Sri Bhagavatha kamudi    Chapters   

పురంజనోపాఖ్యానము

పృధు చక్రవర్తి వంశములో "ప్రాచీన బర్హి" అను నతడు కర్మాసక్తుడై అనేక యజ్ఞములు గావించి వసుంధరా వలయంబెల్ల తన యజ్ఞశాలతో విరాజిల్లచేయగా ఒకనాడాతని వద్దకు నారదుడు విచ్చేసి, " రాజవర్యా! నీవు ఉన్ని యజ్ఞముల నాచరించితివిగదా! ఏమి ప్రయోజనము సాధించితివి? ప్రతి మానవుడు కోరు దుఃఖహాని. సుఖ ప్రాప్తి నీకు ఏమైన లభించినదా" అని అడుగ రాజు అట్టి దేమియుకలుగలేదని చెప్పెను. అంతట నారదుడు ఇట్టి యజ్ఞాదికర్మల వలన మోక్షము కలుగకపోగా, ఈ యాగములలో ననీవు చంపిన పశువులు, నీవు పరలోకమును చేరగానే ఇనుప కొమ్ములతో పొడిచి చంపుటకు ఎదురు చూచుచున్నవి. కనుక నీకు వైరాగ్యము కలిగి తత్వజ్ఞానముతో మోక్షమునుపోందుటకు పురంజనోపాఖ్యానము చెప్పెదను.

పురంజనుడను రాజోక డున్నాడనియు, అతనికి అవి జ్ఞాత చేష్టితుడగు అవిజ్ఞాతనామకుడను స్నేహితుడు డొక డుండెననియు అధ్యాత్మతత్వమును కథారూమున బోధించెను. ఆ కధ వలన అధ్యాత్మతత్వమును అర్ధము చేసికొన లేక, ఆ కధకు అంతరార్థము చెప్పమని కోరగా, నారదుడు ఇట్లు చెప్పెను: "ఈ దేహములోని జీవుడే పురంజనుడు, అతనికి సుఖుడని చెప్పబడిన అవిజ్ఞాతుడే ఈశ్వరుడు, ఆ పురంజనుడు ప్రవేశించిన పురము ఈ దేహము. నేను, నాది అను అభిమానము పుట్టించు బుధ్ధిచే అతని నాకర్షించిన కామరూపియగు ప్రమద, దాని నాశ్రయించి పురుశు డనుభవించు జ్ఞాన కర్మేంద్రియ గుణములు తన మిత్రములు, పంచవృత్తియగు ప్రాణమే పంచ శీర్షమగు పన్నగము, మనస్సే బృహద్బలుడు, పాంచాలములు శబ్దాది విషయములు, ఆ పురమునకు గల ద్వారములు తొమ్మిదింటిలో రెండుకండ్లు , రెండు ముక్కలు ఒక నోరు కలసి ఐదు పూర్వ ద్వారములు, రెండు చెవులు ఉత్తర దక్షిణ ద్వారములు, మలమూత్రద్వారములు పశ్చిమద్వారములు. చండ వేగుడనువాడు సంవత్సరము మున్నూట అరవై గంధర్వులు మున్నూట అరవై పగళ్ళు. మున్నూట అరవై గంధ్వర స్త్రీలు మున్నూట అరవై రాత్రులు, యవనేశ్వరుడనువాడు మృత్యువు. ఆతని సైనికులే ఆధివ్యాధులు. దేహము, రథము, ఇంద్రియములు అశ్వములు, పుణ్యపాపములు రెండును చక్రములు, పంచప్రాణములు బంధనములు, మనస్సు, పగ్గము, బుద్ది సారధి, హృదయము రధికుడు పుండు స్థానము, ఆ త్మెతరమైన దేహేంద్రియ మనో ధర్మములను తనయందు ఆరోపించుకొని, నేను నాది అను దురభిమానముతో అజ్ఞానాంధకారమున మునిగి, తాను ప్రకృతికి పరుడైన పరమాత్మయని తెలియక ప్రకృతి గుణములకు అభిమానియై, స్వాత్విక, రాజస, తామసవృత్తులకు వశుడై చేసిన కర్మలకు అనుగుణ్యములగు లోకములు పొందును. ఒకప్పుడు పురుషుడుగాను, ఒకప్పుడు స్త్రీగాను, ఒకప్పుడు పశువుగాను, ఒకప్పుడు మనష్యుగాను కర్మాను గుణముగా పుట్టును. ఈ విధముగా కామాశ్రయుండైన జీవుడు ఉచ్చనీచ మార్గముల తిరుగుచు సుఖదుఃఖముల ననుభవించును ఇట్టి స్థితిలో దుఃఖ విచ్ఛేదము ఎప్పుడూ కలుగదు. అప్పుడప్పుడు తోచు శాంతియనునది తాత్కాలికమేగాని నిత్యముకాదు. తలమీది బరువు భుజముమీదికి దించుకొన్నట్లేగాని అన్యముకాదు. కర్మలకు కేవల కర్మయే ఆత్యంతిక ప్రతీకారము కానేరదు. ఆ రెండు విధముల కర్మలు అవిద్యాప్రాప్తములే! పరమార్థ స్వరూపుడైన ఆత్మకు ఈ అనర్ధ పరంపరయే సంసారము. దానిని విచ్ఛేదమొనర్చునది హరి భక్తియే. అట్టి భక్తిక్రమముగా విరక్తిని, జ్ఞానమును కలిగించును. అట్టి భక్తి యోగము భాగవత సజ్జనులు చేరినచోట, వారి సహవాసము వలన కలుగును. కనుక సత్సంగము ప్రధానము. అట్టి సాధు సమాజమున ఆ మహాఫురుషులు కీర్తించు భగవత్‌ గుణముల శ్రవణమువలన, క్రమముగా క్షుత్‌ పిపాసలు, భయశోక మోహములు కలుగవు. భగవదనుగ్రహ భాజనుజడైనవాడు లోక వ్యవహారములను, కర్మమార్గమున ఆసక్తిని త్యజించి క్రమముగా ఆత్మజ్ఞానమును కలిగి తరించును. కావున ఓ ప్రాచీన బర్హీ అవాస్తవములై, చెవికి ఇంపుగాతోచు ఈ కర్మములయెడ పరమార్ధ దృష్టి చేయకుము. మలిన బుద్ధులు వేదపరమార్ధ మెరుగక కర్మాచరణమే వేదార్ధంబని భ్రాంతిచెంది, ఆత్మ లోకమెరుగరు. బర్హిష్మంతుడను పేరు గల నీవు ప్రాచీనాగ్రములైన దర్భలను, భూమండల మెల్ల పరచి. అసంఖ్యాకములుగ యజ్ఞములుచేసి, ప్రాచీన బర్హియము నామమున పొందితివి. ఏ కర్మ భగవంతుని యందు భక్తిని కలిగించునో అదియే నిజమైన కర్మ. అట్టి భక్తిని కలిగించనివి కర్మములు కనేరవు. కనుక భగవంతుని యందు భక్తికలిగి, ఆయనే శరణమని తలచి, ఆయనవల్లనే అభయము రాగలదని ఎరింగినవాడే విద్వాంసుడగును" ఇట్లు నారదుడు ప్రాచీన బర్హికి ఆత్మవిద్యను బోధింపగా ఆతడు కర్మలయందు ఆసక్తి విడచి, నారదుని ఉపదేశాను సారము ఆత్మతత్వ విచారణ చేయుచూ కర్మల విషయమై సంశయము కలిగి " నారదా కర్మలు చేయువాడు, తత్కర్మాచరణకు సాధమైన దేహమును ఇచ్చట విడువగా దేహాం తరమున తత్ఫలముల ననుభవించునని చెప్పుట ఎట్లు కుదురును? చేసిన కర్మ ఇచ్చటనే నశించగా కాలాంతరమున ఎట్లు ఫలమిచ్చును?" అని సంశయము వెలిబుచ్చ నారదుడు " ఓ రాజా పురుషుడు మనస్సే ప్రధానముగా గల సూక్ష్మశరీరముతో కర్మలు చేయునుగాన ఆ కర్మఫలమంతయు ఆ సూక్ష్మ శరీరములోనే నిలచియుండును. స్థూలదేహము నశించుననూ, సూక్ష్మశరీరమే ఇంకొక స్థూలదేహములో ప్రవేశించును గాన, కర్మచేసిన వాడే ఆ ఇంకొక స్థూలదేహాములో ఫలమనుభవించును రెండు శరీరములలోనూ సూక్ష్మదేహ మొక్కటియేగాన, నీ సంశయమున కవకాశములేదు. కర్మనశించిననూ దాని ఫలము సూక్ష్మదేహములో నిలచియుండును గాన ఆ ఫలమును కాలాంతరమున దేహాంతరముతో అనుభవించును. జలగ తనకు ముందున్న తృణమును పట్టుకొనియే తానున్న తృణమును విడచును. ఈ తృణజలూక న్యాయమున పురుషుడు మ్రియమానుడయ్యూ అన్యదేహ ప్రాప్తి కలుగ నంత వరకూ పూర్వదేహాభిమానము విడువడు. ఈ విధమున పూర్వపూర్వ కర్మములు, ఉత్తరోత్తర దేహములకు ఆరంభమగును. కర్మ ప్రవాహమున సర్వమూ ఉపపన్న మగును. కావున ఓ రాజా ఈ జగమంతయూ వాసుదేవత్మకమేనని తలంచి ఆ హరిని భక్తితో ధ్యానించి మోక్షమును పొందుము'' అని నారదుడు ప్రాచీన బర్హికి తత్త్వోపదేశము పొందుము'' అని నారదుడు ప్రాచీన బర్హికి తత్త్వోపదేశ##మే చేసెను. అంత నాతడు రాజ్యమును పుత్రులకు వప్పగించి కపిలాశ్రమమున ఏకాగ్రచిత్తుడై భగవంతుని ధ్యానించి ముక్తుడైయ్యెను. వాని కుమారులైద ''ప్రచేతసులు'' కొంత కాలము పరిపాలించి రాజ్యమును తమ కుమారులకు వప్పగించి ఏకాగ్ర మనస్కులై తమ మొనరింపగా శ్రీహరి సాక్షాత్కరించి వరము కోరుకొమ్మని అడుగగా, ఆ ప్రచేతసులు ''మేము ఎన్ని జన్మములు ఎత్తిననూ మాకు భాగవతుల సంగము ఎల్లప్పుడూ వుండునట్లు అనుగ్రహింపు''మని వరమగడిగిరి. శ్రీహరిచే ఆ వరములు పొంది ప్రచేతసులు కొంతకాలము రాజ్యపాలస చేసి, పుత్రులకు వప్పగించి, పశ్చిమతీరమున పుణ్యాశ్రమమునందు ఆత్మజ్ఞానము కొరకు తపస్సు చేయగా, నారదుడు ప్రత్యక్షమై ''సకల శ్రేయస్సు లకు మూలము హరిధ్యానమే. సర్వభూతములకు హరియే ఆత్మ. వృక్షమూలమున నీరుపోసిన, శాఖలకు పత్రములకు పుష్పములకు, ఫలములకు ఎట్లు తృప్తి కలుగునో అటులనే సర్వసృష్టికి మూలమైన హరిని అర్చించినచో సర్వ భూతములనూ అర్చించినట్లే యగును. ఈ ప్రపంచ మంతయూ ఆ హరివల్లనే వ్యక్తమై, ఆ హరిలోనే లయించును. సూర్యకాంతి సూర్యునికి వేరుకాని విధమున విచిత్ర ప్రకారమైన ఈ జగత్తు ఆ హరికంటె వేరుకాదు. కావున మీరు ఆ నిత్యానంద చిద్ఘనుడగు ఆ పరమాత్మను ఆత్మైకత్వ భావనతో భజింపుడు. అందుకు సర్వభూత దయ, యదృచ్ఛాలాభ సంతుష్టి, సర్వేంద్రియోపశాంతి ముఖ్యసాధనములు'' అని బోధించి వెడలిపోయెను. అంత ప్రచేతసులు నారదుని ఉపదేశాను సారము ధ్యానము గావించి ఆత్మజ్ఞానమును పొంది ముక్తులైరి.

చతుర్ధ కిరణము సమాస్తము

భాగవతములోని చతుర్థస్కంధము సమాప్తము

Sri Bhagavatha kamudi    Chapters