Sri Bhagavatha kamudi    Chapters   

4 వకిరణము

దేవహూతి, కపిల సంవాదమును వినిన తరువాత విదురుడు కర్దముని కుమార్తెయగు అనసూయను అత్రి మహర్షికి యిచ్చి వివాహము చేయగా వారికి కలిగిన సంతానము గుఱించి చెప్పమనగా మైత్రేయు డిట్లు చెప్పదొడంగె.

అత్రిముని భార్యతోడ భగవంతుని కుమారుడుగా బడయవలెనని ఘోరమైన తపస్సు చేసెను. అంతట త్రిమూర్తులు ప్రత్యక్షమై, మేము మువ్వురము మీకు కుమారులమై జన్మించెదమని వరమిచ్చి అంతర్థానమైరి. అందుచే బ్రహ్మాంశమున సోముడు, శంకరాంశమున దూర్వాసుడు, విష్ణ్వంశమున దత్తాత్రేయుడు జన్మించిరి చివరకు దత్తాత్రేయుడొకడే త్రిమూర్తుల యవతారముగా విరాజిల్లెను తరువాత మైత్రేయుడు నరనాకాయణావతారమును చెప్పి, నరనారాయణులే కృష్ణార్జునులుగా అవతరించిరని తెలిపెను.

తరువాత దక్షయజ్ఞధ్వంసమును గురించి విదురుడు అడుగగా ఇట్లు చెప్పెను. ''పూర్వము ప్రజాపతులు సత్రయాగము ఆరంభించగా రెండవ సూర్యునివలె వెలుంగుచున్న దక్షుడు ఆ సభలోకి వచ్చెను. అప్పుడు అందరునూ లేచి దక్షుని గౌరవించిరి. కాని శివుడు లేవలేదు. అంత దక్షుడు తనకుమార్తెను వివాహమాడిన శివుడు, మామాగారైన తనను గౌరవించలేదను కోపముతో శివునికి యజ్ఞములో హవిర్భాగము చెందకుండుగాక యని శపించెను. అంతట శివుడు ఆ సభనుండి లేచి తన నివాసములకు జనియె. అంతట నందీశ్వరుడు తన ప్రభువైన శివుని నిందించెను కోపముతో దక్షునకును, శివశాపము విని వూరుకొన్న బ్రాహ్మణులకును తిరిగి శాపమిచ్చె. బ్రాహ్మణులను శపించి నందులకు భృగువు తిరిగి శపించె. తరువాత కొంత కాలమునకు దక్షుడు బృహస్పతి నవనము చేయదలచి అందరిని ఆహ్వానించెను. గాని తన అల్లుడైన శివుని ఆహ్వానింపలేదు. శివుని భార్యయైన సతీదేవి ఆ యాగమునకు అందరూ వెళ్ళుచుండుట చూచి తానుకూడ పోవ కుతూహలపడి భర్తతో తన వాంఛను తెల్పగా శివుడు ''మనలను పిలువలేదు. కనుక మనము వెళ్ళుట ధర్మముకాదు'' అని తెల్పెను. కాని పిలువకపోయిననూ పుట్టినింటికి వెళ్శవలెనను కోరిక స్త్రీసహజము కాన, తాను వెళ్ళుటకు అనుజ్ఞనిమ్మని సతీదేవి ప్రార్థించెను. అంతట శివుడు భార్యతో ''నీవు అచ్చటకు పోయిన యడల నిన్నెవరు ఆదరింపకుండుటయేఏ గాక, అవమానింతురు, చాలా అనర్థములు కలుగును. కనుక వెళ్ళవద్దని'' ఎంత చెప్పిననూ వినక ఆ యజ్ఞమునకు వెళ్లెను. అంత ఆమెతో కూడ కొంత పరివారము కూడ వెడలెను. ఆమె యజ్ఞశాలకు వెళ్ళగా దక్షునికి భయపడి ఎవ్వరునూ ఆదరించలేదు. ఇంకనూ పరమేశ్వరుడగు తన భర్తకు హవిర్భాగము లేకుండా ధర్మమునకు విరుద్ధముగా ఆ యజ్ఞము నడచుచుండెను. ఇంకనూ ఆ యజ్ఞములో శివుని నిందించుచుండిరి. అంతట సతీదేవి అవమానమును, శివనిందను భరించలేక శివనిందచేయుచున్న దక్షుని కుమార్తెగా పుట్టిన తన దేహమును త్వజించుటకు నిశ్చయించి ఉత్తర దిక్కునకు తిరిగి కూర్చుండి ఆచమనముచేసి కనులు మూసుకొని యోగమార్గమున ప్రవేశించి భర్తయొక్క పాదారవిందములు ధ్యానించుచూ యోగాగ్నిని పుట్టింపగా ఆమె దేహము ఆ యగ్నిలో భగ్గున భస్మమయ్యెను. అంతట అచ్చట నున్న శివభక్తులకు మిగిలిన వారికి గొప్పయుద్ధము ప్రారంభముకాగా ఈ సంగతి శివునికి తెలిసి, తన జట నొక్క దానిని తీసి నేలకు కొట్టగా గొప్ప భయంకర రూపమునవీరభద్రుడు వుద్భవించి దక్షయజ్ఞ స్థానమునకు జని దక్షుని శిరస్సును ఖండించి అగ్నిలో వ్రేల్చి యజ్ఞశాలను తగులబెట్టి శివద్వేషులందరినీ శిక్షించెను. అంతట అందరూ భయపడి బ్రహ్మవద్దకు వెడలిరి మొరపెట్టగా బ్రహ్మ యిట్లనియె ''శివునికి యజ్ఞభాగము నిషేధించి ఆయనకు అపరాధము గావించినారు. గనుక నేనును, విష్ణువును ఆ యజ్ఞమునకు రాలేదు. మీరు చేసిన ఈ అధర్మమునకు శివుని యొద్దకు వెళ్లి వారి పాదములపై బడి క్షమాపణ కోరుకొనుడు. ఆయన అశుతోషి గనుక మిమ్ములను అనుగ్రహించును.'' అని చెప్ప వారందరునూ బ్రహ్మతోకూడ శివుని యొద్దకు వెళ్లి వారి పాదములపై పడి క్షమాపణకోరి దక్షుని తిరిగి బ్రతికింపమనియు, యజ్ఞమును యధావిధిగ పూర్తిచేయుమనియు, యజ్ఞ శేషమంతయూ మీదేయనియు ప్రార్థింప, శంకరుడు అశుతోషుడు గనుక వారి మన్ననల నాలకించి, అనుగ్రహించి మేకతలను దక్షునికి అతికించినచో నేను తిరిగి అతనిని బ్రతికించి యజ్ఞమును పూర్తిచేసెదను అని చెప్పి వారందరితో యజ్ఞశాలకు వెళ్లి మేక తలను దక్షునికి అతికించగా అతని అనుగ్రహ వీక్షణమున నిద్రనుండి మేల్కొన్నట్లు దక్షుడులేచి తాను చేసిన తప్పిదమునకు క్షమింపమని శివుని ప్రార్థించి శివాను గ్రహమును పొంది యజ్ఞమును యధవిధిగ సంపూర్తిచేసెను. అంతట విష్ణువు ప్రత్యక్షమై తనకును శివునికిని భేదమును చూచిన వారు అజ్ఞానులు, పాపాత్ములు అనియూ, మా యిరువురిలో భేదముచూడక భక్తితో పూజించిన వారే శాంతిని పొంది విముక్తులగుదురనియు చెప్పి అంతర్ధానమయ్యెను. దేహమును విడచిన సతీదేవి తపస్సుచేసి హిమవంతునకు, మేనకకు పుత్రికగా జన్మించి పార్వతియను పేర శివునికి భార్యయయ్యెను.''

ధృ వ చ రి త్ర

అంతట విదురుడు స్వాయంభువ మనువు యొక్క వంశ చరిత్రను చెప్పమని కోరగా ఇట్లు చెప్పెను, ''స్వాయంభువ మనువునకు శతరూప యను భార్యయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను యిరువురు కుమారులు జనించిరి. వారిలో ఉత్తనపాదునకు సునీత సురుచి అను ఇద్దరు భార్యలుండిరి. సునీతకి ధృవుడును, సురుచికి ఉత్తముడును అను ఇద్దరు కుమారులు కలిగిరి. ఆ యిద్దరు భార్యలలో రెండవ భార్యయైన సురుచి యందు భర్తకు ఎక్కువ ప్రేమ కలదు. ఇట్లు భార్యలిద్దరితోనూ, పుత్రు లిద్దరితోనూ ఉత్తానపాదుడు ప్రపంచమంతయూ పరిపాలించుచుండెను. ఇట్లుండ ఒకనాడు రెండవ భార్య కుమారుడైన ఉత్తముని తన తోడమీద కూర్చుండబెట్టుకొని ముద్దాడుచుండగా పెద్దభార్య కుమారుడైన ధృవుడును తన తండ్రి తొడపై కూర్చుండబోయెను. తండ్రి ఆదరింపకపోగా సవతితల్లి సురుచి ధృవుని చూచి 'వత్సా నీవు అన్య స్త్రీ గర్భమున పుట్టినావు గనుక నీకు రాజ్యాధిపత్యము లేదు. రాజ్యాధి పత్యమునే కోరితివేని, నీవు నా గర్భమునందు పుట్టవలెను' అని పరుషముగా పల్కెను. అంతట ధృవునకు రోషము, ధుఃఖము రాగా తన తల్లియైన సునీతి యొద్దకు వెళ్ళి జరిగిన దంతయూ చెప్పగా, సునీతి కుమారునితో ''వత్సా! రాజు నన్ను భార్య యని చెప్పుకొనుటకే సిగ్గుపడుటచేతను, రెండవ భార్యయందు ఎక్కువ ప్రేమగా నుండటచేతను, ఆమె యట్లనుట సంభవించినది. నీకు రాజ్యాధిపత్యమున వాంఛ కలదేని, భగవంతుని ఆరాధించి నీ వాంఛ నేరవేర్చుకొనుము'' అని చెప్పి కుమారుని ఓదార్చెను. తల్లి మాటలయందు ధృవునికి విశ్వాసము కలిగి, సవతితల్లి అనిన మాటలచే రోషము కలిగి, భగవంతుని గూర్చి తపస్సు చేయుటకు నిశ్చయించి ఇల్లు విడచి బయలుదేరెను. అట్లు వెడలుచున్న ధృవునకు త్రోవలో నారదుడు కనిపించి ఎచ్చటకు వెళ్ళుచున్నావని అడుగగా, ధృవుడు 'నా సవతి తల్లి అనిన మాటలకు సహింపలేక, తల్లి ఉపదేశమున భగవంతుని ఆరాధించుటకు వెళ్ళుచున్నాను' అని చెప్పగా, నారదుడు విని అతని మనో నిశ్చయమునకు సంతసించి ధృవుని వాంఛతీరటకుగాను ధృవునితో ''వత్సా! నీ తల్లి చెప్పినమార్గము శ్రేయస్కరము. నీవు భగవంతుని అనుగ్రహము పొందుటకు యమునానదీతీరమున ఉన్న మధు వనంబునకు జని అచ్చట వాసుదేవుని ఏకాగ్ర మనస్సుతో ధ్యానింపుము. వాసుదేవుని అనుగ్రహమున నీ వాంఛ నెరవేరును'' అని పలికి వాసు దేవ ద్వాదశాక్షరీ మంత్రముపదేశించి ఆ దేవుని దివ్వ మంగళ విగ్రహ స్వరూపమును తెల్పి వెడలిపోయెను.

ఇట్లుండ ఉత్తానపాదుడు తన కుమారుడైన ధృవుడు తనచే గావింపబడిన అవమానము సహింపలేక రోషముతో ఇల్లు విడచి వెళ్ళిపోయెనని తెలసి తాను చేసిన పశ్చాత్తాపము నొంది, బాలుడైన నా కుమారుడు అడవులలో ఎట్లు బ్రతుకునో! ఏ క్రూరమృగమైన మ్రింగుమనేమో యని విలపించుచుండ, అచటకుజనిన నారదుడు, ''రాజా నీ పుత్రుని గురించి దుఃఖింప పనిలేదు. అతడు భగవంతుని అనుగ్రహంబు బడసి, త్వరలోనే నీ సన్నిధికి రాగలడు. అతనివలన నీ వంశ మంతయూ అద్భుతమైన కీర్తితో వెలుగును'' అని పలికి అతనిని ఓదార్చెను.

ధృవుడు నారదోపదేశమున మధు వనమునకు జని నదిలో స్నానమాచరించి హరి ధ్యానము చేయ ప్రారంభించెను. ఆరంభములో మూడు దినముల కొక పర్యాయము ఫలములు మాత్రమే స్వీకరించుచు ఒక మాసము గడిపెను. రెండవ మాసములలో ఆరేసి దినముల కొకనాడు తృణములను, వర్ణములను తినుచు తపస్సు చేసెను. మూడవ నెలలో తొమ్మిది రోజుల కొకనాడు జలమును మాత్రమే స్వీకరించుచూ తపము చేసెను. నాలుగవ నెలలో పండ్రెండు దినముల కొకసారి వాయువును మాత్రమే భక్షించుచు తప మాచరించెను. ఐదవమాసమున వాయు నిరోధం బొనర్చి నిశ్చలుండై, మనస్సును విషయముల మీదకి పోనివ్వక ఏకపాదము మీద నిలచి ధ్యానమొనర్చెను. ఆ బాలుడు తప మొనరించుచుండగా లోకములోని వారందరకునూ ఉఛ్చ్వాస నిశ్వాసములు నిలిచిపోగ అందరును హరియొద్దకు జని తమ కష్టములను బాప శరణుజోచ్చిరి. అంతట హరి ధృవుని ఘోర తపస్సు వలన ఇట్లు జరిగెనని చెప్పి ఆ బాలుని వెంటనే అనుగ్రహించి మీ కష్టములను పోగొట్టెదనని స్వాంతపరచి వెంటనే గరుత్ముంతుని అధిరోహించి ధృవుని యొద్దకు వచ్చెను. కనులు మూసుకోని ధ్యానములో వున్న ఆ బాలుని అంతరంగమునుండి ప్రసన్నుడగుచున్న హరి అంతర్హితుడు కాగా, ఈ మార్పును సహించలేక ధృవుడు కనులు తెరువగా ధ్యానములో తాను చూచిన వాసుదేవుడే గరుడారూఢుడై ఎదుట ప్రత్యక్షమయ్యెను. అంతట ఆ దేవదేవునికి సాష్టంగా ప్రణామములు ఆచరించి స్తోత్రము చేయలెనను సంకల్పము కలిగెను. కాని స్తోత్రము చేయజాలని బాలుడగుటచే తహతహలాడుచున్న ఆ బాలుని చూచి భగవానుడే తన చేతిలోనున్న వేదమయ శంఖముతో ఆతని కపోల భగమును స్పృశించి అనుగ్రహించెను. దాని ప్రభావమున ధృవునికి వేదాది సకల విధ్యలును కరతలామలకము లయ్యెను. అంత నాతడు భక్తితో నిండుయున్న మనస్సుతో వాసుదేవుని స్తుతించేను ఆ స్తోత్రమునకు భగవంతుడు సంతోషించి ''నీవు వాఛించిన రాజ్యపదమేగాక గ్రహ నక్షత్రాది జ్యోతిశ్చక్రములకు ఆధారమై అత్యున్నతమై ఇంతవరకూ ఎవ్వరూ అధిష్టించని ఉత్తమ స్థానము నీకొసంగెద. నీవు భవనమునకు వెళ్ళిన తదుపరి నీ తండ్రి నీకు రాజ్యము నప్పగించి తపోవనమున కరుగును. నీవు మహారాజపదవి నదిష్టించి ఇరవై ఆరువేల సంవత్సరములు నిష్కంటకముగా పాలించి ఐహిక భోగముల ననుభవించి అంత్యకాలమున నేనిప్పుడు అనుగ్రహించిన సర్వోత్తమ స్థానముపొంది, పునరావృత్తిని కాంచవు నీవు పొందబోవు స్థానము నీ పేరుతో ధృవమండలమని శాశ్వతముగా ప్రసిద్ధిగాంచును."" అని చెప్పి అంతర్ధానమాయెను.

అంతట ధృవుడు తన పట్టణమునకు తిరిగి వచ్చి తాను భగవంతుని సాక్షాత్కారము పొందియు, మోక్షమును కోరక భేదదర్శనమున ఉత్తమ పదివిని వాంఛించితిని, నేనెంత దౌర్భాగ్యుడనో అని చాలా పశ్చాత్తాపము నొందెను. తండ్రి, తన కొడుకు తిరిగి వచ్చుటచూచి చనిపోయినవాడు తిరిగి జీవించినంతటి సంతోషము పొంది, భార్యా పుత్ర పరివార సమేతముగా కుమారునికి స్వాగతమిచ్చి కౌగిలించుకొని ఆనందాశ్రువులు రాల్చెను. సవతి తల్లియైనను, సురిచి తాను గావించిన అపరాధమునకు పశ్చత్తాపమునొంది ఆ బాలుని కౌగిలించుకొని దీవించెను. సోదరుడగు ఉత్తముడు గూడ కౌగిలించుకొని దీవించెను. ఇక తల్లియైన సునీతికి కలిగిన ఆనందమునకు మేరలేదు. తన ప్రాణములకంటే అధిక ప్రేమాస్పదుడైన కుమారుని గాఢ ప్రేమతో ఆలింగనము చేసికొని పరమసుఖమును గాంచి స్తనములు పొంగార ఆనందభాష్పాములు రాల్చెను, అప్పుడు అచ్చట జేరిన జనులందరూ సునీతియొక్క అదృష్టమును కొనియాడ, ఆమెను, ఆ బాలుని ప్రసంశించిరి అంతట ఆ బాలుని గజారోహణ చేయించి అలంకరింపబడిన పురవీధులలో వూరెగింప, పౌరులు అతనిని సకల విధోపచారములతో సేవించిరి. అంతట ఉత్తానపాదుడు తన కుమారుని ప్రభావమునకు ఆశ్చర్యపడి, ప్రజల వాంఛను గ్రహించి అఖిలధరణీ రాజ్యామునకు ధృవుని పట్టభిషిక్తుని గావించి, తాను విరక్తుడై తపోవనమునకు జనియె. తరువాత ధృవుడు వివాహముచేసుకోని పుత్రులను కని, ధర్మ మార్గమున చక్కగా పరిపాలనము చేయసాగుచుండెను. ఇంట్లుండగా అతని సవతి తమ్ముడైన ఉత్తముడు వేటకై పోయి అచ్చట యక్షునిచే హతుడగుటయు అది విని తల్లి యగు సురుచి అగ్ని ప్రవేశము చేయుటయు జరిగెను.

ధృవుడు, తన తమ్మునియొక యక్షుడు వధించినాడను వార్తవిని, యక్షులనందరనూ నశింపజేయుచుండగా విని, తాతగారగు మనువు - ఇట్టి క్రౌర్యభావముకోపము ఎవరికీ తగవనియు, శ్రేయస్సునకు భంగకరములనియూ చెప్పి అతనికి తత్వము ఉపదేశించి శాంతపరచెను. అట్టి తత్వోపదేశము పొందిన ధృవుడు తనలోనూ సర్వభూతములలోనూ ఆ సర్వేశ్వరుని చూచుచూ ధర్మపధములను 26 వేల సంవత్సరములు రాజ్యమేలి, కుమారుని రాజ్యాభిషిక్తునిజేసి, పరమవైరాగ్యముతో సంసారమును త్యజించి, బదరికాశ్రమమున తపమాచరించి సమాధినిష్ఠుడైయుండ, అతనికడకు ఇద్దరు విష్ణుదూతలు వచ్చి అతనిని స్తుతించుచూ భగవంతునివలన పొందిన వరము ప్రకారము నిన్ను ఉత్తమస్థానమునకు గొంపోవుటకు విమానమును తెచ్చితిమి, రమ్మని ప్రార్ధింపగా ధృవుడు ఆ విమానమున గూర్చుండి, పైకి వెళ్ళుచూ గ్రహమండలములను, సప్తఋషి స్థానములను ముల్లోకములను దాటి ఉత్తమస్థానమును ఆరోహించెను. అదియే ''ధృవమండలము'' అని ప్రఖ్యాతి నొంది విరాజిల్లుచున్నది.''

ధృవచరిత్రను చెప్పిన తరువాత మైత్రేయుడు విదురునకు ధృవుని కుమారులతోనూ మనమలతో కూడిన వారి వంశమునంతయూ వర్ణించి వారి వంశములలో అంగుడు అను రాజు అశ్వమేధము నాచరించగా, దేవత లేవ్వరునూ ఆ యజ్ఞమునకు పిలచిననూ రానందులకు కారణమడుగగా నీకు పుత్రులు లేనందున నీ యజ్ఞమున కట్టి లోపముకలిగినది. కావున పుత్రకామేష్టి యజ్ఞమును చేయుమని అచ్చటి మహర్షులు బోధింప, అంగుడు పుత్రకామేష్టి చేసి, అందు అనుగ్రహింపబడిన పాయసమును భార్యఅగు సునీధకు ఇవ్వగా ఆమె వేనుడను కుమారుని కనియెను. అతడు పుట్టినప్పటినుండియూ ఆధార్మికుడై తోటి బాలురను హింసించుచూ లోక మందరి చేతనూ నిందకు పాలయ్యెను. ఇట్లు దుష్టుడైన పుత్రుని చూచి, అంగుడు, అతని సాధు మార్గమున ప్రవర్తింప జేయుటకు ఎంత ప్రయత్నించిననూ సాధ్యముగాక సంసారమునుండి విరక్తుడై సర్వమును త్యజించి అడవులకు పోయెను. అంతట ప్రజలు రాజుజాడగానక కుమారడైన వేనుని రాజ్యాభిషిక్తున్ని జేసిరి. వేనుడు దుర్మార్గుడగుట వలన, యజ్ఞములు చేయవద్దనియు, దానములు, హోమములు చేయవద్దనియు నిషేధించెను. ఇట్లు దుర్వృత్తుడై అధర్మపాలన చేయుచున్న వేనుని గని అతనికి అన్నవిధముల హితబోధచేసిననూ వినక తానే భగవంతుడననియు తననే పూజించుడనియూ నిర్భంధింపగా, మునులు సహింపలేక ''హూం'' కారమున అతనిని నశింపజేసిరి.

పృధు చరిత్ర

వేనుడు చనిపోగానే రాజ్యము అరాచక మగుటచేత ప్రజలు చాల అపాయములకు లోనుకాగా, మహర్షులు వేనుని శవమును సంస్కారముతో శుద్ధిచేయగా వేనుడు చేసిన పాపమంతయూ నల్లని హ్రస్వ గాత్రములతో, పొట్టి చేతులతో ఎర్రని నేత్రములు వెంట్రుకలతో వికృతరూపము దాల్చి ''నిషీదు'' డనువాడు పుట్టెను. అతని వంశము వారందరూ నిషాదులై గిరి కాననములలో నివసించుచుండిరి. వేనుని పాపమంతయూ ఈ నిషాదుని రూపమున బయటకు పోగా, మిగిలిన శరీరమంతయూ పవిత్రమగుటచే ఆ శరీరము యొక్క బాహూవులను మహర్షులు మధనము చేయగా ఒక మిధునము పుట్టెను. ఆ మిధునములో పురుషునకు ''పృధు'' అనియు స్త్రీకి ''అర్చస్సు'' అనియు పేరు పెట్టిరి. ఆ దంపతులను చూచి మహర్షులు, లోక రక్షణార్థమై అవతరించిన లక్ష్మినారాయణులే యని కీర్తించుచుండ పుష్పవర్షము కురిసెను. గంధర్వులు గానముచేసిరి. అట్లు విష్ణు చిహ్నములతో అవతరించిన ఆ పృథువును పట్టాభిషిక్తుని చేయగా కుబేరుడు అతనికి ఉత్తమ సింహాసనమును, వరుణుడు శ్వేతపత్రమును, వాయువు చామరద్వయమును, ఇంద్రుడు కిరీటమును, యముడు సంయమ దండమును, బ్రహ్మదేవుడు వేద మయ కవచమును భారతీదేవి ఉత్తమ హారమును, విష్ణువు సుదర్శన చక్రమును, లక్ష్మీదేవి సంపత్తును, రుద్రుడు అద్భుతమైన కరవాలమును, అంబిక శత చంద్రమను ఫలకమునూ, సోముడు ఉత్తమ తురంగములను, స్రష్టసుందరమైన స్యందనములను, అగ్ని కోదండమును, సూర్యుడు బాణములను, భూమి పాదుకలను, సముద్రుడు శంఖమును సమర్పించగా, ఋషులు అశీర్వాదముచేసిరి. ఇతడు ఆదర్శ ప్రభువు కాగలడని ప్రశంసించిరి.

పృధు చక్రవర్తి రాజ్యాభిషిక్తుడై పాలన ప్రారంభింపగా ప్రజలు తినుటకు తిండిలేక బాధపడుచు, రాజునొద్దకు వచ్చి తమ కష్టములను చెప్పుకొనిరి. పృధుడు వారి మొర నాలకించి, ఈ కరువుకు కారణము భూమి పంటలు పండించకపోవుట యని తెలిసి భూమిని శిక్షీంచుటకు బాణమును గురిపెట్టగా భూమి గోరూపముతో ప్రత్యక్షమై "రాజా నీవు ధర్మజ్ఞుడవయ్యూ నన్ను ఏల వధించుటకు పూనుకొంటివి? స్త్రీ వధ దోషము కదా ? నీకు పూర్వపు రాజులు అధర్మపాలన చేయుటచేతను, లోకమంతయు అరాచక మగుటచేతను, నేను ఓషదుల నన్నింటినీ మ్రింగివేసితిని అందుచేత సస్యములు పండులేదు. కరువు వచ్చినది. నీవు ఇప్పుడు ధర్మపాలన చేయుచున్నాపు గనుక ఆ ఓషధులను తిరిగి నేను క్షీర రూపములో నీ కొసంగెదను. కావున నీవు నా పాలు పిదుకుము"" అని చెప్పెను. అంతట పృధు చక్రవర్తి ఆ గోరూపములోనున్న పృధివి చెప్పిన మాటలకు సంతసించి పాలు పిదుకగా ఓషదు లన్నియు తిరిగి క్షీరరూపమున వ్యక్తమైనవి. అంతట భూమిలో అన్నివిధముల సస్యములు పండి కరువు పోయి ప్రజలు తృప్తిపడిరి ఇంకనూ వేనుని అధర్మపాలనలో, గ్రామములు పట్టణములు పాడగుట చేతను, మెట్టపల్లముల వల్ల భూమి వాసయోగ్యము కాకపోగ, పృధువు భూమిని సమతలము కావించి వానయోగ్యముచేసి, గ్రామములు, పురములు, పట్టణములు దుర్గములు నిర్మించి అన్ని సౌకర్యములు కలుగజేయగా ప్రజలు సుఖముగా జీవించిరి.

ఇట్లు పృధుడు చక్రవర్తి ఆదర్శప్రాయముగా పాలించుచుండ, ఇంద్ర పదవి పొందుటకుగాను నూరు అశ్వమేధ యాగములు చేయ నారంభింప తన ఇంధ్ర పదివికి భంగము వాటిల్లునను భీతిచే ఇంద్రుడు యాగములకు విఘ్నములు కల్పించుచూ నూరవ అశ్వమును ఎత్తుకొనిపొగా, పృధువు ఇంద్రునిపైకి ఇంద్రునిపైకి యుద్ధమునకు వెళ్ళి ఆతనిని చంపబోగా, విష్ణువు ప్రత్యక్షమై, ఇంద్రుడు తన తప్పిదమునకు క్షమార్పణ కోరుటకు వచ్చినాడు గాన, నీవు యుధ్ధమును విరమించి శాంతుడవు కమ్మనినంత, పృధువు వాసుదేవులకు మ్రొక్కి శాంత చిత్తముతో తన పురమునకు విచ్చేసి, ప్రజలకు అన్ని సౌఖ్యములను సమకూర్చుచు ఆదర్శ ప్రభావని ఖ్యాతి పొంది, చివరకు సనత్‌ కుమారుల వలన ఆత్మతత్వమును తెలిసికొని ఆత్మ సాక్షాత్కారము పొంది ముక్తుడయ్యె ను. పతివ్రతయగు అతని భార్యభర్త వియోగము భరించలేక, భర్తను ధ్యనించుచు సహగమనము చేసెను.

పురంజనోపాఖ్యానము

పృధు చక్రవర్తి వంశములో "ప్రాచీన బర్హి" అను నతడు కర్మాసక్తుడై అనేక యజ్ఞములు గావించి వసుంధరా వలయంబెల్ల తన యజ్ఞశాలతో విరాజిల్లచేయగా ఒకనాడాతని వద్దకు నారదుడు విచ్చేసి, " రాజవర్యా! నీవు ఇన్ని యజ్ఞముల నాచరించితివిగదా! ఏమి ప్రయోజనము సాధించితివి? ప్రతి మానవుడు కోరు దుఃఖహాని. సుఖ ప్రాప్తి నీకు ఏమైన లభించినదా" అని అడుగ రాజు అట్టి దేమియుకలుగలేదని చెప్పెను. అంతట నారదుడు ఇట్టి యజ్ఞాదికర్మల వలన మోక్షము కలుగకపోగా, ఈ యాగములలో ననీవు చంపిన పశువులు, నీవు పరలోకమును చేరగానే ఇనుప కొమ్ములతో పొడిచి చంపుటకు ఎదురు చూచుచున్నవి. కనుక నీకు వైరాగ్యము కలిగి తత్వజ్ఞానముతో మోక్షమునుపోందుటకు పురంజనోపాఖ్యానము చెప్పెదను.

పురంజనుడను రాజోక డున్నాడనియు, అతనికి అవి జ్ఞాత చేష్టితుడగు అవిజ్ఞాతనామకుడను స్నేహితుడు డొక డుండెననియు అధ్యాత్మతత్వమును కథారూమున బోధించెను. ఆ కధ వలన అధ్యాత్మతత్వమును అర్ధము చేసికొన లేక, ఆ కధకు అంతరార్థము చెప్పమని కోరగా, నారదుడు ఇట్లు చెప్పెను: "ఈ దేహములోని జీవుడే పురంజనుడు, అతనికి సుఖుడని చెప్పబడిన అవిజ్ఞాతుడే ఈశ్వరుడు, ఆ పురంజనుడు ప్రవేశించిన పురము ఈ దేహము. నేను, నాది అను అభిమానము పుట్టించు బుధ్ధిచే అతని నాకర్షించిన కామరూపియగు ప్రమద, దాని నాశ్రయించి పురుశు డనుభవించు జ్ఞాన కర్మేంద్రియ గుణములు తన మిత్రములు, పంచవృత్తియగు ప్రాణమే పంచ శీర్షమగు పన్నగము, మనస్సే బృహద్బలుడు, పాంచాలములు శబ్దాది విషయములు, ఆ పురమునకు గల ద్వారములు తొమ్మిదింటిలో రెండుకండ్లు , రెండు ముక్కలు ఒక నోరు కలసి ఐదు పూర్వ ద్వారములు, రెండు చెవులు ఉత్తర దక్షిణ ద్వారములు, మలమూత్రద్వారములు పశ్చిమద్వారములు. చండ వేగుడనువాడు సంవత్సరము మున్నూట అరవై గంధర్వులు మున్నూట అరవై పగళ్ళు. మున్నూట అరవై గంధ్వర స్త్రీలు మున్నూట అరవై రాత్రులు, యవనేశ్వరుడనువాడు మృత్యువు. ఆతని సైనికులే ఆధివ్యాధులు. దేహము, రథము, ఇంద్రియములు అశ్వములు, పుణ్యపాపములు రెండును చక్రములు, పంచప్రాణములు బంధనములు, మనస్సు, పగ్గము, బుద్ది సారధి, హృదయము రధికుడు వుండు స్థానము, ఆ త్మెతరమైన దేహేంద్రియ మనో ధర్మములను తనయందు ఆరోపించుకొని, నేను నాది అను దురభిమానముతో అజ్ఞానాంధకారమున మునిగి, తాను ప్రకృతికి పరుడైన పరమాత్మయని తెలియక ప్రకృతి గుణములకు అభిమానియై, స్వాత్విక, రాజస, తామసవృత్తులకు వశుడై చేసిన కర్మలకు అనుగుణ్యములగు లోకములు పొందును. ఒకప్పుడు పురుషుడుగాను, ఒకప్పుడు స్త్రీగాను, ఒకప్పుడు పశువుగాను, ఒకప్పుడు మనష్యుగాను కర్మాను గుణముగా పుట్టును. ఈ విధముగా కామాశ్రయుండైన జీవుడు ఉచ్చనీచ మార్గముల తిరుగుచు సుఖదుఃఖముల ననుభవించును ఇట్టి స్థితిలో దుఃఖ విచ్ఛేదము ఎప్పుడూ కలుగదు. అప్పుడప్పుడు తోచు శాంతియనునది తాత్కాలికమేగాని నిత్యముకాదు. తలమీది బరువు భుజముమీదికి దించుకొన్నట్లేగాని అన్యముకాదు. కర్మలకు కేవల కర్మయే ఆత్యంతిక ప్రతీకారము కానేరదు. ఆ రెండు విధముల కర్మలు అవిద్యాప్రాప్తములే! పరమార్థ స్వరూపుడైన ఆత్మకు ఈ అనర్ధ పరంపరయే సంసారము. దానిని విచ్ఛేదమొనర్చునది హరి భక్తియే. అట్టి భక్తిక్రమముగా విరక్తిని, జ్ఞానమును కలిగించును. అట్టి భక్తి యోగము భాగవత సజ్జనులు చేరినచోట, వారి సహవాసము వలన కలుగును. కనుక సత్సంగము ప్రధానము. అట్టి సాధు సమాజమున ఆ మహాఫురుషులు కీర్తించు భగవత్‌ గుణముల శ్రవణమువలన, క్రమముగా క్షుత్‌ పిపాసలు, భయశోక మోహములు కలుగవు. భగవదనుగ్రహ భాజనుజడైనవాడు లోక వ్యవహారములను, కర్మమార్గమున ఆసక్తిని త్యజించి క్రమముగా ఆత్మజ్ఞానమును కలిగి తరించును. కావున ఓ ప్రాచీన బర్హీ అవాస్తవములై, చెవికి ఇంపుగాతోచు ఈ కర్మములయెడ పరమార్ధ దృష్టి చేయకుము. మలిన బుద్ధులు వేదపరమార్ధ మెరుగక కర్మాచరణమే వేదార్ధంబని భ్రాంతిచెంది, ఆత్మ లోకమెరుగరు. బర్హిష్మంతుడను పేరు గల నీవు ప్రాచీనాగ్రములైన దర్భలను, భూమండల మెల్ల పరచి. అసంఖ్యాకములుగ యజ్ఞములుచేసి, ప్రాచీన బర్హియము నామమున పొందితివి. ఏ కర్మ భగవంతుని యందు భక్తిని కలిగించునో అదియే నిజమైన కర్మ. అట్టి భక్తిని కలిగించనివి కర్మములు కనేరవు. కనుక భగవంతుని యందు భక్తికలిగి, ఆయనే శరణమని తలచి, ఆయనవల్లనే అభయము రాగలదని ఎరింగినవాడే విద్వాంసుడగును" ఇట్లు నారదుడు ప్రాచీన బర్హికి ఆత్మవిద్యను బోధింపగా ఆతడు కర్మలయందు ఆసక్తి విడచి, నారదుని ఉపదేశాను సారము ఆత్మతత్వ విచారణ చేయుచూ కర్మల విషయమై సంశయము కలిగి " నారదా కర్మలు చేయువాడు, తత్కర్మాచరణకు సాధమైన దేహమును ఇచ్చట విడువగా దేహాం తరమున తత్ఫలముల ననుభవించునని చెప్పుట ఎట్లు కుదురును? చేసిన కర్మ ఇచ్చటనే నశించగా కాలాంతరమున ఎట్లు ఫలమిచ్చును?" అని సంశయము వెలిబుచ్చ నారదుడు " ఓ రాజా పురుషుడు మనస్సే ప్రధానముగా గల సూక్ష్మశరీరముతో కర్మలు చేయునుగాన ఆ కర్మఫలమంతయు ఆ సూక్ష్మ శరీరములోనే నిలచియుండును. స్థూలదేహము నశించుననూ, సూక్ష్మశరీరమే ఇంకొక స్థూలదేహములో ప్రవేశించును గాన, కర్మచేసిన వాడే ఆ ఇంకొక స్థూలదేహాములో ఫలమనుభవించును రెండు శరీరములలోనూ సూక్ష్మదేహ మొక్కటియేగాన, నీ సంశయమున కవకాశములేదు. కర్మనశించిననూ దాని ఫలము సూక్ష్మదేహములో నిలచియుండును గాన ఆ ఫలమును కాలాంతరమున దేహాంతరముతో అనుభవించును. జలగ తనకు ముందున్న తృణమును పట్టుకొనియే తానున్న తృణమును విడచును. ఈ తృణజలూక న్యాయమున పురుషుడు మ్రియమానుడయ్యూ అన్యదేహ ప్రాప్తి కలుగ నంత వరకూ పూర్వదేహాభిమానము విడువడు. ఈ విధమున పూర్వపూర్వ కర్మములు, ఉత్తరోత్తర దేహములకు ఆరంభమగును. కర్మ ప్రవాహమున సర్వమూ ఉపపన్న మగును. కావున ఓ రాజా ఈ జగమంతయూ వాసుదేవత్మకమేనని తలంచి ఆ హరిని భక్తితో ధ్యానించి మోక్షమును పొందుము'' అని నారదుడు ప్రాచీన బర్హికి తత్త్వోపదేశ##మే చేసెను. అంత నాతడు రాజ్యమును పుత్రులకు వప్పగించి కపిలాశ్రమమున ఏకాగ్రచిత్తుడై భగవంతుని ధ్యానించి ముక్తుడైయ్యెను. వాని కుమారులైద ''ప్రచేతసులు'' కొంత కాలము పరిపాలించి రాజ్యమును తమ కుమారులకు వప్పగించి ఏకాగ్ర మనస్కులై తమ మొనరింపగా శ్రీహరి సాక్షాత్కరించి వరము కోరుకొమ్మని అడుగగా, ఆ ప్రచేతసులు ''మేము ఎన్ని జన్మములు ఎత్తిననూ మాకు భాగవతుల సంగము ఎల్లప్పుడూ వుండునట్లు అనుగ్రహింపు''మని వరమగడిగిరి. శ్రీహరిచే ఆ వరములు పొంది ప్రచేతసులు కొంతకాలము రాజ్యపాలస చేసి, పుత్రులకు వప్పగించి, పశ్చిమతీరమున పుణ్యాశ్రమమునందు ఆత్మజ్ఞానము కొరకు తపస్సు చేయగా, నారదుడు ప్రత్యక్షమై ''సకల శ్రేయస్సు లకు మూలము హరిధ్యానమే. సర్వభూతములకు హరియే ఆత్మ. వృక్షమూలమున నీరుపోసిన, శాఖలకు పత్రములకు పుష్పములకు, ఫలములకు ఎట్లు తృప్తి కలుగునో అటులనే సర్వసృష్టికి మూలమైన హరిని అర్చించినచో సర్వ భూతములనూ అర్చించినట్లే యగును. ఈ ప్రపంచ మంతయూ ఆ హరివల్లనే వ్యక్తమై, ఆ హరిలోనే లయించును. సూర్యకాంతి సూర్యునికి వేరుకాని విధమున విచిత్ర ప్రకారమైన ఈ జగత్తు ఆ హరికంటె వేరుకాదు. కావున మీరు ఆ నిత్యానంద చిద్ఘనుడగు ఆ పరమాత్మను ఆత్మైకత్వ భావనతో భజింపుడు. అందుకు సర్వభూత దయ, యదృచ్ఛాలాభ సంతుష్టి, సర్వేంద్రియోపశాంతి ముఖ్యసాధనములు'' అని బోధించి వెడలిపోయెను. అంత ప్రచేతసులు నారదుని ఉపదేశాను సారము ధ్యానము గావించి ఆత్మజ్ఞానమును పొంది ముక్తులైరి.

చతుర్ధ కిరణము సమాస్తము

భాగవతములోని చతుర్థస్కంధము సమాప్తము

Sri Bhagavatha kamudi    Chapters