Geetha Koumudi-1    Chapters   

ప్ర శం స

శ్రీమద్గాయత్రీ పీఠాధిపతులగు శ్రీ విద్యాశంకర భారతీయతీంద్రులు తమ సాంప్రదాయిక మనన మంథా దండముచే గీతా క్షీరవారాశిని చిలుకగా నుద్భవించిన అమృతాంశుద్యుతి ఈ గీతాకౌముది ఇచట 'సాంప్రదాయిక' మనునది సాభ్రిపాయము. గీత ఉద్భవించినది మొదలు నేటివరకును దాని తాత్పర్యము ననేకు లనేక విధములుగా చెప్పుచున్నారు. కర్మప్రధానమని కొందరు, జ్ఞానప్రధానమని కొందరు, ఉభయప్రధానమని కొందరు, భక్తిప్రధానమని కొందరు, యోగాభ్యాసప్రధానమని కొందరు, ఈవిధముగ అనేకు లనేకరీతుల గీతనుగూర్చి చెప్పియున్నారు. చెప్పుచున్నారు. ఈ మతము లన్నిటిలో ఎద్దియో ఒక్కటియే సత్యము కావలెను; కాని అన్నియు సత్యము కాజాలవుకదా, గీత ఉపనిషత్సారరూప మగుటచే ఉపనిషత్ర్పతిపాద్యవిషయమే గీతాప్రతిపాద్యము కావలెననియు, అందుచే జ్ఞానమార్గమే గీతారహస్యమనియు శంకర భగత్పాదులు సోపపత్తికముగ నిరూపించియున్నారు. ఇదియే సంప్రదాయ సిద్ధ విషయము. కాని ఈ విషయమును సరిగ మనస్సునకు పట్టించుకొనవలెననిన ఎంతయో మనన మావశ్యకము. ఏతద్గంథము లేనివారికి గూడ అర్థమగునట్లు బోధించవలెననిన ఎంత మననము చేయవలసియుండును. అది ఊహమాత్ర గమ్యము. ఈవిధముగ సంప్రదాయసిద్ధ గంభీరవిషయమును అతిసులభము, ఆహ్లాదకమునునగు రీతిలో నెల్లరకును అందజేయు నీగ్రంథము కౌముది అనుట ఎంతయు సమంజసముగ ఉన్నది.

ఎంతటి శ్రుతిప్రతిపాదితార్థమైనను యుక్త్యుపబృంహితము కానిచో అది సుదృఢము కాజాలదు. కావుననే శంకర భగవత్పాదులు "సత్సుతు వేదాన్తవాక్యేషు జగతః జన్మాది కారణవారిషు తదర్థగ్రహణదార్ధ్యాయ అనుమాన మపివేదాన్తవాక్యా విరోధి ప్రమాణం భవన్న నివార్యతేశ్రుత్యైవసహాయత్వేన తర్కస్యాభ్యు పేతత్యాత్‌ తధాహి 'శోతవ్యో మన్తవ్యః" అని వ్రాయుచు యుక్తవష్టం భావశ్యకత నంగీకరించియున్నారు. కాని అట్టియుక్తులు కాల భేదముచే మారుచుండునని నా యభిప్రాయము. పూర్వము తార్కిక యుక్తులను-అనుమానాదులను- చూపిన సరిపోవుచుండెడిది. కాని నేడు వాటితోపాటు వైజ్ఞానికైతిహాసికాది యుక్తులనుగూడ జూపినగాని సంపూర్ణత్వములభించుట లేదు. అట్టి నూతనయుక్తులను జూపి అద్వైత సిద్ధాంతమున కపూర్వసేవ చేయుచున్న నేటి ఆధ్యాత్మిక విద్యాప్రచారకులలో శ్రీస్వామివారు అగ్రశ్రేణికి చెందినవారు. వీరి ఈదృశ శక్తి ఈగ్రంథమునం దంతటను, ప్రధానముగా మొదటి మూడు కిరణములందును సుస్పష్టముగ గోచరించుచున్నది. భగవద్గీత యొక్కటియే విశ్వజనీన మతగ్రంథమగు నర్హత కలదనుటకు వీరిచ్చిన ఉపపత్తులు విచారసహముగ నున్నవి. మీమాంసకోపజ్ఞమగు ఉపక్రమోపసంహారాది లింగషట్కమును సామాన్యులకుగూడ అర్ధమగుతీరున నాల్గవకిరణమున ప్రతిపాదించుట ప్రశంసనీయము. 'ఉపనిషద్‌' 'గీతా' శబ్దముల స్త్రీలింగ సామ్యమునకొక యుపపత్తి కల్పించుట చమత్కారముగ నున్నది.

గీతలోన ప్రతియొక్క శ్లోకము అర్ధమగు చున్నట్లే ఉండును. కాని ప్రతిపాద్య విషయగాంభీర్యముచేతనో లేక అస్మదాదిబుద్ధిలోపముననో ఎచటినుండి ఎచటివరకు ఏవిషయము చెప్పబడినది, చెప్పినదంతయు పరస్పరవ్యాహతము కాకుండ నున్నదా, అన్నచో సందేహము రాకమానదు. వాస్తవమున "వ్యామిశ్రేణవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే" అనుచు అర్జునుడు కూడ భగవద్వాక్యములు అస్పషార్ధకముగ నున్నవని పలికియున్నాడుకదా. ఇట్టిశంకలు తొలగునట్లు శ్రీస్వాములవారు ఏశ్లోకసంఖ్యానిర్దేశ పూర్వకముగా ఏ శ్లోకమునుండి ఏ శ్లోకమువరకు ఏవిషయము చెప్పబడినది? అందలి సూక్ష్మాంశ##భేదము లెవ్వి ? అనునది మొదటి మూడధ్యాయములకు సంబంధించినంతవరకు అరటిపండొలచినట్లు అందజేయుచున్నారు. ఈభాగమును చదువునపుడు వారి ఉపన్యాసమును వినుచున్నట్లనిపించును.

ఎనిమిదవ కిరణమున అర్జునుడు బ్రహ్మవిద్యకు అధికారి యని నిర్ణయింపబడినది. కాని 96 వ పుటలోని మొదటి నాల్గుపంక్తులును "అర్జునుడు జ్ఞాననిష్ఠకు అధికారి కాడు" అని చెప్పుచున్నవి. మొదట చదివినపుడు ఈ ఘట్టములలో విరోధమున్నదా అని అనిపించినది. కాని బ్రహ్మవిద్యాధి కారమున్న దనినపుడు బ్రహ్మవిద్యాగ్రహణ మాత్రమున కధికారమున్నదనియు, జ్ఞాననిష్ఠతో అధికారము లేదనగా స్వవిహితకర్మత్యాగపూర్వక జ్ఞానైకమాత్రాధికారము లేదనియు శ్రీ స్వామివారి యభిప్రాయమై యుండునని అనుకొంటిని. కావుననే 'నిష్ఠ' అను పదమును సాభిప్రాయముగ వాడియున్నారు.

మొదటి మూడధ్యాయములకువలెనే మిగిలిన అధ్యాయములపై గూడ శ్రీస్వామివారు చేసిన వ్యాఖ్యను పుస్తక రూపమున ఆస్తికుల కందజేయవలెనని ప్రార్థించుచున్నాను హైదరాబాదు, పుల్లెల శ్రీరామచంద్రుడు.

30-1-1967. వేదాన్త శిరోమణి వేదాన్త విశారద,

విద్వాన్‌ , M. A.

(సంస్కృతము, ఆంగ్లము, హిందీ)

సంస్కృతోపన్యాసకుడు,

ఉస్మానియా విశ్వవిద్యాలయము,

Geetha Koumudi-1    Chapters