Sri Bhagavatha kamudi    Chapters   

3.వకిరణము

విదురమైత్రేయ సంవాదురూపబోధ

దేవహూతికి కపిలుని బోధ

పరీక్షిత్తు అడిగిన ఆత్మతత్వమును గురించి శుకయోగీంద్రుడు యిట్లనెను. ''ఓ రాజా, పూర్వము విదురుడు మైత్రేయుని నీవు నన్ను అడిగినట్లే అడుగగా మైత్రేయుడు విదురునకు చేసిన బోధను నేను చెప్పెదను వినుము. కౌరవ పాండవ యుద్ధమునకు పూర్వము విదురుడు ధృత రాష్ట్రునితో పాండవులకు వారి రాజ్యమును ఇచ్చి సంధిచేసి కొనమని హితబోధ చేయగా దుర్యోధనుడు ఆ మాటలను వినకపోగా విదురుని బాగా నిందించి వెడలగొట్టెను. అంతట విదురుడు తీర్థయాత్రలకు బయలుదేరి, ఆయా తీర్థములు తిరుగుచూ తిరుగుచూ ఉద్ధవుని దర్శించెను, అంతట విదురుడు ఉద్ధవుని కౌరవ పాండవుల క్షేమమును గురించి అడుగగా, వారిద్దరికి యుద్ధము సంభివించిన దనియు, ఆ యుద్ధములో పాండవులు పాండవులు జయించినారనియు, కౌరవులు ఓడిపోయి నశించినారనియు, చెప్పి, కృష్ణనిర్యాణమును గూర్చి గూడ చెప్పెను. అంతట విదురుడు ఉద్ధవునితో యిట్లనియె ''ఉద్ధవా నేను కృష్ణునియొద్ద ఆత్మతత్వమును తెలిసికొనవలెనని వాంఛతో నున్నాడను. కృష్ణుడు నిర్యాణము చెందినచో నాకు ఆత్మతత్వమును బోధించువారెవ్వరు?'' అని విలపించగా ఉద్ధవుడు ''విదురా, నీకు ఆత్మతత్వమును చెప్పుటకై కృష్ణుడు మైత్రేయుని నియమించెను, కనుక నీవు గంగానదీ తీరమున నున్న మైత్రేయుని కలసినచో నీకు వారు ఉపదేశించెదరు, కనుక నీవు వారిని కలియుము'' అని చెప్పగా, విదురుడు గంగానదీతీరమున నున్న మైత్రేయుని కలిసి ''సాధుపుంగవా నేను కృష్ణుని యొద్ద ఆత్మతత్వమును తెలిసికొనవలెనని అనుకొనగా, కృష్ణుడు అవతారమును చాలించుచూ, నాకు ఆత్మతత్వమును బోధించుటకు మిమ్ములను నియమించినాడని తెలిసి తమ వద్దకు వచ్చితిని. కావున నాకు ఆత్మతత్వమును చెప్పి నన్ను అనుగ్రహింపు''డని ప్రార్ధించెను. అంతట మైత్రేయుడు, ''విదురా నీవు యముని అంశములో జన్మించిన పవిత్ర జన్ముడవు. భగవంతుడైన కృష్ణునికి నీవు పరమ భక్తుడవు. అందుచేతనే కృష్ణుడు నిర్యాణాత్పూర్వము నీకు జ్ఞానోపదేశము చేయ నన్ను నియమించెను. కావున భగవల్లీఅను గురించియు, ఆత్మతత్వమును గురించియు వివరించెదను శ్రద్ధగా వినుము.

ఈ ప్రపంచము ఏర్పడుటకు ముందు భగవంతుడు నిర్గుణ నిరాకారుడుగా ఒక్కడే వుండెను. ఆయన మాయతో కలిసి ఈ విశ్వము నంతయూ నిర్మించెను, ఆ సృష్టిలో మొదట మహదాది తత్వముల సృష్టించగా వానిలో ఒకరి కొకరికి కలయిక లేకపోవటము వలన ప్రపంచ రచన కుదరక పోగా ఈశ్వరుడు ఆత్మతత్వములలో అంతర్యామిరూపమున క్రియా శక్తితోడ ప్రవేశించి నానా రూపములగు ఆ తత్వగుణములకు పరస్పర సంయోగము గావించెను. అంతట విరాట్‌ దేహము సృజింపబడెను. ఆ విరాట్టు జ్ఞాన శక్తి యోగమున హృదయావచ్ఛిన్న చైతన్యరూపమున ఏకవిధముగను, క్రియాశక్తి యోగమున ప్రాణాపానవ్యానో దాన సమానములు, నాగ కూర్మ కృకర దేవదత్త ధనం జయములు అను దశ విధములుగాను, తరువాత జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనోబుద్ధి చిత్త అహంకారములు ఏర్పడెను. క్రమముగా దేవ నర భూతములు సృష్టింపబడగా, దేవతలకు స్వర్గలోకమును, మనుష్యులు, పశ్యాదులకు భూలోకమును, భూతాది గణములకు అంతరిక్షము నివాసమయ్యెను.

మనుష్యులలో బ్రాహ్మణాది వర్ణములు వారి వారి వృత్తులతో జనించిరి. వేద ఇతిహాస పురాణాదులును ఆవిర్భవించెను. ఈ నాలుగు వర్ణముల వారును తమ తమ వృత్తులతో భగవంతుని శ్రద్ధతో ఆరాధించిన, చిత్తశుద్ధి కలిగి, భగవత్‌ సాక్షాత్కారము పొంది తరింతురు'' - అని మైత్రేయ మహర్షి విదురునకు చెప్పెను. అంత ''స్వామీ నిర్గుణుడు నిర్వికారుడైన పరమాత్ముడైన భగవంతునికి గుణ క్రియా సంబంధము ఎట్లు కలిగెను? ఆత్మకు అవిద్యా సంబంధము ఎట్లు కలిగెను'' అని విదురుడు అడుగగా మైత్రేయుడు ''విదురా భగవంతునికి మాయ అనుశక్తి కలదు. అది అచింత్యమైనది, అట్టి మాయా బలముచే భగవంతునికి గుణ క్రియా సంబంధము ఏర్పడెను. ఆ సంబంధములు యదార్ధ ముగా లేకుండిననూ స్వప్న దృశ్యమువలె ఉన్నట్లు కనిపించు చుండును. అటులనే ఆత్మకు అవిద్యచే సంసారాదికము ప్రాప్తమయ్యెను. నీరు కదిలినయడల నీటిలోని సూర్య ప్రతిబింబము కదిలినట్లు కనపడిననూ, వాస్తవములో సూర్యుడు కదలనట్లు ప్రతిబింబ రూపుడైన జీవుని యొక్క సంసారమేమాత్రమునూ బింబభూతుడైన ఆత్మను అంటదు.

దేహ తాదాత్మ్యమున జీవునికి దుఃఖరూపమైన ఈ సంసారము ఏర్పడినది. అట్టి తాదాత్మ్యాభిమానము పోవుటకు, నివృత్తి ధర్మము, భగవంతుని అనుగ్రహము, భగవద్భుక్తి అను మూడు ముఖ్య సాధనములు అని మైత్రేయుడు విదురునకు చెప్పెను. తరువాత విదురుడు కాలము యొక్క సామాన్య లక్షణములను విశేష లక్షణములను చెప్పమని కోరగా అవి అన్నియూ వివరించె. ఆ తరువాత వర్ణ ధర్మమును ఆ శ్రమ ధర్మమును వివరించె. ఒక్కొక్క ఆశ్రమము నాలుగు విధములుగా నున్నదని చెప్పెను.

ఇంతవరకూ గావించిన సృష్టి సంకల్పము చేత గావింపబడిన దగుటచేత వృద్ధిపొందక పోయెను. అందుచేత వృద్ధి పొందతగిన వృద్ధి పొందతగిన విధానములో సృష్టి చేయదలంచి బ్రహ్మ తపస్సు చేయగా అతని దేహము నుంచి ఒక పురుషరూపము, ఒక స్త్రీ రూపము ఉద్భవించె. ఆ పురుషుడు స్వాయంభువ మనువున్నూ, స్త్రీ అతని భార్యయగు శతరూపయు నయిరి. వారిద్దరి సంయోగము వలన ప్రజాభివృద్ధి బాగుగనయ్యె. ఈ విధముగ మిధున సృష్టి అప్పటి నుంచి ఏర్పడి, అద్భుతముగ వృద్ధిలోనికి వచ్చెను. స్వాయంభువ మనువునకును శత రూపకును ప్రియ వ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కుమారులున్నూ, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను ముగ్గురు కుమార్తెలున్నూ కలిగిరి. అంతట మనువు ఆకూతి యను కుమార్తెను రుచికిని, దేవహూతిని కర్ధమునకును, ప్రసూతిని దక్షకునకు ఇచ్చి వివాహము చేసెను. వారి సంతతులద్వారా ఈ జన్మమంతయూ మానవ సృష్టితో పరిపూర్ణంబయ్యె. స్వాయంభువ మనువు సంతానము కన్న తరువాత తాము చేయవలసినపని ఏమి అని బ్రహ్మను అడుగగా, ఆదరభావముతో పుత్రులు తండ్రుల ఆజ్ఞలను పరిపాలించుటయే వారు చేయవలసిన ధర్మము అని చెప్పి ధర్మమార్గమున ఈ భూమిని పరిపాలించుచు, యజ్ఞములు చేసి, యజ్ఞ పురుషుని ఆరాధింపుము, అవియే నీవు చేయవలసిన ప్రధాన కృత్యములు. వారి వలన భగవంతుడు సంప్రీతుడు అగును, అని బ్రహ్మ చెప్పగా మనువు దానికి అంగీకరించి ప్రస్తుతము భూమి నీటిలో మునిగియున్నది కాన దానిని ఉద్ధరింపమని బ్రహ్మను ప్రార్ధించెను. అంతట బ్రహ్మ తన కునూ ఏమియు తోచక భగవంతుని ధ్యానించగా అతని నాసా వివరమునుండి అంగుష్ఠ ప్రమాణముతో ఒక వరాహము బయల్పడి, చూచుచుండగనే అద్భుతముగ పెరిగిపోయెను. దానికి వారందరు ఆశ్యర్యపడి, ఆ వరాహమును సుత్తించుచుండగా ఆ వరాహము జలములోనికి ప్రవేశించి ఆ నీటిలో మునిగియున్న భూమిని లేవనెత్తి బయటకు వచ్చుచుండగా హిరణ్యాక్షుడు అడ్డము వచ్చి ఆ యజ్ఞ వరాహమూర్తితో యుద్ధము చేయగా ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని ఉద్ధరించె. భగవంతుడే ఈ వారహ అవతారమున భూమిని ఉద్ధరించి అందరిని కాపాడినాడను ఆనందముతో బ్రహ్మాది మహర్షులు ఆ వరాహమూర్తిని స్తోత్రము చేసిరి.

ఈ వృత్తాంతమును వినినంతనే విదురుడు హిరణ్యాక్షుని జన్మ వృత్తాంతమును చెప్పమని కోరగా మైత్రేయుడు ఇట్లు చెప్పదొడంగె :

పూర్వము కశ్యప ప్రజాపతి భార్యయైన దితి ఒక సంధ్యా సమయమున కామోద్రేకము భరించలేక పుత్రార్థినియై భర్తను ప్రార్ధించె. సంధ్యా సమయమున భార్యా భర్తలు కలియరాదనియు, అట్లు కలిసిన రాక్షసులు పుట్టుదురనియు, కశ్యపుడు ఎంత చెప్పినను, దితి వినక కామోద్రేకముచే భర్తను నిర్బంధింపగా అతడామెకోర్కెను తీర్చెను. వారి సంయోగము వలన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అను యిద్దరు రాక్షసులు పుట్టిరి. అంతట దితి తాను చేసిన దుష్కార్యమునకు పశ్చాత్తాపముతో చింతించి ఇట్టి రాక్షస పుత్రుల వలన తనకు అప్రతిష్ఠ రాకుండగ రక్షింపమని ప్రార్ధింపగా కశ్యుపుడు తన రెండవ భార్యతో నీ ద్వితీయ కుమారునియొక్క కుమారుడు పరమ భాగవతోత్తముడై శాశ్వత యశస్సు గడించుననియూ, నీ కుమారుల నిద్దరనూ నారాయణుడు సంహరించుననియు చెప్పగా, విని దితి చాల సంతసించె.

ఈ హిరణ్యాక్ష హిరణ్యకశివుల పూర్వజన్మ వృత్తాంత మేమనగా, వైకుంఠములో నున్న భగవంతుని దర్శించు నిమిత్తము బ్రహ్మ మానవ పుత్రులగు సనకాదులు వైకుంఠమునకు రాగా అచ్చటి ద్వారపాలకులగు జయ విజయులు సనకాదులను లోనికి పోకుండ అడ్డగించిరి. అంత సనకాదులు కోపముతో వారిద్దరిని రాక్షసులు కమ్మని శపించిరి. అంతట భగవంతుడు శ్రీదేవితో అచ్చటకు విచ్చేయగా సనకాదులు తాము జయ విజయులను శపించుట పొరబాటని పశ్చాత్తాపము ప్రకటించగా, భగవంతుడు సనకాదులతో తాము తప్పు చేయలేదనియూ ద్వారపాలకులదే తప్పనియూ, బ్రాహ్మణోత్తములగు సనకాదులు తనకే పరదైవతంబులు కాన తన ద్వారపాలకుల తప్పును తన తప్పుగానే భావించి క్షమించమనియు, సనకాదులిచ్చిన శాప ప్రకారముజయ విజయులను వెంటనే రాక్షసులుగా జన్మించి తిరిగి తనయొద్దకు వచ్చునట్లు అనుగ్రహించె. అట్లు భగవంతుడు చెప్పిననూ, సనకాదులు తాము క్రోధముతో శపించుట తమ ధర్మమునకు భంగమనియు, తాము చేసినది పాపకార్యము గాన తమ్ము గూడ దండించిననూ సమ్మతమేననియు విన్నవించగా, భగవంతుడు ''మహర్షులారా! మీరు ఇచ్చిన శాపము మీరు బుద్ధిపూర్వకముగా చేసినది కాదు. నేనే మీచేత అట్లు శాపము నిప్పించితిని. కనుక మీరు చేసినది తప్పు కాదు భయపడకుడు'' నిఅ వారిని తృప్తిపరచి పంపెను. అంతట తమ ద్వారపాలకులను పిలిచి ''మీరు పూర్వ మొకసారి నా భార్య రమాదేవి నా యొద్దకు వచ్చుచుండగా, ఆమెను గూడ లెక్కజేయక అడ్డగించితిరి. ఆమె అప్పుడు, మీరు రాక్షసులుగా పుట్టవలసిన వారను భావము కలిగినదయ్యె. ఆ భావమే యిట్లు సనకాదుల ద్వారా శాపముగా వ్యక్తమయ్యెను. మీరు అల్పకాలములోనే నా సన్నిధికి చేరగలరు'' అని వారిని వూరడించి భగవానుడు లోనికి జనియె. తరువాత విదురుడు మిధువ ధర్మమున ప్రజావృద్ధిని గావించిన స్వాయంభువ మనువు, వంశమును గురించి తెలిసికొనవలయునుగాన వారి పుత్రులగు ప్రియవ్రత ఉత్తానపాదులు ఎట్లు సప్తద్వీపంబగు ఈ భూమిని ధర్మముగా పాలించిరో, ఆ మనువు యొక్క పుత్రికలైన దేవహూతి, ఆకూతి, ప్రసూతుల వల్ల సృష్టి ఎట్లు వృద్ధిపొందెనో చెప్పమని కోరగా, మైత్రేయుడు ఇట్లు చెప్పెను.

పూర్వము బ్రహ్మ ప్రజలను సృష్టించమని కర్దమ ప్రజాపతికి చెప్పగా నాతడు తదర్ధమైన తపస్సు చేసెను. అంతట నారాయణుడు ప్రత్యక్షమై మనువు యొక్క పుత్రిక దేవహూతిని నీకిచ్చి వివాహము చేయుదురనియు నీవు తొమ్మిదిమంది కూతులను కనిన తదుపరి నేను నీ పత్నియగు దేవహూతి గర్భమున అవతరించి కపిలుడు అనుపేరుతో తత్వోపదేశము చేసెదననియు చెప్పి, సప్తసాగర పరీతంబైన మహీమండలము సామ్రాట్టుగా పరిపాలించెదనని చెప్పి అంతర్థానంబయ్యెను. కొంత కాలమునకు స్వాయంభువ మనువు భార్యా కుమార్తెలతో కర్దముని వద్దకు వచ్చి దేవహూతిని వివాహము చేసికొనమని కోరగా ఆతడంగీకరించి వివాహము చేసికొనెను. ఈ వివాహమే జగత్తులో ప్రప్రధమ వివాహము. వివాహానంతరము కర్దముడు పతి వ్రతయైన తన భార్య యొక్క సపర్యలను గైకొనుచూ తపోనిష్ఠలోనుంచెను. ఇట్లు దీర్ఘకాలముగడువగా దేవహూతి భర్తతో సంసార ధర్మము ఏమియు ఎరుగక కృశించిపోయి కంట నీరు పెట్టుకొన, ఆమెను చూచి, ఆమె విచారమునకు కారణ మడగి తెలిసికొని ''మానినీ నీ పరిచర్య వలన చాల సంతసించితిని. నేను తపస్సు వలన సాధించిన భోగము లన్నియు నీకు అనుగ్రహించెదను. దుఃఖించకుము'' అని చెప్పగా ఆమె 'తన శరీరము యొక్క కృశించిన వార్థక్యస్థితిలో కామ భోగముల ననుభవించు టెట్లు సాధ్యము' అన్నంత కర్దముడు భార్యను తన ఆశ్రమములోనున్న బిందు సరోవరమున స్నానమారించి రమ్మని చెప్పెను. ఆమె అట్లు ఆ సరస్సునందు స్నానముచేయగా తన పూర్వపు ¸°వన స్థితి వచ్చుటయు, అనేక మంది పరిచారికలు సకల విధముల పరిచర్యలు చేయుటయూ ఆమె చూచి ఆనందించెను అంతట కర్దముడు యోగమహిమచే గొప్ప విమానమును సృజించి ఆ విమానములో భార్యతో విహరించి భూగోళము ఎల్ల చూపి ఆనందపరచెను. తరువాత ఆ దంపతు లిద్దరూ సర్వ భోగములను అద్భుతముగా అనుభవించుచూ సంసారము చేయగా తొమ్మిదిమంది కుమార్తెలు కలిగిరి. అంతట కర్దముడు గృహస్థాశ్రమము విడచి సన్యసించెదనని చెప్పగా దేవహూతి, ఈ కుమార్తెలందరకూ వివాహము చేసి తనకు పుత్రుని ప్రసాదించిన తరువాత తనకు గూడ మోక్షమునకు తగు జ్ఞానబోధన అనుగ్రహించ మనగా కర్దముడంగీకరించి ఆమెను భగవంతుడే పుత్రుడుగా తనకు పుట్టునట్లు తపస్సు చేయమనెను. అట్లు దేవహూతి తపస్సు చేసిన యనంతరము ఆ దంపతులకు భగవంతుడు కపిలుడుగా అవతరించెను. అప్పుడు పుష్పవర్షము కురిసి దేవదుందుభులు మ్రోగెను. బ్రహ్మ, మరీచి మున్నగువారితో అచ్చటకు విచ్చేసి అవతరించిన కపిలుని దర్శించి స్తుతించి ఆయన గొప్పతనమును, వారియొక్క అవతార చర్యలు విశదీకరించి అంతర్ధానమయ్యెను. అంతట కర్దముడు తన తొమ్మిది మంది కుమార్తెలను అత్రి, అంగీరస, భృగు, వశిష్ఠుడు మున్నగు తొమ్మండ్రు ప్రజాపతులకు యిచ్చి వివాహము చేయగా వారందరూ భర్తలతోడ వారి వారి ఆశ్రమములకు వెళ్ళిరి. అంతట కర్దముడు భగవదవతార పురుషుడున్నూ తన పుత్రుడున్నూ అయిన కపిలుని చూచి''నీబోటి సర్వజ్ఞుడైన పరమ పురుషుని కుమారునిగా గని నేను నా పితృఋణము తీర్చుకొని ధన్యుడనైతిని. నేను తురీయా శ్రమము స్వీకరించుటకుగాను వెడలుచున్నాను అనుజ్ఞనిమ్ము'' అని కోరగా కపిలుడు''మానవునికి ఆత్మ సాక్షాత్కారము వల్లనే మోక్షము, అట్టి ఆత్మతత్వమార్గము చాలా కాలము గడచుటచే నష్టమయ్యెను. అట్టి మార్గమును ఉద్ధరంచుటకై నేను అవతరించితిని. నీకు దానిని బోధించెద''నని దాని సారమును చెప్పగా, కర్దముడు సన్యసించి వనమునకు పోయి మౌన వ్రతము నవలంబించి ఆత్మధ్యానము గావించి ఆత్మసాక్షాత్కారము పొంది - సర్వ భూతములలో తనను, తనలో సర్వభూతములను కనుగొని ముక్తుండయ్యెను.

కపిలుడు దేవహూతికి బోధించుట

కర్దముడు అడవికి వెళ్ళినంతనే, భార్యయగు దేవహూతి కుమారుడగు కపిలుని సమీపించి ''మహాత్మా ప్రపంచ విషయాభిలాషిణియై, జ్ఞానజ్యోతి కానక అజ్ఞానాంధకారములో వున్న నన్ను ఉద్ధరించి తత్వజ్ఞానము ప్రసాదింపుము'' అని అడిగిన తల్లినిచూచి అట్టి వాంఛను కనపరచినందుకు తల్లిని అభినందించి ఇట్లు బోధించెను :-

మనస్సె జీవునకు బంధములకు మోక్షములకు, రెంటికిని కారణము. అనాత్మయగు దేహమునందు ఆత్మాభిమానము, ఆత్మీయులగు దారాపుత్రులయందు ఆత్మీయత్వాభిమానము. ఈ రెండునూ వీటి వలన వచ్చు కామక్రోధములును మనస్సునకు మాలిన్యములు అని చెప్పబడును. ఈ మనస్సులోనుంచి మాలిన్యములు తొలగి మనస్సు శుద్ధముగా మారి ద్వాంద్వాతీతమైనప్పుడు జ్ఞాన వైరాగ్యములు కలిగి ఆత్మసాక్షాత్కారము పొందును సత్పురుషుల సహవాసము దీనికి ముఖ్యసాధనము. శమద మాది సంపన్నులగు సాధువులు నాయెడ దృఢమైన జ్ఞానభక్తిచేసి నా కథలను కీర్తించుచూ ఆనందించుచుందురు. వారే సర్వసంగ వివర్జితులైన సాధువులు. అట్టి సాధు సంగమము ప్రార్ధనీయము. వారిని సేవించిన యెడల భగవంతుని ప్రభావము తెలియజేయు కథలు వినుట సంభవించి దాని వలన భగవంతునిపై శ్రద్ధయు భక్తియూ కలుగగా అట్టి భక్తియోగముచే భగవంతుని పొందుదురు.

జ్ఞానేంద్రియములున్ను, కర్మేంద్రియములున్నూ, మనస్సుయును, భగవంతుని యడల ప్రవర్తించుటయే భక్తియోగము, ఇంకనూ తత్వమార్గము ఏదియన, దేని వలన హృదయగ్రంధి భేదమై ఆత్మదర్శన రూప జ్ఞానము కలుగునో అది తత్వజ్ఞాన మార్గము. ప్రకృతికి పరుడై అనంగుడు నిర్గుణుడు పరంజ్యోతి అగు ఆత్మయే పురుషుడు అనబడును. అతడు దేహాది ఉపాధుల సహకారముచే జనన మరణాదులు పొందినట్లు వ్యక్తమగును వాస్తవమున ఆత్మకు జనన మరణాదులు లేవు కాని మాయచే తనను మరచి తాను కర్తయని భోక్తయని తలంచుచుందురు. ఇదియే ఆత్మకు సంసారబంధము. కార్యకారణ కర్తృత్వమున పురుషునకు ప్రకృతి కారణము, సుఖదుఃఖ భోక్తృత్వమున ప్రకృతికి పురుషుడు కారణము. గుణత్రయసమన్వితమై అవ్యక్తమై కార్యకారణ రూపమైన ప్రధానమే ప్రకృతి యనబడును. పంచభూతములు, శబ్దస్పర్శాదులు అయిదు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు కలసి పది, మనోబుద్ధిచిత్తాహంకారములు నాలుగు, ఇవి యన్నియూ కలిసి ఇరవైనాలుగు తత్వములు కలిగినది ప్రకృతి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మము దీనితో కలిసి సగుణబ్రహ్మముఅగును. బ్రహ్మము ప్రకృతిలో కలసిననూ నిర్గుణము కావున అకర్త గానే ఉండును. నీటిలో ప్రతిబింబించినసూర్యునికి నీటి సంబంధము అంటని విధమున ప్రకృతి గుణములగు సుఖదుఃఖ వేపమును ఆత్మపొందదు. అట్లుగాక అవిద్యాగుణములగు నత్వాదులతో తాదాత్మ్యము పొందునేని, అహంకార మూఢాత్ముడై నేను కర్తను అని అభిమానముతో సంసారములో పడును. విషయమును ఎల్లప్పుడును చింతించు నెడల అతనికి సంసారము తప్పదు కనుక మనస్సు నట్టి మార్గమున పోనివ్వక నిరంతరము భగవధ్యానమున నిలుపవలెను. క్రమముగా శాంతుడై ఆత్మవంతుడై అహతామమతల వదలి పరిపూర్ణమగు బ్రహ్మభావమును పొందును.

ప్రకృతికి పురుషాపేక్షయు, పురుషునకు ప్రకృతి అపేక్షయు కలిగియున్నచో ప్రకృతి పురుషులకు అన్యోన్నా శ్రయము కలుగునుగదా? అని దేవహూతి యడుగగా కపిలుడు ఇట్లు చెప్పెను. సాధన సంపత్తి సరిగా లేనియడల ప్రకృతి బంధము తిరిగి కలుగును కాని, సాధన సామాగ్రీ బాగుగా నున్నయడల ప్రకృతి బంధము తిరిగి కలుగనేరదు. వర్ణాశ్రమోచితంబుగా ఫలాపేక్ష విడచి స్వధర్మమును అనుష్ఠించినచో మనస్సు పరిశుద్ధమగును. అట్టి శుద్ధ మనస్సుతో భగవత్కధలను నిరంతర శ్రవణము చేసిన యడల తీవ్రమగు భక్తి కలుగును. అంతట ప్రకృతిపురుష వివేకమున కలిగిన జ్ఞాన వైరాగ్యమువల్ల ఆత్మసమాధి యోగము లభించును. అంతట పురుషునకు బంధము కావించు ప్రకృతి దగ్ధమై తనంతట తాను అంతర్ధానము చెందును. అందుచేత తిరిగి బంధము కావింపలేదు కావున నిష్కామ కార్మానుష్ఠానము, భక్తి అను వానిచే సంస్కృతమైన మనస్సునందు ఆత్మజ్ఞానము కల్గి పరమ పురుషార్ధ రూపమైన స్వస్వరూప సాక్షాత్కారము కలిగి ముక్తుడగును. ఇది తత్వజ్ఞానమున ముక్తి కలుగు మార్గము. ఇంకనూ అష్టాంగయోగమువలన గూడ ఆసన ప్రాణాయామప్రత్యాహార ధారణ ధ్యానముల వలన భగవన్‌ మూర్తిని ధ్యానించుచూ వుండి క్రమముగా మనస్సు ధ్యేయమునుండి తనకు తానుగా తొలిగి నిర్విషయమై ఆత్మస్వరూపమును కాంచును. కల్లుత్రాగినవాడు తనమీది వస్త్రము దేహమున ఉండిననూ పోయిననూ ఎరుగనివిధమున అట్టి ఆత్మసాక్షాత్కారము పొందిన జ్ఞాని తన దేహము వుండినను పోయినను ఎరుగలేడు.

ఇంకనూ భక్తియోగమన్ననో సాత్విక రాజస తామసములని మూడు విధముల నుండును. శ్రవణ కీర్తనాది బేధమున భక్తియోగము తొమ్మిది విధములుగా నున్నది. ఇది అంతయూ సగుణ భక్తివిధానము. ఫలాపేక్ష లేక ఖౌద దర్శనమును విడచి ప్రవర్తించు నతడు నిర్గుణ భక్తుడై సాలోఖ్యమును గాని సమానైశ్యర్యమును గాని సమీప్యమును గాని, సారూప్యము గాని కోరక త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావమును బడయును. సర్వ భూతవర్తియైన భగవంతుడు తనలో నుండునని యెంతవరకూ గ్రహింపడో అంతవరకూ నరుడు స్వధర్మపరుడై ప్రతిమాదుల యందు భగవత్‌ భావనము చేసి పూజింపవలెను. ఈశ్వరుడు జీవకళ##చే అందరిలో నున్నాడని సర్వ భూతములను మ్రొక్కువలయును.

దేవహూతి జీవుని గర్భవాసగతి చెప్పమని కపిలుని కోరగా ఇట్లు చెప్పదొడగె-పూర్వజన్మ కర్మయొక్క పుణ్యఫలమో పాపఫలమో అనుభవించిన తరువాత తిరిగి మానవ దేహము ఎత్తవలసి వచ్చినప్పుడు దైవప్రవర్తితం బైన కర్మవశంబున అన్నముద్వారా రేతస్సును ఆశ్రయించి పిమ్మట స్త్రీ గర్భములో ప్రవేశించును అంతట ఆ రేతస్సు స్త్రీ గర్భములోని శ్రోణిత సంబంధము కలిగి మూడు రోజులలో వర్తుల రూపము దాల్చును. పది దినములలో రేగు పండంత అయి క్రమ క్రమముగా మాంసపిండాకారము దాల్చును ఒక నెలకు శిరస్సు ఏర్పడును. రెండు నెలలకు కరచరణాద్యవయవ సన్నివేశము కల్గును. మూడు నెలలకు నఖగోమాస్తి లింగ రంధ్రములు ఏర్పడును. నాలుగు నెలలకు సప్త ధాతువులు ఏర్పడును. ఐదు నెలలకు క్షుత్పిపానలు కలుగును. ఆరు నెలలకు జరాయువేష్టితుడై తల్లి గర్భమున తిరుగుచుండును. అప్పుడు తల్లి తినిన ఆహారములోని, కారము, ఉప్పు, పులుసు మున్నగు వాని వలన తన సుకుమార దేహమునకు బాధ కలుగగా దుఃఖించును. ఏడవ నెలలో దైవవశమున పూర్వ జన్మ స్మృతి కలిగి పూర్వకర్మ వలన తనకు గర్భవాస బంధనము అనుభవించవలసివచ్చెనేయని పరితపించుచూ పరమేశ్వరుని యింట్లు ప్రార్థించును ''స్వామీ నానా గర్భవాస రూపంబైన ఈ దుఃఖము ఇక కలుగకుండ నేను బయటపడిన తరువాత నీ ధ్యానము చేసి, సంసారమునుండి నన్ను ఉద్ధరించుకొందును'' గర్భవాస నరకము అనుభవించుచుండగా పదవ నెల రాగా ఉద్భవించి భూమిమీద పడగానే గర్భములో నుండగా కలిగిన వివేకముపోయి విపరీతజ్ఞానము కలిగి ఏడ్చును. క్రమముగా పెరిగి పెద్దవాడై యవ్వనము రాగానే స్త్రీ వశుడై భగవత్‌ చింతనలేక అధర్మ కార్యములను ఆచరించి మరణించిన తరువాత నరకము పాలగును. కావున బుద్ధిమంతుడైన మానవుడు కామమునకు వశుడు కాక స్త్రీల మోహమునకు చిక్కక భగవదారాధన రూపముగ స్వధర్మమును నిష్కామముగ ఆచరించి పరమేశ్వరుని ఉపాసించి దేహాంతమున బ్రహ్మలోకమునకు పోయి ఆ బ్రహ్మతో కూడ శ్రవణాదుల ద్వారా ఆత్మజ్ఞానము కలిగి సచ్చిదానందరూప బ్రహ్మ భావమును పొందును. ఇది ఉపాసనవలన కలుగు క్రమ మూర్తి. అట్లుగాక జ్ఞానమార్గమున సంచరించువాడు ఈ జన్మములోనే చిత్తశుద్ది పొంది శ్రవణ మనన ధ్యానాదులచే ఆత్మసాక్షాత్కారము పొంది సర్వాత్మభావముతో జీవన్ముక్తుడగును. కొందరు యోగసిద్ధులు ఆధికారిక పదవిలో భూలోకములో జన్మింతురు. భేదదర్శనమున పరమాత్ముని ఉపాసించు వారికి పునరావృత్తి కలుగును. అభేద దర్శన జ్ఞానము కలవారికి మాత్రమే పునరావృ%్‌తి లేదు. కావున తల్లీ పరమేశ్వరోపాసనమున అభేదదర్శనము ప్రధానము. అట్లు అది సాధ్యముగాని వారికి సగుణ భక్తియే శరణ్యము. అట్టి సగుణభక్తిచే వైరాగ్యమును, క్రమముగా ఆత్మజ్ఞానమును కలుగును భగవంతుడు ఒక్కడేయైననూ ద్రష్టృదృశ్య కారణ రూపముల నానాత్వమునం దోచుచుండును. కావున ఓ సాధ్వీ సంగమును సంపూర్తిగా త్యజించుటయే ముఖ్యమై సాధనము. జ్ఞానయోగమునకు ఆత్మలాభము ప్రయోజనము. భక్తియోగమునకు భగవత్‌ ప్రాప్తి ప్రయోజనము. క్షీరము ఒక్కటి అయ్యూ, కంటికి తెల్లగానూ, నాలకకు తియ్యగానూ శరీరమునకు చల్లగానూ తోచు రీతిన, భగవంతుడు ఒక్కడే అయ్యూ వివిధములగు ఉపాసనా భేదములవలన, నానావిధముల నిరూపింపబడి యుండును. అంతేకాని భగవంతునిలో నానాత్వములేదు. అందరకునూ భగవంతుడు ఒక్కడే ప్రాప్యుడు. తల్లీ! జీవుల నానావిధ సంనృతి గతులను యోగమార్గమును, భక్తిమార్గమును, జ్ఞానమార్గమును సర్వము నీకు బోధించితిని. ఇట్టి బోధను, అవినీతునకు, దురాచారునకు, అభక్తునకును, భాగవతద్వేషికిని ఎప్పుడూను చెప్పరాదు. అసూయారహితుడైన శ్రధ్ధాభక్తులు కలవానికే ఉపదేశింపతగును'' - అని కపిలుడు తల్లియైన దేవహూతికి బోధను సమాప్తము చేసెను.

అంతట దేవహూతి తన కుమారుడైన కపిలుడు ఉపదేశించిన ప్రకారము అత్యంత నియమములతో యోగసాధనము అవలంబించి పరమాత్మ జ్ఞానము కలిగి జీవన్ముక్తురాలయ్యెను. ప్రాపబ్ధవశమున దేహము పతనము కాగా యోగమహిమవలన ఆ శరీరము నదియై పాఱిసిద్ధిప్రదమయ్యెను. ఆ ప్రదేశము సిధ్ధిప్రదము అను పరమ పావన క్షేత్రముగా విరాజిల్లెను.

దేవహూతి కపిల సంవాదము సమాప్తము.

(మూడవకిరణము సమాప్తము)

భాగవతములోని మూడవ స్కందము సమాప్తము

Sri Bhagavatha kamudi    Chapters