Jagadguru divyacharithra   Chapters   Last Page

 

7. అఖిలాండేశ్వరీదేవి - తాటంక ప్రతిష్ఠ

శ్రీ ఆదిశంకరులు తమ విజయయాత్రలో తిరిచినాపల్లికి ఉత్తరాన కొలదిమైళ్ళ దూరంలో ఉన్న జంబుకేశ్వరానికి విచ్చేశారు. అచటి అఖిలాండేశ్వరీదేవి మహోగ్రకళలతో ఉండటాన్ని దర్శించారు. వెంటనే ఆ జగజ్జనని దృష్టికెదురుగా ప్రసన్న గణపతిని ప్రతిష్ఠించారు. ఆ పుత్రప్రేమతో ఆమెకు వాత్సల్యదృష్టి ఏర్పడినది. అంతేకాక శ్రీచక్రాలను కర్ణాభరణాలుగా చేయించి ఆతాటంక ప్రతిష్ఠను తాము స్వయముగా చేసి ఆ ఉగ్రకళలను శాంతింపజేసి, ఆ పరదేవతా ప్రసాద దృష్టిని లోకానికి ప్రసాదించారు.

ఈ సంప్రదాయం వల్లనే అప్పడప్పుడీ తాటంకాల జీర్ణోద్ధారం చెయ్యవలసి వచ్చినపుడు శ్రీ ఆదిశంకరుల స్వపీఠ సంప్రదాయపరంపరలోని వారగు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులే ఈ కార్యక్రమం నిర్వహించటం అనుస్యూతంగా వస్తున్న సంప్రదాయం ఐ ఉంది. ధర్మ సంస్థాపనంతో పాటు ఈ పీఠాధిపతు లీ దేవాలయ కార్యాలను నిర్వహిస్తూంటారు.

ఈ సంప్రదాయాన్ని అనుసరించే కామకోటిపీఠ గురు పరంపరలోని 64 వ గురువులగు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ (V) 1814 - 1851 స్వామివారు ఈ అఖిలాండేశ్వరీ దేవికి రత్న తాటంక జీర్ణోద్ధారం చేసి 1846 లో వాటి పునః ప్రతిష్ఠను చేశారు.

*ఐతే ఈ సమయంలోనే తిరిచి జిల్లాలోని సాదర్‌ అమీన్‌ కోర్టులో శ్రీశృంగేరీ పీఠంవారు ఈ రత్నతాటంక ప్రతిష్ఠను నిర్వహించే హక్కు తమదని చెప్పుతూ ఒక అభియోగాన్ని తీసికొని వెళ్ళారు. ఈ సివిల్‌ సూటులో కంచి కామకోటి పీఠంవారిని వీరు మొదటి ప్రతివాదిగా గూడ పేర్కొన్నారు. ఇరుపక్షాలవారి వాదాలను విన్న తరువాత కోర్టువారు యిలా అభిప్రాయపడ్డారు. శృంగేరీపీఠ పక్షాన చూపిన రికార్డులు నమ్మదగినవిగా లేవు. వారి పక్షాన వాచికంగా చెప్పించిన సాక్ష్యాధారాలు స్వవచన వ్యాఘాతుకాలుగా ఉన్నవి.''అని చెప్పి ఈ అభియోగాన్ని కొట్టివేస్తూ ప్రతివాదులకు ఖర్చులను గూడ ముదరాగా చెల్లించుకోవలసిందిగా తీర్పునిచ్చారు. అంతతో ఇది సమాప్తి కాలేదు. తరువాత పైరెండు కోర్టులలో కూడ వీరు ఇలాంటి విఫల యత్నాన్నే చేశారు. ఇది ఇప్పటికి 120 యేళ్ళ క్రిందటి చరిత్ర.

ఈ అభియోగాల నెంబర్లు (1) O.S. 95/1844 (2) 109/1846 (3) స్పెషల్‌ అప్పీల్‌ పిటిషన్‌ నెం 106/1848.

ఇరుపక్షవాదాలు తీర్పు, ఇవన్నీ చక్కగా ముద్రింపబడి ఇప్పటికిని సిద్ధముగా ఉన్నవి.

ఈ సంప్రదాయాన్ని అనుసరించే 1908 లో ఈ ఆలయ పునరుద్ధరణ జరిగినపుడు కుంభాభిషేకం చెయ్యవలసి వచ్చినపుడు కూడ ప్రస్తుతం 68వ ఆచార్యులైన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీ చరణులే తాము పీఠాధిపత్యం పొందిన అనతికాలంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ప్లవంగ పుష్యమాసం. ఈ కుంభాభిషేక కార్యక్రమం మహావైభవంగా జరిగింది. ఈ కార్యనిర్వహణకై లక్ష రూపా

___________________________________________

* చూడు ' ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత' పుటలు 435, 436.

యలు వెచ్చింపబడినవి. ఈ కార్యం అంతా సులక్షణంగా నిర్వహింప బడటానికి శ్రీ రాజమయ్యర్‌గారు కారకులయ్యారు.

ఈ కుంభాభిషేకం జరిగిన మరుసటి రోజున శృంగేరీ పీఠాధిపతులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు ఇచట అమ్మవారి దర్శనం చేసికొని వెళ్ళారు. అలాగే ఈ కార్యక్రమం జరిగిన కొన్ని నెలల తరువాత శివగంగ స్వాముల వారగు శ్రీ సుబ్రహ్మణ్య భారతీ శంకరాచార్యుల వారు దేవదర్శనం చేసికొని వెళ్ళారు.

తరువాత 1923 ఏప్రిల్‌ 29వ తేదీన మరల అమ్మవారికి తాటంకముల జీర్ణోదధారం చెయ్యవలసి వచ్చినపుడు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణులే (68 వ ఆచార్యులు) ఈ కార్యక్రమాన్ని మహా వైభవంగా నిర్వహించారు.

ఈ అతిలోక వైభవ విశేషాలు 10-5-1923 తేదీగల 'హిందూ మెసేజ్‌' అనే పత్రికలో చక్కగా వర్ణింపబడి ఉన్నవి. ఈ పత్రికాధిపతులు శ్రీ టి. కె. బాలసుబ్రహ్మణ్యయ్యర్‌ గారు 'గురుభక్త శిఖామణి శృంగేరీ' అని వీరి బిరుదు. ఈ పత్రిక శ్రీరంగం వాణీవిలాస ప్రెస్‌లో ముద్రింపబడేది. వీరు ఆది శంకరుల గ్రంథాలన్నంటినీ ముద్రించి ప్రచురించారు.

పై సంపాదకీయం ఆంగ్లంలో ఉన్నది. అందలి అంశాలు తెలుగులో ఇచట పేర్కొనబడుతున్నవి.

''23 వ తేదీన శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యస్వామి తిరుచునాపల్లి పట్టణానికి విచ్చేసినప్పుడు ఈ పట్టణ చరిత్రలో ఎన్నడు కనివిని ఎరుగని ఆనందోత్సాహ కోలోహలం ప్రజలలో పెల్లుబికింది. ఆ ఊరేగింపు ఒక్క మైలు పొడవున్నది. సర్వాలంకార శోభితములైన భద్రగజాలు ముందుగ నడుస్తున్నవి. ప్రజాసమూహం నేల ఈనినట్లు క్రిక్కిరిసి ఉన్నది. మధ్యలో శ్రీస్వామివారు ఆత్యున్నతంగా ఏనుగుదంతపు పల్లకిలో ఆసీనులై ఉన్నారు. చుట్టూ వేద పండితుల స్వస్తివాచక ఘోష మార్మ్రోగుతోంది. భజన పాళీలు, తేవారం గాయకులు మధురగానాన్ని ఆలపిస్తున్నారు. సుమారు ఎనిమిది మైళ్ళ పొడవున రాజమార్గం అంతా సర్వాలంకారశోభితమై ఉంది. శ్రీ స్వామివారి దర్శనోత్సుకులైన ప్రజల గుంపు కార్యక్రమం చివరి వరకు వెంటనంటి ఉన్నది. పట్టణం అంతటా మహాపర్వంలో వలె ఉత్సాహం పొంగి పోతోంది. ప్రతివ్యక్తి ఏదో రూపంగా శ్రీ స్వామివారి సేవలో పాల్గొనాలని అహమికతో పొంగిపోతున్నాడు. ఈ దివ్యవైభవం అంతా దేవతలకు సైతం నేత్రపర్వమైంది. ప్రజలలో మతం, మతసంబంధమైన ఆశయాలు ఇప్పటికి స్థిరంగా ఉన్నవని చెప్పటానికి ఇది ఒక దృఢమైన నిదర్శనం.

వైస్రాయికాదు చక్రవర్తి ఐనప్పటికి ప్రజల్లో ఇలాంటి నిసర్గమైన భావోత్తేజాన్ని కలిగించలేడు. ఈ ఊరేగింపు గమ్యం చేరుకోవటానికి సుమారు ఐదు గంటలసేపు పట్టింది.

శ్రీ స్వామివారు అచట గుమికూడి ఉన్న జనసందోహంలోని ప్రతివ్యక్తిని ఒక చిరునవ్వుతోనో, ఒకమాటతోనో తృప్తుణ్ణి చేశారు. శ్రీవారు మఠంలో విశ్రాంతి తీసికొన్నారు. ప్రజల్లోని ఆనందోత్సాహాలు బడలికను శ్రీవారివైపునకు కూడ తొంగి చూడనివ్వలేదు. మరుసటి రోజున జంబుకేశ్వరంలో శ్రీఅఖిలాండేశ్వరీదేవి తాటంక ప్రతిష్ఠకు సంబంధించిన ప్రారంభ క్రీయాకలాపం ఆరంభ##మైనది. తాటంక ప్రతిష్ఠ అంటే ఏమిటో పాఠకుల సౌకర్యార్థం కొంచెం వివరిస్తాను.

ఆదిశంకరులు తమ విజయయాత్రల్లో యావద్భారతంలోని దేవాలయాల్లో యంత్రోద్ధారాలు చేశారు. అలాంటి సుప్రసిద్ధ క్షేత్రాల్లో జంబుకేశ్వరం ఒకటి. ఇచటి అమ్మవారు అఖిలాండేశ్వరి. ఈమె ఉగ్రకళలవల్ల అర్చకులతో సహా ఎదురుగా వెళ్ళినవారు భస్మమై పోతూ ఉండేవారు. అచ్చటకు విచ్చేసిన ఆదిశంకరు లీవృంత్తాంతాన్ని తెలిసికొన్నారు. అమ్మవారికి ప్రియపుత్రుడైన గణపతిని ఆమెకెదురుగా ప్రతిష్ఠించారు. అందువల్ల ముందుగా గుడితలుపు తెరిచేటప్పటికి ఆ ప్రియపుత్రునిపై ఆమె దృష్టి ప్రసరించి సౌమ్యతను సంతరించుకొంటుంది.

అంతేకాక రెండు శ్రీచక్రాలను తాటంక రూపంలో (చెవులదుద్ధులు)చేయించి ఆమె ఉగ్రకళల నందులో ప్రతిష్ఠించి వాటిని ఆమె చెవులకు అలంకరించారు. అప్పటినుండి ఆమె 'సౌమ్యమూర్తి' ఐనది. నాటినుండి ఈ తాటంకాలు అమ్మవారికి రాత్రివేళలందు తప్ప తక్కిన సమయాల్లో అలంకరించి ఉంచుతారు.

ఈ తాటంకాలు జీర్ణోద్ధారము చేయబడవలసి వచ్చినప్పుడల్లా కంచికామకోటి పీఠాధిపతులైన జగద్గురువులు వాటిని శుభ్రపఱచి అమ్మవారికి కర్ణాభరణాలుగా వాటిని పునః ప్రతిష్ఠిస్తారు. ఈ సంప్రదాయ నియమాన్ని పాలించుతూ ప్రస్తుతం కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించిన శ్రీస్వామి వారు ఈ పనికి పూనుకొన్నారు.

ఈ మహాకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీకామకోటి పీఠాధిపతులు ఇప్పటికి నాలుగు సంవత్సరాలకు పూర్వం కుంభకోణం నుండి బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అసంఖ్యాకులైన భక్తులకు ధర్మప్రబోధం చేస్తూ తిరుచునాపల్లికి రెండు వారాలకు పూర్వం విజయం చేశారు. ప్రతిష్ఠాకార్యక్రమానికి పూర్వాం గంగా వేలాది బ్రాహ్మణులు ఆ వైదిక కార్యకలాపంలో నిమగ్నులైనారు. ప్రధాన కార్యక్రమం 29 వ తేదీన ఆరంభ##మైంది. ఆనాడు ఉదయం 8 గం. లకు శ్రీ స్వామివారు మఠంనుండి ఆలయానికి బయలుదేరారు. పట్టణం పట్టనంతటి ప్రజాసందోహం వెల్లువగా వచ్చింది. అటు జగద్గురువులు, ఇటు అఖిలాండేశ్వరి రెండాకర్షణలతోను నిస్సీమితోత్తేజంతో ప్రజావాహిని సంతోష సాగరంలో ఓలలాడింది. ఆ ప్రజావాహినిని చీల్చుకొని శ్రీవారు మఠంలోంచి ఆలయంలోకి వెళ్ళటమే మిక్కిలి కష్టతరమైంది. శ్రీవారు గర్భగృహంలో ప్రవేశించగానే యాగశాలలోంచి కుంభం తీసుకొనివచ్చారు. అమ్మవారికి అభిషేకం జరిగింది. తరువాత తాటంకాలు ప్రతిష్టింపబడ్డాయి. ఆ లోపలనున్న వారికి మాత్రమే ఆ పవిత్ర దృశ్యం చూచేభాగ్యం అబ్బింది. వేలాది తైర్థికులు ఎదురుచూస్తున్న కార్యక్రమం ముగిసింది. వేలాది ప్రజలకు అన్నదానం జరిగింది. శ్రీస్వామివారి ఆదేశానుసారం మహావిద్వాంసులు అనేకులు ఉపన్యసించారు. విధ్వాంసులందరిని యధార్హంగా శ్రీవారు సమ్మానించారు. ఇంతకు పూర్వం రెండు పురుషాంతరాలలో కనివిని ఎరుగని అపూర్వ కార్యక్రమం పూర్తిఐంది.''

''శ్రీ చక్రాత్మతాటంక తోషితాంబా మనోరథాయనమః |''

(శంకరాచార్యాష్టోత్తర శతనామావళి, శ్రీ శారదాపీఠము, 127వ పుట.)

Jagadguru divyacharithra   Chapters   Last Page