Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

ప్రేమ-అహింస

ప్రేమ చాలాదొడ్డది. అదే లేకపోతే మనబ్రతుకు వృథా. ఆకాశము. భూమి, నక్షత్రాలు, పక్షులు, తరులతా గుల్మాదులు - ఇట్లు సృష్టి విచిత్రంగా వివిధంగా ఉంటున్నది. వీటి నన్నిటినీ పరికిస్తున్నప్పుడు మన హృదయాలు ఇట్లా అఖండంగా ప్రేమభరితమైపోతే మన మనస్సులో ఈ విశ్వప్రేమ చెరిగిపోని ముద్రగా నిలిచిపోగల్గితే, దుఃఖం అనేది మనలను అంటదు. మనకు చాల దవ్వులో ఉంటుంది. పసిపాపలను గమనించండి. వారి హృదయాలు ఎప్పుడూ ఏదో అనిర్వాచ్యమైన ప్రేమతో తొణికిసలాడుతూ ఉంటవి. కాని వాళ్ళు పెరిగేకొద్ది ఈ ప్రేమ తగ్గుతూవస్తుంది. అంటే లౌక్యంలోనికి తమ హృదయాలను తరిఫీదు చేస్తున్నారన్నమాట. మాతృప్రేమ-ప్రేమపరాకాష్ఠ. దానిసాటి అదే, అందుచేతనే ఆచార్యులవారు జగదంబను సంబోధిస్తూ 'కుపుత్రో, జాయేత, క్వచిదపి కుమాతాన భవతి', అని సెలవిచ్చారు. తల్లి తన సంతానాన్ని నిర్వ్యాజంగా ఎట్లు ప్రేమిస్తుందో, అట్లే మనమూ ఈవిశ్వాన్నంతా మన ప్రేమలో ముంచివేస్తూ, ఇతరుల కష్టసుఖాలలో మనకూ భాగస్వామ్యమున్నదనీ భావిస్తూ చేతనైనంత సహాయం చేస్తూఉండాలి.

'జాతస్య హి ధ్రువో మృత్కుః' పుట్టినది గిట్టుతున్నది. ఇదొక తిరుగులేని చట్టం. ప్రేమ విషయమూ అంతే. ఈ ప్రేమ ఏనాడో అంతరించవలసినదే. అందుచేత ప్రేమలో దుఃఖాంశం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మన బంధుమిత్రులను ఎంతో ప్రేమాధిక్యంతో చూచుకొంటూ ఉంటాం.

కాలంచెల్లి ఎవరయినా వీరిలో గతిస్తే ఎంతో విచారం వేస్తుంది. హృదయం పగిలిపోయేటట్లు దుఃఖం కలుగుతుంది. అందుకోసం మనం ప్రేమించకుండా ఉండగలమా? కానీ ఇవన్ని ఒకరోజు అంతమైపోయే ప్రేమలు. ఇదికాక అవి నాశ##మైన అనంతమైన ప్రేమ ఒకటిఉన్నది. అది దైవమందు మనంఉంచే ప్రేమ. భగవంతుడు అనంతుడు. అవినాశి. దేశకాల అపరిచ్చిన్నుడు. సృష్టి ప్రళయాలకు అతీతంగా అవికారంగా ఉండేవాడు. సమస్త వస్తుజాలమూ, చరాచర ప్రపంచమూ ఆయనలోపుట్టి ఆయనలోనే లయిస్తున్నది. చిచ్ఛక్తుల సమ్మేళనమే ఈజగత్తు. 'ఈశావాస్యమిదం సర్వం' అన్న శ్రుతివాక్యాన్ని గుర్తుంచుకొని, అన్నిటిని మనం ఈశ్వరమయంగా, ఈశ్వర స్వరూపంగా భావించాలి. లోకంలో చీకటి ఎంతఆవరించిఉన్నా, ఆకాశంలోఅరుణరేఖలు, నెలకొనగానే ఎంతచీకటి అయినా విరిసిపోతుంది. లోకములో సమస్త వస్తువులూ వానివాని కాంతినీ, శక్తినీ, అందాన్నీ, ఆకారాన్ని ఆసర్వేశ్వరుని మూలంగానే పొందుతున్నవి. అందుచేత మనం ఈ జగత్తును చిన్మయంగా, భగవన్మయంగా చూడగల్గిననాడు, ఒకవస్తువు పోయినదే అనికాని, ఒకమనిషి చనిపోయాడే అని కానీ దుఃఖించం. దుఃఖం తీరవలెనంటే భగవత్ప్రేమ వృద్ధికావాలి.

అహింస ఈవిశ్వప్రేమకు బాహ్యచిహ్నం. అది మనోవాక్కాయకర్మలా ఉండాలి. కాని అహింస ఎంత ఆచరణియమైనా పూర్ణ అహింసానుష్ఠానం ఆచరణలో పెట్టగలమా అంటే పెట్టజాలమనే చెప్పాల్సివస్తుంది. అన్ని జాతులవారు, అన్ని తరగతులవారూ సర్వకాల సర్వావస్థలలో అహింసను ఆచరించడం అనేది కానిపని. ఒక ఆవుదూడ చికిత్సకు లొంగని వ్యాధితో మరణబాధ పడుతున్నదని, దాని బలవన్మిరణానికే సంపూర్ణ అహింసావాదులైన మహాత్మాగాంధీగారే అంగీకరించినారట. ఈహింసాకార్యంలో జీవకారుణ్యం పెనవేసుకొని ఉన్నది. కాశ్మీరంలో దేశరక్షణకోసం సైనికులను నియమించవలసినదే యని అన్నారట, 'ఎవడైనా చెంపపై కొట్టితే, మరొక్క చెంపనుకూడా అతనికి చూపు' అన్న జీససుక్రీస్తు అనుయాయులే పాశ్చాత్య దేశాలలో రెండు ప్రపంచ యుద్ధాలును తెచ్చి పెట్టి అవి చాలమన్నట్లు క్రొత్త, క్రొత్త మారణాయుధాలు సృష్టించడంలో మహౌత్సుక్యం చూపుతున్నారు. వైదిక యజ్ఞాలలోని పశుహింసను అధిక్షేపించిన బుద్ధుడు, భిక్షాపాత్రలో వేసిన సూకరమాంసం తిని, అతిసార వ్యాధితో మరణించినట్లు చెపుతారు - బౌద్ధాన్ని పాటించే ఇతర దేశాలలో, తాము చంపకపోయినా ఇతరులందించే మాంసాహారం నిరాక్షేపంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే అహింస ఒక ఉన్నత లక్ష్యమైనా ఆచరణలోకి వచ్చేసరికి కొంత కుంటుపడుతుందని మనం గ్రహించవలసి వస్తుంది.

ఇక ఈ విషయంలో హిందువులమాట చూద్దాం. ఆచారబద్ధంగా హైందవాన్ని పాటించేవారిలో చాలామంది శాకాహారులే. చేపలు తినడంలో పాటింపులేని వంగీయులలో సహా వితంతువులు చేపలు తినడం మానడమేకాక ఏకాదశినాడు నిర్జలోపవాసం ఉంటారట. దక్షిణాదిలో శైవం పాటించేవారిలో చాలామంది శాకాహారులు. బ్రాహ్మణతరులలో మాంసాహారులున్నా, కొన్ని తిథులలో, ముఖ్య దినాలలో మాంసం ముట్టుకోరు-జీవహింస కలుగుతుందని మాంసాహార నిషేధానికి కారణం చెప్పుతుంటారు. ఆవిధంగాచూస్తే కాయగూరలలోనూ జీవమున్నది. వానిని తరిగేటప్పుడు జీవహింస కలుగుతున్నది. వంటలో బీజగర్భానికి విచ్ఛత్తి కలుగుతూనే యున్నది. అదీ హింసే. జీవహింస అనే పట్టింపు కలవారు బాగుగా పండిన ఫలాలనూ - జీర్ణ పర్ణాశినః క్వచిత్‌ - పండిరాలిపోయిన ఆకులనూ భక్షణ చేయవలసినదని శాస్త్రం నిర్దేశిస్తున్నది. పూర్వం ఋషులు ఆ విధంగా పర్ణ భక్షణా, ఫల భక్షణాన చేసేవారట. లేగ త్రాగగా మిగిలిన పాలను స్వీకరించేవారట. ఈ విధంగానే బతకగలిగితే కామం మనలను బాధించదు. కామ విజయం ఈమార్గాలవల్ల సిద్ధించవలసినదే కాని, ప్రస్తుతం ప్రభుత్వం చెప్పే కుటుంబనియంత్రణ మార్గములవల్ల సిద్ధించదు.

ఐతే పైచెప్పిన ఫలహారమూ, పర్ణభక్షణమూ అందరూ పాటించగలరా అంటే అది కానిమాట. అందుచేత మనం ఎంత తక్కువ హింసతో ఆహారం కూర్చుకొనగలమాఅన్నదే ప్రశ్న. దానికోసమే పాటుపడాలి. కాని అహింస అందరికి ఆచరణీయమైన లక్ష్యంగా ఉండాలి. పరిపూర్ణ అహింస ఏఉత్తమాధికారులో ఆపరించవలసినది. బుద్ధుడూ, మహాత్మాగాంధి ఈఅధికారభేదాన్ని గమనించక అహింస అందరిని ఆచరించమన్నారు. కానిహిందూమతం, ఇష్టానిష్టాలనూ, శక్తిసామర్థ్యాలనూ లెక్కలోనికి తీసుకొని అధికారభేదాన్ని నిర్ణయించింది.

సన్యాసికి సంసారబంధం కాని, ప్రాపంచిక బంధంకాని లేదు. అందువల్లనే అతనికి సంపూర్ణ అహింసావ్రతం విధి. అతడు ఆకులను గిల్లరాదు. ఆహారం వండుకోరాదు. హిందూ మతానికి ఆశ్రమాలు, వర్ణాలే మూలస్తంభాలు. ఒక్కొక్క వర్ణానికీ ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. గృహస్థుని ధర్మాలు వేరు. సన్యాసి ధర్మాలు వేరు. అందుచేతనే కృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో యుద్ధంచేయుమనీ, మరోసందర్భంలో అహింసను పాటించువనీ అర్జునుడికి బోధించినది. న్యాయాధికారి శిక్ష విధిస్తాడు. అదీ హింసే. మనం ప్రేమగా చూచేవారికి పిచ్చియెత్తినప్పుడు, నిర్బంధంలో ఉంచుతాం. అది వాళ్ళకు కష్టమే కలిగించవచ్చు. అధికారభేదం గుర్తించి నందువల్లనే హిందూమతంలో ఈ మాత్రమైనా అహింస నిలిచి ఉన్నది. దీనిని గమనించి ధర్మాన్ని మనం ఆచరిస్తే తప్పులు దొరలవు. అట్లు దొరలినా తక్కువగా ఉంటవి.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page