Nadayadu Daivamu  Chapters  

 

పరిచయము

శంకర గ్రంధావళీ పాఠకులకు నామహాతున్మి వ్యక్తిత్వ మెట్టిదో తెలిసికొన కుతూహలముండును. వారి యపార రచనా ప్రపంచమున నెచ్చటగాని వారి వ్యక్తిత్వము ఛాయా మాత్రముగనైన కన్పట్టదు. బ్రహ్మసూత్ర భాష్యమున నొకచోట నొకేయొక ప్రస్తావన కలదు. అదియును వారి వ్యక్తిగత జీవితమునకుగాని, లౌకిక చరిత్రకు గాని సంబంధించినది కాదు. అంతర్ముఖులై పరమాత్మాను సంధానము చేసిన యనుభవ విశేష దార్శినికమది. అది ''శరీర ధార్మియై యాత్మాను భవము నందిన వేనికైనను బ్రహ్మజ్ఞానానుభవమును నిరాకరించుట యెట్లు పొసగును'' అనునది. ఇది జీవన్ముక్తి విషయికము. ఇది శంకరుల స్వానుభవ ప్రదర్శకమే యనునది స్పష్టము.

శంకరుల జీవిత విశేషములు, వారి విజయములను నితర ప్రాగ్సంగిక విషయములను పురస్కరించుకొని సేకరింప నయినవి. ఇవి రకరకములుగ నున్నవి. అయినను నీ జగద్గురునిమూర్తిమత్తము వారి రచనలను, నుపదేశములను, భాగ్యములను నాధారముగా జేసికొన్నియూహింప నగును. ఆధ్యాత్మిక మార్గాను యాయులకు దర్శకుడుగా, మహామేధా సంపన్న తత్త్వ బోధకుడుగా, నా బాల్యమైహికాను బంధ విముక్తుడుగా, ఉపనిషద్విజ్ఞాన భాస్కరుడుగా, సర్వమానవ సంక్షేమ కార్యకర్తగా దివ్య జీవన స్రవంతిగా, నేతగా, నాయకుడుగా, గురువులకు గురువుగా, జగద్గురువుగా మన యెదుట నా స్వామి దర్శన మిచ్చును. ఇంతకు నాయన మహోజ్జ్వల మూర్తిగా భాసించు చున్నారు.

ఇప్పుడొక సందేహము కలుగవచ్చు. ఇట్టి మహనీయుడీ భూమిపై నడయాడుట సాధ్యమా? అనంతకోటి మానవ చరిత్రలో గమించు తాత్త్విక మహామేధావి శిష్టకోటి, యీ యొక్క సన్యాసిలో మూర్తీభవించునా? ఈసందేహము తీరుట కొక మార్గము కలదు. కంచికామకోటి పీఠాధిపతులైన పూజ్యుపాదులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామిని దర్శించిన తీరును. వారాది శంకరమూర్తులే. మానవరూపముననున్న దైవమేవారు. సర్వరక్షకమైనవారి తేజోవాహిని ప్రపంచ పరివ్యాప్తము. వారికృపావీక్షణ మాబాలగోపాల తారకము. కడవానిపైకనకధార. అరువది సంవత్సరములుగా శ్రీ స్వామివారు ఆదిశంకరుల యా దేశ సంకల్ప నిర్వహణమున, సర్వమానవ ''శం'' కరత్వమున శంకరులుగా పూజనీయులై భక్తకోటినను గ్రహించుచుండిరి. ఆధ్యాత్మికోన్నతి విని మానవకల్యాణమునకు నుపయుక్తములైన యెన్నో మార్గములను స్వామివారు ప్రసాదించిరి. మానవకల్యాణ కరముగా భారతీయ పునరుజ్జీవన శక్తి సుస్థిరమై, మహోజ్జృంభణమునందుటకు, నిర్విరామముగా విగతశ్రమముగా యావజ్జీపకృషి కెవ్వరైన నంకితులైరన్నచో నదియపారమైన శ్రీ శంకరకృపాఫలమేయని యనక తప్పదు.

తత్కృపాఫలముగా ప్రపంచకము విశ్వ పరిపూర్ణత్వమున నొకమెట్టు పైకి గమించినదనక తప్పదు.

Nadayadu Daivamu  Chapters