Jagadguru divyacharithra   Chapters   Last Page

 

8. శ్రీ సురేశ్వరులు

సరస్వతీ సంప్రదాయం

వీరి పూర్వాశ్రమనామం మండన మిశ్రులు. వీరు పూర్వమీమాంసామార్గంలో మంచి నిష్ణాతులు. మొదట కేవల కర్మవాదులు. వీరు గృహస్థులు. వీరి ధర్మపత్ని సరసవాణి లేక ఉభయభారతి. మాహిష్మతీపురం వీరి నివాసం. వీరు కుమారిలభట్టు యొక్క శిష్యులు.

కుమారిలభట్టు సుబ్రహ్మణ్యస్వామి యొక్క అవతారం. వీరు ఆదిశంకరుల కంటే ముందుగనే అవతరించి వేదోద్ధరణం చేశారు. కుమారిలభట్టు ఆదిశంకరులకంటే నలభై ఎనిమిది సంవత్సరాలు వయస్సుచేత పెద్దవారిని చిత్సుఖాచార్యుల బృహచ్ఛంకర విజయం స్పష్టం చేస్తోంది. కర్మప్రధానమైన వేదమార్గమును సుప్రతిష్ఠితం చేసి తమ శిష్యులైన శ్రీమండన మిశ్రులను అందు నిష్ఠాతులనుగా జేశారు. సర్వవైదిక కర్మఫలములు జ్ఞానరూపాన్ని పొందినట్టు కుమారిలుని వద్ద వేద సిద్ధాంతనిష్ణాతులైన మండనమిశ్రులు జ్ఞానస్వరూపులైన శ్రీ ఆదిశంకరులను జేరి వారి శిష్యులై సురేశ్వరులైనారు.

ఆది శంకరులు ప్రయాగవద్ద రుద్ధపురంలో కుమారిల భట్టును వారి జీవిత తుదిలక్షణాలలో ఒక్కమారు మాత్రం కలిసికోవటం జరిగింది.

తరువాత సురేశ్వరులు ఆదిశంకరులను దర్శించి వైదికకర్మ పద్ధతులను గూర్చి, అవి జ్ఞానముగపర్యవసించు జ్ఞానవాదములను గూర్చి చర్చించి వారికి శిష్యులై సరస్వతీ సంప్రదాయంలో సన్య్యాసాశ్రమస్వీకారం చేశారు. నాటినుండే వారు సురేశ్వరులను పేరుతో ఆచార్యులవారికి ముఖ్యశిష్యులై వారి ననుగమించారు. అప్పటికి గల వారి వయస్సు, అనుభవం, యోగశక్తులు వారి కాస్థానాన్ని కలిగించాయి. అందువల్లనే తుదివరకు ఆదిశంకరులతో ఉండి వారధిష్టించిన కామకోటి పీఠానికి వారి తరువాత పూర్ణాధిపతులైనారు. కాని వీరు బ్రహ్మచర్యంలో సన్న్యాసాశ్రమ స్వీకారం చెయ్యలేదు. బ్రహ్మచారిగా ఆశ్రమస్వీకారం చేసిన వారు మాత్రమే తమ యోగలింగ శ్రీమేరువుల నర్చించాలని ఆదిశంకరుల నియమం. మఠాధిపతులైన భాష్యాది ప్రవచనాలు శ్రీసురేశ్వరులు చేశేవారు. యోగలింగ శ్రీమేరు త్రికాలసమర్చనాదులకై శ్రీ సర్వజ్ఞాత్మ శ్రీచరణులు నియమింపబడినారు.

శ్రీ సురేశ్వరులు ఆదిశంకరులు ప్రతిష్ఠించిన ఏ పీఠానికి ప్రథమాచార్యులు గారు, వారు తమపరిపాలనా దక్షతవల్ల ఆదిశంకరుల అనంతరం వారు ప్రతిష్ఠించిన అన్ని పీఠాలపైన ప్రధానాధిపత్యం వహిస్తూ 70 సంవత్సరాలు ధర్మపరిపాలనంచేసి కాంచీక్షేత్రంలోనే నిర్వికల్పసమాధిని పొందారు. వీరి పూర్వాశ్రమనామంతో కంచిలో 'మండన మిశ్రాగ్రహారం' అని ఉన్నది. కామకోటి పీఠాధిపతులు విజయయాత్రకువెళ్ళి తిరిగి కాంచి క్షేత్రానికి వచ్చినపుడు మొదటిరోజున ఈ మండనమిశ్రాగ్రహారవాసులే వీరికి భిక్షావందనం చెయ్యటం ఇప్పటికి ఆచారంగా ఉన్నది.

ఐతే మాధవీయం ప్రమాణంగా పలికేవారు కొందరు శృంగేరీ దక్షిణామ్నాయ మఠమని, యజుర్వేదీయ ''అహం బ్రహ్మస్మి'' మహావాక్యం అందుకు మూలమని ఈ మఠానికి శ్రీ సురేశ్వరులు 800 సంవత్సరాలు అధిపత్యం వహించారని అనుకొంటారు. కాని ఆ మాధవీయంలో ఆదిశంకరులు ధర్మసింధు నిర్దేశానుసారం శ్రీ సురేశ్వరులకు సామవేదమహావాక్యం ఒక్కటే ఉపదేశించినట్లున్నది. కనుక ఈ అభిప్రాయం స్వయంగానే స్వవచన వ్యాఘాతుకతను సంతరించుకొని దానంతట అదే ఖండిత మౌతుంది.

ఆత్మ బోధేంద్రుల సుషమలో ఇలా ఉన్నది.

''అయం సురేశ్వరః స్వయం బ్రహ్మచర్యాదేవ అపరిగృహీత పారమహంస్యతయా, పరమహంసైక సమధ్యాసనీయే జగద్గురుణా స్వపీఠే శిష్యపీఠేవా స నివేశితో 7పి స్వ సమాన వైదుష్య భాజనతయా మహాయోగితయాచ సర్వపీఠ వ్యవస్థాగోపనే నియక్తః తత్ర తత్ర కియంతచిత్‌ కాల మువాస. తత స్తన్మఠీయైః పరమాచార్యాత్‌ పరమాచార్య పరంపరయాం పఠ్యత ఇతి వస్తుస్థితిః ||

ఇందుకు అనుగుణంగానే ఆదిశంకరులు శ్రీసురేశ్వరులను సర్వపీఠరక్షణమున నియుక్తుల చేసినట్లు చిక్సుఖాచార్యుల బృహచ్ఛంకర విజయంలో ఇలా ఉన్నది.

నత్వాం న్యాస్యామధి మఠమిహక్వాపిపీఠాధిపత్యే |

త్రాతుం సర్వాంస్త్వమసిత ఇతస్త్వాంగురుం సంగిరం తాం ||

 

జ్ఞానం విరాగతైశ్వర్యం తపస్సత్యం క్షమాధృతిః |

స్రష్టృత్య మాత్మసంబోధః అధిష్ఠాతృత్వమేవచ

అవ్యయాని దశైతాని నిత్యం తిష్ఠంతి శంకరే ||

Jagadguru divyacharithra   Chapters   Last Page