Nadayadu Daivamu  Chapters  

 

సామాన్య ధర్మములు

సర్వ జనులు ఆచరించవలసిన సామాన్య ధర్మములను గూర్చి మనుస్మృతి ఇలాచెప్తుంది. ''అహింసా సత్యమస్తేయో శౌచమింద్రియ నిగ్రహం'' అహింస, సత్యము, దొంగిలించకుండుట, పరిశుభ్రత, ఇంద్రియనిగ్రహము యీ ఐదూ చాలా ముఖ్యమైన ధర్మములు. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి మొదలగునవికూడా సామాన్య ధర్మములని వేదములలోనుపదేశించారు. యీఐదు ధర్మాలు ఏమిటో కొంచెం విచారణ చేద్దాం.

-: అహింస :-

ఏ జంతువుకీ హానికల్గించక పోవటం అందరికీ సామాన్యమైన ప్రధానధర్మం. ఒకచీమను కూడా చంపకూడదు. ఎవరికీ బాధకల్గించకూడదు. ఇదీ అహింసఅంటే. అహింసను యోగానికిసాధనంగా చెప్పారు.

యోగమంటే ఏమిటి? యోగమంటే మనోనిగ్రహం. ''యోగశ్చిత్తవృత్తి నిరోధః.'' యోగమంటే మనస్సులో కలిగే భావాలను అరికట్టడం. మనస్సులో కోరిక పుడుతుంది. మనస్సు ఆలా విషయాలనుగురించి ఆలోచిస్తుంది. కాబట్టి మనస్సులో చాలామార్పులు చెలరేగుతుంటాయి. మనస్సు వల్లనే మనకు అన్ని కష్ఠాలూ వచ్చేది. కాబట్టే ''మన ఏవ మనుస్యాణాం కారణం బంధ మోక్షయోః'' అనిచెప్పారు. బంధమోక్షములు రెండింటికి మనస్సే కారణ మన్నారు. మనం కోరుకున్న విధంగా మనస్సు వుండదు. మనం ఒకవిషయాన్ని గుఱించి ఆలోచిస్తుంటే అది ఎక్కడకోపోతుంది. అసలు దేన్ని గుఱించీ ఆలోచించవద్దనుకుంటే అదిచాలా అసాధ్యమైన మాటే. మాటాడవద్దనుకుంటే నోరుమాటాడదు. చూడవద్దంటే కన్ను చూడదు. కానీ మనస్సు వూరుకోమంటే వూరుకుంటుందా! అంటే మన మనస్సు మన ఆధీనంలో లేదన్నమాట. అది నిజంగా మన ఆధీనంలో వుంటే మనం చెప్పినట్లు అది వినాలి. మనం ఆలోచించవద్దంటె అది ఆలోచించకుండా మానేయాలి. కానీ జరిగేదేమిటి? ఒక విషయాన్ని గుఱించి భావించమని దానికి చెప్తే సరిగ్గా ఆ విషయానికి వ్యతిరేకమైనదాన్ని అది భావిస్తుంది. పిచ్చివాడు శాంతంగా కూర్చోలేడు. ఎప్పుడూ ఏదో వాగుతూనే వుంటాడు. వాడిచేత నోరు మూయించటం అసాధ్యం. అదే విధంగా మనకు మనస్సును నిగ్రహించుకోవటం అసాధ్యం. మనస్సుకు సంబంధించినంత వరకూమనమూ పిచ్చివాళ్లమే. మనస్సు మన అదుపులో వుంటే మనం నడుచుకోమన్నట్లది నడుచుకోవాలి. అప్పుడే అది మనఅదుపులోవున్నదని చెప్పవచ్చు. మనకి శరీరంలో బాధవున్నదనుకోండి. మనస్సు ఆ బాధ అనుభవిస్తూ వుంటుంది. అప్పుడు మనం ఆ బాధనుగురించి పట్టించుకోవద్దంటే అది మన ఆజ్ఞకు లోబడి వుండాలి. అదన్నమాట మనోనిగ్రహమంటే, మనస్సు నిగ్రహింపబడితే బాధలేదని భావించటం సాధ్యమౌతుంది. పెద్దపులివచ్చి గాండ్రించిందనుకోండి. అప్పుడు మనంభయపడవద్దనిచెప్తేభయపడకుండా వుండాలి. ఏడవమంటే ఏడవాలి. వద్దంటే మానాలి. ప్రస్తుతం వున్నస్థితి ఇదికాదుగాదా! ఏడవవలసిన హేతువు లేకపోయినా మనస్సు ఏడుస్తూనే వుంటున్నదిగదా! మనమనస్సు అదుపులోకి వస్తే ఏడవటానికి తగినంత కారణమున్నా ఏడవవటం మానివేయాలి. అప్పుడది అదుపులోకి వచ్చిందన్న మాట. అప్పుడు కోపగించవద్దు అంటే అది కోపంలేకుండా వుంటుంది. ఇప్పుడో మననోరుగూడా మనకుసంపూర్ణంగా స్వాధీనంలో లేదు. మనమేదో పిచ్చిగావాగి తరువాత ఇట్లా మాట్లాడామేమిటి అని పశ్చాత్తాపపడుతూఉంటాము. పిచ్చివాడికి మనకీ పెద్దభేదంలేదు. పిచ్చివాడుగూడా అప్పుడప్పుడు పిచ్చివాగుడు వాగుతున్నానవి అంటూనే వుంటాడు. హఠాత్తుగా మనం భయపడతాం. ఇల్లాంటి పరిస్థితులు రాకుండా నివారించటానికి మన మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలి. మనస్సు స్వాధీనమైతే ఆస్థితి ఎల్లావుంటుందో వర్ణించారు. అప్పుడది తైలధారవత్తుగా వుంటుందట. అప్పుడు మనో ప్రవాహం నిర్విఘ్నంగా ఏకముఖంగా నడుస్తుంది. మనస్సు ఏకముఖమైతే బాగా స్వాధీనంలోకి వస్తే ఆస్థితి యీశ్వరదర్శనం కంటే గొప్పది. ఈశ్వర దర్శనం వల్ల చాలా ఆనందం కల్గుతుంది. ఆ ఆనందంలో మునిగివుండమని మనస్సుకు చెప్తే అది మునిగివుంటుంది. లేదూ యీశ్వరుడే అయిపొమ్మంటే అయిపోతుంది. ఎట్లా వుండమంటే అట్లా వుంటుంది. ఎలా చెప్తే అలా వింటుంది. ఇదీయోగ మంటే.

దేన్ని భావిస్తే మనకు సుఖం కలుగుతుందో దాన్ని గుఱించి ఆలోచించకుండా తక్కినవాటిని గుఱించి ఆలోచిస్తుంది మనమనస్సు. ఇదీ ప్రస్తుతస్థితి. మఱిఏంచేస్తే ఇది అదుపులోకివస్తుంది? కోపం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలి. వద్దంటే మానాలి. ఇల్లా అదుపులో పెట్టడానికి మార్గమేదోవెదకాలి. మనం చావకముందే ఆమార్గమేదో కనిపెట్టాలి.

వేదం ఇల్లాచెప్తోంది. ''తమేవం విద్వానమృత యిహభవతి'' ఆయన్ను అల్లా తెలుసుకున్నవాడు ఇక్కడే అమృతుడౌతాడు. (పురుష సూక్తం) గీతలోగూడా భగవానుడు ఇలాఅంటాడు. ''శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్‌, కామక్రోధోద్భవం వేగం సంయుక్తస్స సుఖీనరః'' యీశరీరం పడిపోకముందే కామక్రోధాలు మనస్సులో కల్గించే అలజడిని అరికట్టగల్గించినవాడే యోగి. వాడేసుఖి. (గీత 5-23) కామక్రోధాలు విజృంభించే సందర్భం తటస్థించినా వాటి వేగాన్ని యీ జన్మలోనే మనం అరికట్టాలి. అల్లాచేయగల్లినవాడు యుక్తుడు. యుక్తుడంటే యోగం కలవాడు. యోగముఋషుల కోసమే అనుకోరాదు. మందు ఎవరికిఅవసరం? ఎవరికి రోగమో వాడికే గదా! మనకి ఇప్పుడు మనోరోగమున్నది. దానివల్ల బాధపడుతున్నాము. కాబట్టి మనకే యీ యోగాలు అవసరం. మనస్సు స్వాధీనం చేసుకోటానికి ఏది మార్గం? రెండు మార్గాలున్నాయి. ఒకటి బహిరంగమైనది. రెండోది అంతరంగమైనది. వాటి భోగట్టా తెలిసిన వాళ్ల దగ్గరనుండి మనం నేర్చుకోవాలి. మనస్సును బాగా స్వాధీనం చేసుకున్నా వాళ్లదగ్గర నుండి నేర్చుకోవాలి? నిరంతరం మనస్సును అదుపులో వుంచుకోగల్గినవాళ్ళలో భగవంతుడైన శ్రీకృష్ణుడొకరు. మన ఆచార్యులైన శంకర భగవత్పాదుల వారు ఒకరు. పుట్టినప్పటినుండి కొంతమంది అందంగాను సువర్ణచ్ఛాయగాను వుంటారు. మఱి కొంతమంది చలి దేశాలకుపోయి అక్కడ వేసుకోవలసినదుస్తులు వేసుకొని శరీరచ్ఛాయ సంపాదిస్తారు. కొన్ని పక్షులు పుట్టుగానే ఎగురుతాయి. కొన్నిటికిఆలస్యంగా రెక్కలు వస్తాయి. చేపలు పుట్టినప్పుడే యీత్తాయి. మనం పెరిగిన తరువాత నేర్చుకుంటాము. ఈశ్వరుడికి స్వాభావికంగానే మనస్సు స్వాధీనంలో వుంటుంది. ఆయన శాశ్వతంగా వుంటాడు. ఆయన మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా వుంటుంది. కానీ మనం బాగా ప్రయత్నం చేసి మనోనిగ్రహాన్ని సాధించాలి. విద్యారణ్యస్వాములు, సదాశివబ్రహ్మేంద్రులు సుశిక్షణవల్ల మనోనిగ్రహాన్ని సాధించినవారు వీరిద్దరూ మనకు దీనికి మార్గాలు చెప్పారు.

రెండు మార్గాలున్నాయని పైనచెప్పాను. అందులోఒకటి బహిరంగసాధన. అంటే బయటవుండి సహాయం చేసేవి. దానం, ధర్మం సంధ్య ఔపాసనముయజ్ఞము, పరోపకారము మొదలైనవి బహిరంగ సాధనాలు. ఇవిచక్కగా ఆచరిస్తే, శ్రద్ధగా ఆచరిస్తే మనస్సు సంస్కృతమౌతుంది.

అంతరంగ సాధనాలు మన లోపల వుండి సహాయము చేసేవి. మఠంలోపూజకు సంబంధించి చాలాపనులు చేయాల్సి వుంటుంది. బండీతోలేవాడూ కూలివాడూ మొదలగువారు మఠానికి వెలుపలవుండి సహాయం చేస్తారు. దీపారాధన చేసేవాడూ పూలు తెచ్చేవాడూ బాగా దగ్గరవుండి సహాయ పడ్తారు. అహింస మనోనిగ్రహానికి తోడ్పడుతుంది. మనస్సు సాధించలేదంటూ లేదు. మనస్సుస్వాధీనం లేకపోతే అదిసాధించే మేలంటూ లేదు. ఏనుగును మచ్చిక చేయకపోతే దానివల్ల మనకు వుపయోగ మేమిటి? పైపెచ్చు దానివల్ల హానిమాత్రమే కలుగుతుంది. దాన్ని మచ్చిక చేశామో అది మనకు చాలాపనులు చేసి పెడుతుంది. మనస్సుకు ఎన్నిఏనుగుల బలంవుందో చెప్పలేము. హనుమంతుడు, విశ్వామిత్రుడు మొదలగు మహాత్ములు మనోనిగ్రహాన్ని సంపూర్ణంగా సాధించినవారు. అందువల్లవారికి అంత గొప్పశక్తి వుండేది. మన మనస్సూన్ను వాళ్లమనస్సలాటిదే. మనం మన ఆజ్ఞను పాలించటం మనస్సుకు నేర్పుతే మనం కూడా ఆశ్చర్యం కల్గించే అద్భుతమైనపనులు చేయగలం. వేదాంతం ఏమి చెబుతోంది.? యీ విశ్వాన్నంతటినీ మనస్సే కల్పించిందని చెబుతోంది. యీ మొత్తం విశ్వం చీమ మనస్సుకు కూడా తులతూగదు.

మనస్సు పెద్దభూతంలాటిది. విక్రమాదిత్యుని కధలో వచ్చే భూతంలాటిది. ఆ భూతాన్ని వశంచేసుకున్న తరువాత అది ఏపని చెప్తే ఆపని చేసినట్లుగానే మనస్సుకూడా వశపడితే అట్లాగే చేస్తుంది. సంపూర్ణంగా మనస్సును నిగ్రహించడమే యోగం. అహింస యోగాంగాల్లో ఒకటి. మనో నిగ్రహం సాధించినవారు మేముఅహింసామార్గాన్ని అవలంబించి మనస్సును స్వాధీనం చేసుకున్నామని చెపుతారు. అందుకనే మనుధర్మశాస్త్రంలో అహింస ప్రధానంగా వుండవలసిన గుణాల్లో ఒకటనిచెప్పారు. యోగశాస్త్రంలోదాన్ని యోగాంగములలో ఒకటని చెప్పారు. అహింసలో వుండే గొప్పతన్నాన్ని చెప్పటానికి ఇంతదూరం చెప్పాను.

ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని సాధించటానికి మన మొకపని చేస్తే దానికి ఇతర ప్రయోజనాలు కూడా చాలావుంటాయి. వీటిని అవాంతర ప్రయోజనాలంటారు. ఉదాహరణకు పూజించటానికి మనం మఠానికి వెడ్తాము. పూజచూడటంతోబాటు మనం పెద్దపెద్ద పండితుల వుపన్యాసాలు వింటాం. మంచి సంగీతం కూడా వింటాము. ఇవి మనం అనుకోకుండానే జరుగుతుంటాయి. అక్కడ చాలా మంది మనుషులను చూస్తాము. చాలామంది పండితుల్నిభక్తుల్ని చూస్తాము. మనం అనుకోకుండా కలిగే భావాలవి. మనం వుద్దేశించిన ప్రయోజనం వుండుటకు పూజచూడటం. తక్కినవన్నీ అవాంతర ప్రయోజనాలు.

అశింసవల్ల చాలా అవాంతర ప్రయోజనాలున్నవి. ప్రధానమైంది మటుకు మనోనిగ్రహం. అది మన ముఖ్యప్రయోజనం. దీంతోబాటు అవాంతర ఫలితాలు కూడా వుంటాయి. దీంతోబాటు అవాంతర ఫలితాలు కూడా వుంటాయి. అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌవైరత్యాగః'' (పతంజలి యోగ సూత్రం) యోగ సూత్రం ఇలా చెపుతోంది. త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్‌ కాయములతో మనం అహింసను పాటించినట్లయితే మన సన్నిధానంలో ప్రతివాడూ వైరబుద్ధివదలి ప్రశాంతంగా వుంటాడు.

మరొకరికి బాధ కల్గించాలని అనుకోరాదు. బాధకల్గించే మాటలు మాట్లాడరాదు. శరీరంతో బాధ కల్గించరాదు. స్వాభావికంగా ఇంకోళ్లజోలికి పోవాలని మన మనస్సు పోవచ్చు. ఎవడైనా ఒక తప్పు చేస్తే కోపం వస్తుంది. వాణ్ణికొట్టబుద్ధవుతుంది. అదే మన పిల్లవాడైతే వాడు కొంపకు నిప్పు పెట్టినా సరే వాడిమీద కోపం వస్తుందా? కోపమైతే రాదు. గాని నిప్పుమాత్రం వెంటనే ఆర్పివేస్తాము. మళ్లాఅట్లానిప్పుపెట్టకుండా చేస్తాం. అలాగే మనకి కష్టం కల్గించేవారిపట్లకూడా ప్రవర్తించాలి. పసిపిల్లవాణ్ణిచూచినట్లుగా వాణ్ణిచూడాలి. అహింస అంటే అది. యీ అహింసను అభ్యసిస్తే వచ్చే ముఖ్య ప్రయోజనం మనోనిగ్రహమని చెప్పాను. దీనికి తోడు అహింసను పాటించే వాని సన్నిధానంలో మనుషుల్ని చంపాలి అనే ఆలోచన కలవాళ్లుకూడా చల్లపడి శాంతంగావుంటారు. అతడున్న చోట పరమ క్రూరుల చిత్తవృత్తికూడా ప్రశాంతంగా వుంటుంది. ఇదీఅహింసకు అవాంతర ప్రయోజనం, (అంటే దానంతట అదేసిద్ధింస్తుందన్న మాట.) వర్ణాశ్రమ ధర్మాల్లోబ్రాహ్మణుడై పుట్టిసన్యసించినవాడు యీ అహింసను పరిపూర్ణంగా పాటించాలి. సన్యాసం పుచ్చుకునేటప్పుడే యీ ప్రతిజ్ఞ తీసుకుంటారు. ''అహింసన్‌ సర్వాభూతాన్య నత్రతీర్ధేభ్యంః'' (ఛందోగ్యోపనిషత్తు) యీ మాట అర్ధమిది. నావల్ల ఏప్రాణికి భయంలేదని. గృహస్తయితే అతడు ఆచరించవలసిన విథుల్లో తప్ప తక్కినచోట్ల అహింస పాటించాలి. వేదం విధించిన కొన్ని కర్మల్లో హింస వుంటుంది. అక్కడ హింస విధిగా చేయవలసిందే. వాటిని విడిచి తక్కిన చోట్ల అహింస పాటించాలి. గౌతమధర్మసూత్రాల్లోనూ, ఛాందోగ్యం చివరలోనూ దీని వివరంబాగా వుపదేశించారు, విధివిహితమైతే తప్ప గృహస్తు హింస చేయకూడదు. సన్యాసి మాత్రం అహింస పరిపూర్ణంగా పాటించాలి. అతడు వండకూడదు. ఆకులు కూడా తుంచకూడదు. హింసవున్న పనులేవిచేయకూడదు.

సత్యం

సత్యానికి నిర్వచనం ఇల్లా వుంది. ''వాగ్మన సయోరైకరూప్యం సత్యం'' మనసులో అనుకున్నదేదో మాటలోఅదిచెప్తే సత్యమోతుంది. భగవంతుడు మనకు భాషనెందుకిచ్చాడు? మనమనస్సులోనున్నది వ్యక్తం చెయ్యటానికిచ్చాడు. అది చేయకుండా అబద్ధాలు చెప్తేవచ్చే జన్మలో మనకు భాషలోపిస్తుంది. అంటే పశుజన్మవస్తుందన్న మాట. అహింసను గుఱించి చెప్తూగృహస్తు విషయంలో దానికి కొన్ని మినహాయింపు లున్నాయని చెప్పాం. అల్లాగే సత్యం చెప్పటంలోకూడా ఒక మినహాయింపు వుంది. అహింస విషయంలో గృహస్తు ఒక్కడికే మినహాయింపు, కాని సత్యం చెప్పటం విషయంలో యీ మినహాయింపు అందరికి వర్తిస్తుంది. ఒకాయన ఇతరులలో తాను దర్శించిన తప్పులన్నీ చెప్తాడు. వాడు దుర్మార్గుడు. వాడు ఆపనిచేశాడు ఈ పనిచేశాడని. అతడు చెప్పినదంతా యదార్ధమేకావచ్చు. యీ చెప్పటంలో వాడి మనస్సుమాట ఏకరూపంలోనే వుండవచ్చు. అయినా అదిసత్యంకాదు. ''సత్యం భూతహితం ప్రియం'' అని చెప్పబడివుంది. మనస్సులో వున్నదే చెప్పాలనేది సత్యానికి సామాన్య నిర్వచనం. మనస్సులోవున్న మాటలే ఎందుకుచెప్పాలో విచారణచేద్దాం. ఏపనిచేసినా మంచికోసం చేయాలి గదా! అల్లాగే సత్యంకూడా మంచికేకావాలి. మంచిపుడితే అది సత్యం. చెడుపుడితే అది సత్యంకాదు. సత్యమనేది అన్ని ప్రాణులకుకూడా మేలుకల్గించాలి. కామక్రోధాలనుండి సత్యం పుట్టదు. ఒకమనిషిని అప్రతిష్ఠపాలు చెయ్యాలనే వుద్దేశ్యంతో చెప్పే మాటలు యదార్ధమైనప్పటికి వాటిని సత్యమే అనటానికి వీలులేదు. సత్యమనేది ఒకమనిషికి దుఃఖం కల్గించరాదు. అతనికి కష్టంకల్గించరాదు. సత్యం మనకి, ఎదుటివాళ్ళకికూడా మేలే కల్గించాలి. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు చల్లగా చెప్పాలి. వినేవాళ్ళకు మేలుకల్గించేట్టుగా వుండాలి. ఇది మనభాషకు సంబంధించినంతవరకు సత్యంచెప్పాల్సినతీరు. మనస్సుతో కూడాను సత్యాన్ని పాటించాలి. అబద్ధం చెప్పాలని అనుకోవడంకూడా పనికిరాదు.

స్నానం చేయకుండానే స్నానం చేసినట్లుగా నటించడం కాయకమైన అబద్ధం. త్రికరణాలతోనూ సత్యాన్నీ పాటించాలి. సత్యంకూడా మనోనిగ్రహం సాధించడంలో సహాయపడుతుంది.

సత్యానికికూడా అవాంతర ప్రయోజనంవుంది సత్యమే మాట్లాడటం బాగా అభ్యాసంచేస్తే మనస్సు ఎప్పుడు గూడాను సత్యాన్ని గూర్చే ఆలోచిస్తుంది. వాక్కు ఎప్పుడూసత్యాన్నే చెబుతుంది. అపుడు చెప్పినదంతా సత్యమే అవుతుంది. పొరపాటున మన నోటి వెంట ఏదో మాట జారినా అది సత్యమై తీరుతుంది. ప్రతిది గూడాను సత్యవాక్కును అనుసరించి తీరుతుంది. ప్రమాదవశాత్తూ నోటివెంట ఏ మాట వచ్చినా అది జరిగితీరుతుంది. సత్యంవల్ల మాటలకంతశక్తివస్తుంది. శాపాగ్రహ సామర్ధ్యంఇదే. సత్య వచనులు యీ రోజున పూర్ణిమ అంటే పూర్ణ చంద్రుడు వుదయించవల్సిందే. అది అమావాస్య అయినా సరే. అందుచేత సత్యవచనులైన వారికి శాపానుగ్రహ సామర్థ్యముంటుంది.

మనకి సంపదమీద కోరికలేదని మనమనుకోవచ్చు. యీ విషయం మనకి తెలిసేదెట్లా? దీనికి నిదర్శనమేమిటి? కలల్లోకూడా సంపదమీద కోరిక కలక్కుండా వుంటే అట్లాంటి కోరిక మనకు లేదని గట్టిగా చెప్పవచ్చు. మనకు ఎవడైనా డబ్బుయిస్తున్నట్లు కల వచ్చిందనుకోండి అప్పుడు ''సరే యివ్వు'' అనరాదు. అలాగే కల్లోకూడా మనం సత్యాన్ని వదిలిపెట్టకుండా వుండేటంత సత్య నిష్ఠను మనం పెంపొందించుకోవాలి. అప్పుడు మనకి సత్యం ప్రసన్నమౌతుంది. మనమన్న మాటల్లా అయితీరుతుంది. యోగసూత్రంలో చెబుతారు. ''సత్యప్రతిష్ఠాయాం క్రియా ఫలాశ్రయత్వం''అని. ఐతే అలాంటి అవాంతర ఫలాన్ని సంపాదించటానికి సత్యాన్ని అభ్యసించరాదు. మరొక సదృశ సాధనం వైరాగ్యం. వైరాగ్యం అంటే కోరిక లేకుండా వుండడం. దీనిక్కూడా అవాంతర ప్రయోజనం వుంది. అది ఏమిటంటే వైరాగ్యం సాధించినవానికి భూమిలో పాతుకునివున్న నిథులు కనపడతాయి. ఒక మనిషి నాకు వైరాగ్యమైతే వున్నది గాని అట్లా పాదుకొని వున్న నిథులు కనపడలేదంటే ఆ మాటలవల్ల వాని వైరాగ్యమెట్లాంటిదో మనకు తెలుస్తుంది. వాడు నిధులు కనపడతాయని ఆశిస్తున్నాడన్న మాట. అందుచేత వైరాగ్యవంతుడుకాడని తేలుతుందిగదా! అలాగే సత్య విషయంలోనూ. యీ అవాంతర ప్రయోజనం కోసం మన సాధన కాకూడదు.

3. అస్తేయం

అన్యాయమైన కోర్కెలను మనం పెంచుకోకూడదు. అస్తేయమంటే దొంగతనం చేయకుండా వుండడం. మోసంచేసి ఎవరిఆస్తిని కాజేయకూడదు. దౌర్జన్యంగా ఎవడిసోమ్మూ లాక్కోకూడదు. అబద్ధపు వుత్తరాలు పుట్టించి ఇతరుల ఆస్తిని కాజేయడం అన్నింటికంటే చెడ్డది.

4. శౌచం

శరీరశుద్ధి మనశ్శుద్ధికి దోవ. ధర్మశాస్త్రాల్లో శరీరశుద్ధి సాధించాడా లేదా కనుగొనడానికి పరీక్షలు చెప్పబడివున్నాయి. ఇప్పుడు 30, 40 ఏళ్ళ నుంచి యీ శరీరశుద్ధి సరిగా పాటించే వారే లేరు. ఎప్పుడు ఎట్లా స్నానంచేయాలి, ఏ పాత్రల్ని ఎల్లా పరిశుద్ధం చేయాలీ, ఇదంతా కూడా శాస్త్రాల్లో చెప్పారు. అన్ని కర్మలకి ప్రధానంగా కావలసింది పరిశుద్ధి. దాన్ని వుపేక్షించరాదు. ఇపుడు దాన్ని మరిచి పోయినా యీ పరిశుద్ధికి సంబంధించిన సూత్రాలు మనం తెలుసుకుపాటించాలి. మనం యీ మాత్రం చేయలేకపోతే మనస్సును ఎట్లా స్వాధీనం చేసుకుంటాం. ఊరికే అదీ ఇదీ విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మనం నేర్చుకున్నదేదో ఆచరణలో పెట్టాలి. మనం చక్కగా బ్రతకాలంటే మనం శుచిగా వుండాలి. పిల్లలదగ్గర నుండి ముసిలివాళ్ళదాకా ప్రతి ఒక్కరు వారు తాగే చెంబులను వేరే వేరే అట్టిపెట్టుకోవాలి. శౌచ కర్మలో ఆ పాత్రనే వాడుకోవాలి. నీరు త్రాగటానికి ఎవరిది వారిది ప్రత్యేకం ఒక్కొక్క పాత్ర వుండాలి. మరొకరి పాత్రతో ఇంకొకరు నీరు త్రాగకూడదు. ప్రతి పాత్ర కూడా దానికి ప్రత్యేకంగా చెప్పిన పదార్థంతో తోముకోవాలి. వెండిపాత్ర అయితే దానికి చెప్పిన పదార్థంలో, రాగి పాత్ర అయితే దానికి చెప్పిన దానితోనూ తోముకోవాలి. భోజనానికి ఎక్కడికి వెళితే అక్కడికల్లా త్రాగే చెంబులు కూడా పట్టుకుపోవాలి. మరొకడి పాత్రతో త్రాగకూడదు. అన్ని వర్ణాల వారు కూడా యీ సూత్రాల్ని పాటించి తీరాలి. వాళ్ళకు విధించిన కర్మలు వారు చేసేటప్పుడు శౌచ సూత్రాల్ని పాటించి తీరాలి.

5. ఇంద్రియ నిగ్రహం

ఇంద్రియాల్ని వాటి ఇష్ఠం వచ్చినట్లు నడవ నివ్వరాదు. ప్రతి ఇంద్రియానికి కొలత ప్రకారం మేత పెట్టాలి. అట్లా ఇంద్రియ నిగ్రహాన్ని అభ్యసించాలి. మన ఇంద్రియానుభవములన్నీ యీ కొలత ప్రకారముండాలి. యింద్రియాలు యీ కొలతనతిక్రమిస్తే వాటిని అదుపులోపెట్టే శక్తి మనకుండాలి. ఇప్పుడు యీ చెప్పిన అయిదు సుగుణాలు వైదిక ధర్మాన్ని అవలంబించిన ఆస్తికులందరికి విహితములైన ధర్మాల్లోప్రధానమైనవి. మనమంతా వీటిని అభ్యసించాలి. ఇవి మూల ధర్మములు.

____________________________________________

1. ఆరుణ్యం సకలాంగకే నయనయోరంతేచ మందస్మితం

సౌక్ల్యం యస్యతు పీతతాకరతలే దేవీహరిద్రార్చనా

శ్రీ రుద్రాక్ష కిరీటకోటి పటలే సౌదాగర శ్రీకలా

శాఠ్యాంగౌరిక మర్చయేత్శబలితం వర్ణై రవర్ణంగురుమ్‌-

2. రక్తాంత స్పృహణీయ దీర్ఘనయనం స్వాకుంచితభ్రూలతం

హాసస్మేర ముదార ఫాల ఫలకం స్పూర్జత్కపోలారుణమ్‌

శ్రీ కర్ణం సునసం సుచారురదనం పూర్ణేందుబింబాననమ్‌

వందే శ్రీ గురుమూర్తి మిందుమకుటమ్‌ శ్రీకామపీఠాధిపమ్‌-

--- గురు కృపాలహరీ.

Nadayadu Daivamu  Chapters