Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

సంయమము

దాదాపు తొమ్మిదివందల సంవత్సరాలకు ముందు ఉత్తరదేశంలో కృష్ణమిశ్రులు అనేవారుండేవారు. వారున్నూ అష్టపదులు వ్రాసిన జయ దేవులున్నూ ఇంచుమించు సమకాలంలోనే ఉన్నారని అనుకుంటారు. ఆకృష్ణమిశ్రులు ప్రబోధ చంద్రోదయమనే నాటకం రచించారు. ప్రబోధ మంటే జ్ఞానం. ఆ కావ్యం జ్ఞానచంద్రోదయమట. అందులోని పాత్రలుకూడా విచిత్రంగా ఉంటవి. అందు వివేకుడు రాజు. వానికి ఎదిరి మహామోహుడు. వివేకునికి సద్గుణములన్నీ మంత్రులుగానూ, సైనికులుగాను ఉంటారు. దుర్గుణములన్నీ మోహునిపరివారం. వివేకునికి శాంతి అనే భార్యమూలంగా ప్రబోధుడనే పుత్రుడు ఉదయిస్తాడు. ఇట్టివిచిత్ర పాత్రలతో యుద్ధము, మోసము, రాయబారము మొదలైన విశేషాలు చేర్చి కృష్ణమిశ్రులు ప్రబోధచంద్రోదయ మనే నాటకాన్ని అల్లారు. ప్రబోధుని పట్టాభిషేకంతో ఆ గ్రంథం సమాప్త మవుతుంది.

వేదాంత దేశికుల పేరు వినేఉంటారు. ఆయన 'వడగలై' వైష్ణవాచార్యులు. వారు కృష్ణమిశ్రుల గ్రంథాన్ని ఖండిస్తూ 'సంకల్ప సూర్యోదయం' అనే నాటకం రచించారు. తన సంకల్ప సూర్యునిముందు కృష్ణమిశ్రుల ప్రబోధచంద్రోదయం ఆగదని వారి భావం. వేదాంతి దేశికులు మహావిద్వాంసులు. అన్నిటిలోనూ మంచి యోగ్యతకలవారు. వారికి ఊరూరా సన్నిధిఉన్నది. నిగమాంత మహాదేశికులని వారికి బిరుదు. మధ్వాచార్యులవారు ఉభయగ్రాస రాహూదయమని ఈ రెండు కావ్యాలను ఖండిస్తూ మరొక్క గ్రంథం వ్రాశారు. రాహూదయమైతే చంద్రుడూ, సూర్యుడూ ఈయిద్దరున్నూ తాళజాలరనివారి అభిప్రాయం - రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీరికి ప్రత్యేకగణనం లేదు. సూర్యచంద్రుల విరుద్ధ గతుల గణనమే వీరి గణనం. ఛాయ అనగా చీకటి 'తమ స్తు రాహుః స్వర్భానుః సైంహి కేయో విధుంతుదః' అని అమరం.

తమస్సు ప్రకాశాన్ని కప్పివేస్తుంది. ఛాయాగ్రహమైన రాహూదయంలో సంకల్ప సూర్యుడూ, ప్రబోధ చంద్రుడూ ఇరువురూ తిరోధానమయిపోతారన్న భావంతో మధ్యాచార్యులు ఈ గ్రంథం వ్రాశారు.

ఐతే కృష్ణమిశ్రులు తమ గ్రంథానికి చంద్రోదయమన్న పేరెందుకు పెట్టారు? ఉష్ణమూ, ప్రకాశమూ ఎప్పుడూ చేరియే ఉంటవి. తాపమంటేమనకు ప్రీతిలేదు. ప్రకాశంమీద మాత్రం మనకు ఇష్టం. ఆ ప్రకాశం చల్లగాఉంటే మరింత ప్రియం. చంద్రుని ప్రకాశం చల్లనిది. జ్ఞానం సైతమూ అటువంటిదే. లోకంలోని ఇతర విద్యలన్నీ తాపమూ, శ్రమా, అహంకారం ఈ మొదలయిన వానితో కూడుకొన్నవి. ఆత్మజ్ఞానంతక్క ఇతరములన్నీ తాపకారకాలు. మనస్సుకు ఆనందమిచ్చేది ప్రబోధమే. అది చంద్రోదయం వంటిది. ఈ పేరు నిలువగూడదని దేశికులు సూర్యోదయమనేపేరు తమగ్రంథానికి పెట్టుకొన్నారు. అందులో చల్లదనంమృగ్యమైనా, ప్రకాశ##మైనా ఉన్నది. మధ్వాచార్యులు దాన్ని గమనించక పేరుకు విరుద్ధంగా ఉంటే చాలునని తమ గ్రంథానికి రాహుదయం అనేపేరు పెట్టుకున్నారు. మనస్సుకు సంతోషమూ, ఆనందమూ కల్గించడంవల్ల కృష్ణమిశ్రులు జ్ఞానాన్ని చంద్రునితో పోల్చారు.

సంకల్ప సూర్యోదయంలో ఎదిరిరాజుకు సైనికులుగా డంబుడు (డంబము) మొదలైనవారుఉంటున్నారు. నాటకంలో నీదేవూరని డంబుణ్ణి ఒకరు ప్రశ్నిస్తారు. నాది చిన్న కాంచీపుర అగ్రహారమని అతడు బదులు చెప్తాడు. వేదాంత దేశికులకు తాతాచార్యుల వారంటే చుక్కెదురు. తాతాచార్యులవారిది చినకంచి. వారినుద్దేశించే దేశికులు పైవిధంగా వ్రాశారు.

మొదట తాపంకలిగించి పిదప ప్రకాశం ఇచ్చేది సూర్యోదయం. తాపశమనం చేసేది చంద్రోదయం..

మధుసూదన సరస్వతులవారు అద్వైతసిద్ధి అనేగ్రంథం ఒకటి ఉన్నది. అది మాధ్వమతము ప్రతిష్ఠిస్తూంది. అద్వైతసిద్ధికి గౌడ దేశీయులైన బ్రహ్మానంద సరస్వతి 'చంద్రిక' అనే వ్యాఖ్యవ్రాశారు. బెంగుళూరులో తెంగలైవైష్ణవులు అనంతాళ్వారు అనెడివారు వుండేవారు. వీరిని దేశికులకంటే అధిక విద్వత్తుకలవారని అనుకొంటూ ఉంటారు. వారు చంద్రికకు న్యాయభాస్కరమనే ఖండన మొకటి వ్రాశారు. వీరున్నూ దేశికుల ఖండనమును అనుసరించి తమ గ్రంథానికి న్యాయ భాస్కరం అని పేరు పెట్టారు. మన్నారుగుడి మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ రాజుశాస్త్రులు అనేవారు గొప్ప శాస్త్రజ్ఞులు. వారి పాండిత్యం వారితోనే అంతరించింది. వారు అనంతాళ్వార్ల భాస్కరమునకు ఖండనం ఒకటి వ్రాశారు. దాని పేరు న్యాయేందు శేఖరం. చంద్రుని శ్రేష్ఠతను, ఉద్ఘాటించేటందుకు వారు ఆ పేరు ఎన్నుకున్నారు. ఇందు శేఖరుడంటే పరమేశ్వరుడు ఇందు శేఖరమన్న పేరు చాలా గ్రంథాలకున్నది. శ##బ్దేందు శేఖరం అనేది ఒక వ్యాకరణ గ్రంథం. ఇది చాలా ప్రసిద్ధి కన్నది. దీనిని చదివిన వారిని శేఖరాంతం చదివినవారు అని ప్రశంసించడం వాడుక. పరిభాషేందు శేఖరం అని మరొక వ్యాకరణ గ్రంథం కూడా వున్నది.

ఇన్ని గ్రంథాలు - ఖండన మండనాలు కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయ మూలాన వచ్చినవి. ఆయన కూడా డంబుణ్ణి తన నాటకంలో ఒక పాత్రగా కల్పన చేశారు. 'నీ వెక్కడినుండి వచ్చావు?' అని డంబుణ్ణి అడిగితే 'నేను బ్రహ్మలోకంనుంచి వచ్చానని అతడు బదులు చెపుతాడు' 'ఏమిటి విశేషాలు?' అని అంటే 'నేనే బ్రహ్మలోకానికి వెళ్ళాను. బ్రహ్మ నన్ను తన తొడమీద కూచోబెట్టుకోడానికి కులాసాపడ్డాడు. నేను వెంటనే గోమయంతో ఆయన తొడ శుద్ధిచేసి కూర్చున్నాను. కొంచంసేపు ముచ్చటలాడి వచ్చాను.' అని అతడు చెబుతాడు. కృష్ణమిశ్రుల ప్రబోధచంద్రోదయంలోని దీ క్రింది మంగళ శ్లోకం.

అస్తర్నాడీ నియమిత మరుల్లంఘిత బ్రహ్మ రంధ్రమ్‌

స్వాంతే శాంతి ప్రణయిని సమున్మీల దానందసాంద్రమ్‌,

ప్రత్యగ్జ్యోతి రయతి యమినః స్పష్ట లలాట నేత్ర

వ్యాజ వ్యక్తి కృతమిప జగద్వ్యాపి చంద్రార్థమౌలేః.

ఇందు చంద్రమౌళి విషయం ఉంది. ఈనాటకం శాంత ప్రధానమూ, వైరాగ్య ప్రధానమూ కాబట్టి పరమేశ్వరుని శాంత్యానంద స్వరూపిగా ఉన్న దక్షిణామూర్తిని ఈ మంగళ శ్లోకంలో చంద్రమౌళిగా కృష్ణమిశ్రులు వర్ణించారు.

ఈ శ్లోకంలో యమి అన్నపదం ఉంది. అన్నిటినీ నిగ్రహము చేయువాడు యముడు. యమి కూడా అన్నిటినీ నిగ్రహముచేస్తాడు. సంయమియు అట్లే. మనకు రెండు సమయాలలో నిగ్రహం ఉంది. ఒకటి నిదురలో. అప్పుడు మతపు గొడవలుకాని మరి యేడగొడవలు కాని మనలను కలవరపెట్టవు. అటులే చచ్చినపుడున్నూ నిగ్రహమున్నది. చావుకూడా నిద్రే. అదొక దీర్ఘ నిద్ర. నిద్రలో ఆలోచనాలూ కలవరమూ ఏదీలేదు. కాని మేలుకొన్నంతనే అన్నీ మనలను ఆవరిస్తవి. అటులనే చనిపోవునపుడు కూడా అన్నీ అణగిపోతున్నై.

ఈ అణుగుట మన అధీనంలో లేదు. నిద్రలో అణగిన దంతా జాగ్రత్తలో పునరావృత్త మవుతున్నది. చావున్నూ ఈ విధంగానే వున్నది. చచ్చేసమయంలో అన్ని తొందరలూ అణగినప్పటికీ, దేహాంతరంలో అవి మనల వెంటాడుతవి. అని మన ప్రయత్నంచే అణగారిపోనందున తమ తమ స్వభావం చొప్పున మనల మరలమరల వెంటాడుతున్నవి. అందుచే వీనినన్నిటినీ మన స్వాథీనానికి తెచ్చుకోవాలి. అందరినీ నియమించేవాడు యముడు. ఇంద్రియములను తమ స్వాధీనములోనికి తెచ్చుకొన్నవాడు యమి. ఎరుకతో ఇంద్రియములను నియమించుకోగలవాడు 'చూడవద్దు' అని అనుకుంటే కన్ను చూడదు.

స్వామి మృతునివలె అస్వతంత్రుడుగా ఉండలేడు. ఆయన సూర్యునిపై ఆగ్రహించి అతని పళ్ళూడగొట్టాడు. భిక్షాటనంచేశాడు. తాండవం చేశాడు. అంతటితో ఆగక శక్తులకు వరాలిచ్చి ఊరూరా తిరుగుతున్నాడు. ఇట్టి వెన్నో చేస్తున్నాడు. ఐతే ఆయన అణగిన సమయమెప్పుడు. లోపల అణగి ఉంటే వెలుపల ఎట్లున్నా ఫరవాలేదు. కాని వెలుపలి అణకువలేకపోతే లోపల అణకువ ఎట్లా సిద్ధిస్తుంది?

'నీ దృష్టిని తగ్గించుకో, జనసంగంలో ఉండకు, ఇంద్రియ వ్యాపారాలను మితంచేసుకో' అని చెప్పటం అందుకోసమే. బహిఃప్రవృత్తి అధికమయితే అంతర్వ్యాపారమూ మితిమీరుతుంది. అందుచేతనే వనవాసం చేయ్యి, అర్థమును అనర్థముగా చూడు' అని పెద్దలన్నారు.

స్వామి అంతరంగికంగా అతిసంయమంతో ఉన్నాడు. వెలుపల ఇచ్చవచ్చినరీతి మెలగుతున్నాడు. పార్వతీ కల్యాణ సందర్భంలో అట్లా ఉన్నాడని కుమారసంభవంలో కాళిదాసు వేషంలో కనిపించాడు. మూడుకన్నుల సంయమిని పార్వతి చూచినదని కాళిదాసు వ్రాస్తాడు.

మనకు రెండుకన్నులున్నవి. వానిది వెలిచూపు. ఇవి కాక మూడవకన్ను పరమేశ్వరునికి ఉన్నది. కృష్ణమిశ్రుడు దానిని గూర్చిచే మంగళ శ్లోకంలో 'స్వామి యమిగా ఉన్నాడు. ఆయనలో తేజస్సు, ఆత్మజ్యోతిస్సు ప్రకాశిస్తున్నవి. దర్శన మాత్రాన అది తెలుస్తూంది. లలాటనేత్రం స్పష్టంగా కానవస్తూంది. ఆ మిషతో ఆత్మజ్యోతిస్సే ప్రకాశిస్తుంది, అది సమస్తలోకమూ వ్యాపించి ఉన్నది.' అని వర్ణించాడు.

దేహమధ్యంలో ఉన్న నాడి సుషుమ్న. యోగాభ్యాసం చేసి, అందు వాయువు పూరించి ఆరు చక్రముల ద్వారా బ్రహ్మరంధ్రంవరకూ దానిని తీసుకొనిపోయి, మానసికంగా శాంతియనే పత్నితో సహవాసంచేస్తే ఎప్పుడున్నూ ఆనందమే. సంసారం వల్ల సంతతమూ కష్టాలే. భార్య ఎంత గుణవతియైనా అనుకూలవతియైనా వియోగం తప్పదు కదా! శాంతమే ఆంతరంగిక పత్నిఐతే వియోగదుఃఖమేలేదు. లోనదీపించే ఆనందం బయటికి తెలిసేటట్లు చిన్ముద్రధరించి తపస్వియై ఆత్మనిష్టతో పరాశక్తియైన శాంతిని మనస్సులో ఉంచుకొని నిత్యానందమై కూరుచున్న స్వరూపం దక్షిణామూర్తిదే.

మన శాస్త్రముల ప్రకారం లోకంలో పదార్థాలన్నీ పరమాత్మ స్వరూపమే. పరమాత్మతప్ప నేరుగా వస్తువేలేదు. ఉపనిషత్తులున్నూ భేదంలేదనే చెప్పుతవి. కాని మనదంతా భేదదృష్టి. నిజదృష్టికి అన్నీ పరమాత్మ స్వరూపంగా గోచరిస్తుంది. అట్టి స్థితిలో ద్రష్టకూడా మరిగిపోతాడు. 'సర్వమున్‌తాన' ఐనట్లు తోస్తుంది. సంయమిది ఈ దృక్కు, అతనిది సమ్యగ్దృష్టి, మనది భేదదృష్టి.

అద్దంలో మన స్వరూపాన్ని చూచుకొన్నప్పుడు, అది ప్రతిబింబమని మనం తెలుసుకొంటున్నాము. అదే ఏదైనా మృగంచూస్తే దానిని కుమ్మటానికి పోతుంది. దానికి అది ప్రతిబింబమనే జ్ఞానంలేదు. అట్లే మనం లోకంలో అన్నిటినీ భేదదృష్టితో చూస్తాం. ప్రపంచమంతా మన ప్రతిబింబమే అన్నగుర్తు మనకుండదు. కాని సంయమి తీరు వేరు.

ఒకప్పుడు ఈశ్వరుడు పిట్టవాణి అమ్మఅనే దోసెలు అమ్ముకొని జీవించే తన భక్తురాలికి సహాయపడటం కోసం మధురకు వెళ్ళాడు. వైఘానది వరదలెత్తి ప్రవహిస్తూంది. అందుకూ మట్టి త్రవ్వి కట్టకట్టవలెనని రాజాజ్ఞ, 'అవ్వా! నీవు దోసె తునకలు నాకు ఇయ్యి. నీకు బదులు నేనుమట్టి మోస్తాను', అని ఒక పిన్నవాడు అవ్వతో అన్నాడు. అతడు సుందరేశ్వరుడు. ఆ పిన్నవాడు సరిగా మట్టివేయలేదని రాజుచబుకుతో కొట్టాడు. కొట్టాడోలేదో రాజువీపుమీదనే కాక అందరి వీపులమీదా కశాఘాతం కనిపించింది. ఈ విషయమేశివలీలార్ణవం ఇట్లా వర్ణించింది.

వేత్రా హతిం విభక్తుం విశ్వాత్మకతా ప్రదర్శితాభవతా,

కరగత కబళ గ్రాసే పునరభి నీతం శివాద్వైతమ్‌.

నీవు చబుకుదెబ్బలు పంచిపెట్టడంలో మాత్రం 'నీ విశ్వాత్మకత్వాన్ని వెల్లడిచేశావు. పిట్టువాణియమ్మ దోసెలు ఇచ్చినప్పడు ఏమిచేశావు? అపుడుమాత్రం శివాద్వైతమా? దోసెలు తినేటప్పుడు అద్వైతమూ, దెబ్బలు తినేటప్పుడు ద్వైతమూనా? బలేబాగాఉంది.' అది ఫిర్యాదు.

స్వామిపక్షపాతులూ కొందరు ఉంటారు.

త్రాణ యోధికృతః సమ స్తజగతాంత స్యాంబురాశౌసుఖం

నిద్రాణప్య తథావిధేపి సమయే ప్రష్టైవ నాలక్ష్యతే,

కష్టం కుర్వతి తామ్యతి శ్రమభరా ద్వేత్రాహతి స్త్వయ్యభూత్‌

కస్యాగ్రే కథయిష్యసీమ మనయం స్వామి న్ననాథోహ్యసి.

''నీ వొక అనాథుడవు. వైఘానదిలో వరదలని వచ్చావు. పరిపాలనచేసే అధికారం నారాయణుడిది. ఆయన యేమో ఏ చింతాలేక నడిసముద్రంలో శేషశాయియై నిదురపోతున్నాడు. ఎక్కడ, ఏ వరదలువస్తే ఆయనకేమి చింత? ప్రళయోపద్రవం వచ్చినా తెలియని చోటులో సుఖంగా ఆయన వున్నాడు. ఇది యేమి పాపమయ్యా? అని అడిగే నాథుడు లేడు. ఆయన అక్కడ నిద్రపోతూంటే, నీవేమో ఇక్కడ మట్టిమోస్తూ కష్టిస్తున్నావు. ఈ శ్రమకు ప్రతిఫలం చబుకు దెబ్బలు, చెప్పుకొందామంటే నీకు దిక్కులేదు. ఉన్న కష్టాన్ని చెప్పుకొంటే తీరుతుందంటారు. దానికిన్ని నీకు గతిలేదు. మరొక్కరు ఇలా అంటున్నారు.

హే సంతః శృణుతాధునై పమిళితై రస్మాభి రేతచ్చి వే

వాచ్యం వేత్రహతిం విభడిజ్యనపయం భొక్తుంసమార్థా ఇతి,

నోచేత్‌ పాదహతిః శిలాప్రహరణం కోదండదండా లుతిర్‌

గండూషాంబుని షేచనంచసకలంసర్వంవిభాజ్యంభ##వేత్‌

రాజుగారి చబుకు దెబ్బలు అందరికీ పంచడం శివుడు చేసిన అన్యాయం. అన్యాయాన్ని ఎదుర్కొనవలసినదే. ఎవరు చేస్తే మాత్రమేమి? అందరిని కూడగట్టుకొని ఒకరు అంటున్నారు. నీవు పంచిన ఈ చబుకు దెబ్బలు మేము అంగీకరించము. నీవాలకంచూస్తే, నీ వెక్కడికి వెళ్ళినా తన్నులు తినేరకంగా కనబడుతూంది. ఒకడు నిన్ను కాలితో తన్నుతాడు, మరొకడు రాయి తీసుకొని కొడతాడు. మరొకడు వింటితో వేస్తాడు. ఇది చాలదన్నట్లు పుక్కిలించి నీపై మరొక్కడు నీ కయితే వీనినంతా సహించుకోవలసిన కర్మ ఉంది. మా కేమి? మే మెందుకు బాధపడాలి?

కట్టకడపట మరొకరు వచ్చారు. నీవేమో చిన్నదోసెముక్కకు మన్ను మోసి రాజుగారిచేత దెబ్బలుతిన్నావు. నా హృదయకమలములో భక్తి మధువున్నది. నీవు హాయిగా నా హృదయ సరోజంలో తిష్టవేసి, నా మనోభావాన్ని పీల్చివేశావంటే నీకీ కష్టాలుండవు. నేను నిన్ను దండించే వాణ్ణి కాను. అందుచే నీకూ సౌఖ్యం, నాకూ ఆనందం - అని వారు ఈశ్వరునికి విన్నవించుకున్నారు.

మనమున్నూ ఆ విధంగానే ప్రార్థిస్తే మనోభావములు ఈశ్వరునిలో లయించి మనం సంయముల మయిపోగలం.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page