Sri Bhagavatha kamudi    Chapters   

7వ కిరణము

ప్రహ్లాదచరిత్ర

పూర్వము రాజసూయయాగమైన తరువాత, శిశుపాలుని కృష్ణుడు సంహరించగా శిశుపాలునిలోని జీవుడు కృష్ణునితో సాయుజ్యము బొందుటకు ధర్మరాజునకు చాల ఆశ్చర్యము కలిగి ఇట్లనియె.

''అత్యంత భగవద్ద్వేషియ దుష్టుడును అయిన శిశుపాలునకు పరమ భాగవతో త్తములకు గూడ దుర్లభ##మైన వాసుదేవసాయుజ్యము ఎట్లు గలిగెను'' అని అడుగగా ఆ సభలోనున్న నారదుడు ఇట్లనియె.

''పరమేశ్వరుడు సర్వాత్ముడుగాన అతనికి కొందరి యందు అభిమానము. మరికొందరియందు వైషమ్యమున్ను ఉండనేరదు. వైరముచేతగాని భక్తిచేతగాని భయముచేత గాని స్నేహముచేతగాని కామముచేతగాని ఏవిధముగా నైనను చిత్తము భగవంతునియందు చేర్చిన యెడల భ్రమర కీట న్యాయప్రకారము అట్టివారు భగవంతుని బొందుదురు. శిశుపాలుడు నిరంతర వైరభావముతో తన మనస్సును కృష్ణునియందుపెట్టి ఆ విధముగానైనను నిత్యము భగవన్నామ స్మరణ చేయుటచేత, వాని పాపములన్ని నశించి భగవంతుని పొందగలిగెను అటులనే గోపికలు కామము ద్వారాను, కంసుడు భయముచేతను, భగవంతుని బొందగలిగెను. భక్తియోగమున తప్పక భగవంతుని చేరుదురు గదా! కావున ఏ ఉపాయముచేతనైనను భగవంతునియందు మనస్సును బెట్టవలెను ఇంకను శిశుపాలుడు దంతవ క్తృడు అను ఇద్దరును వైకుంఠమున విష్ణుమూర్తికి ద్వారపాలకులుగ నుండి విప్రశాపమువల్ల ఇట్లు శిశుపాల దంతవక్తృలుగ బుట్టి కృష్ణునిచేత సహరింపబడుటచేత, శాపవిమోచనము కాగా, సద్గతి నొందిరి. ఈ సంగతి వినగనే ధర్మారాజు విష్ణుపార్షదులకు శాపమెట్లు గలిగె అని అడుగగా నారదుడిట్లు చెప్పదొడంగె.

''బ్రహ్మమానసపుత్రులైన సనకసనందాదులు ఒకనాడు వైకుంఠమునకు విష్ణుదర్శనార్థమై వెడలగా, ద్వారపాలకులయిన జయ, విజయములు వీరిని లోనికి వెళ్ళరాదని అడ్డగించిరి అంత, సనకాదులు జయవిజయములు గావించిన అక్రమ చర్యలకు వారిని అసురజన్మ మెత్తుడని శపించిరి. అంతట వారు భయపడి, పశ్చాత్తాపముతో శాపవిమోచనము గురించి ప్రార్థించగా, మూడు జన్మలలో మాత్రము ఈ శాపము ననుభవింపవలెననియు ఆ తరువాత మీరు పూర్వమువలె ద్వారపాలకులవలె ఉందురనియు అనుగ్రహించిరి.

ఆ శాపవశమున జయవిజయలు మొదటి జన్మమున హిరణ్యకశివు హిరణ్యాక్షులుగా జన్మించిరి. భగవంతుడు వరాహావతారమెత్తి హిరణ్యాక్షుని వధించెను. అతని అన్నయైన హిరణ్యకశివుని భగవంతుడు నరసింహావతారమెత్తి వధించెను.

వీరిద్దరూ రెండవ జన్మమున రావణ కుంభకర్ణులుగా జన్మించి లోకమును పీడించుచుండగా, భగవంతుడు రామావతారమెత్తి వారిద్దరినీ సంహరించెను.

మూడవ జన్మమున శిశుపాల, దంతవక్తులుగా జన్మించి లోకమును బాధించుచుండగా భగవంతుడు శ్రీ కృష్ణావతారమెత్తి వారిద్దరినీ సంహరించెను. అంతట వారిద్దరూశాపవిముక్తి కాగా వైకుంఠమున పూర్వమువలె జయ, విజయలు అయిరి.'' ఇట్లు నారదుడు ధర్మరాజుతో చెప్పగా ధర్మరాజు హిరణ్యకశివు వృత్తాంతము చెప్పమని కోరెను.

నారదుడిట్లు చెప్పెను. ''వారి వరాహమూర్తియై హిరణ్యాక్షుని చంపినాడను క్రోధముతో, హిరణ్యకశివుడు ఆ హరిని చంపుటకు నిశ్చయించికొని హరికి బ్రాహ్మణులు, గోవులు ప్రియులు గనుక దేశములోనున్న బ్రాహ్మణులను, గోవులను హింసింపమని పరివారమునకు ఆజ్ఞ ఇచ్చి తాను అజయత్వమునూ, అజరామరత్వమునూ పొందగోరి, మందర పర్వతమున కరిగి ఘోరమైన తపంబు ఆచరించెను. ఆ తపస్సునకు స్వర్గలోకమంతయూ, తపింపగా దేవతలు బ్రహ్మలోకమునకు జని బ్రహ్మతో హీరణ్యకశివుని ఘోర తపస్సునుగురించియు దానివలన తనకుగల్గిన తాపమును గురించియూ విన్నవించగా, బ్రహ్మదేవుడు వారి మొర నాలకించి హిరణ్యకశివుని వద్దకు జని కృశించియున్న హిరణ్య కశివుని శరీరముమీద, తన కమండలోదకమును ప్రోక్షింపగా అతడు తపస్సులోనుండిలేచి, బ్రహ్మదేవునకు సాష్టాంగ నమస్కారముచేసి, స్తుతించెను.

అంతట బ్రహ్మదేవుడు నీకేమి వరము కావలెనో కోరుకొమ్మని అడగగా, హిరణ్యకశిపుడు ''దేవా! నీవు సృజించిన భూతములలో దేనివలననూ నాకు మృత్యువు కలుగకూడదు. ఇంకనూ నాకు భూమిమీదకానీ, ఆకాశమునకుగాని, నరులచేతగాని, మృగముచేతగాని, పగలుగాని, రాత్రిగాని, లోనగాని, బయటగాని ఏ విధమునైనను మృత్యువు కలుగకుండ వరమిమ్మ.'' బ్రహ్మదేవుడు అతను కోరిన ప్రకారము వరమిచ్చి తన లోకమునకు జనియెను.

అంతట హిరణ్యకశిపుడు అట్టి వరములు పొందిన గర్వముచే, ముల్లోకములవారినీ జయించి, పీడించుచూ, స్వర్గము నాక్రమించెను. బ్రాహ్మణులుచేయు యజ్ఞములో హవిర్భాగములు తన కొసంగుడని ఆజ్ఞాపించెను.

అంతట అన్నిలోకముల వారునూ భయపడి, తమకు రక్షణ శ్రీహరివలన కలుగగలదని నిశ్చయించి, శ్రీహరిని శరణుజొచ్చిస్తుతించిరి. అంతట వారికి అశరీరవాణి ఇట్లు వినిపించె. ''ఓ దేవతలారా! ఆ దైత్యాధముని దుర్వత్తినే నెరుంగుదును. వేదములనూ, దేవతలనూ, గోవులనూ, బ్రాహ్మణులను, సాధువులను ద్వేషించు ఈ రాక్షసుడు అచిరకాలములో నశించును. అతనికి నిర్వైరుడు, ప్రశాంతుడునగు, ప్రహ్లాదుడను నొక కుమారుడు కలుగును. ఆ కుమారుని హింసించు సమయమున, నేను అతనిని సంహరించి లోకశాంతి గావించెదను.'' ఇట్లు వాసుదేవుడు అశరీర వాక్కు ద్వారా వారికి ధైర్యమును కలుగచేసెను.

ఈ హిరణ్యకశిపుడు యథేష్టముగా పరిపాలించుచుండగా అతనికి ప్రహ్లాదుడు మున్నగు పలువురు పుత్రులు జన్మించిరి. వారందరిలోనూ ప్రహ్లాదుడు పరమశాంతుడునూ, సత్యసంధుడునూ, జితేంద్రియుడునూ, సర్వభూతప్రియుడునూనై నిత్యమూ భగవద్భక్తితో కాలము గడపుచు ఉండెను.

అంతట హిరణ్యకశిపుడు ఈ పిల్లవానికి తోటి బాలురతో చదువు చెప్పించుటకు తన పురోహితుల కుమారులు అగు చండామార్కులను ఏర్పాటు చేసెను. వారు బోధించుచుండగా ప్రహ్లాదుడు తన విష్ణుభక్తిని మానకుండుటను తండ్రి చూచి చండామార్కులతో వీనికి విష్ణువునందు ద్వేషము కలుగునట్లు బోధింపుమని ఆజ్ఞాపించెను.

ఆ గురువులు విష్ణువునందు ద్వేషము కలుగునట్లు ఎన్ని బోధనలు చేసిననూ ప్రహ్లాదునికి బుద్ధి మారలేదు. నీకు ఈ బుద్ధి ఎవరు కల్గించిరి అని అడుగగా, ఇనుము అయస్కాంత సన్నిధికి వెళ్ళునటుల నా బుద్ధి శ్రీహరిమీదకు వెళ్ళుచున్నది. నాకు ఇంకెవరునూ ఈ బుద్ధిని పుట్టించలేదు, అని చెప్పెను.

కొంతకాలమునకు హిరణ్యకశిపుడు తన కుమారుని విద్య పరీక్షించుటకువచ్చి కుమారుని తొడమీద కూర్చుండపెట్టుకొని ''కుమారా, నీవింతవరకూ గురువుల సన్నిధిలో చదివినదానిలో సారమైన విషయమేదైవ చెప్పుము'' అని అడిగెను.

అంతట ప్రహ్లాదుడు ''తండ్రీ ! శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము అను ఈ తొమ్మిది విధముల ఆ వాసుదేవుని సేవించుటయే చదువులన్నికంటే ఉత్తమమయిన చదువు'' అని చెప్పగా, హిరణ్యకశివుడు కోపముతో, తన కుమారుని జవాబుకు గురువులే కారణమని నిందించెను.

ఆ గురువులు తమ లోపము కాదని ఎంతో చెప్పగా తండ్రి కుమారుని, నీ కీ బుద్ధి ఎట్లు పుట్టెను అని ప్రహ్లాదుని అడిగెను. ''నాయనా, ఇట్టి భగవంతునిమీద బుద్ధి పరోపదేశమున ఎపుడునూ కలుగదు. విషయ విరక్తులైనవారికే ఇట్టి విష్ణుభక్తి కలుగును. నాకు ఇతరులెవరునూ బోధించలేదు'' అని చెప్పెను.

అంతట హిరణ్యకశిపుడు క్రోధావేశముతో కుమారుని అనేక విధముల హింసింపచేసెను. ఈ బాలుని కొండ మీద నుంచి పడివేయించుట, శూలములచే పొడిపించుట మొదలైన ఎన్ని కార్యములు చేసిననూ, ఆ భగవంతునిపై చిత్తము ఉంచిన ప్రహ్లాదుని విషయమున అవన్నియూ విఫలములయ్యె. అంతట దిగ్గజములచే త్రొక్కించుట, పాములచే కరిపించుట, గోతులో పూడ్పించుట, విషము పెట్టించుట, నీటిలోనూ, అగ్నిలోనూ పడవేయుట, ఇట్టి ఘోర కార్యము లెన్ని చేసిననూ ఆ పిల్లవానికి విష్ణుభక్తి చెడకుండుటచేత తండ్రి ఆశ్చర్యపోయి వీడు అప్రమేయ ప్రభావుడు, నిర్భయుడు, అమరుడుగా కనిపించుచున్నాడు. వీని చేతనే నాకు మృతికలుగునేమో అని తోచుచున్నది. అన్ని లోకములు జయించి ఏ చింతయూలేని నాకు ఈ కుమారునివలన గొప్ప చింత ఏర్పడినది అని చింతాక్రాంతుడై ఉండె.

ఇట్లుండగా ప్రహ్లాదుడు తోటి బాలురకు పరమార్థమును, భగద్భక్తిని బోధించుచు వారందరిని విషయవిముఖులను హరిభక్తులను చేయుచుండెను, అంతట ఆ బాలురందరునూ నీ కింత హరిభక్తి ఎట్లు కలిగెను అని అడుగగా నారదమునీంద్రునివలన కలిగెనని చెప్పెను. ''నారదుడు నీ కెప్పుడు ఉపదేశించెను? మేమందరము నీదగ్గరనే ఉంటిమి కాదా'' అని వారు అడుగగా ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను.

''మా తండ్రి తపము చేయుటకు మందరగిరికి వెళ్ళి నపుడు దేవతలు రాక్షసులందరినీ వెడలగొట్టిరి. ఇంద్రుడు మా తల్లిని పెట్టుకొనిపోవ ప్రయత్నించుచుండగా ఆమె ఏడ్పు విని నారదుడు అచటకు వచ్చి ఆమెను విడిచిపెట్టుము. ఆమె గర్భములో పరమభాగవతోత్తముడు ఉన్నాడు. కనుక పరమపతివ్రతయైన ఆమెను విడిచిపెట్టుమని చెప్పగా, ఆ నారదుని ఆదేశము ననుసరించి ఇంద్రుడు ఆమెను విడిచిపెట్టి జనియె. అంతట నారదుడు మా తల్లిని తన ఆశ్రమమునకు తీసుకొనిపోయి, నా తండ్రి వచ్చువరకు తన ఆశ్రమములో నుంచుకొని, ఆమెకు ధర్మ తత్త్వమును, జ్ఞానమును బోధించి, వాసుదేవ మంత్రమును ఉపదేశించెను. ఆమె గర్భములోనున్న నేను అదంతయూ గ్రహించితిని. ఈ విధముగ నాకు భగవద్భక్తి నారదుని వలన కలిగెను.'' ప్రహ్లాదుడు ఇట్లు దైత్యకుమారులతో చెప్పగా, దైత్యకుమారులందరు విష్ణుభక్తి పరాయణు లైరి.

హిరణ్యకశివుడు ప్రహ్లాదుని బుధ్ది మారకుండుట వలన కోపావేశముతో కుమారుని అనేకవిధముల నిందించి, చంపుదును అని భయపెట్టి, ''ఎవని బలమున నీవు నేను చెప్పిన మాట వినక అతిక్రమించుచున్నావు?'' అని అడుగగా, ''ఏ భగవంతుడు ఈ జగమును సృజించి పాలించుచున్నాడో, అతని బలముననే ఇట్లు ప్రవర్తించుచున్నాను. అంతః శత్రువులను గెలువలేక ప్రపంచమంతనూ గెలువ గల్గితినని తలంచుట భ్రాంతి. గనుక అంతఃశత్రువులను జయించుడు''అని ప్రహ్లాదుడు తండ్రికి విన్నవించెను. ఈ మాటలు వినగనే తండ్రికి కోప మెక్కువై ''ఆ జగదీశ్వరుడు అనువాడు నాకంటే వేరుగలడా? ఉండినచో ఎక్కడున్నాడు'' అని ప్రహ్లాదుని అడుగగా, ఆ భగవంతుడు ఎక్కడచూసిన అక్కడే గలడని చెప్పెను. అంతట హిరణ్యకశిపుడు కుమారునితో ఈ సభలో నున్న స్థంభములో ఉన్నాడా? అనగా ఉన్నాడని కుమారుడు చెప్పెను. అంతట తండ్రి తన కరవాలంబుతో ఆ స్ధంభమును తన పూర్తిబలముతో కొట్టెను. అపుడు జరిగిన భయంకరమైన శబ్దమునకు ముల్లోకములోని వారందరూ అదిరిపడిరి. అంతట అంతర్యామి అయిన ఆ భగవంతుడు తన భక్తుని వచనము సత్యము చేయు తలంపుతో నరసింహావతారమున ఆవిర్భవించెను. ఆ ఆకారమును హిరణ్యకశివుడు చూచి నరుడు గాకుండుటను మృగము కాకుండుటను చూచి భయపడియు, చివరకు ధైర్యము తెచ్చుకొని గదాపాణియై ఆ నృషింహారూపుని మీదకు పోగా ఈ నృసింహమూర్తి గరుత్మంతుడు పాముని పట్టుకొన్నట్లు ఆ హిరణ్యకశివుని పట్టుకొని తాను ద్వారమున కూర్చొండి హిరణ్యకశివుని తొడపై పెట్టుకొని సంధ్యాసమయమును సఖములతో చీల్చివేసెను. ఇట్లు హిరణ్యకశిపుడు సంహరింపబడగా, ఆకశమున విమానములతో దేవతలందరూ పుష్ప వర్షమును కురిపించిరి. దేవదుందుభులు మ్రోగెను. గంధర్వులు పాడిరి. అప్సరసలు నాట్యము చేసిరి. అపుడు బ్రహ్మరుద్రేందాదులు, ఋషులు, పితృదేవతలు ప్రజాపతులు మున్నగువారు అందరును అచ్చటకు విచ్చేసి ఆనరసింహమూర్తిని వేరువేరుగా స్తుతించిరి. కాని ఆ నరసింహమూర్తి సన్నిధికి ఎవరు పోలేక భయపడుచుండగా బ్రహ్మ ప్రహ్లాదుని పిలిచి నీవు నరసింహస్వామిని శాంతింప చేయుమనికోరెను. అంతట ప్రహ్లాదుడు ఆ నరసింహదేవుని సన్నిధికి చేరి ఆతడు శాంతించునటుల స్తుతించెను. భక్తిపూరితమైన ఆ స్తోత్రమునకు ఆ స్వామి సంతోషించి, శాంతుడై ప్రహ్లాదుని ఏదైన వరము కోరుకొమ్మని అడిగెను. అంతట ప్రహ్లాదుడు "స్వామీ, నిన్ను వరములు కోరువాడు వణిజుడుగాని భక్తుడుకాడు. నేను నిష్కాముడగు భక్తుడను. నాకు వరము లిత్తురేని సర్వానర్ధకమగు కామము నా మనస్సులో ఎప్పటికినీ చేరకుండు నటుల వరమిమ్ము" అని చెప్పెను. అందుకు స్వామి సంతోషించి ప్రహ్లాదుడు కోరక పోయినను, "ఆ మన్వంతరమున దైత్యేంద్ర భోగములు అనుభవించుచూ భగవత్కధలు ఆకర్ణించుచు, సర్వభూతములలో ఏకరూపమున అంతర్యామియై ఉన్న భగవంతుని ఆత్మలో అనుసంధించి చివరకు కళేబరమును ఛేదించి ముక్తబంధుడవై భగవంతుని చేరుదువుగాక." అని ఆశీర్వదించెను. అంతట ప్రహ్లాదుడు ఆ స్వామితో "నా తండ్రి నీకు విముఖుడై నిన్ను నిందించి అనేక పాప కార్యములు చేసెను గనుక అతనిని పవిత్రునిగ చేసి ముక్తుడగునట్లు అనుగ్రహింపుము" అని కోరగా ఆ స్వామి ప్రహ్లాదునితో "భాగవతోత్తముడవైన నిన్ను కుమారునిగ పొందిన కారణమున అతను అతని పూర్వులు కూడ పవిత్రులైరి. ప్రహ్లాదా! నీవేకాక నిన్ననుసరించిన వారందరూ భక్తులగుదురు. నీవు అందరకునూ ఉపమానాస్పదుడవు కాగలవు. నా శరీరస్పర్శచేత పవిత్రుడైన నీ తండ్రి శరీరమునకు ప్రేతకార్యముల నిర్వర్తించి తండ్రి రాజ్యమున పట్టాభిషిక్తుడవై ధర్మపాలనముచే ప్రజలకు శాంతిని కలుగ చేయుము." అని చెప్పెను. అంతట ప్రహ్లాదుడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపి రాజ్యసింహాసనమున పట్టాభిషిక్తుడై చక్కగా పరిపాలన చేయుచుండెను. నరసిహస్వామి బ్రహ్మనుచూచి అసురులకు ఇట్టి వరములను ఇవ్వవద్దని బోధించి అంతర్ధాన మయ్యెను. ఇట్లు నారదుడు ధర్మరాజుతో పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని చరిత్ర వివరించెను.

మనుష్య సామాన్య ధర్మములు

మనుష్య సామాన్య ధర్మములు

ధర్మరాజు నారదుని మనుష్య ధర్మముల గురించి అడుగగా, నారదుడిట్లు చెప్పెను. "సర్వవేదమయుడైన భగవంతుడు ధర్మమునకు ప్రమాణము. ధర్మనిర్ణయమునకు మన్వాదుల స్మృతులు ప్రమాణము. సర్వమానవ సాధారణమైన ధర్మములు ఏవనగా-సత్యము, దయ, తపము, శౌచము, తితిక్ష, యుక్తాయుక్త వివేకము, శమము, దమము, అహింస, బ్రహ్మచర్యము, దానము, స్వాధ్యాయము, ఋజుత్వము, సంతోషము, సాధు సేవనము, కామ్యకర్మత్యాగము, విచారణ, దేహాదివ్యతిరిక్తాత్మజ్ఞానము, అతిధ్యభ్యాగతుల పూజ, సర్వభూతములకు ఆహారదానము, సర్వభూతదయ, సర్వభూతములయెడ ఆత్మత్వబుద్ధి, శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, సఖ్య, ఆత్మవివేదనములను తొమ్మిది విధముల భక్తి. ఇవియన్నియు సర్వమానవ సాధారణ ధర్మములు." ఇట్లు నారదుడు ధర్మరాజునకు మనుష్య సామాన్య ధర్మములు చెప్పి విశేష ధర్మములైన చాతుర్వర్ణ్య ధర్మములను, ఆశ్రమ ధర్మములను కూడ బోధించెను.

ప్రహ్లాద అజగర సంవాదము

పూర్వము కావేరీతీరమున నేలపై ధూళి ధూసర గాత్రంబుతోను, బ్రహ్మ తేజస్సుతోను, పరుండిన ఒక ముని వద్దకు పరమభాగవతుండైన ప్రహ్లాదుడు మంత్రులతో సహా వెళ్లెను. ఆమునిని చూడగానే అతని వర్ణాశ్రమాది లింగము లేవియూ కానరాకపోయినను, మహాపురుషుడని ఎంచి సాష్టాంగప్రణామం బాచరించి "స్వామీ, నీవు ఎట్టి ఆహారము తీసుకొనకపోయిననూ, ఎట్టి భోగములును అనుభవించక పోయిననూ, మీదేహము బలవంతంబై ఎంతో వర్చస్సుతో ఉన్నది. దీనికి కారణము తెలియ కోరెదను." అని పార్ధించెను. అంతట ఆముని ఇట్లు చెప్పెను: నారాయణుడు కేవలము భక్తియోగమున సంతోషించి భక్తుని హృదయములో నిత్యము నివసించి అతని అజ్ఞానముని పోగొట్టి ముక్తి నిచ్చును. మనుష్యజన్మ యెత్తి, సుఖప్రాప్తియు, దుఃఖనివృత్తిని కోరియును, అవి లభింపకుండుటచే నేను ఆప్రవృత్త ధర్మము విడచి నివృత్తిధర్మను స్వీకరించితిని. జుంటీగనూ, అజగరమును, నేనీలోకమును ఉత్తమ గురువులుగా స్వీకరించి, తదీయవృత్తి పర్యాలోచనమున విరక్తిని యధాలాభ సంతోషమును నేర్చుకొంటిని, జుంటీగ, నానాకుసుమములలో నుంచి ఎంతో కష్టంతో ఆర్జించిన తేనెను. ఇంకొకడు దానిని జంపి తీసుకొనిపోవుట చూచి, ఒకడు శ్రమపడి సంపాదించి, కూడబెట్టిన ధనమును ఇంకొకడు అపహరించునుగదా, అని నిశ్చయించి విషయాసక్తి అనర్ధములను సమకూర్చునని తెలిసికొని, సుఖమునిచ్చు వైరాగ్యమును బూనితిని. జుంటీగ వలన ఈ నీతిని నేర్చుకొంటిని. ఇంకను అజగరము వలన తెలిసికొనినది ఏమగా, అజగరము కదలక ఉన్నచోటనే ఉండి, నోటివద్దకు వచ్చిన దానిని తిని, తృప్తిగాంచుట చూచి, నేనును యదృచ్ఛాలాభమునకు తృప్తిచెందుట ఉత్తమమని తలంచి, దొరికినదానితో పరితృష్టి నొందుచూ, దొరకని యెడల ఉపవసించుచూ, ధైర్యముతో నుండుదును. దొరికిన వస్తువు అల్పమైననూ, అధికమైననూ, రసవంతమైననూ, నీరంబైననూ, నేను భుజియింతును. దొరికిన వస్త్రము మంచిది అయినను, చెడ్డది అయినను, కర్మప్రాప్తమని కట్టుకొందును. వట్టినేలపైననే పవళింతును. పరప్రయత్నమున మేడల మీద, పర్యంకముల మీద శయనింతును, నిందాస్తుతులొనర్చు జనులను నేను నిందిపను. స్తుతింపను. మందమతులకు నా వృత్తంబు లోకవిరుద్ధముగా తోచిననూ, భగవద్భక్తుడవైన నీకు, ఇదంతయూ చెప్పితిని. ఆమహాముని పలుకులువిని, ప్రహ్లాదుడు సంతసించి వారిని యధావిధిగ పూజించి వెడలి పోయెను.

గృహస్ధులు జ్ఞానమార్జించు విధము

ధర్మరాజు నారదుని గృహస్ధులు జ్ఞానమార్జించు విధమును చెప్పమని కోరగా, నారదుడిట్లు చెప్పెను. గృహస్ధుడు గృహస్ధాశ్రమోచిత ధర్మములను, భగవత్సేవగా చేయుచు, ఫలములను భగవంతునికి అర్పించవలెను భగవదవతారకథలను వినుచుండవలెను. సత్పురుషుల సహవాసము చేయవలెను. దేహపుత్రకళత్రాదులమీది సంగమును విసర్జింప వలయును. అవసరమున్నంత వరకూ, దేహపుత్రాదుల యెడ విధ్యుక్తమును నెరవేర్చుచు, మమకారము లోకుండా ప్రవర్తింపవలెను. ఉదర పూరణములకు అవసరమైనంత మాత్రమే గ్రహించవలెనుగాని. అధిక మపేక్షించువాడు చోరుడువలె దండనార్హుడగును. పశుపక్ష్యాదులను ఆత్మ సామ్యమున చూడవలెను. తనకున్న దానిలో వీరు, వారు అనక అన్ని భూతములకు పంచిపెట్ట వలయును. దైవలబ్ధమైన ధనముతో పంచ యజ్ఞముల నిర్వర్తించి తచ్ఛేషమును స్వీకరింపవలెను. దేవ ఋషి నర భూత పితృగణంబును ప్రతిదినము పూజించవలెను. అగ్ని ముఖమున వేల్చిన హవ్యముల వలన కంటె బ్రహ్మణోత్తముల కొసగిన కబళముల వలన భగవంతుడు ఎక్కువ తృప్తిగాంచును. కావున బ్రాహ్మణులందునూ, దేవతలందునూ, ఇతర మనుష్యులందునూ, పశ్వాదులందునూ, అంతర్యామి అయిన పరమపురుషుని బ్రాహ్మణ పూజాపూర్వకముగా ఆరాధింపవలెను, భాద్రపద కృష్ణపక్షమున తల్లితండ్రులకునూ, తద్బాంధవులకునూ, మహాలయశ్రాద్ధమును నలుపవలెను. సంక్రాంతులు, గ్రహణములు రథసప్తమి మొదలగు పుణ్యతిధులు; ఏకాదశి, ద్వాదశి అను జన్మనక్షత్ర శ్రవణాన్వితంబులైన దినములునూ, శ్రేయోదాయకములుగాన, అట్టి పుణ్యదినంబులందు జప హోమాదులను, దానములునూ, పూజలును చేయవలెను దేశములలో పుణ్యదేశము లేవి యనగ-తపో విద్యాదయాన్వితులైన బ్రహ్మణులు నివశించు దేశము, భగవత్పూజ గావింపబడు దేశము, ప్రసిద్ధములైన గంగాది నదులు ప్రవహించు దేశము, కురుక్షేత్రమున, ప్రయాగక్షేత్రమున, పులహాశ్రమమున, నైమిశారణ్యమున, సేతువున, పభాసమున, కుశస్ధలియూ, వారాణసియూ, మధుపురియూ, పంపాసరోవరమున, బిందు సరస్సున, బదరీనారాయణాశ్రమము, సీతారాములు వసించిన ఆశ్రమములు, హరివిగ్రహసమేతములైన దేశములు మొదలగునవి. కావున శ్రేయస్కాములు వీటిని సేవింపవలయును. ఇందొనర్చిన ధర్మములు సహస్రగుణాధికంబగు, చరాచరమయుడైన హరియే ఉత్తమపాత్ర కావున, అట్టి హరిపూజనంబు సర్వజీవాత్మ తర్పణంబగు. జ్ఞానాధిక్యము ఎచట కన్పడునో అయ్యది సత్పాత్రము. వేదమును ధరించిన కారణమున బ్రాహ్మణులు మనుష్యులలో నెల్ల ఉత్తములు. అట్టి బ్రాహ్మణులే పరమదైవముని కృష్ణుడు చెప్పెను కదా!

అనంత ఫలముకోరువారు హవ్యకవ్యములను జ్ఞాననిష్ఠుల కొసంగవలయును. వారు లభింపనిచో ఇతరులకు పెట్టవచ్చును. దేశకాలము లందు హరి దైవతంబుగా ఎంచి శ్రద్ధతో నీవారాన్నమైననూ సత్పాత్రకొసంగిన యెడల అక్షయ ఫలప్రదంబగు ధర్మతత్వ మెరిగినవాడు శ్రాద్ధమున, మాంసమును పెట్టడు. తాను తినడు. పశుహింసాపూర్వకముగా చేసిన దానికంటె నీవారాదుల చేసిన దానిని శ్రాద్ధదేవతలు మెత్తురు. మానస వాచిక కాయికరూప హింసను వర్జించుటే ఉత్తమధర్మము. కావున ధర్మవిదుడు దైవోపసన్నమైన నీవారాన్నమున సంతుష్టుడై ప్రతిదినము నిత్యనైమిత్యికకర్మ లొనర్పవలెను. విధర్మము-పరధర్మము-ఆభాసధర్మము-ఉపమాధర్మము-ఛలధర్మము అని అధర్మము ఐదు రకములుగా నున్నదిగాన, వాటనన్నింటినీ త్యజింపవలెను. స్వధర్మమునకు హానికల్గించునది విధర్మము. ఇతరులకు విహితమైనది పరధర్మము. వేదవిరుద్ధమైన పాషండధర్మము ఉపమాధర్మము. ధర్మమువలె కనబడుచూ, ధనార్ధమై లోకమును పంచించుచు చేయబడినది ఆభాసధర్మము ఛలధర్మము అర్థచ్ఛలము, శబ్దచ్ఛలము అని రెండురకములు చచ్చిపోవుటకు సిద్ధముగా నున్న గోవును దానము చేయుట అర్థఛలము. శబ్దమునకు అపార్థము కల్పించి చేయునది శబ్దచ్ఛలమగును. పరధర్మమెపుడునూ అనుష్ఠింపరాదు. నిర్ధనుడు ధర్మార్థమైననూ, యాత్రార్థమైనను ధనము కోరరాదు. నిరీహుడై అజగర వృత్తిని అవలంబించవలెను. నిత్యమంతుష్టునకు సర్వమూ శివమయమే అసంతుష్టుడైన విప్రునకు తేజస్సు, విద్య,తపము, యశస్సు నశించును. సంకల్పవర్జనము వలన కామమును, కామత్యాగమువలన క్రోధమునూ, దృశ్యపదార్థములయందు అనర్థవిమర్శము వలన లోభమునూ, తత్వవిచారమువలన భయమునూ, ఆత్మానాత్మవివేకమువలన శోకమోహములను, సాధుసేవనము వలన దంభమునూ, మౌనమువలన లోకవార్తాదులను, దేహాభిమానత్యాగము వలన హింసనూ, కృపవలన భూతములవలన దుఃఖమునూ, సమాధివలన దైవిక దుఃఖమునూ, ప్రాణాయామాదుల వలన దేహజన్య దుఃఖమునూ, సాత్వికాహారాదిసేవనమువలన సత్యమునూ. సత్వమున రజస్తమస్సులనూ, ఉపశమము వలన సత్వమునూ గురుభక్తివలన సర్వమునూ జయింపవలెను. గురువు సామాన్యమానవుడని తలచినవాని చదువు నిష్ఫలమగును. చిత్తమును వశముచేసుకొనవలెనని యత్నించునతడు నిస్సంగుడై. నిస్సహాయుడై, నిష్పరగృహుడై, నిర్జన దేశవాసియై భిక్షాన్నమును తినుచు శుచియైన ప్రదేశమున స్ధిరమైన సుఖాసనమును ఏర్పర్చుకొని ప్రణముచ్చరించుచూ, ప్రాణాపానముల నిరోధించి స్వనాసాగ్రనిరీక్షణము వలన మనస్సు యేయే గతులను పోవునో అవి అన్నియూ తొలగించి, చిత్తమును నిరోధింపవలెను గృహస్థునకు కర్మత్యాగము, వటువునకు వ్రతత్యాగము, వానప్రస్తునకు గ్రామసేవ, యతికి ఇంద్రియమలోలత్వము నింద్యములు. శరీరము రథముగా ఇంద్రియములను గుఱ్ఱములుగా, మనస్సును పగ్గముగా, బుద్ధిని సారధిగా, శబ్దాదివిషయము లనుగంతవ్యదేశములుగా, జీవుని రథికునిగా, ప్రణవమును ధనస్సుగా, శుద్ధజీవుని శరీరముగా, పరబ్రహ్మము లక్ష్యముగా గ్రహింపవలెను. ప్రవృత్తము, నివృత్తము అను వైదిక కర్మలు రెండు విధములు. ప్రవృత్తములవలన పునరావృత్తియూ, నివృత్తమున అమృతమును గలుగు. ఇష్టాపూర్తి కర్మలు ప్రవృత్తకర్మలు. ఇంద్రియములలో స్వకర్మములనూ, ఇంద్రియములు మనస్సు నందునూ, మనస్సు వాక్కునందునూ, దానిని ఓంకారమునందునూ, దానిని బిందువునందునూ, దానిని నాదమునందునూ, దానిని ప్రాణమందునూ, దానిని బ్రహ్మమందునూ సమన్వయించి బ్రహ్మలోకమును పొంది విశ్వునకు సూక్ష్మలయంబు గావించి సూక్ష్మమును కారణమున లయించి. కారణస్వరూపమును సాక్షిస్వరూపమునలయించి, తురీయుడై ,సర్వలయమున ముక్తుడగును. ఇది దేవయాన మార్గము.

పరమాత్మస్వరూపమునకు వాస్తవభేదము లేకుండిననూ, పూర్వకర్మవశమున భ్రాంతి కలుగును. అవిద్య ఉండునంతవరకూ ఆ భ్రాంతి ఉండును. ఆ అవిద్య తొలగిన యెడల భ్రాంతి తొలగును. ఆత్మతత్వానుభవమువలన భావాద్వైత, క్రియాద్వై, ద్రవ్యాద్వైతములను నిరసించవలెను. వస్త్రమునకు. తంతృవులకు ఐక్య మెట్లో ఉత్పత్తికి పిమ్మట కార్యకారణంబులు రెండునూ ఒక్కటే అని ఆలోచించుట భావాద్వైతము మనోవాక్కాయకృతములైన సర్వకర్మములను పరబ్రహ్మయందు సమర్పించుట క్రియాద్వైతము. తనకునూ, భార్యాపుత్రాదులకునూ, ఇతరులకునూ, పంచభూతాత్మక దేహ మొక్కటే అనియూ పరమాత్మస్వరూపమున భోక్త ఒక్కటే అనియూ, అభేద మాలోచించి అందరి అర్థకామములనూ ఒక్కటిగా చూచుట ద్రవ్యాద్వైతము. ఈవిధముగా వేదచోదితకర్మల నాచరించు నరుడు గృహాశ్రమము నుండియూ కృష్ణునిమీద భక్తిచే, తద్గతిని పొందును.

ఇట్లు నారదుడు ధర్మరాజునకు చెప్పి కృష్ణపరమాత్మయొక్క అనుగ్రహముచేతనేకదా, మీరు అన్ని కష్టములు దాటి రాజసూయాగము చేయగలిగితిరి; అని చెప్పగా ధర్మరాజు కృష్ణుని గొప్పతనము పూర్తిగా గ్రహించి, కృష్ణుడు పరబ్రహ్మస్వరూపుడే అని నిశ్చయించి. ఆ వాసుదేవుని పూజించెను. అంతట నారదుడు కృష్ణ. ధర్మనందనుల అనుజ్ఞ తీసుకొని వెడలిపోయెను.

(ఏడవ కిరణము సమాప్తము)

సప్తమస్కందము సంపూర్ణము.

Sri Bhagavatha kamudi    Chapters