇవ్వనిచో నన్ను వంచించిన పాపమునకు ఫలముగా కొన్ని సంవత్సరములు నరకములో పడియుండవలెను'' అనిన; బలి ''నాపలుకులు అనృతము కానేరవు. వానిని సత్యము గావింతును. నీరెండు పాదము తో భూమండలము, ఊర్ధ్వమండలములను ఆక్రమించితివిగాన నీ మూడవపాదమును నా తలపై పెట్టుము. నేను ఆడినమాటను తప్పించినానను అపకీర్తికి మాత్రమే భయపడుదును. ఇంక దేనికీ భయపడను, నీవు నిక్కముగ అసురులకు శత్రురూపమున కనపడు పరమవిత్రుడవు, గురువువు, వైరానుబంధమున పలువురు అసురులే ఏకాంత యోగులకు ప్రాప్తించని ఉత్తమస్థానము పొందిరి. కావున నీవు నన్ను వరుణపాశమున బంధించినందుకు భయపడను. అదినాకు పరమశోభనము, క్షేమకరము. నేను ఈ జీవితమును నిత్యమని తలచునట్లుచేయు ఐశ్వర్యమును తొలగించి నాకు జీవితముయొక్క అనిత్యత్వమును చూపిన నిన్ను ఆశ్రయించెదను నన్ను రక్షింపుము'' అని విన్నవించెను. అట్టి సమయమున ప్రహ్లాదుడు అచ్చటికిరాగా బలి తన తాతయగు ప్రహ్లాదునకు పూజాదులు చేయుటకు పాశబద్ధుడగుటచే అసమర్థుడై సిగ్గున తలవంచుకొని కన్నీరుకార్చుచు నమస్కరించెను. అంతట ప్రహ్లాదుడు వామనునితో ''దేవా నీవిచ్చిన ఇంద్రపధమును హరించుటయే వీనికి క్షేమము ఆత్మమోహనమైన ఐశ్వర్యము పోవుటచే ఇతడు నీవలన అనుగ్రహింపబడెను. ఈ ఐశ్వర్యమనునది ఎంత వారికిని మోహుమును గావించును. ఐశ్వర్యమున దవిలినవాడు ఆత్మగతిని గననేర్చడు.'' అని విన్నవించెను.

అంత బలిభార్యయగు వింధ్యావళి అచటికి వచ్చి భర్తకు నమస్కరించి కన్నీటితో హరితో నిట్లనెను. ''స్వామీ నీవు ముల్లోకములను సృజించి పాలించుచుండగా కుమతులైనవారు తామే ఈశ్వరులమని, కర్మత్వము వహించి వృధాభిమానముతో అహంకారులై ఇట్లు చెడుదురు. పరమేశ్వరుడవైన నీకు ఏమిదానమివ్వగలము? నన్ను నాభర్తను రక్షింపుము'' అని ప్రార్థించెను. తరువాత బ్రహ్మ వామనునితో ''ఈ బలి స్థిర చిత్తముతో నీపాదములను ప్రక్షాళన చేసి పూజించినవాడుగాన ఇతనికి దుఃఖము కలుగకుండ విడిపించి రక్షింపుము'' అని పల్కగా, బ్రహ్మకు వామనుడు ఇట్లనియె ''ధనమదమున మానవుడు లోకమునూ, నన్నునూ అవమానించును. అందుచేత వానిని రక్షించుటకుగాను అతని ఐశ్వర్యమును పోగొట్టుదును. పురుషజన్మమెత్తి జన్మకర్మ వయోరూప విద్యైశ్వర్యధనాదుల వలన మదము చెందని వానిని నేను అనుగ్రహింతును. దానవేశ్వరుడైన ఈ బలి వ్యసన ప్రాపుడయ్యును, సంపదలు పోయిననూ, స్థానభ్రంశము కల్గిననూ, వరుణపాశముచే కట్టబడిననూ, తనవారందరనూ పరిత్యజించిననూ, గురుడు శపించిననూ, ధర్మమనూ సన్మార్గమునూ తప్పక జయింపశక్యముకాని నామాయను జయించెను. అమరదుర్లభ##మైన నాస్థానమున ఇతనిని చేర్చెదను. సావర్ణమన్వంతరమున ఇతడు నా అనుగ్రహము వలన ఇంద్రపదవిని పొందును. అంతవరకూ విశ్వకర్మనిర్మితమైన సుతలలోకమున ఇతడు నివసించును'' ఇట్లాతనిని ఆశీర్దించి తరువాత ఇంద్రుని చూచి '' నీవు స్వర్గలోకము కు జని పూర్వమువలె పరిపాలించుము'' అని చెప్పగా బద్ధాంజలియై బాష్పగద్గదిక గాత్రుడై బలి వామనునితో ఇట్లనెను. ''దేవా! దేవతల కెవరికీని లభింపని నీ అనుగ్రహమును అధముడైన నాపై చూపితివి. నీఆజ్ఞ ప్రకారము నేను సుతల లోకమునకు చనెదను'' అని వెడలెను. అంత ప్రహ్లాదుడు ''స్వామీ నీవు అసురులమైన మాయెడ గావించిన అనుగ్రహము బ్రహ్మేంద్రాదులుగూడ పొందలేదు. నీ చరిత్రము అతివిచిత్రము. నిన్నాశ్రయించిన వారికి ఉచిత ఫలములు ఒసంగుదువు.'' అని హరిని స్తుతించగా ఆ హరి ప్రహ్లాదునిగూడ సుతలలోకమున కరిగి మనుమడైన బలితోనూ స్వజనులతోనూ సర్వసౌఖ్యముల ననుభవింపుమని ఆదేశించగా ప్రహ్లాదుడునూ సుతలలోకమునకు జనెను.

తరువాత హరి ఋత్విక్కులతో కర్మవష్టముకాకుండ యజ్ఞము పూర్తి చేయించెను. ఇట్లు హరి వామనవతారమెత్తి బలిని యాచించుటద్వారా ఇంద్రుని స్వర్గము ఇంద్రున కిచ్చి బలిని గొప్పగా అనుగ్రహించెను. అంతట బ్రహ్మ మున్నగు దేవతలందరూ లోకముల కన్నింటికీ పతిగా వామనాకారుడైన ఉపేంద్రుని ఏర్పరచిరి.

పాపమోచనమైన ఈవామనచరితము శుకయోగీంద్రులు పరీక్షిన్న రేంద్రునకు విశదీకరించెను. తరువాత మత్య్సావతార కథను కూడా ఇట్లు చెప్పెను.

గడచిన కల్పాంతమందు నైమిత్తిక ప్రళయములో భూమ్యాది లోకములు సముద్రజలమున మునగగా వేదములను హయగ్రీవుడను దానవుడు హరించెను. ఆ వేదములను తెచ్చుటకై హరి మత్య్సావతారము నెత్తెను. అపుడు సత్యవతుడను రాజర్షి నారాయణపరుడై సలిలభక్షణము మాత్రము చేయుచూ తీవ్రతపముచేయ, అతనికి మేలు గావించుటయు, మత్య్సావతార ప్రయోజనము. ఆ సత్య వ్రతుడే ఆనంతరము మనువయ్యెను.

ఆ సత్యవ్రతుడు ఒకనాడు నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోనికిచిన్న చేపపిల్ల వచ్చెను. ఆ మత్య్సమును నీటిలో విడువబోగా అది తనను విడువవద్దని బ్రతిమాలుకొనెను. అంత దానిని ఇంటికి తెచ్చి తన కమండలములో వేసెను. అది కమండలమంతయూ నిండి క్రమమముగా పెరిగి సరోవరము నిండగా, సముద్రములో వేసెను. అంతట ఆమీనమూ అచటనూ బాగుగా పెరుగగా దానిని సత్యవ్రతుడు 'నీ వెవడ'వని అడిగెను. అంతట ఆ మీనము 'నేను మత్య్సావతార మెత్తిన భగవంతుడను, భగవద్భక్తుడవైన నీకు ప్రియముచేయబూని యిట్లు నీకు దర్శనమిచ్చితిని. నేటికి ఏడవరోజున ముల్లోకములు సముద్రములో మునిగిపోవును. అప్పడు ఒక గొప్పనావను నీవద్దకు పంపెదను. దానిలో నీవు సప్తర్షిమండలముతో సకల ఔషధులను, బీజములను సంగ్రహించి ఆ నావలో కూర్చుండి ఆ నీటిలో తిరుగుము. ఆ నావను వాసుకి యను త్రాటితో నా రొమ్మునకు కట్టుము. బ్రహ్మ రాత్రి గడుచునంతకాలము, ఈనావను నిన్ను భద్రముగా కాపాడి నీకు బోధచేయుదును.' అని హరి అంతర్ధానమయ్యెను. ఆయన చెప్పినప్రకారము ఏడవదినమున మూడు లోకములు మునిగి జలమయముకాగా తనయొద్దకువచ్చిన నావను సత్యవ్రతుడు, సప్తఋషులతోడను, ఓషధులతోడను ఎక్కి హరిని ధ్యానించుచుండెను. అప్పుడు ఆ స్తోత్రమునకు సంతోషించి మత్స్యావతారుడైన హరి ఆ ఏ కార్ణవంబున ఆ సత్యవత్రునకు తత్వోపదేశము, పురాణసంహిత చెప్పెను. ఆ పురాణమే మత్స్య పురాణము. ఆ ప్రళయముచివర మత్స్యావతారుడైన హరి హయగ్రీవనామక రాక్షసుని చంపి అతడు అపహరించిన వేదములను బ్రహ్మ కొసంగెను. ఆ సత్యవతుడే సప్తమ మన్వంతరమున వైవస్వతమనువయ్యెను. ఈ మత్స్యపురాణమును చదివిననూ విన్ననూ సర్వపాపములు పోయి పరమగతిని పొందును. అని శుకులవారు పరీక్షిత్తునకు చెప్పెను.

(ఎనిమిదవ కిరణము సమాప్తము)

ఎనిమిదవ స్కంధము సమాప్తము.

Sri Bhagavatha kamudi    Chapters