Nadichedevudu   Chapters  

 

74. ''రామభక్తులలో అగ్రగణ్యులు గాంధిగారు''

రాజ్యాంగవేత్తగా, భారత స్వాతంత్ర్య ప్రదాతగా, అహింసాసిద్ధాంత ప్రవర్తకుడుగా గాంధిమహాత్ముడు అద్వితీయుడు.

అదేవిధంగా, వర్తమానకాలంలో ఆధ్యాత్మికరంగంలో మహోన్నతశిఖరాల నధిష్ఠించి, తన నిత్యజీవితమే లోకానికి దివ్యసందేశంగా నిరూపించి, అశేష విజ్ఞప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కంచికామకోటిపీఠపరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి సనాతన ధర్మపరాయణులకు పరమప్రామాణికులు.

ఇరువురిలో ఒకరు కర్మయోగి. ఒకరు జ్ఞానయోగి. ఈ మహనీయులు ఉభయులూ వేరు వేరు రంగాలలో కృషి చేసినా, కంచిస్వామి దేశాభిమానాన్ని గాని, మహాత్మగాంధి మతాభిమానాన్ని గానీ శంకించడానికి వీలులేదు. భారతజాతి బహుముఖాభ్యుదయం ఉభయులకూ సమానలక్ష్యం.

ప్రజలకు సంబంధించిన ఒక్కొక్క సమస్యకు పరిష్కారమార్గాన్ని అన్వేషించడంలో వీరికి భిన్నాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన ఒండొరుల యెడల వీరికి గల గౌరవభావానికి అవి ఏమాత్రం అడ్డురాలేదు. అందుకు నిదర్శనా లున్నవి.

1927లో దక్షిణ భారతంలో నెల్లిచెరి అనే గ్రామంలో కంచిస్వామికీ, గాంధిగారికీ జరిగిన ప్రత్యేక సంభాషణానంతరం, గాంధిగారు తమ ఆశ్రమ వాసి శ్రీ కిశోరిలాల్‌ మశ్రువాలాకు ఒక లేఖ వ్రాస్తూ, కంచిస్వామివారిని గురించి ''ఆయన సాక్షాత్తూ మూర్తీభవించిన శాంతమే'' అన్నారు.

అదే విధంగా, గాంధి నిర్యాణానంతరం కంచిస్వామి గాంధి గారిని ''భారతమాత పుత్రులలో ఆయన అగ్రగణ్యుడూ, మహోదారుడూ'' అని వర్ణించారు.

1948 జనవరి 30వ తేదీ యావద్భారతజాతికి మహాదుర్దినం. ఆనాడే గాంధీమహాత్ముడు మతోన్మాది అయిన, ఒక సోదరదేశీయుని ఘాతుకకృత్యానికి బలి అయినాడు. ఈ దుర్వార్త విన్న కంచిస్వామి దక్షిణాదిని మహోదయపుణ్యకాలాన పాలార్‌ నది సంగమం వద్ద ఒక ప్రకటన చేస్తూ, భారత జాతికి గాంధీగారి అమూల్యసేవలను ఈ విధంగా ప్రస్తుతించారు. ''భారతమాత పుత్రులలో అగ్రగణ్యుడూ, మహోదారుడూ అయిన గాంధీ నిర్యాణం వల్ల మనదేశ మొక్కటేగాక, యావత్ప్రపంచం ఎంతో నష్టపోయింది. విశేషించి, దారుణమైన ఈ హత్యకు ఒక భారతీయుడే కారకుడు కావడం మన మందరం మరింత సిగ్గుపడవలసిన విషయం. ఈ కళంకాన్ని తుడచివేయాలంటే భారత ప్రజలందరూ సత్యం, అహింస, బ్రహ్మచర్యం అనే లక్ష్యాలను ఇతోధికంగా అంకితం కావాలి.''

అదే ప్రకటనలో మహాత్ముని అహింసా విధానాన్ని గురించి కామకోటిస్వామి ఇలా అన్నారు. ''గాంధిగారి అహింసావ్రతంమహోత్కృష్టమైనది. సర్వ ప్రపంచం దానిని హర్షించింది. గాంధిగారి సిద్ధాంతాలు కొన్నిటితో కొందరు ఏకీభవించకపోవచ్చు. దాని కేమి? వారి మహనీయతనూ, వారి దైవభక్తినీ గుర్తించని వారుండరు.''

ఇదే సందర్భంలో శ్రీ శంకరాచార్యస్వామి 1927 తమకూ, గాంధిగారికీ ఏకాంతంగా జరిగిన ఒక సంభాషణను గుర్తు చేస్తూ ఇలా అన్నారు. పాలఘాట్‌ జిల్లా నెల్లిచెరిగ్రామంలో 1927 అక్టోబరులో మేమిరువురం ఒంటరిగా మాట్లాడుకున్నాము. అప్పటికి కొద్ది కాలం కిందటే ఒక మహమ్మదీయుడు ఆర్యసమాజ నాయకుడైన స్వామి శ్రద్ధానందుని హత్య చెయ్యడం సంభవించింది. ఆ ఘాతుక చర్య తన నెంతో కలవరపరిచిందని గాంధిగారు నాతో అన్నారు. ''నేడా హంతకుని ఖడ్గానికి బలి అయిన వ్యక్తి స్వామి శ్రద్ధానందుడు కావచ్చు. మరొక నాడు భారతీయసంస్కృతికి ప్రమాణభూతుడైన మదన మోహన మాలవ్యా పండితుడే అట్టి అత్యాచారానికి గురి కావచ్చు. అయినప్పటికీ, ఆ హంతకుని పట్ల ఇంచుకంత ద్వేషభావం లేకుండా, కుమారుని వలెనో, స్నేహితుని వలెనో అతనిని ఆలింగనం చేసుకోవాలని ఆశిస్తున్నాను. అయితే, ఆపని చేయగలనా, అని మరల నన్ను నేనే సందేహిస్తున్నాను,'' అన్నారు.

ఈ విధంగా మహాత్ముని మాటలను మన దృష్టికి తెస్తూ, ''వాస్తవమైన అహింసావ్రతునికి ఇంతకంటె ఉన్నతమైన, ఉత్తమమైన ఆదర్శం ఉండగలదా?'' అంటున్నారు స్వామివారు.

గాంధి జీవితం పట్ల, గాంధి సిద్ధాంతాలపైన కంచిస్వామికి గల గౌరవ భావానికి పైవాక్యాలు పరమనిదర్శనం. అంతే కాదు, గాంధిగారు నిర్మాణ కార్యక్రమం పేరిట ఖద్దరు ఉద్యామన్ని ప్రారంభించింది మొదలుకొని, కంచి స్వామి వారు దీక్షగా ఖద్దరునే ధరిస్తూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుని ప్రబోధ మాలించి, పీఠాధిపతియైన తాను ఖద్దరును ఎందుకు ధరించాలి అన్న భావం స్వామివారికి అడ్డురాలేదు. ఏ దిక్కునుంచి వచ్చినా, మంచిని గ్రహించడమే స్వామిలక్ష్యం.

1948లో మహాత్మగాంధి నిర్యాణానంతరం వచ్చిన తొలి శ్రీరామనవమి పండుగ సందర్భంగా, గాంధిగారి సుభాషితాలను సేకరించి, కంచిస్వామి తమ ఉపోద్ఘాతంతో పాటు వాటిని ప్రచురించి, ప్రజలకు ఉచితంగా పంచిపెట్టించారు.

గాంధిగారు రాజకీయరంగంలో ప్రవేశించింది మొదలుకుని రాజకీయాలకు నైతిక, ఆధ్యాత్మిక విలువల నాపాదించి రాజకీయరంగాన్ని ఉన్నతస్థాయికి తెచ్చారనీ, అస్పృశ్యత మొదలైన కొన్ని విషయాలను మినహాయిస్తే, రామనామమూ, రామాయణమూ, వర్ణాశ్రమధర్మమూ, ఆహార నియమమూ, భగవన్నిరూపణమూ మొదలైన ప్రధానాంశాలపై మహాత్ముడు వెల్లడించిన అభిప్రాయాలూ, ఆయన దృఢవిశ్వాసాలూ హిందూమతావలంబకులు అమూల్యంగా పరిగణించవలసినదనీ కంచిస్వామి ఆ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు.

కడపటి మాటగా, 'ప్రస్తుత కాలంలో శ్రీ రామభక్తులలో గాంధి మహాత్మునంతటి వానిని వేరొకరిని వేలెత్తి చూపజాలము' అని కూడా ప్రస్తుతించారు.



ధర్మం తార్కికం కాదు

ధర్మం సనాతనం. అది. పరిణామబద్ధం కాదు. అందులో ఏ కొంచెం మార్పు వచ్చినా, ఈ విశ్వానికే ఆపత్తు వస్తుంది.

అన్ని ధర్మాలకూ వేదాలే మూలం. 'వేదోఖిలో ధర్మ మూలం'. వేదాలు అపౌరుషేయాలు. వాటి కర్తలను మనం ఎరగం. ఈ ధర్మశాస్త్రాలను వ్యక్తిగతంగా కాని, పరిసరమూలకంగా కాని, సామాజికవ్యవస్థల ద్వారా గాని మార్పు చెయ్యడానికి వీలు లేదు. మార్పు చేస్తే ధర్మమే అస్థిరమై పోతుంది. అందుచేతనే అది సనాతన ధర్మ మన్నారు.

శ్రీరాముడు మాటి మాటికీ ''ఏషధర్మస్సనాతనః'' అనడం అందుకే. ధర్మంలో తర్కానికి తావు లేదు. ''తర్కో అప్రతిష్ఠః'' (తర్కం స్థిరత్వం లేనిది) ధర్మం తార్కికం కాదు, కర్తవ్యం.

Nadichedevudu   Chapters